రంప గ్రామంలో భూములు కోల్పోయిన కోయ గిరిజనులు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ భూ సమస్య తారాస్థాయికి చేరుకుంది. తూర్పు గోదావరి జిల్లాలో కూడా పరిస్థితి దాదాపు అంతే ఘోరంగా ఉంది

మేము జీపు దిగుతూనే, భయాందోళనతో రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్స్ వారి వారి స్థానాలకు చేరుకున్నారు. ఈ పోలీస్ స్టేషన్ స్పెషల్ ఫోర్సెస్ రక్షణలో ఉంది. మా వద్ద ఉన్న కెమెరా ఈ పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. ఈస్ట్ గోదావరి జిల్లాలోని ఈ ప్రాంతాలలో పోలీస్ స్టేషన్ లను ఫోటో తీయడం నిషేధించబడింది.

స్టేషన్ లోపలినుంచే హెడ్ కానిస్టేబుల్ మా వివరాలు అడిగి తెలుసుకున్నారు. "ఓ, జర్నలిస్టులా?" పరిస్థితి కొంచెం చల్లబడింది. "మీరు కొంచెం మరీ ఆలస్యంగా స్పందించడంలేదు?" అని అడిగాను నేను. "మీ స్టేషన్ పై దాడి జరిగి 75 సంవత్సరాలు అవుతుంది."

"ఏమో అండి, ఎవరికి తెలుసు" అన్నారు ఆయన తాత్వికంగా. "మళ్లీ ఇవాళ మధ్యాహ్నమే దాడి జరగొచ్చు."

ఆంధ్రప్రదేశ్లోని ఈ గిరిజన ప్రాంతాలు 'ఏజెన్సీ' ఏరియాగా పిలవబడతాయి. 1922 ఆగస్టులో ఈ ప్రాంతం ఒక తిరుగుబాటుకు వేదికైంది. మొదట్లో ఈ తిరుగుబాటు కేవలం ఈ ప్రాంత ప్రజల ప్రకోపంలా కనిపించినప్పటికి, కొద్ది కాలంలోనే అది రాజకీయ రంగును పులుముకుంది. తాను గిరిజనుడు కాకపోయినా, అల్లూరి రామచంద్రరాజు (సీతారామరాజు), ఈ మన్యం తిరుగుబాటులో గిరిజనులకు సారధ్యం వహించారు. వీరు కేవలం తమ సమస్యల పరిష్కారం కొరకు పోరాడలేదు.  1922 నాటికి, బ్రిటిష్ పాలనను అంతు చేయడానికి పోరాడారు. ఈ తిరుగుబాటుదారులు ఏజెన్సీ ఏరియాలోని పోలీస్ స్టేషన్ల మీద దాడుల ద్వారా వారి లక్ష్యాలను తెలియజేసారు. దీనిలో భాగంగా వారు రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ మీద  కూడా దాడి చేశారు.

ఈ ప్రాంతపు ప్రజలు ఏ సమస్యల వలన 75 సంవత్సరాల క్రితం బ్రిటీషువారిపై తిరగబడ్డారో, ఆ సమస్యలు నేటికి అలానే మిగిలున్నాయి.

PHOTO • P. Sainath

తూర్పుగోదావరి జిల్లాలో సీతారామరాజు విగ్రహం

రాజు సారధ్యంలో ఈ గిరిజన సైన్యం గెరిల్లా దాడుల రూపంలో బ్రిటీష్ వారికి నానా కష్టాలు తెచ్చిపెట్టింది. ఇది భరించలేక బ్రిటిష్ ప్రభుత్వం మలబార్ స్పెషల్ బలగాలని రప్పించారు. అటవీ ప్రాంతాపు యుద్ధాలలో ఆరితేరిన ఈ బలగాలు, ఆధునిక ఆయుధాలతో ఈ తిరుగుబాటుని అణిచివేశాయి. 1924లో సీతారామరాజుగారి మృతితో ఈ పోరాటం ముగిసింది. అయినప్పటికీ, చరిత్రకారుడు ఎం.వెంకటరంగయ్యగారి ప్రకారం "ఈ తిరుగుబాటు బ్రిటిష్ వారికి సహాయ నిరాకరణోద్యమంకంటే పెద్ద తలనొప్పిగా మారింది."

ఈ సంవత్సరం సీతారామరాజుగారి 100వ జయంతి. ఆయన 27 ఏళ్ల వయసుకే మరణించారు.

PHOTO • P. Sainath

కృష్ణదేవిపేటలో సీతారమరాజుగారి సమాధి

బ్రిటిష్ పాలన గిరిజనుల జీవితాలని నాశనం చేసింది. 1870 నుంచి 1900 మధ్య, అడవులను "రిజర్వ్" ఏరియాగా ప్రకటించి, పోడు వ్యవసాయాన్ని నిషేధించారు. ఆ తర్వాత, గిరిజనులు అడవి ఉత్పత్తులను సేకరించడం కూడా నిషేధించి ఆ హక్కుని ఆటవీశాఖ కాంట్రాక్టర్లకు అందచేశారు. ఆ పై ఎటువంటి వేతనం చెల్లించకుండా గిరిజనులతో బలవంతపు చాకిరి చేయించారు. కొద్ది కాలంలో ఈ భూములను ఆదివాసులు కానివారి పరమైపోయింది. వీటి వలన గిరిజనుల ఆర్ధిక జీవనాధారం తీవ్రంగా దెబ్బతింది.

"భూములులేని వాళ్లమంతా చాలా బాధలు పడుతున్నాం. మరి 50 సంవత్సరాల క్రితం పరిస్థితి ఎలా ఉండేదో నాకైతే తెలియదు" అంటారు రామాయమ్మ. ఈమె రంప గ్రామంలో నివసించే ఒక కోయ గిరిజన మహిళ.

రంప గ్రామం 1924 తిరుగుబాటుకి ముఖ్యకేంద్రం. 150 కుటుంబాలు ఉండే ఈ గ్రామంలో సుమారు రామాయమ్మ కుటుంబంతో కలిపి, 60 కుటుంబాలూ భూములులేనివారే.

"మా తల్లిదండ్రులు పది రూపాయిల ఋణం చెల్లించలేక భూమి పొగుట్టుకున్నారు" అని అంటారు రామాయమ్మ. దానిపై, “బయటవాళ్ళు గిరిజనులుగా నటిస్తూ ఇక్కడికి వచ్చి మా భూములు కాజేస్తారు." ఈ ప్రాంతంలో అతి పెద్ద భూస్వామి ఇంతకుముందు ప్రభుత్వ పట్టా ఆఫీసులో పనిచేసిన ఒక బయటి వ్యక్తి. దీనివలన భూమి పట్టాలు ఆయన చేతికి చిక్కాయి. ఊర్లో జనం ప్రకారం ఆయన ఈ పట్టాలను తారుమారు చేశారు. ఆయన కుటుంబం సుమారు 30 మందిని పనికి పెట్టింది. మహా అయితే ఒక కుటంబానికి 3 ఎకరాలు లేక అంతకంటే తక్కువ భూమి ఉండే ఈ ఊర్లో, 30 మందిని పనికిపెట్టడమంటే అసాథారణమైన విషయమే.

పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ భూ సమస్య తారాస్థాయికి చేరుకుంది. తూర్పు గోదావరి జిల్లాలో కూడా పరిస్థితి దాదాపు అంతే ఘోరంగా ఉంది. ఒక గిరిజన అభివృద్ధి శాఖ ఆఫీసర్ ప్రకారం "చాలా మంది గిరిజనులు, స్వాతంత్రం వచ్చిన తర్వాతే వారి భూములను కోల్పోయారు." 1959 నుండి 1970 మధ్యలో ఈ ప్రాంతంలో సుమారు 30% భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. వింతగా, "ఆంధ్రప్రదేశ్ స్టేట్ ల్యాండ్ ట్రాన్స్ ఫర్ రెగులేషన్ ఆక్ట్ 1959 అమలులోకి వచ్చినప్పటికీ, ఈ పరిస్థితి మెరుగుపడలేదు." రెగులేషన్ 1/70గా పిలవబడే ఈ చట్టం ప్రత్యేకంగా ఈ సమస్యను అరికట్టడానికే అమలు చేయబడింది. ప్రస్తుతం ఈ చట్టాన్నే బలహీనపరచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

PHOTO • P. Sainath

రంప గ్రామంలో భూమిలేని మరొక ఇల్లాలు, పి.కృష్ణమ్మ వారి కుటుంబం ఎదుర్కొంటున్న కష్టాల గురించి మాట్లాడుతున్నారు

గిరిజనులకి బయటవారికి మధ్య ఈ తగాదా క్లిష్టమైనది. ఇక్కడ గిరిజనులే కాకుండా ఇతర జాతులకు చెందిన కొంత మంది కూడా పేదరికంతో పోరాడుతున్నారు. ఇక్కడి పరిస్థితి ఉద్రిక్తమైనప్పటికి, గిరిజనులు వారి కోపాన్ని వీరిపై చూపలేదు. దీని మూలాల 1924లో బ్రిటీష్ పై  జరిపిన తిరుగుబాటులో దొరుకుతాయి. రాజు ఆధ్వర్యంలో కేవలం బ్రిటిష్ మరియు ప్రభుత్వ సంస్థల మీదే దాడులు జరిపారు. రంప తిరుగుబాటుదారుల ఉద్దేశంలో వారి వ్యతిరేకత కేవలం బ్రిటిష్ పట్లే.

నేడు, సమాజంలో పైకెదిగిన గిరిజనేతరులనే కాకుండా వారి స్వంత జాతులకు చెందిన పేదవారిని కూడా దోచుకుంటున్నారు. ఈ గిరిజన ప్రాంతాలలో చాలావరకు చిన్నపాటి ప్రభుత్వ ఆఫీసర్లంతా బయటవారే. రెగులేషన్ 1/70 చట్టంలో కొన్ని లొసుగులున్నాయి. "ఇక్కడ భూమిని కౌలుకివ్వడం ప్రబలం." అంటారు పొట్టవ కామరాజు. ఇతను కొండపల్లిలో నివసించే ఒక భూమిలేని కోయ గిరిజనుడు. కౌలుకిచ్చిన భూమి చాలా అరుదుగా తిరిగి యజమాని చేతికొస్తుంది. కొంతమంది బయటవాళ్ళు గిరిజన భూమి పొందటానికి గిరిజన మహిళలతో రెండో పెళ్లి కూడా చేసుకుంటారు. సీతారామరాజు తిరుగుబాటు కొండపల్లి గ్రామాన్ని కూడా తాకింది. ఇక్కడి నుంచి బ్రిటిష్ వాళ్ళు తిరుగుబాటుదారులని అండమాన్ పంపించి, ఇక్కడి కుటుంబాలని నాశనం చేసి ఈ గ్రామాన్ని పేదరికంలో ముంచారు.

ఇలా కుటుంబాలు విడగొట్టబడటం వలన ఆ కాలపు గుర్తులు చెరిగిపోయాయి. కాని సీతారామరాజు పేరు మాత్రం ఇప్పటికి ప్రజల మదిలో మెదులుతుంది. అప్పటి సమస్యలు కూడా అలానే మిగిలున్నాయి. "చిన్నపాటి అటవీ ఉత్పత్తులు అంత పెద్ద సమస్యేమికాదు" అని చమత్కారంగా అంటారు విశాఖ జిల్లా మంప గ్రామం నివాసితులు కామరాజు సోములు. "నేడు చాలా తక్కువ అటవీ ప్రాంతం మిగిలుంది." దీని వలన పేదలకి కష్టాలు పెరిగాయి, "తరచు భోజనానికి గంజి నీళ్లతో సరిపెట్టుకుంటున్నాం" అంటారు రామాయమ్మ. తూర్పు గోదావరి జిల్లా దేశంలో ధనికమైన గ్రామీణ జిల్లాలో ఒకటిగా పరిగణించబడినప్పటికి, ఇక్కడి గిరిజనుల కష్టాలు ఇంకా కొనసాగుతూనేఉన్నాయి.

"తరచు భోజనానికి గంజి నీళ్లతో సరిపెట్టుకుంటున్నాం" అంటారు రామాయమ్మ, రంప గ్రామంలో నివసించే ఒక కోయ గిరిజన మహిళ (ఎడమ). "డబ్బులున్నోళ్ళంతా ఒకటే." అంటారు పొట్టవ కామరాజు, కొండపల్లి గ్రామంలో నివసించే ఒక భూమిలేని కోయ గిరిజన (కుడి)

ఇప్పుడు గిరిజనులలో కూడా వర్గాలు ఏర్పడుతున్నాయి. "ధనవంతులైన కోయలు వారి భూములను ఊర్లో ఉండే మాకు కాకుండా బయటివాళ్లయిన నాయుళ్లకు కౌలుకిస్తున్నారు" అంటారు పొట్టవ కామరాజు. "డబ్బులున్నోళ్ళంతా ఒకటే." చాలా కొద్ది మంది గిరిజనులకే ప్రభుత్వ ఉద్యోగాలు దొరుకుతాయి. భూములులేని కార్మికులకు ఈ ప్రాంతంలో కేవలం సంవత్సరంలో కొన్ని నెలలు మాత్రమే పని దొరుకుతుంది.

పశ్చిమ గోదావరి జిల్లాలో వేతనాలకై పోరాటం మొదలైంది, అది త్వరలోనే తూర్పు గోదావరి జిల్లాను కూడా తాకనుంది. ఆ పై, బయటవాళ్ళు కొంతమంది గిరిజన పెద్దల్ని అక్కున చేర్చుకుంటున్నారు. మంపలో పంచాయతీ ప్రెసిడెంటైన ఒక గిరిజనడు, ఇపుడు ఒక పెద్ద భూస్వామి. ఆయన కుటుంబానికి సుమారు 100 ఎకరాల భూమి ఉంది. "ఆయన ఇక పూర్తిగా బయటవాళ్ళతో కలిసిపోయారు" అంటారు సోములు.

బ్రిటిష్ ప్రభుత్వం అల్లూరి సీతరామరాజు బ్రతికినంత కాలం ఆయనతో సంధి కుదుర్చుకోలేకపోయింది. ఆయనకి 50 ఎకరాల మాగాణి భూమి ఇచినప్పటికి ఈ ప్రయత్నం ఫలించలేదు. ఆయనకంటూ ఏ సమస్యలేనప్పటికి, రాజుగారికి గిరిజనులతో ఉన్న ఈ విడదీయలేని బంధం బ్రిటిష్ ప్రభుత్వానికి అసలు అర్థమే కాలేదు. ఒక బ్రిటిష్ రిపోర్ట్ ప్రకారం ఆయన "కలకత్తాలో ఒక రహస్య కమిటీలో సభ్యుడు." బ్రిటిష్ ప్రభుత్వమే కాకుండా, రాజకీయనాయకులు కూడా రాజుగారి పట్ల వ్యతిరేకత వ్యక్తం చేశారు. 1922-24లో రాజుగారి తిరుగుబాటుని అణిచివేయ్యమని విజ్ఞప్తి చేశారు. మద్రాస్ అసెంబ్లీలో, సి.ఆర్. రెడ్డి లాంటి నాయకులు తిరుగుబాటు అణిచివేయబడేవరకు, దానికి దారితీసిన కారణాలపై దర్యాప్తు జరపడాన్ని వ్యతిరేకించారు.

చివరికి "జాతీయవాద" పత్రికలు కూడా ఆ తిరుగుబాటుని వ్యతిరేకించాయని చెబుతారు చరిత్రకారుడు మురళి అట్లూరి. "ఈ తిరుగుబాటు అణిచివేయబడితే మాకు సంతృప్తి కలుగుతుంది," అని తెలుగు పత్రిక 'ది కాంగ్రెస్' ప్రచురించింది. ఆంధ్ర పత్రిక కూడా తిరుగుబాటుని విమర్శించింది.

PHOTO • P. Sainath

శిథిలమైన సీతారమరాజుగారి సమాధి

మురళి అట్లూరి ప్రకారం సీతారామరాజు మరణించిన తరువాతే వారిని అక్కున చేర్చుకున్నారు. ఆయన మరణాంతరం, ఆంధ్ర పత్రిక ఆయన ఆత్మ వీర-స్వర్గంలో విశ్రాంతి చెందాలని నివాళి అర్పించింది. ది సత్యాగ్రహి పత్రిక ఆయన్ని జార్జ్ వాషింగ్టన్తో పోల్చింది. కాంగ్రెస్ పార్టీ ఆయన్ని అమరవీరుడిగా గుర్తించింది.  ఆయన కీర్తిలో పాలుపంచుకోవడానికి ఇప్పటికి ప్రయత్నాలు జరుగుతూనే  ఉన్నాయి. ఆయన 100వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఖర్చు చేయనుంది. అదే సమయంలో, ప్రభుత్వంలో కొందరు రెగులేషన్ 1/70ని సవరించడానికి ప్రయత్నం చేస్తున్నారు - దీని వలన గిరిజనులకు మరింత నష్టం కలుగుతుంది. కృష్ణదేవిపేటలో రాజుగారి సమాధికి సంరక్షకుడైన గజాల పెద్దప్పన్ గారికి వయసు పైబడుతున్నా, గత మూడు సంవత్సరాలుగా జీతం చెల్లించలేదు. ఈ ప్రాంతపు జనాలలో రోజురోజుకి అసంతృప్తి పెరుగుతుంది. దీనితో వైజాగ్-తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దుపై మావోయిస్టుల ప్రభావం పెరుగుతోంది.

"సీతారామరాజు గిరిజనుల కోసం ఎలా పోరాడారని మా తాత మూత్తాతలు మాకు చెబుతూ వస్తున్నారు" అంటారు కొండపల్లిలో పొట్టవ కామరాజుగారు. ఇదే కామరాజుగారు నేడు వారి భూమిని తిరిగిపోందాటానికి పోరాడతారా? "తప్పకుండా. మేము పోరాడిన ప్రతిసారి, పోలీసులు నాయుళ్లకు,  డబ్బులున్నోళ్లకి సహాయపడతారు. కాని మా బలంపై మాకు నమ్మకముంది, మాకు ఒక రోజొస్తుంది."

PHOTO • P. Sainath

సీతారామరాజు విగ్రహం

బహుశా హెడ్ కానిస్టేబుల్ స్టేషన్ పై జరగబోయే దాడికై వేచి ఉండడం సమంజసమేనేమో.

ఇవాళ మధ్యాహ్నమే దాడి జరగొచ్చు.

ఫోటోలు: పి. సాయినాథ్


ఈ కధనం మొదట 'ద టైమ్స్ ఆఫ్ ఇండియా'లో ఆగస్ట్ 26, 1997లో ప్రచురించబడింది.

ఈ వరసలో ఇంకొన్ని శీర్షికలు :

సాలిహాన్ రాజ్ మీద ఎదురుదాడి చేయగా

పనిమారా స్వాతంత్య్ర క్షేత్ర యోధులు -1

పనిమారా స్వాతంత్య్ర క్షేత్ర యోధులు - 2

లక్ష్మి పాండా ఆఖరి పోరాటం

తొమ్మిది దశాబ్దాల అహింస

షేర్పూర్ : గొప్ప త్యాగం, గుర్తులేని జ్ఞాపకం

సోనాఖాన్ : వీర్ సింగ్ రెండు సార్లు మరణించాడు

కల్లియాస్సెరి: సుముకన్ కోసం వెతికే  ఒక ప్రయత్నం

కల్లియస్సేరి : యాభైల్లో కూడా వీడని పోరాటం


అనువాదం: అవంత్

ಪಿ. ಸಾಯಿನಾಥ್ ಅವರು ಪೀಪಲ್ಸ್ ಆರ್ಕೈವ್ ಆಫ್ ರೂರಲ್ ಇಂಡಿಯಾದ ಸ್ಥಾಪಕ ಸಂಪಾದಕರು. ದಶಕಗಳಿಂದ ಗ್ರಾಮೀಣ ವರದಿಗಾರರಾಗಿರುವ ಅವರು 'ಎವೆರಿಬಡಿ ಲವ್ಸ್ ಎ ಗುಡ್ ಡ್ರಾಟ್' ಮತ್ತು 'ದಿ ಲಾಸ್ಟ್ ಹೀರೋಸ್: ಫೂಟ್ ಸೋಲ್ಜರ್ಸ್ ಆಫ್ ಇಂಡಿಯನ್ ಫ್ರೀಡಂ' ಎನ್ನುವ ಕೃತಿಗಳನ್ನು ರಚಿಸಿದ್ದಾರೆ.

Other stories by P. Sainath
Translator : Avanth

Avanth is pursuing his MA-PhD candidate in Economics at the Graduate Institute Geneva.

Other stories by Avanth