తన ఇంట్లో ఒక కుర్చీ మీద నిశ్శబ్దంగా కూర్చొని ఉన్న గోమా రామా హజారే ఖాళీగా ఉన్న తన గ్రామ ప్రధాన రహదారివైపు అశ్రద్ధగా చూస్తూ పొద్దుపుచ్చుతున్నారు.
ఆ దారినే పోతూ అప్పుడప్పుడూ తాను ఎలా ఉన్నాడో చూసిపోవడానికి వచ్చేవారితో ఆయన ముచ్చటలాడుతున్నారు. దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన భార్య చనిపోయి ఒక వారమవుతోంది.
అప్పుడు సమయం సాయంత్రం 5 గంటలు. ఏప్రిల్ నెలలో (2024) సగం గడిచిపోయింది. ఆ రోజు చాలా వేడిగా ఉంది. ఉత్తర గడ్‌చిరోలిలోని ఆర్మొరీ తహసీల్‌లో దట్టమైన వెదురు, టేకు వనాల మధ్యన ఉండే పళస్‌గావ్ గ్రామం చాలా చాలా నిశ్శబ్దంగా ఉంది. గడ్‌చిరోలి-చిమూర్ లోక్ సభ నియోజకవర్గానికి ఇంకొద్ది రోజులలో వోటింగ్ జరగాల్సి ఉంది. బిజెపి ఎమ్‌పి అశోక్ నెతే మరోసారి అదే స్థానం నుండి పోటీ చేస్తున్నాడు. కానీ ఎక్కడా ఎన్నికలన్న ఉత్సాహం కనిపించటంలేదు. నిజానికి, ఆందోళన కనిపిస్తోంది.
గత రెండు నెలలుగా గోమాకు ఎలాంటి పని దొరకలేదు. సాధారణంగా ఇలాంటి సమయాలలో అరవయ్యేళ్ళు దాటి, సొంత భూమి కూడా లేని ఆయనతో సహా చాలామంది అడవిలో మహువా (ఇప్ప) పూలను, తెందూ (బీడీ) ఆకులను సేకరించటమో లేదా పొలాలలో పనిచేస్తూనో ఉంటారు.
"కానీ ఈ ఏడు అలా లేదు," అంటారు గోమా. "ఎవరు మాత్రం తమ ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకుంటారు?"
"జనం ఇళ్ళ లోపలే ఉండిపోతున్నారు," గోమా చెప్పారు. రోజులు చాలా వేడిగా ఉన్నాయి. ఎవరం బయటకు పోలేం. గడ్‌చిరోలి నాలుగు దశాబ్దాలుగా సాయుధ సంఘర్షణలతో ఇబ్బందిపడుతూ, భద్రతా దళాలకూ సాయుధ మావోయిస్టులకూ మధ్య జరిగే రక్తపాత కలహాలతో నలిగిపోతున్నందున చాలా గ్రామాలు అటువంటి కర్ఫ్యూలకు అలవాటుపడ్డాయి. కానీ ఇప్పుడొస్తోన్న అతిథులు వేరేవారు, నేరుగా ప్రాణాలకూ జీవనోపాధికీ బెడదగా మారినవారు.
23 అడవి ఏనుగుల మంద ఒకటి, అందులో ఎక్కువగా ఆడ ఏనుగులు, వాటి పిల్లలు, పళస్‌గావ్ చుట్టుపక్కల ప్రాంతాలలో విడిదిచేసి ఉన్నాయి.














