Portrait of Ponnusamy
PHOTO • P. Sainath

1993లో మేలాణ్‌మఱై నాడు గ్రామంలోని తన ఇంట్లో మేలాణ్‌మై పొన్నుసామి

ప్రపంచం ఆయనకొక గ్రామం. అయిదో తరగతిలోనే బడిమానేసి, గొప్ప సాహిత్యకారుడిగా రూపొందిన ఆయనను నేను మొదటిసారి 1993లో పుదుక్కోట్టైలో చూశాను. ఆ తరువాత. మేలాణ్‌మఱై నాడు గ్రామంలోని ఆయన ఇంట్లో కలుసుకున్నాను. అప్పట్లో అది కామరాజర్ జిల్లాలో ఉండేది (ఇప్పుడు విరుదునగర్). అక్టోబర్ 30న, 66 ఏళ్ళ మేలాణ్‌మై పొన్నుసామి మరణంతో, గ్రామీణ ప్రాంతానికి చెందిన అత్యంత సాధికార సాహిత్య గళాల్లో ఒకదాన్ని భారతదేశం కోల్పోయింది. అయితే, పొన్నుసామి ఒక గొప్ప సృజనాత్మక రచయితని మించినవారు. ఆయనకు చక్కటి రాజకీయ జ్ఞానం; తన పూర్వీకుల సొంత ప్రాంతమైన రామనాథపురం (రామ్‌నాడ్‌గా ప్రసిద్ధం)లో పేదరికం, అణచివేతల స్వభావాలనూ, వాటికి గల కారణాలనూ శోధించి బయటపెట్టే, విశ్లేషించే సునిశితమైన, విశ్లేషణాత్మకమైన శక్తి ఉన్నాయి.

ఆయన పల్లె మీద దృష్టి కేంద్రీకరించారు, దాని ద్వారా ప్రపంచాన్ని అర్థం చేసుకున్నారు. ‘వ్యవసాయ సంక్షోభం’ అనే మాటలు జనబాహుళ్యంలో బహుళంగా ఉపయోగించడానికి ఒక దశాబ్దం ముందుగానే, తమ గ్రామంలో కొత్త రకాల విత్తనాల ద్వారా రైతులకు ముంచుకురావొచ్చునని తాను భావించిన విధ్వంసం గురించి మాట్లాడారు. “ఈ విత్తనాల వాడకాన్ని ప్రారంభించినప్పటినుండి వాళ్ళకు ఉత్పాదక ఖర్చు చాలా ఎక్కువైపోయింది” అని ఆయన చెప్పారు. అలా చెప్పింది కూడా 1993లో!.

సుప్రసిద్ద సాహిత్యకారుడు, సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత, అసంఖ్యాకమైన ఇతర బహుమతులను గెలుచుకున్నవాడు అయినప్పటికీ, తన గ్రామాన్ని వదిలి మదురై లేదా చెన్నైల్లో ఏదో ఒక పెద్ద వేదిక మీదికి చేరుకోవాలనే ఆలోచనను ఆయన వ్యతిరేకించారు. పాత రామ్‌నాడ్ జిల్లాలో (ఇప్పుడు విరుదునగర్‌లో) ఉన్న ఒక గ్రామంలో జీవించడం ద్వారానే ఒక రచయితగా తాను ప్రామాణికతను పొందగలిగినట్టు పొన్నుస్వామి భావించారు. తన జీవితంలో కేవలం గత మూడు నాలుగు సంవత్సరాల్లో మాత్రమే, అనారోగ్యంతో సతమతమవుతున్న ఆయన, తన కుమారుడితో కలిసి ఉండడానికీ, వైద్యురాలైన కుమార్తెకు దగ్గరగా ఉండడానికీ చెన్నైకి మారారు.

ఎంత గొప్ప రచయిత ఆయన! ఎంత అద్భుతమైన మానవుడాయన! ఆయన లేకుండా పోవడం, ఇదెంత దారుణమైన నష్టం! ‘ ఎవ్రిబడీ లవ్స్ ఎ గుడ్ డ్రౌట్ ’ అనే నా పుస్తకంలో ఆయన గురించిన ఈ కథనం కనిపిస్తుంది:

ఒక రచయిత, ఒక ఊరు

మేలాణ్‌మఱై నాడు, కామరాజర్ (తమిళనాడు): ఆయన అయిదో తరగతిలో బడి మానేశారు. ఆయన రాసిన చిన్న కథల్లో కొన్ని ప్రస్తుతం విశ్వవిద్యాలయ స్థాయిలో చదవడం అవసరం. కానీ మేలాణ్‌మై పొన్నుసామి రచనల్లో ఎల్లప్పుడూ విస్పష్టంగా దర్శనమిచ్చే వ్యంగ్యోక్తి, ఆయనను ప్రయాణం పొడుగునా వెంటాడింది. ఈ కథల్ని ఇతర జిల్లాల్లోని విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నారు. ఆయన ఎంతగానో ప్రేమించే రామ్‌నాడ్‌కు మాత్రం సొంతంగా ఒక్క విశ్వవిద్యాలయమైనా లేదు.

పుదుక్కోట్టైలోని కిక్కిరిసిన ఒక సమావేశమందిరంలో, ఓ సాయంత్రం జరుగుతున్న బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తున్నప్పుడు మొదటిసారిగా ఆయనను చూశాను. ఒక టేబుల్‌పై ముందుకు ఆనుకొని ఉన్న పొన్నుసామి తన చిన్ని రామ్‌నాడ్ గ్రామం మీద గల్ఫ్ యుద్ధపు నాటకీయ ప్రభావం గురించి తన ప్రేక్షకులకు వివరిస్తున్నారు. అక్కడ ఉన్న కొందరు రైతులు తమ ‘ఆధునికీకరణ’, ట్రాక్టర్లు, తదితరాలను తాము వాడకంలోకి తేవడం గురించి ఆలోచించారు. తరువాత యుద్ధం మొదలైంది (1991లో). పెట్రోల్, డీజిల్, దిగుమతి చేసుకున్న ఉపకరణాల ధరలు ఆకాశాన్నంటడంతో వారి ప్రణాళికలు చెల్లాచెదురైపోయాయి.

ఈ దశలో, సమావేశ మందిరంలో కరెంట్ పోయింది. పొన్నుసామి ఒక్క క్షణం కూడా విరామం ఇవ్వలేదు. టేబుల్‌కు అనుకొని, తన ప్రసంగాన్ని కొనసాగించారు. అలాగే, మొదట్లో కేకలు వేసినప్పటికీ, శ్రోతలు కూడా కదల్లేదు. చీకట్లోనే వాళ్ళు మంత్రముగ్ధులై వింటూ ఉండిపోయారు.

అదంతా ఒక నెల రోజుల క్రితం. ఇప్పుడాయనను మనం మళ్ళీ బహుశా చీకట్లో వినబోతున్నాం. మారుమూలన ఉన్న ఆయన గ్రామం కోసం మేం గంటల తరబడీ వెతికాం. మేం అక్కడికి చేరుకొనేసరికి అర్ధరాత్రి దాటిపోయి దాదాపుగా 2 గంటలయింది. దార్లో నా కాలు విరగ్గొట్టుకున్నాను, నొప్పి దారుణంగా ఉంది. కుక్కల అరుపులు చుట్టూ మైళ్ళ తరబడీ ఉన్నవారిని నిద్రలేపుతూ ఉంటే, ఆ సమయంలో ఆయనను లేపి ఇబ్బంది కలిగించినందుకు మేం క్షమాపణ చెప్పుకున్నాం.

ఆయన ఆశ్చర్యపోయినట్టు కనిపించారు: “ఒక చర్చ సాగించడానికి ఇది ఉత్తమమైన సమయం కాదంటారా?” అని అడిగారు. కొన్ని క్షణాల తరువాత, మేం లోతైన చర్చలో మునిగిపోయాం.

Income slip of family
PHOTO • P. Sainath

ఆరుగురు సభ్యులున్న ఒక కుటుంబం నెలవారీ ఆదాయం రూ. 250 కావడం, 1993 నాటి రామ్‌నాడ్‌లో అసాధారణమేమీ కాదు

అత్యంత గౌరవనీయుడైన రచయిత అవటంతోపాటు, కొన్ని విధాలుగా, ఈ జిల్లాలో వెనుకబాటునం గురించి అవగాహన ఉన్న గొప్ప నిపుణుల్లో సైతం పొన్నుసామి ఒకరు. విసిరేసినట్టున్న ఆయన చిన్న గ్రామం మేలాణ్‌మఱై నాడు, రామ్‌నాడ్ విభజన తరువాత, ఇప్పుడు కామరాజర్ జిల్లాలో ఉంది. ఇక్కడి నుంచి, రామ్‌నాడు ఇప్పుడున్న స్థితిలోకి ఎలా చేరుకుందనే విషయంలో అంతర్‌దృష్టిని ఆయన అందిస్తున్నారు. గత 21 సంవత్సరాలుగా ఆయన రాసిన ప్రతి కథా రామ్‌నాడ్ గురించే, అదే కథాస్థలం కూడా.

కల్కి పురస్కార గ్రహీత, అభ్యుదయ రచయితల సంఘంలో ప్రధాన వ్యక్తి అయినప్పటికీ, తన మారుమూల గ్రామంలో జీవించడంవైపే పొన్నుసామి మొగ్గు చూపారు. ఒక పెద్ద నగరానికి ఎందుకు వెళ్ళలేదు? “అది రచనా సమగ్రతకు హాని కలిగిస్తుంది,” అని ఆయన చెప్పారు. కాబట్టి ఆయన మేలాణ్‌మఱై నాడులోనే ఉండిపోయారు. దారి కనుక్కోవడానికి చాలా కష్టమైన ప్రదేశం కావడంతో మేం అనుకున్న సమయానికి ఆరుగంటలు ఆలస్యంగా అక్కడకు చేరుకున్నాం.

“మీరు నన్ను రామ్‌నాడ్ పేదరికం మీద ఒక నిపుణుడిగా ఇంటర్వ్యూ చెయ్యబోతున్నారా? రచయితగా కాదా?” ఇదంతా పొన్నుసామికి వినోదంగా ఉందన్నది స్పష్టమైంది.

“రామనాథపురం జిల్లా 1910లో ఏర్పడింది” అని పొన్నుసామి అన్నారు. “ఈ రోజుకు కూడా దీనికి సొంతంగా ఒక విశ్వవిద్యాలయం లేదు. ఇప్పుడిది మూడు జిల్లాలకు, ఇద్దరు మంత్రులకు జన్మనిచ్చింది, కానీ ఒక్క మెడికల్ కాలేజీ కూడా లేదు,” అని అన్నారు. అలాగే ఒక్క ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ కూడా లేదు. ఇక్కడున్న ఒకే ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీని కూడా ఈ ఏడాది బహుశా మూసెయ్యవచ్చు. కొత్త జిల్లా వ్యాప్తంగా ఏ తరహావైనాకానీ మూడే మూడు కాలేజీలున్నాయి; వాటిలో కూడా కేవలం రెండు పోస్టు-గ్రాడ్యుయేషన్ తరగతుల్ని మాత్రమే అందిస్తున్నారు.

“వెనుకబాటుతనం తనదైన ఆలోచనాధోరణికి బీజాలు వేస్తుంది,” అన్నారాయన. “రామ్‌నాడ్‌లో ఒక విశ్వవిద్యాలయం కోసం ఎన్నడూ గట్టిగా డిమాండ్ చేయటం సైతం లేదు. కేవలం ఈ మధ్యకాలంలో మాత్రమే రాజకీయ పార్టీలు దాని గురించి మాట్లాడుతున్నాయి. ప్రాథమిక విద్యను ఆమోదించడానికి కూడా ఇక్కడ రెండు తరాలు పట్టింది.” అని ఆయన వివరించారు.

“డిమాండ్లు చెయ్యడం, పిటిషన్లు వెయ్యడం అనేవి రామ్‌నాడ్ ప్రజల నుంచి అంత సులువుగా జరిగే విషయాలు కావు. 83 ఏళ్ళపాటు ఈ జిల్లా కేంద్రం, మరో జిల్లా అయిన మదురైలో ఉంది! చివరికి, ఆరునెలల కిందటి దాకా కూడా మా న్యాయ స్థానాలు ఆ పట్టణంలోనే ఉండేవి. 1985లో, రామ్‌నాడ్‌ను మూడు జిల్లాలుగా మార్చిన తరువాతే ఆ పరిస్థితి మారింది.” అని ఆయన చెప్పారు.

Dalit leather worker in Ramnad
PHOTO • P. Sainath

1993లో రామ్‌నాడ్‌లోని ఒక దళిత చర్మకారుడు. ఇటువంటి పనివారు, భూమిలేని కార్మికులు, సన్నకారు రైతులే పొన్నుసామి కథల్లో పాత్రలుగా ఉంటారు

అంటే, “పరిపాలన ఎల్లప్పుడూ ప్రజల నుంచి దూరంగానే ఉంటోంది. అధికారులు చాలా దూరంగా ఉంటారు, స్థానిక సమస్యల గురించి వాళ్ళకి తెలిసింది చాలా తక్కువ. ఈ ప్రాంతపు సంక్లిష్టతలను గురించి సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఇప్పుడు మాకు కోర్టులు, కలెక్టరేట్, ఇతర పాలనా నిర్మాణాలు ఉన్నాయి. అయినప్పటికీ, పాత వ్యవహారమే నడుస్తోంది. ఎందుకంటే మౌలికమైన సమస్యలను గురించి పట్టించుకోవడం జరగలేదు” అని తననుతాను వామపక్షవాదిగా చెప్పుకోవడానికి ఎంతమాత్రమూ సందేహించని పొన్నుసామి వెల్లడించారు.

ఆదాయపరంగా రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఇదొకటి; ఆ నియమం ప్రకారం, ఈ ప్రాంతం మిగిలిన తమిళనాడు కంటే దాదాపు 20 శాతం వెనుకబడి ఉంది. “ఇది పూర్వకాలంలో జమీందారీ ప్రాంతం. అనేక చిన్న రాజ్యాలు, లేదా సంస్థానాలతో నిండి ఉండేది. అవి చాలా వరకూ కుల ప్రాతిపదికన నడిచేవి. ఆ విధంగా ఇక్కడి వెనుకబాటుతనానికి కులం అపారంగా దోహదం చేసింది.”

ఆ మాత్రపు జీవన విధానాన్ని కూడా బ్రిటిష్ పాలన అస్థిరం చేసింది. ఉపాధికీ, ఆదాయానికీ అప్పట్లో ఉన్న కొద్దిపాటి మార్గాలను కూడా అది నాశనం చేసేసింది. “అనేకమంది మనుషులు అక్రమ కార్యకలాపాలకు పాల్పడ్డారు. వాళ్ళకి బతికే ఇతర మార్గాలు చాలా కొద్దిగానే మిగిలాయి.” ఈ రోజుకు కూడా, రామ్‌నాడ్‌లో ప్రధానంగా కుల ప్రాతిపదికన జరిగే హింస, నేరాలు అత్యంత తీవ్ర స్థాయిలో ఉన్నాయి.

“ఇక్కడ భూసంస్కరణలు కూడా అర్థంలేకుండానే సాగాయి. అందరూ అనుకునేదానికి భిన్నంగా, ఈ జిల్లాకు చక్కటి వ్యవసాయక సామర్థ్యం ఉంది. కానీ, ఈ దృక్పథంతో పని చేసినవాళ్ళెవరైనా ఎప్పుడైనా ఉన్నారా?” రామ్‌నాడ్‌లో 80 శాతానికి పైగా కమతాలు పరిమాణంలో రెండు ఎకరాలకన్నా చిన్నవి. అనేక కారణాలవల్ల అవి ఆర్థికంగా గిట్టుబాటయేవి కావు. అన్నిటికన్నా ప్రధానమైన సమస్య సాగునీటి వసతి లేకపోవడం.

“ఉపాధి, ఉపాధి స్వభావం అనేవి మానవుడి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో గొప్ప స్థానాన్ని ఆక్రమిస్తాయి. మీ దగ్గర్లో సిమెంట్ ఫ్యాక్టరీ ఉంటే, మీకు దొరికేది కేవలం సిమెంట్ మాత్రమే కాదు, ఒక నిర్దిష్ట స్వభావం కలిగిన ఉద్యోగాలు కూడా. అయితే, అలాంటి కర్మాగారం పెట్టాలంటే మొదటగా మీరు అందుకు కావలసిన స్థలాన్ని, వనరుల్ని వెతుక్కోవాలి. రామ్‌నాడ్‌లోని వనరులను గుర్తించే చర్యలు నిజంగా ఎన్నడూ జరగలేదు. అలాగే, శాశ్వత ప్రాతిపదికన ఉపాధిని కల్పించే చర్యలను కూడా ఎన్నడూ తీసుకోలేదు.”

పొన్నుసామి చెప్పినవాటిలో ఒక ముఖ్యాంశం ఉంది. రామ్‌నాడ్‌లో బహుశా “ఏడాది పొడుగునా ఆర్థికంగా క్రియాశీలత కలిగిన జనాభా” నిష్పత్తి అత్యంత కనిష్టంగా, 40 శాతంకన్నా తక్కువగా ఉంది. అంటే, ప్రజల్లో చాలా ఎక్కువమంది, చాలా నెలలపాటు పెద్దగా ప్రయోజనం ఇవ్వని ఉద్యోగాలతో జీవిస్తున్నారు. “ఒకవైపు, నీటి వనరుల వినియోగం సరిగ్గా లేకపోవడంతో వ్యవసాయం విఫలమయింది. ఇంకోవైపు ఎటువంటి పారిశ్రామికాభివృద్ధి లేదు. క్లుప్తంగా చెప్పాలంటే, ‘ఉపాధిని సృష్టించాలనే స్పృహ’ లేదు. కార్మికుడి ఉత్పాదకత విషయానికొస్తే, రాష్ట్ర సగటుకు దాదాపు 20 శాతం వెనుకబడి ఉంది.”

రామ్‌నాడ్‌లో ఆర్థికపరమైన బలహీనవర్గాల సంఖ్య ఎప్పుడూ ఎక్కువగానే ఉంది. ఇక్కడి జనాభాలో షెడ్యూల్డ్ కులాలు, తెగల వారు దాదాపు 20 శాతం వరకూ ఉంటారు. దీంతోపాటు, ఈ జిల్లాలో వెనుకబడిన తరగతుల నిష్పత్తి చాలా ఎక్కువ. రాష్ట్రంలోనే అత్యంత అధ్వాన్నంగా, ఈ వర్గాల్లో నిరుద్యోగిత స్థాయి అత్యధికంగా ఉంది. “ఈ జిల్లాలో దోపిడీ సంబంధాలు కూడా మాకు ఎక్కువగానే ఉన్నాయి.”

Chilli farmers filling sacks for market
PHOTO • P. Sainath
At the chilli market in Raman town
PHOTO • P. Sainath

ఎడమ: ఎట్టివయల్ గ్రామంలో మిరపకాయలతో గోనెసంచులు నింపుతున్న రైతులు. కుడి: 1993లో, రామనాథపురంలోని మిర్చి మార్కెట్ దగ్గర

అది విలక్షణమైన రామ్‌నాడ్ వడ్డీవ్యాపారి గురించి కావచ్చు, లేదా మిరప రైతు విషాదం గురించి కావచ్చు- మేలాణ్‌మై పొన్నుసామి వాటన్నిటినీ ఏకరువు పెడతారు. పదే పదే వచ్చే కరవులు, దీర్ఘకాలంపాటు వలసపోవటాలు, లేదా నిరుద్యోగం ప్రభావాలు- ఇవేవీ ఆయన దృష్టిని తప్పించుకోలేకపోయాయి. అట్టడుగు స్థాయి నుంచి, కేవలం తన చిన్న గ్రామంలో పరిశీలన జరపడం ద్వారా ఆయన సంపాదించుకున్న అంతర్‌దృష్టి నిర్ఘాంతపోయేలా చేస్తుంది. ఆయన పరిశీలనలు తరచూ అత్యుత్తమ పరిశోధన ఫలితాలకు సరిపోలుతాయి.

“కొత్తరకాల విత్తనాలను మిరప రైతులు ఉపయోగిస్తున్నారు. అవి ఎక్కడినుంచి వచ్చేయనేది నాకు ఖచ్చితంగా తెలీదు; కానీ అవి రైతు ఆర్థిక పరిస్థితుల్ని దుర్భరం చేస్తున్నాయి. ఈ విత్తనాలు తాత్కాలికంగా ఎక్కువ ఫలసాయం ఇవ్వొచ్చు. కానీ ఎరువుల మీదా, వ్యవసాయక రసాయనాల మీదా ఇంకా, ఇంకా ఎక్కువ ఖర్చు చెయ్యాల్సిన అగత్యాన్ని అవి రైతులకు కలిగిస్తున్నాయి. అవి నేలని నిర్జీవంగా చేస్తున్నాయి. కొద్దికాలం తరువాత ఫలసాయం పడిపోవడం మొదలవుతుంది. ఈ విత్తనాల వాడకాన్ని మొదలుపెట్టినవారి ఉత్పత్తి ఖర్చు ఇప్పుడు చాలా పెరిగిపోతోంది.”

ఏదైతేనేం, ఆయన రాసిన మొత్తం ఆరు కథా సంకలనాలు, ఒకే ఒక నవల అణచివేయలేని ఆశావాదాన్ని ప్రతిఫలిస్తాయి. (ఒక సంకలనం పేరు ‘ మానవత్వమే గెలుస్తుంది ’). “ఇక్కడి ప్రజలకు పోరాట స్ఫూర్తి ఉంది. వాళ్ళే స్వయంగా రామ్‌నాడ్‌ని మారుస్తారు. అలా అని మనం కేవలం ఆత్మసంతృప్తి చెంది ఉండిపోకూడదు. మనం దాని కోసం పని చెయ్యాలి.” అయితే, ఆయన కేవలం రామ్‌నాడ్ మీద మాత్రమే రాయడాన్ని కొనసాగిస్తారా?

“నా రచనల్లో వాస్తవం ఉండాలి. అయితే, ఈ గ్రామానికి సంబంధించిన వాస్తవాల విషయంలో అత్యంత నిజాయితీగా ఉంటూనే, ఉత్తరప్రదేశ్‌లోని ఒక గ్రామం తాలూకు వాస్తవికత గురించి కూడా బహుశా నేను రాయగలను. ఎవరి సమస్యలను మీరు చెబుతున్నారనే దాని మీద ఇది ఆధారపడి ఉంటుంది, కాదంటా రా?”

అనువాదం: ఆర్ఎస్ఆర్ కృష్ణశర్మ

پی سائی ناتھ ’پیپلز آرکائیو آف رورل انڈیا‘ کے بانی ایڈیٹر ہیں۔ وہ کئی دہائیوں تک دیہی ہندوستان کے رپورٹر رہے اور Everybody Loves a Good Drought اور The Last Heroes: Foot Soldiers of Indian Freedom کے مصنف ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز پی۔ سائی ناتھ
Translator : RSR Krishna Sarma

RSR Krishna Sarma is a senior journalist working as a senior sub-editor in a Telugu language daily newspaper.

کے ذریعہ دیگر اسٹوریز RSR Krishna Sarma