బుధవారం, జూన్ 7న, పీపుల్స్ ఆర్కైవ్ అఫ్ రూరల్ ఇండియా, మనసును హత్తుకునే కొన్ని ఘడియలను స్వంతం చేసుకుంది. ఇది PARI వలనే జరిగిందని చెప్పడానికి నాకెంతో గర్వంగా ఉంది. కెప్టెన్ పెద్ద అన్న, సుడిగాలి సైన్యం గురించి రాసిన కథనం గుర్తుందా? మరి, ఈ ఘడియ కూడా కెప్టెన్ పెద్దన్న ఇంకా మరువబడిన ఇతర నాయకులకు చెందినది.

సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ, దుఃఖం పెరుగుతోంది: భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన  యోధులు చనిపోయి, మన నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు. తరవాత తరం ఎవరూ మనకు స్వాతంత్య్రం తెచ్చిన వారిని నేరుగా చూడడం గాని, వినడం గాని చేయలేరు. బహుశా, ఇది చదువుతున్న చాలామందికి అటువంటి అనుభవం ఎప్పుడూ కలగలేదు.

అందుకే, కొన్నేళ్లుగా, నేను ఆ పోరాటంలో వృద్ధులైన స్త్రీ పురుషులను  ఫిలిం చేసి, వారి గురించి రాసి, డాక్యుమెంట్ చేస్తున్నాను. వారిలో చాలామంది నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటారు. కానీ వారిని ఎవరూ కీర్తించలేదు, గుర్తించలేదు.

వీడియో చూడండి: షెనోలిలో  గోపాల్ గాంధీ ఇంకా ఇతరులు, 1943 జూన్ 7న,  రైలు లో  తూఫాన్ సేన దాడిని  గురించి బ్రిటిష్ ఇండియన్ రైల్వేస్ వారు  కట్టించిన చిన్న ‘స్మారక చిహ్నం’ వద్ద ఉన్నారు

అందుకని మేము 1943-46 మధ్య సతారా లోని ప్రతి సర్కార్  లేదా తాత్కాలిక అండర్ గ్రౌండ్ ప్రభుత్వంలో పనిచేసిన నాయకుల పునః కలయిక (Reunion )ను నిర్వహించాము. మహారాష్ట్ర లోని, సతారా, సాంగ్లీ జిల్లాలకు చెందిన - తూఫాన్ సేనలో పని చేసినవారే కాక ఇతర స్వాతంత్య్ర పోరాట వీరులను- వృద్ధాప్యపు ఆఖరు అంచున ఉన్నవారిని జూన్ 7న సన్మానించాము. 1943 సంవత్సరంలో ఇదే రోజున వీరు బ్రిటిష్ అధికారుల జీతాన్ని పట్టుకెళ్తున్న రైలు మీద సతారా లోని షెనోలి గ్రామంలో దాడి చేశారు. ఆ డబ్బును పేదవారికి, వారు ఏర్పరిచిన  ప్రతి సర్కార్ కార్యాలకు వాడారు.

గోపాల్ గాంధీ, రిటైర్డ్ దౌత్యవేత్త, పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ - అంతేగాక మహాత్ముడి మనవడు - ఈయనను ఢిల్లీ నుండి వచ్చి ఈ కార్యక్రమంలో మాట్లాడమని మేము కోరాము. అతను వచ్చి, ఇక్కడి  దృశ్యం చూసి తీవ్రంగా కదిలిపోయాడు.

తూఫాన్ సేన (సుడిగాలి లేదా తుఫాను సైన్యం) ప్రతి సర్కార్ యొక్క సాయుధ విభాగం - ఇది భారతదేశస్వేచ్ఛా పోరాటంలో ఆశ్చర్యపరిచే ఒక అద్భుతమైన అధ్యాయం. 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమంలో సాయుధ శాఖగా పుట్టుకొచ్చిన ఈ విప్లవకారుల బృందం అతి పెద్దదైన సతారా జిల్లాలో సమాంతర ప్రభుత్వాన్ని ప్రకటించింది. ఇప్పటి  సాంగ్లీ జిల్లా కూడా అప్పుడు సతారాలో కలిసి ఉండేది.

Haunsai bai and Nana Patil felicitation
PHOTO • Namita Waikar ,  Samyukta Shastri

ప్రతి సర్కార్ నాయకుడైన నానా పాటిల్ కూతురు హౌషతాయిని,  మాధవరావు మన్నేను  సన్మానిస్తున్న గోపాల్ గాంధీ, ఈ వేడుక కుండల్ లో జరిగింది

షెనోలిలో ఆ చారిత్రాత్మకమైన రైల్వే ట్రాక్ వద్ద ఒక చిన్న వేడుకలా, చరిత్రను గుర్తిస్తూ వారిని సన్మానిద్దామనుకున్నాం. కానీ ఆ వేసవి మధ్యాహ్నం 3 గంటలకు వేడుకలో పాల్గొనడానికి 250 మంది దాకా వచ్చారు. చాలామంది  80 లలో 90 లలో ఉన్న వృద్ధులు, ఆ రైల్వే లైన్ వద్ద చిందరవందరగా- పార్క్ లో చిన్నపిల్లల్లా గుమిగూడి ఉన్నారు. వారికి ఇదొక కలయిక, రకరకాల పాయలలో స్వాతంత్య్ర పోరాట యోధులందరూ కలుసుకునే సందర్భం. ఆ వృద్ధ విప్లకారులు గోపాల్ గాంధీని ఆలింగనం చేసుకుని, ‘మహాత్మా గాంధీకి జై’ అని నినాదాలిచ్చారు. ముఖ్యంగా కెప్టెన్ భాను. ఆయన కళ్ళు గర్వంతో  తడిసాయి. ఆరోగ్యం బాలేకున్నా వీరందరిని కలవాలని గట్టిపట్టు మీద  వచ్చాడు. 94 ఏళ్ళ మాధవరావు మన్నే, ట్రాక్ చుట్టూ చురుకైన బాలుడిలాగా తిరుగుతుంటే, నేను ఆయన పడిపోతాడేమోనని ఆయన వెనుకే పరుగులు తీస్తున్నా. ఆయన పడలేదు. నవ్వునూ వీడలేదు.

ఆ తరవాత మేము, ట్రాక్ కిందుగా, ఎక్కడైతే  74 ఏళ్ళ క్రితం సైనికులు రైలుని ఆపి ఎక్కారో అక్కడికి వెళ్లాము. అక్కడొక చిన్న స్మారక చిహ్నం ఉంది- అది విప్లవకారులు ఏర్పరచింది కాదు, బ్రిటిష్ ఇండియన్ రైల్వేవారు ఆ దాడికి దుఃఖ చిహ్నంగా ఉంచారు. బహుశా ఇప్పుడక్కడ ఇంకో స్మారక చిహ్నం పెట్టాలేమో, ఆ రోజుకు అసలు అర్థాన్ని వివరిస్తూ.

ఆ తరవాత షెనోలికి 20 నిముషాల దూరంలో ఉన్న కుండల్ లో ఏర్పాటు చేసిన పెద్ద వేడుకలో పాల్గొనడానికి వెళ్ళాము. 1943లో ప్రతిసర్కార్  కుండల్ లో ఉండేది. ఈ వేడుకను అక్కడి స్థానికులు, స్వాతంత్య్ర పోరాట యోధుల - నాగనాథ్ నాయక్వాడి కి చెందిన జి డి బాపు లాడ్, గొప్ప యోధుడైన, ప్రతిసర్కార్ అధినాయకుడైన అయిన నానాపాటిల్ వారి కుటుంబాలు నిర్వహించారు. 1943 సన్నివేశంలోని ఈ చతుష్టయంలో పాలుపంచుకున్న వారిలో పావువంతు భాగస్వామ్యం ఉన్న భాను కెప్టెన్ ఒకరే సజీవంగా ఉన్నారు. వారితో పాటే చక్కని  వ్యక్తీకరణ కలిగిన  ఇంకో వ్యక్తి హౌషాబాయి, నానాపాటిల్ కుమార్తె, అలానే ఆ విప్లవోద్యమంలో సభ్యురాలు కూడా - అక్కడే ఉన్నారు. ఆ వృద్ధుడైన కెప్టెన్ భాను రెండు రోజుల ముందు నుంచి రోడ్డు మీదే ఉన్నారు. అవును, మహారాష్ట్ర లో నిరసన వ్యక్తం చేస్తున్న రైతుల తరఫున. ఇది గుర్తుంచుకోండి: చాలామంది స్వాతంత్య్ర పోరాట యోధులు, వారి వారసులు - రైతులు, రైతు కూలీలు.

వీడియో  చూడండి: వృద్ధ స్వాతంత్య్రయోధులు, కుండల్  ప్రజలు నిలబడి వ్యక్తం చేసిన హర్షాన్ని అందుకున్నారు

మహారాష్ట్ర ప్రభుత్వం జూన్ 7 వార్షికోత్సవాన్ని భిన్నంగా, 1943 లో బ్రిటిష్ రాజ్య పద్ధతిలో   చేసింది. పోలీసులను రైతుల పై అణిచివేతకు పంపించింది. దీనివలన స్వాతంత్య్ర పోరాట యోధుల వేడుక సన్నాహాలకు ఇబ్బంది కలిగింది.  చాలామంది రైతులను, కార్యకర్తలను లాగి, ఈడ్చి ‘నివారణ అరెస్టులు’ అనే పేరు చెప్పి లాక్ అప్ లో వేశారు. ఇవన్నీ ఎటువంటి ఆరోపణలు లేని అక్రమ నిర్బంధాలు. కిసాన్ సభకు చెందిన ఉమేష్ దేశముఖ్ షెనోలి లోనూ, కుండల్  లోనూ జరిగే స్వాతంత్య్ర  సమర యోధుల వేడుకకు ముఖ్యమైన నిర్వాహకుడు. కానీ అతనే హాజరుకాలేకపోయాడు. అతనిని ఉదయం 5. 30 కు ఇంకో ఎనిమిది మందితో కలిపి  తస్గోం పోలీస్ స్టేషన్ లాకప్ లో వేశారు. అతను ఈ పాత యోధులందిరి ఇళ్లకు ఫోనులు చేసి, వారు వేడుకకు రావడానికి ఏర్పాట్లు చేస్తూనే ఉన్నాడు.

అయినా రెండు సమావేశాలు జరిగాయి - కుండల్ పోడియంలో 20 మందికి పైగా స్వాతంత్య్ర  సమరయోధులున్నారు. ప్రేక్షకులలో ఒక్క కుర్చీ కూడా ఖాళీగా లేదు, చాలామంది కూర్చోడానికి స్థలం లేక నిలబడవలసి వచ్చింది. గోపాల్ గాంధీ- స్వాతంత్య్ర పోరాటం, మహాత్మా గాంధీ యొక్క విధానం, పాత యోధుల పట్ల గోపాల్ గౌరవం, ప్రస్తుత సమయాల్లో మన వైఖరులను గురించి మాట్లాడినప్పుడు ప్రేక్షకులు శ్రద్ధగా విన్నారు.

అతను ముగించిన వెంటనే, పాత యోధులకు ప్రేక్షకులు  అందరు ఒకేసారి నించుని గౌరవాన్ని తెలిపారు. కొద్దిసేపు కాదు, అలా చాలాసేపు నించున్నారు.  కుండల్ ప్రజలు తమ నాయకులకు, నాయకురాళ్ళకు  నమస్కరించారు. చాలామంది కళ్ళలో నీళ్లు నిండాయి, నా కళ్ళలో కూడా. నేను అక్కడ నిలబడి, చప్పట్లు కొడుతూ 90 ఏళ్ళు పైబడిన ఆ అద్భుతమైన స్త్రీపురుషులను చూస్తూ గర్వంతో ఆనందంతో  మైమరచిపోయాను. వారి సొంత పట్టణం వారిని ఈ విధంగా సన్మానిస్తోంది. ఇది వారి చివరి సంవత్సరాలలో చివరి గొప్ప క్షణం. వారి చివరి ఆనందాతిరేకం.

Freedom fighter program
PHOTO • Sinchita Maaji ,  Samyukta Shastri

యోధులను కారతాళ నాదాలతో ప్రేక్షకులు లేచినిలబడి మెప్పును అందించారు. కుడి: కుండల్‌లో జరిగిన కార్యక్రమంలో డౌటీ యోధుడు 95 ఏళ్ళ కెప్టెన్ భావు

ఫోటోలు: నమిత వేకర్, సంయుక్త శాస్త్రి, సించిత మాజి

అనువాదం: అపర్ణ తోట

پی سائی ناتھ ’پیپلز آرکائیو آف رورل انڈیا‘ کے بانی ایڈیٹر ہیں۔ وہ کئی دہائیوں تک دیہی ہندوستان کے رپورٹر رہے اور Everybody Loves a Good Drought اور The Last Heroes: Foot Soldiers of Indian Freedom کے مصنف ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز پی۔ سائی ناتھ
Translator : Aparna Thota

Aparna Thota is a writer (Telugu & English) based out in Hyderabad. ‘Poorna’ and ‘Bold & Beautiful’ are her published works.

کے ذریعہ دیگر اسٹوریز Aparna Thota