అన్నింటికంటే పైన ప్లాస్టిక్ ఉంది. ఇది దాదాపు ఊహించదగిన ప్రతి రూపంలోనూ ప్రతిచోటా ఉంది - వీధుల్లో పడి ఉంటుంది, నీటిలో తేలుతూంటుంది, సంచులలో నిల్వచేసి ఉంటుంది, డబ్బాలలో పెట్టేసి ఉంటుంది, పైకప్పులపై పోగుచేసి ఉంటుంది. 13వ కాంపౌండ్ సరిహద్దులో ఉన్న క్రీక్(సముద్రపు పాయ) వద్ద అధిక విలువ కలిగిన లోహ భాగాలను వెలికితీసేందుకు ప్లాస్టిక్ వస్తువులను కాల్చినప్పుడు, ఘాటైన పొగ గాలిని చిక్కగా చేస్తుంది.

అంతే లేని ఈ ప్లాస్టిక్, ఇతర వ్యర్థ పదార్థాల గొలుసు ముంబైలోని అన్ని ప్రాంతాల నుండి ధారావిలోని రీసైక్లింగ్ రంగమైన ఈ కాంపౌండ్‌కు క్రమం తప్పకుండా చేరుకుంటుంది. నగరంలో ప్రతిరోజూ ఉత్పత్తి అయ్యే 10,000 టన్నులకు పైగా వ్యర్థాలలో అధిక భాగాన్ని చేతితో లాగే బండ్లలో, ట్రక్కులలో, టెంపోలపై ఇక్కడకు చేరవేస్తారు. ఈ పని చేసే కార్మికులలో ఎక్కువ మంది వివిధ రాష్ట్రాల నుండి వలస వచ్చిన యువకులు. వీరు ఈ సెక్టార్‌లోని నమ్మశక్యంగానంత ఇరుకైన సందుగొందులగుండా ఈ వ్యర్థాలను నింపుకొనివచ్చి ఇక్కడ అన్‌లోడ్ చేస్తారు.

ఇక్కడి కిక్కిరిసిన అతుకులబొంతల్లాంటి షెడ్డుల్లో - వాటిలో కొన్ని నాలుగు-అంతస్తులుగా కూడా ఉంటాయి - రీసైక్లింగ్ యొక్క  పొరల పొరల ప్రక్రియ మళ్లీ మళ్లీ పురివిప్పుతుంది. ప్రతి వస్తువు ఒక 'కొత్త' ముడి పదార్థంగానో, లేదా మరొక వాడుకకు సిద్ధంగా ఉన్న ఉత్పత్తిగానో రూపాంతరం చెందడానికి ముందు, ఒక వరుస క్రమంలో, ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి, ఒక ప్రక్రియ నుండి మరో ప్రక్రియకు పంపబడుతుంది.

టెరా కాంపౌండ్‌లోని రీసైక్లింగ్ పర్యావరణ వ్యవస్థ చక్కగా వరుస కట్టబడిన అంతర్గత తర్కాన్ని కలిగి ఉంటుంది: కొనుగోలు, అమ్మకం ఏర్పాట్ల వరుస అమలులో ఉంటుంది. జనం పనికి సంబంధించిన నిర్దిష్ట పదజాలాన్ని ఉపయోగిస్తారు. వివిధ ప్రక్రియల వరుస దశలు చక్కగా వ్యవస్థీకరించి ఉంటాయి. ప్రతి వ్యక్తి ఒకటి లేదా మరికొన్ని పనులలో నైపుణ్యం కలిగి ఉంటారు: రద్దీవాలాలు (నగరంలోని స్క్రాప్ డీలర్లు) పనికిరాని వస్తువులను సేకరిస్తారు. వ్యర్థాలను సేకరించేవారు, ఫేరీవాలాలు (ఇంటింటికీ తిరిగేవారు) రోజువారీగా సేకరించినవాటిని షెడ్డుల వద్ద జమ చేస్తారు. వాహన చోదకులు, సహాయకులు కాంటావాలాల(తూకం వేసేవాళ్ళు) వద్ద సరుకును అన్‌లోడ్ చేస్తారు. ఆ తర్వాత గోడౌన్‌లను కలిగి ఉన్న సేటులు, వారు ఏర్పాటుచేసుకున్న సూపర్‌వైజర్లు, స్త్రీ పురుష కార్మికులు- ఇలా అందరూ వేలాది పనులలో నిమగ్నమై ఉంటారు.

PHOTO • Sharmila Joshi
PHOTO • Sharmila Joshi

ధారావి , 13 కాంపౌండ్ లోని రీసైక్లింగ్ పర్యావరణ వ్యవస్థ చక్కగా వరుస కట్టబడిన అంతర్గత తర్కాన్ని కలిగి ఉంటుంది

యంత్రాల గొలుసుల రాపిడి, రణగొణ ధ్వనుల మధ్య లోహాన్ని కాల్చి, కరిగించి, తిరిగి ఉపయోగించగల షీట్లను కర్మాగారాల కోసం తయారుచేస్తారు. ఉపయోగించిన పెట్టెల నుండి మంచి భాగాలను కత్తిరించి, వాటితో కార్మికులు అట్టపెట్టెలను తయారుచేస్తారు. పాత రబ్బరు చెప్పుల అడుగుభాగాన్ని ముక్కలుచేసేందుకు చర్నర్‌లో ఉంచి, జెర్రీ క్యాన్‌లను శుభ్రం చేసి, వాటిని పైకప్పులపై కుప్పలుగా పేర్చుతారు. పాత రిఫ్రిజిరేటర్ల, వాషింగ్ మెషీన్ల భాగాలు 13వ కాంపౌండ్‌లో విడదీస్తారు. మెటల్, ప్లాస్టిక్ భాగాలను రీసైక్లింగ్ కోసం తరలిస్తారు. కంప్యూటర్ కీబోర్డులను విరగ్గొట్టేస్తారు, పాత ఫర్నిచర్‌ని విరగ్గొట్టడమో, లేదా మరమ్మతులు చేయటమో చేస్తారు. చమురు, రంగుల(పెయింట్స్) ఖాళీ పీపాలను శుభ్రం చేసి, మరోసారి వాడేందుకు సిద్ధం చేస్తారు. అయితే వాటిలోని హానికరమైన అవశేషాలు మురుగు కాలువలలోకి ప్రవహిస్తాయి.

కొన్ని గోడౌన్లలో, కార్మికులు ప్లాస్టిక్ వస్తువులను వాటి నాణ్యత, పరిమాణం, రకాన్ని బట్టి - సీసాలు, బకెట్లు, పెట్టెలు, మరికొన్నింటిగా - వేరు చేస్తున్నారు. వీటిని ఒక క్రమపద్ధతిలో వేరుచేసి కడిగి శుభ్రంచేస్తారు. కొన్ని వర్క్‌షెడ్‌లలో ఇవి తక్కువ రకం ప్లాస్టిక్ వస్తువులుగా తిరిగి మార్చడానికి వీలుగా గుళికలుగా తయారుచేస్తారు. తర్వాత, తదుపరి ప్రయాణం కోసం వీటిని గోతాలలో బిగించి కట్టి, టెంపోలలో ట్రక్కులలో భర్తీ చేస్తారు. ఈ పనిని ఈ కార్మికుడు (కవర్ ఫోటో), అతని సిబ్బంది బహుశా ఇప్పుడే పూర్తిచేశారు.

"మీరు ఇలాంటి గావ్ ['గ్రామం'/ప్రదేశం] ని ఎక్కడైనా చూశారా?" అని ఒక కార్మికుడు ఒకసారి నన్నడిగారు. "ఈ ప్రదేశం మీకు అన్నీ ఇవ్వగలదు. ఇక్కడకు వచ్చే ఎవరికైనా ఏదైనా పని దొరుకుతుంది. రోజు ముగిసేసరికి ఇక్కడ ఎవరూ ఆకలితో ఉండరు."

అయితే గత దశాబ్దకాలంగా, అనేక గోడౌన్‌లు ధారావి నుండి ముంబైకు ఉత్తరపు అంచులలో ఉన్న నాలాసోపారా, వసయీ వంటి ఇతర రీసైక్లింగ్ హబ్‌లకు తరలిపోతున్నాయి. పెరుగుతున్న ఖర్చులు, పునరాభివృద్ధిలో అనిశ్చితి ఇందుకు కారణం. ఒక చదరపు మైలు విస్తీర్ణంలో ఉన్న సెంట్రల్ ముంబై ప్రాంతమైన ధారావిని 'పునరాభివృద్ధి' చేయాలనే ప్రణాళికలు సంవత్సరాలుగా ప్రచారంలో ఉన్నాయి. ఇవి అమలు చేయబడినప్పుడు మరిన్ని వ్యర్థాల రంగంలోని వ్యాపారాలను, ఇక్కడ దీర్ఘకాలంగా వేతనాలు పొందుతున్న వేలాది మంది కార్మికులను క్రమంగా బయటకు నెట్టివేస్తాయి. ఆ తర్వాత, వారి పట్టణప్రాంత 'గావ్' మరిన్ని ఎత్తైన టవర్లకు మార్గం చూపుతుంది.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Sharmila Joshi

شرمیلا جوشی پیپلز آرکائیو آف رورل انڈیا کی سابق ایڈیٹوریل چیف ہیں، ساتھ ہی وہ ایک قلم کار، محقق اور عارضی ٹیچر بھی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز شرمیلا جوشی
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

کے ذریعہ دیگر اسٹوریز Sudhamayi Sattenapalli