ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో పండే మిరప పంటను కొయ్యడానికి సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్గడ్, ఒడిశాల నుంచి ఎందరో యువ కూలీలు వస్తారు. వాళ్ళిక్కడికి వచ్చేది కూలీ డబ్బులకోసం కాదు- ఏడాదిపొడుగునా వాడుకోవడానికి సరిపొయ్యే మిరపకాయల కోసం. ఈ కారపు దినుసును నిల్వచేసుకోవాలనే కోరిక ఎంతటిదంటే, ఇందుకోసం వాళ్ళల్లో కొందరు బాలబాలికలు బడి కూడా మానేసి వస్తారు. ఈ రోజువారీ ప్రధాన ఆహారాన్ని సేకరించి ఇంటికి తీసుకురావడానికి సంవత్సరంలో వారికి దొరికే ఏకైక అవకాశం ఇదొక్కటే మరి.
వీరికిది రోజువారీ ఆహార పదార్థం. పిల్లలు వారి కుటుంబాల్లోని పెద్దలకంటే చాలా తక్కువ కారం తింటారు. కానీ వాళ్ళ కుటుంబాలకి రోజూ కావాల్సిన మిరపకాయలు సంపాదించడంలో మాత్రం పిల్లల పాత్రే ఎక్కువ. ఈ పనిచేసేవాళ్లలో సగం మంది పిల్లలే. తిరిగి మిరపపంట కాపుకి వచ్చేవరకు సరిపోయేలా ఈ విలువైన మిరపకాయల్ని "సంపాదిస్తారు". రోజు కూలి 120 రూపాయలు తీసుకునే బదులు ఎక్కువమంది అంతకు సమానమైన మిరపకాయలు తీసుకోవడానికే మొగ్గుచూపుతారు. చేసే పనిని బట్టి మొత్తంమీద అర క్వింటాల్, లేదా ఒక్కోసారి క్వింటాల్ దాకా మిరపకాయలు వస్తాయి. కిలో 100 రూపాయలు అనుకుంటే క్వింటాల్కి రూ.10,000 కూలీ వచ్చినట్టు.
వాళ్ల కుటుంబాలకిది మంచి సంపాదనే. ఒక కుటుంబం సంవత్సరానికి 12 నుంచి 20 కిలోల మిరపకాయలు వాడుకుంటుంది. అదనపు ఆదాయం కోసం మిగిలిన సరుకుని వాళ్ళు మార్కెట్లో అమ్ముకోవచ్చు. ఇలా మిరపకాయలు కూలీగా తీసుకోవడంవల్ల కారానికి ఏడాదంతా లోటు ఉండదు- అది కూడా చేను నుండి తాజాగా కోసిన నాణ్యమైన మిరపకాయలు!
"మా గ్రామం నుంచి మేం 20 మందిమి వచ్చాం. ఇక్కడ మూడు వారాల పాటు ఉంటాం," ఒడిశా రాష్ట్రం మల్కాన్గిరి జిల్లాలోని గుటుముడా గ్రామం నుంచి వచ్చిన ఉమాశంకర్ పొడియామి అన్నారు. "మా బృందంలోని ప్రతి ఒక్కరూ కూలీగా డబ్బు తీసుకోవడంకంటే మిరపకాయలు తీసుకోడానికే ఇష్టపడతారు".





