"నేను మొదటిసారి డోక్రాను చూసినప్పుడు అదొక మాయాజాలంలా అనిపించింది," అన్నారు 41 ఏళ్ళ పియూష్ మండల్. పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లాకు చెందిన ఈ కళాకారుడు దాదాపు 12 సంవత్సరాలుగా ఈ కళను సాధన చేస్తున్నారు. ఈ ప్రక్రియలో మైనపు పోత సాంకేతికతను ఉపయోగిస్తారు. సింధు లోయ నాగరికత నాటి భారతదేశంలోని పురాతన సంప్రదాయ లోహపు పోతపోసే పద్ధతులలో ఇది కూడా ఒకటి.

డోక్రా (లేదా ఢోక్రా) అనే పేరు తూర్పు భారతదేశమంతటా ప్రయాణించిన సంచార కళాకారుల సమూహాన్ని సూచిస్తుంది.

ఒడిశా, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్‌ల మీదుగా వ్యాపించి ఉన్న ఛోటా నాగపూర్ పీఠభూమిలో పెద్ద మొత్తంలో రాగి నిక్షేపాలు ఉన్నాయి. రాగి, డోక్రా బొమ్మలను తయారుచేసే ఇత్తడి, కంచు లోహాల మిశ్రధాతువులలో ఉపయోగించే ప్రధాన లోహం. భారతదేశంలోని అనేక ప్రాంతాలలో డోక్రా కళను సాధన చేస్తున్నారు, కానీ బాఁకూరా, బర్ధమాన్, పురూలియా జిల్లలకు చెందిన 'బెంగాల్ డోక్రా'కు భౌగోళిక గుర్తింపు సర్టిఫికేట్ ఉంది.

డోక్రా శిల్పాన్ని తయారుచేయటంలో మొదటి దశ మట్టితో పోతపోయడానికి అనువుగా అచ్చు పోయడం - కావలసిన బొమ్మకు ఇదే పునాది. తేనెమైనం, లేదా సాల వృక్షపు (షోరియా రాబస్టా) జిగురు నుండి తొలిచిన అనేక ఆకృతుల నమూనాలపై మెత్తని బంకమట్టిని పొరలు పొరలుగా పూస్తారు. అంతా సిద్ధమయ్యాక, కరిగిన మైనం బయటకు రావడం కోసం ఒకటి లేదా రెండు మార్గాలు తెరిచి ఉంచి, మరొక మట్టి పొరతో మైనపు నమూనాను మూసివేస్తారు. వేడి వేడి కరిగిన లోహాన్ని అదే మార్గం ద్వారా లోపలికి పోస్తారు.

"ప్రకృతి పాత్ర చాలా ముఖ్యమైనది (ఈ పద్ధతికి)," అంటారు సీమా పాల్ మండల్. "సాల వృక్షాలు లేకపోతే మైనాన్ని తయారుచేయడానికి నాకు వాటి జిగురు లభించదు. తేనెటీగలు, తేనెపట్టులు లేకపోతే నాకు మైనం కూడా దొరకదు." డోక్రా పోతపని వివిధ రకాల మట్టి లభ్యతపైనా, సరైన వాతావరణ పరిస్థితులపైనా కూడా ఎక్కువగా ఆధారపడివుంటుంది.

బయటి మట్టిపొర పూర్తిగా ఆరిపోయిన తర్వాత పియూష్, అతని సహచరులు అతని స్టూడియోలో ఉండే 3 నుంచి 5 అడుగుల లోతు ఉండి, ఇటుకలు మట్టితో కట్టిన రెండు బట్టీలలో ఒకదానిలో వాటిని వేసి కాలుస్తారు. మట్టి కాలినప్పుడు లోపలి మైనం కరిగిపోయి ఖాళీలు ఏర్పడతాయి. అందులోకి కరిగించిన లోహాన్ని పోస్తారు. ఆ మట్టి అచ్చును చల్లారడానికి ఒక రోజంతా అలా బయట ఉంచుతారు. త్వరగా డెలివరీ ఇవ్వాల్సినవాటినైతే 4 నుంచి 5 గంటలపాటు ఉంచుతారు. ఆ తర్వాత మట్టి అచ్చును పగలగొడితే లోపల ఉన్న శిల్పం బయటపడుతుంది.

వీడియో చూడండి: డోక్రా, ఒక అద్భుత కళ

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Sreyashi Paul

Sreyashi Paul is an independent scholar and creative copywriter based out of Santiniketan, West Bengal.

Other stories by Sreyashi Paul
Text Editor : Swadesha Sharma

Swadesha Sharma is a researcher and Content Editor at the People's Archive of Rural India. She also works with volunteers to curate resources for the PARI Library.

Other stories by Swadesha Sharma
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli