చక్కని ఎండ కాస్తున్న ఒక ఆదివారం రోజున‌, సుమారు 30 మంది మ‌హిళ‌ల‌తో ముప్ఫ‌యి తొమ్మిదేళ్ల సునీతారాణి మాట్లాడుతున్నారు. త‌మ హ‌క్కుల్ని కాపాడుకోవ‌డం కోసం పెద్ద సంఖ్య‌లో దీర్ఘ‌కాలిక దీక్ష‌కు సిద్ధం కావాలని ఆమె వారికి ఉద్బోధిస్తున్నారు. “ కామ్ పక్కా, నౌకరి కచ్చి (ప‌నికి హామీ, జీతానికి లేదు)”, అని ఆమె నిన‌దిస్తుండ‌గా, “ నహి చలేగీ, నహీ చలేగీ (ఇకపై చెల్ల‌దు, ఇకపై చెల్ల‌దు)”, అంటూ ఆ మ‌హిళ‌లు త‌మ గొంతును క‌లుపుతున్నారు.

ఢిల్లీ-హర్యానా హైవేకి స‌మీపం లోని సోనిపట్ పట్టణంలోని సివిల్ హాస్పిటల్ లాన్ లోప‌ల ప‌లువురు మ‌హిళ‌లు కూర్చునివున్నారు. వీరిలో ఎక్కువ‌మంది ఎరుపు రంగు దుస్తులు ధరించివున్నారు. హర్యానాలో వారు ధ‌రించే యూనిఫారం రంగు కూడా అదే. ఒక ధుర్రి (చిన్న‌పాటి వేదిక‌)పై కూర్చుని న్న‌ సునీతతో వారు త‌మ బాధ‌లు వెళ్ల‌బోసుకుంటున్నారు. నిజానికి అవ‌న్నీ అంద‌రికీ తెలిసిన విష‌యాలే.

ఆ మహిళలందరూ గుర్తింపు పొందిన ఆశా సామాజిక ఆరోగ్య కార్యకర్తలు, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్ఆర్‌హెచ్ఎం)ను ముందుకు నడిపే క్షేత్రస్థాయి కార్యకర్తలు. భారతదేశ గ్రామీణ ప్ర‌జ‌ల్ని దేశ ప్రజారోగ్య సంరక్షణ వ్యవస్థతో అనుసంధానించే కీలకమైన బాధ్య‌త‌ను నిర్వ‌హిస్తున్న‌ది వీరే.  దేశవ్యాప్తంగా ప‌ది ల‌క్ష‌ల‌మందికి పైగా ఆశా కార్య‌క‌ర్త‌లు విధులు నిర్వ‌హిస్తున్నారు. ఆరోగ్యానికి సంబంధించి ఏ అవ‌స‌రం ఏర్ప‌డినా, అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో కూడా ప్ర‌జ‌లకు స‌ర్వ‌వేళ‌లా అందుబాటులో వుండేది ఈ ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలే.

వీరకి ప‌న్నెండు ముఖ్యమైన పనులుంటాయి, మ‌ళ్లీ ఇందులో 60 ఉప టాస్కులుంటాయి. పోషకాహారం, పారిశుద్ధ్యం, అంటు వ్యాధుల గురించి ప్ర‌జ‌ల‌కు సమాచారాన్ని అందించ‌డం నుండి, క్షయవ్యాధి రోగుల చికిత్సను ట్రాక్ చేయడం, వారి ఆరోగ్య సూచికల రికార్డులను నిర్వహ‌ణ దాకా బాధ్య‌త‌ల‌న్నీ ఆశా కార్య‌క‌ర్త‌లు పంచుకోవాల్సిందే.

''మా ఆశా కార్య‌క‌ర్త‌లు వీటిలోనే కాదు, ఇంకా అనేక విధుల్లో కూడా భాగ‌మ‌వుతుంటారు. నిజానికి మేము శిక్ష‌ణ పొందిన‌ది, ప‌నిచేస్తున్న‌ది వేర్వేరు అంశాల మీద‌. శిక్ష‌ణ‌లో భాగంగా మాకు నేర్పింది ప్రసవించిన త‌ల్లుల, న‌వ‌జాత శిశువుల ఆరోగ్య గణాంకాలను మెరుగుపరచడం గురించి మాత్ర‌మే'' అన్నారు సునీతారాణి. ఆమె సోనిపట్ జిల్లాలోని నాథుపూర్ గ్రామంలో పనిచేస్తున్నారు. ఆ  గ్రామంలోని 2,953 మంది జనాభాను చూసుకునే ముగ్గురు ఆశా కార్య‌క‌ర్త‌ల్లో సునీత ఒకరు.

ASHA workers from Sonipat district on an indefinite strike in March; they demanded job security, better pay and a lighter workload
PHOTO • Pallavi Prasad

త‌మ‌కు ఉద్యోగ భద్రత క‌ల్పించాల‌ని, మెరుగైన వేతనాలు చెల్లించాల‌ని, ప‌నిభారాన్ని త‌గ్గించాల‌ని డిమాండ్ చేస్తూ , సోనిపట్ జిల్లాకు చెందిన ఆశా కార్యకర్తలు మార్చిలో నిరవధిక సమ్మెను నిర్వ‌హించారు

ప్ర‌స‌వానికి ముందు, ప్ర‌స‌వానంత‌ర సంర‌క్ష‌ణ బాధ్యతలే కాక, ఆశాలు, కమ్యూనిటీ ఆరోగ్య కార్యకర్తలుగా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తారు. ప్రభుత్వ కుటుంబ నియంత్రణ విధానాలు; గర్భనిరోధకాంశాలు, గర్భాల మధ్య అంతరం వుంచాల్సిన అవసరాలపై కూడా వారు ప్ర‌జ‌ల‌కు అవగాహన కల్పిస్తారు. 2006లో  `ఆశా` కార్యక్రమం ప్రారంభించిన స‌మ‌యానికి వున్నన‌వ‌జాత శిశువుల మ‌ర‌ణాల సంఖ్య‌ను 2017 నాటికి ఆశా కార్య‌క‌ర్త‌లు గ‌ణ‌నీయ ప‌రిమితికి చేర్చ‌గ‌లిగారు. 2006లో ప్ర‌తి వెయ్యి జ‌న‌నాల‌కీ 57 మంది శిశువులు మ‌ర‌ణం పాల‌య్యేవారు. 2017 నాటికి ఈ సంఖ్య 33కి చేరింది . 2005-06 మరియు 2015-16ల‌ మధ్య, నాలుగు లేదా అంతకంటే ఎక్కువమంది న‌వ‌జాత శిశువుల సంర‌క్ష‌ణ‌ల కవరేజ్ 37 శాతం నుండి 51 శాతానికి పెరిగింది. ఇక ఆసుప‌త్రుల్లో ప్రసవాలు 39 శాతం నుండి 79 శాతానికి పెరిగాయి. ఈ గ‌ణాంకాల‌న్నీ ఆశా కార్య‌క‌ర్త‌లు సాధించిన విజ‌యాలే.

'మేము చేయ‌గ‌లిగినంత‌ మంచి ప‌ని చేస్తున్నాం. కానీ చివరికి వచ్చేసరికి ఎక్కువ‌గా వరసల చేసే స‌ర్వేల నిర్వ‌హ‌ణ‌కే స‌మ‌యం స‌రిపోతోంది' అని సునీత చెప్పారు.

`మేము ప్రతిరోజూ ఉన్న‌తాధికార్ల‌కు ఒక కొత్త నివేదికను సమర్పించాల్సివుంటుంది` అని జఖౌలీ గ్రామానికి చెందిన 42 ఏళ్ల ఆశా కార్య‌క‌ర్త  నీతు (పేరు మార్చబడింది) చెప్పింది. `ఒక రోజు ఎఎన్ఎం(ANM- ఆశాలు త‌మ నివేదిక‌లు స‌మ‌ర్పించాల్సిన‌ ఒక మ‌ధ్య‌వ‌య‌సు మ‌హిళ - సహాయక నర్సు / మంత్రసాని) మ‌మ్మ‌ల్ని పిలిచి, ప్ర‌సూతి, ప్ర‌స‌వానంత‌ర‌ అవ‌స‌రాలున్న‌ మహిళలందరి వివ‌రాలు సేక‌రించ‌డానికి ఒక సర్వే చేయమని కోరింది. మరుసటి రోజు మేము ఆసుప‌త్రుల్లో ప్ర‌స‌వాల సంఖ్యపై సమాచారాన్ని సేకరించి ఆ బాధ్య‌త‌ను పూర్తిచేశాం. ఆ త‌ర్వాతి రోజున‌ మేము ప్రతి ఒక్కరి రక్తపోటు వివ‌రాల్నీ న‌మోదు చేశాం. (క్యాన్స‌ర్‌, మ‌ధుమేహం, గుండె సంబంధిత వ్యాధుల నివార‌ణ‌కు కేంద్ర‌ప్ర‌భుత్వం చేప‌ట్టిన జాతీయ ప‌థ‌కం కోసం ఈ వివ‌రాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయి). ఈ స‌ర్వే పూర్తికావ‌డం ఆల‌స్యం, మ‌మ్మ‌ల్ని ఎన్నిక‌ల సంఘం ఆదేశాల మేర‌కు బూత్ లెవెల్ అధికారులుగా స‌ర్వేలు నిర్వ‌హించ‌డానికి నియ‌మించారు. ఈ ప్ర‌యాణం ఆగ‌దు,ఇలా కొన‌సాగుతూనే వుంటుంది`` అన్నారు సునీతారాణి.

నీతూ - తాను 2006లో ఉద్యోగంలో చేరినప్పటి నుంచీ విధినిర్వ‌హ‌ణ కోసం కనీసం 700 వారాలు కేటాయించాన‌ని; అనారోగ్యం, లేదా పండుగలకు మాత్రమే త‌న‌కు సెలవులు దొరికాయ‌ని అంచనా వేసింది. 8,259 మంది జనాభా ఉన్న ఆమె గ్రామంలో తొమ్మిది మంది ఆశాలు ఉన్నప్పటికీ, ఆమే బాగా అలసిపోయినట్లు కనిపిస్తుంది. గ్రామప్ర‌జ‌ల‌కు రక్తహీనత అవగాహనపై ఒక‌ డ్రైవ్‌ను ముగించి, ఒక గంట ఆల‌స్యంగా ఆమె సమ్మె జరిగిన ప్రదేశానికి చేరుకోగ‌లిగింది. ఇక ఆశాల బాధ్య‌త‌లు ఇంత‌టితో ఆగ‌వు. గ్రామంలోని పక్కా గృహాల సంఖ్యను లెక్కించడం నుంచి, ఊర్లోని ఆవులు, గేదెలను లెక్కించడం దాకా త‌మ‌క‌ప్ప‌గించిన ఏ ప‌నినైనా వారు పూర్తిచేయాల్సిందే. చివ‌రికి ఇంటింటికి కాల్ చేసే పనులు కూడా వీరే చేయాలి.

39 ఏళ్ల ఆశా కార్యకర్త ఛావీ కశ్యప్ మాట్లాడుతూ ``2017లో నేను ఆశా కార్య‌క‌ర్త‌గా చేరాను. కేవ‌లం మూడేళ్ల‌లో నా ప‌ని ఒత్తిడి మూడు రెట్లు పెరిగింది. ఇందులో ఎక్కువ భాగం డాక్యుమెంటేష‌నే (ప‌త్రాల త‌యారీ) వుంటుంది`` అన్నారు. సివిల్ ఆసుప‌త్రి నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆమె గ్రామం బహల్‌ఘర్ నుండి ఆమె సమ్మెలో పాల్గొంది. `మేము ఒక స‌ర్వే పూర్తి చేసేస‌రికి ప్ర‌భుత్వం ఇంకో స‌ర్వేను మా మీద పడేయడానికి సిద్ధంగా వుంటుంది. మ‌ళ్లీ మేము కొత్త ప‌నిని ప్రారంభించాల్సిందే` అన్న‌దామె.

'We don’t even have time to sit on a hartal,' says Sunita Rani; at meetings, she notes down (right) the problems faced by co-workers
PHOTO • Pallavi Prasad
'We don’t even have time to sit on a hartal,' says Sunita Rani; at meetings, she notes down (right) the problems faced by co-workers
PHOTO • Pallavi Prasad

మాకు హర్తాళ్ లో కూర్చునే సాయమా కూడా లేదు, అన్నది సునీతా రాణి, ఆమె మీటింగుల్లో తన సహోద్యోగులతో కలిసి వారు ఎదుర్కునే సమస్యలను రాస్తోంది(కుడి)

వివాహ‌మైన త‌ర్వాత దాదాపు 15 ఏళ్లపాటు ఛావి తన ఇంటి నుంచి బయటకు వెళ్లిన మ‌నిషి కాదు. మ‌రో మ‌నిషి తోడు లేకుండా క‌నీసం ఆస్పత్రికి కూడా వెళ్లిందిలేదు. 2016లో ఒక ఆశా కార్య‌క‌ర్త (ఫెసిలిటేట‌ర్‌) ఆమె గ్రామానికి వచ్చి, ఆశా కార్య‌క‌ర్త‌ల విధుల గురించి ఒక‌ వర్క్‌షాపును నిర్వహించింది. దానికి హాజ‌రైన‌ ఛావీ తానూ ఆశా కార్య‌క‌ర్త‌గా మారాల‌నుకుంది. మ‌రికొన్ని వ‌ర్క్‌షాపులకు  కూడా హాజ‌ర‌య్యాక ఆశా ఫెసిలిటేట‌ర్లు షార్ట్‌లిస్ట్ చేసి, ముగ్గురు వివాహిత మ‌హిళ‌ల‌ను ఎంపిక చేశారు. వీరంతా 18 నుంచి 45 ఏళ్ల మ‌ధ్య‌వ‌య‌సువారే. క‌నీసం ఎనిమిదో త‌ర‌గ‌తి దాకా చ‌దువుకుని, సామాజిక ఆరోగ్య కార్య‌క‌ర్త‌లుగా ప‌నిచేయాల‌ని ఆస‌క్తితో వున్న‌వారే.

ఛావీకి ఆస‌క్తి, అర్హ‌త రెండూ వున్నాయి. కానీ ఆమె భ‌ర్త ఇందుకు అభ్యంత‌రం చెప్పాడు. అతను బహల్‌ఘర్ లోని ఇందిరా కాలనీలో వున్న‌ ఒక ప్ర‌యివేటు ఆసుపత్రిలో నర్సింగ్ విభాగంలో ప‌నిచేస్తున్నాడు. ``నా భ‌ర్త వారానికి రెండు రోజులు నైట్‌షిప్టులో ప‌నిచేయాల్సివుంటుంది. మాకిద్ద‌రు మ‌గ‌బిడ్డ‌లు. మేమిద్ద‌రం ఉద్యోగాల్లో వుంటే వారినెవ‌రు చూసుకుంటార‌ని ఆయ‌న ఆందోళ‌న‌ప‌డ్డాడు` అని చెప్పింది ఛావీ. అయితే, కొన్ని నెల‌ల త‌ర్వాత అత‌ను ఆర్థికంగా కుదుట‌ప‌డ్డాక, త‌న అభ్యంత‌రాల్ని ప‌క్క‌న‌పెట్టి ఛావీని ఆశా కార్య‌క‌ర్త‌గా ప‌నిచేసేందుకు ప్రోత్స‌హించాడు. ఆ త‌ర్వాత జ‌రిగిన రిక్రూట్‌మెంట్‌లో ఛావీ ద‌ర‌ఖాస్తు చేసుకుని ఆశా కార్య‌క‌ర్త‌గా ఎంపికైంది. బహల్‌ఘర్ లోని 4,196 మంది ప్ర‌జ‌ల‌ కోసం ప‌నిచేస్తున్న ఐదుగురు ఆశా కార్య‌క‌ర్త‌ల్లో ఒక‌రిగా చేరిపోయింది. గ్రామ‌స‌భ కూడా దీనిని ధృవీక‌రించింది.

`భార్యాభ‌ర్త‌లుగా మేమిద్ద‌రం ఒక నియ‌మం పెట్టుకున్నాం. నా భ‌ర్త నైట్‌షిప్టులో వున్న‌ప్పుడు, ఒక మ‌హిళ ప్ర‌స‌వం కోసం ఆసుప‌త్రికి వెళ్లాల‌ని క‌బురందితే నేను ప్ర‌త్యామ్నాయాన్ని చూసుకుంటాను. నా బిడ్డ‌ల్ని విడిచిపెట్టి వెళ్ల‌లేను కాబ‌ట్టి; అంబులెన్సుకు క‌బురు పెట్ట‌డ‌మో, లేదా మ‌రో స‌హ‌చ‌ర ఆశా కార్య‌క‌ర్తను పంపించ‌డ‌మో చేస్తుంటాను` అని చెప్పింది ఛావి.

ప్ర‌తి ఆశా కార్య‌క‌ర్తా త‌మ‌ విధుల్లో భాగంగా వారానికో రోజు ప్రసవ వేదనలో ఉన్న గర్భిణీ స్త్రీలను ఆసుపత్రులకు తీసుకువెళ్లవలసి ఉంటుంది, ఇది ప్రతివారం వారు హడావిడిపడవలసిన విషయమే అవుతుంది. సోనిపట్ లోని రాయ్ తహసీల్ లోని బాద్‌ఖ‌ల్సా గ్రామానికి చెందిన ఆశా కార్య‌క‌ర్త శీత‌ల్ (32) (పేరు మార్చాం) మాట్లాడుతూ, “పోయిన వారం ఒక న‌డివ‌య‌సు మ‌హిళ నుంచి నాకు కాల్ వ‌చ్చింది. తాను ప్ర‌స‌వ‌వేద‌న‌లో వున్నాన‌ని, వేగంగా త‌న‌ను ఆసుప‌త్రికి తీసుకువెళ్లే ఏర్పాట్లు చేయ‌మ‌ని కోరిందామె. కానీ, నేను ఇంటినుంచి క‌దిలే ప‌రిస్థితిలో లేను”. ‘ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన’, గురించి ప్రస్తావిస్తూ, "అదే వారం, నన్ను మా గ్రామంలో ఆయుష్మాన్ క్యాంపును నిర్వహించమని అడిగారు" అని శీతల్ చెప్పింది. ప్రభుత్వ ఆరోగ్య పథకానికి అర్హులైన తన గ్రామంలోని ప్రతి ఒక్కరి ద‌ర‌ఖాస్తులు, రికార్డుల గుంపుల‌లో చిక్కుకునివున్న శీత‌ల్‌కి ఎఎన్ఎం నుంచి ఆదేశాలొచ్చాయి. ఆమె త‌న ఇతర అన్ని పనుల కంటే ఆయుష్మాన్ యోజన పనికే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని  వాటి సారాంశం.

“రెండేళ్ల క్రితం వివాహం చేసుకుని గ్రామానికి వచ్చిన ఈ గర్భిణి నన్ను విశ్వసించడానికి  చాలా ప్రయత్నమే చేశాను. మొదటి నుండి నేనామెకు తోడుగా వున్నాను. ఒక‌వైపు ఆమె కాన్పుకు సంబంధించిన ప‌నులు చేస్తూనే, ఇంకోవైపు  ఈసారి పిల్ల‌ల కోసం క‌నీసం రెండేళ్ల వ్య‌వ‌ధి తీసుకోమ‌ని ఆమె అత్త‌మామ‌లు, భ‌ర్త‌కు కౌన్సిలింగ్ ఇచ్చి వారిని ఒప్పించ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డాల్సివ‌చ్చింది. నేను ఆమెతో ఉండవలసింది.” అని శీత‌ల్ చెప్పింది.

దానికి బదులుగా ఆమె ఫోన్ లో అరగంట సేపు కంగారు పడుతున్న ఆ  కుటుంబాన్ని ఒప్పించి ఆమె లేకుండానే డాక్టర్  వద్దకు పంపించవలసి వచ్చింది. చివరికి ఆమె ఏర్పాటుచేసిన ఆంబులెన్స్ లోనే వారంతా ఆసుపత్రికి వెళ్లారు. “మేము ఏర్పరుచుకున్న విశ్వాసం చెదిరిపోతుంది,” అన్నది సునీతా రాణి.

'In just three years, since I became an ASHA in 2017, my work has increased three-fold', says Chhavi Kashyap
PHOTO • Pallavi Prasad

నేను ఆశా కార్య‌క‌ర్త‌గా చేరిన కేవ‌లం మూడేళ్ల‌లో నా ప‌ని ఒత్తిడి మూడు రెట్లు పెరిగింది ’, అన్నారు ఛావీ క‌శ్య‌ప్‌

ఆశా వ‌ర్క‌ర్లు చివ‌రికి ఉద్యోగ బాధ్య‌త‌ల్లోకి దిగేస‌రికి ఒంటిచేత్తో అనేక విధుల్ని నిర్వ‌హిస్తుంచ వలసి వ‌స్తుంది. సాధారణంగా డ్ర‌గ్ కిట్లు అందుబాటులో వుండవు. లేదా, త‌ప్ప‌నిస‌రైన మందులైన పారాసిట‌మాల్ (క్రోసిన్‌), ఐర‌న్‌, కాల్షియం మాత్ర‌లు, ఓఆర్ఎస్ పాకెట్లు, గ‌ర్భిణులకు మాత్ర‌లు, వారికివ‌స‌ర‌మైన కిట్లు కూడా దొరికవు.  “చివ‌రికి మాకు క‌నీసం త‌ల‌నొప్పి మాత్ర‌లు కూడా ఇవ్వ‌డంలేదు. ప్ర‌తి ఇంటికీ అవ‌స‌ర‌మైన మందుల జాబితాను మేము త‌యారుచేస్తాం. ఇందులోనే గ‌ర్భ‌నిరోధ‌క మందులు కూడా వుంటాయి. ఈ జాబితాను మేము ఎఎన్ఎంకి స‌మ‌ర్పిస్తాం. ఆమె మాకు వీటిని స‌మ‌కూర్చిపెట్టాల్సివుంటుంది”, అని చెప్పారు సునీత‌. ఆన్‌లైన్‌లో పేర్కొన్న‌ ప్ర‌భుత్వ రికార్డుల మేర‌కు సోనిపట్ జిల్లాలో 1,045 కిట్లు అవ‌స‌రం వుండ‌గా ప్ర‌భుత్వం 485 డ్ర‌గ్ కిట్స్‌ని మాత్ర‌మే అందించింది.

ఛావీ మ‌ళ్లీ మాట్లాడుతూ, ”ఆశా వ‌ర్క‌ర్లు త‌ర‌చూ ఖాళీ చేతుల‌తో ప్ర‌జ‌ల ద‌గ్గ‌రికి వెళ్లాల్సివ‌స్తుంటుంది. కొన్ని సంద‌ర్భాల్లో గర్భిణుల కోసం అవ‌స‌ర‌మైన ఐర‌న్ మాత్రల్ని మాత్ర‌మే అందించేవారు. కాల్షియం మాత్ర‌లుండ‌వు. గ‌ర్భిణుల‌కు ఈ రెండు మాత్ర‌లూ త‌ప్ప‌నిస‌రి. కొన్నిసార్లు  ప‌ది టాబ్లెట్లు మాత్ర‌మే కొల‌త వేసుకుని ఇస్తారు. ఇవి ప‌ది రోజుల్లోనే అయిపోతాయి. మ‌హిళలు మాత్ర‌ల కోసం మ‌ళ్లీ మా ద‌గ్గ‌రికి వ‌స్తే,  వారికివ్వ‌డానికి మావ‌ద్ద ఏమీ వుండవు`` అని చెప్పారు.

చాలా సంద‌ర్భాల‌లో వారిచ్చే మాత్ర‌లు ఏమాత్రం నాణ్య‌త లేనివే వుంటాయి. “కొన్ని నెల‌ల‌పాటు మాత్రల స‌ర‌ఫ‌రా లేక‌పోయినా, ఒక్క‌సారిగా మాలా-ఎన్ (నోటి ద్వారా ఇచ్చే గ‌ర్భ‌నిరోధ‌క) మాత్ర‌లు పొందుతాం. కానీ ఇవ‌న్నీ కేవ‌లం నెల రోజుల్లో గ‌డువు ముగిసేవే అయివుంటాయి. వీటిని వీలైనంత తొంద‌ర‌గా ప్ర‌జ‌ల‌కు స‌ర‌ఫ‌రా చేయ‌మ‌ని మాకు ఆదేశాలిస్తారు. మాలా-ఎన్‌ని ఉప‌యోగించే మ‌హిళ‌ల అభిప్రాయాల్నిఆశా కార్య‌క‌ర్త‌లు చాలా శ్ర‌ద్ధ‌గా రికార్డు చేస్తారు. కానీ, అధికారులు వీటిని చాలా అరుదుగానే  ప‌రిగ‌ణ‌న లోకి తీసుకుంటారు”, చెప్పారు సునీత‌.

సమ్మె రోజు మధ్యాహ్నానికి 50 మంది ఆశా కార్యకర్తలు నిరసనకు తరలివచ్చారు. హాస్పిటల్ ఔట్ పేషెంట్ విభాగం పక్కనే ఉన్న స్టాల్ నుంచి టీ ఆర్డర్ చేస్తారు. ఇందుకు డ‌బ్బులెవ‌రు చెల్లిస్తున్నారని ఎవరైనా అడిగితే, ఆరు నెలలుగా జీతం ఇవ్వకపోవడంతో తాను కాద‌ని నీతూ చ‌మ‌త్కారంగా చెప్పింది. ఎన్ఆర్‌హెచ్ఎం - 2005 పాల‌సీ ప్ర‌కారం ఆశా వ‌ర్క‌ర్లను వాలంటీర్లుగా ప‌రిగ‌ణిస్తారు. ఇక వారి వేత‌నాల‌ను వారు పూర్తిచేసిన ప‌నుల సంఖ్యనుబ‌ట్టే చెల్లిస్తారు. ఆశా వ‌ర్క‌ర్ల‌కు కేటాయించిన అనేక విధుల్లో కేవలం ఐదు మాత్రమే 'సాధారణ మరియు పునరావృత‌మైన‌వి'గా వర్గీకరించబడ్డాయి. 2018లో కేంద్ర‌ప్ర‌భుత్వం ఆశా వ‌ర్క‌ర్ల‌కు నెలకు రెండు వేల రూపాయ‌ల క‌నీస వేత‌నాన్ని నిర్ధారించింది. కానీ, ఇవి కూడా స‌మ‌యానికి చేతికందడం అరుదే.

ఈ వేతనంతో పాటు ఆశా కార్య‌క‌ర్త‌లు త‌మ పనులను పూర్తిచేసిన త‌రువాతనే వేత‌నాలు పొందుతారు. గ‌రిష్టంగా వీరికొచ్చే ఆదాయం ఐదువేల రూపాయ‌ల దాకా వుంటుంది. క్ష‌య‌వ్యాధి రోగులకు ఆరు నుంచి తొమ్మిది నెల‌ల పాటు మందులు అందించినందుకు, లేదా ఇక ఒక్క ఓఆర్ఎస్ పాకెట్‌ను ఇచ్చినందుకు వారికి ఒక్క రూపాయి మాత్రమే దక్కుతుంది. కుటుంబ నియంత్ర‌ణ ప్రోత్సాహ‌కాల కింద‌ ఒక ట్యూబెక్ట‌మీ, లేదా వేసెక్ట‌మీని నిర్వ‌హించినందుకు వీరికి ద‌క్కేది కేవ‌లం 200 - 300 రూపాయ‌లే. ఒక్క కండోమ్‌ పాకెట్ ను, గర్భనిరోధక పిల్, ఎల్దా  అత్యవసర గర్భనిరోధక పిల్ ను పంపిణీ చేసినందుకు ద‌క్కేది కేవ‌లం ఒక్క రూపాయి మాత్రమే. ఇక్క‌డ ఇంకో తిర‌కాసుంది. సాధారణ కుటుంబ నియంత్రణ కౌన్సెలింగ్‌కు ఎలాంటి చెల్లింపులుండ‌వు. నిజానికి ఆశా కార్య‌క‌ర్త‌ల‌కు బాగా శ్ర‌మ‌తో కూడుకున్న‌ పని, ప్ర‌జ‌ల‌కు బాగా అవ‌స‌ర‌మైన ప‌ని, ఎక్కువ స‌మ‌యం తీసుకునే ప‌ని కూడా ఇదే.

Sunita Rani (centre) with other ASHA facilitators.'The government should recognise us officially as employees', she says
PHOTO • Pallavi Prasad

`మ‌మ్మ‌ల్ని అధికారికంగా ప్ర‌భుత్వ ఉద్యోగులుగా ప‌రిగ‌ణించాలి` అని ఆశా కార్య‌క‌ర్త‌ల న‌డుమ కూర్చుని నిన‌దిస్తున్న సునీతారాణి (మ‌ధ్య‌లో వున్న మ‌హిళ‌)

దేశ‌వ్యాప్తంగా, రాష్ట్రాల వ్యాప్తంగా ఆశా కార్య‌క‌ర్త‌ల స‌మ్మెలు పెరుగుతుండ‌డంతో వివిధ రాష్ట్రాలు తమ ఆశా కార్యకర్తలకు స్థిరమైన నెలవారీ స్టైఫండ్‌ను చెల్లించ‌డం మొద‌లుపెట్టాయి. కానీ, వీటిలో కూడా రాష్ట్రాల మ‌ధ్య వైరుధ్యాలున్నాయి. క‌ర్ణాట‌క‌లో రు.4000; ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రు. 10,000; హ‌ర్యానాలో రు. 4,000 స్ట‌యిఫండ్‌లు అమ‌ల‌వుతున్నాయి.

''ఎన్ఆర్‌హెచ్ఎం పాల‌సీ ప్ర‌కారం ఆశా కార్య‌కర్త‌లు రోజుకు మూడు నుంచి నాలుగు గంట‌లు; వారానికి నాలుగు నుంచి అయిదు గంట‌లు మాత్ర‌మే ప‌నిచేయాలి. కానీ, తాము ఆఖ‌రి సెల‌వు ఎప్పుడు తీసుకున్నామో ఎవ‌రికీ జ్ఞాప‌కం వుండ‌దు. ప‌రిస్థితి ఇలావుంటే మేము ఆర్థికంగా ఎలా ఎదుగుతాం?'' అని బిగ్గ‌ర‌గా ప్ర‌శ్నించారు సునీత‌. చ‌ర్చ‌ను ప్రారంభించి, అక్క‌డ కూర్చున్న‌వారిలో చాలామంది మాట్లాడాక సునీత త‌న గ‌ళాన్ని బ‌లంగా వినిపించారు. కొంతమంది ఆశా కార్య‌క‌ర్త‌ల‌కి సెప్టెంబర్, 2019 నుండి రాష్ట్ర ప్రభుత్వం నెలవారీ అందించాల్సిన స్టైఫండ్ అంద‌లేదు, మరికొందరికి ఎనిమిది నెలలుగా వారి విధుల ఆధారంగా అందాల్సిన‌ ప్రోత్సాహకాలు అందలేదు.

ఆశా కార్య‌క‌ర్త‌ల్లో ఎక్కువ‌మంది ప్ర‌భుత్వం త‌మ‌కెంత బాకీ వుందో కూడా మ‌ర్చిపోయారు. ``కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఆశాల‌కి జీతాల చెల్లింపుల‌ను వేర్వేరుగా చేస్తాయి. కానీ, వీటికి ఒక నిర్ణీత స‌మ‌య‌మంటూ వుండ‌దు. త‌మకందే మొత్తాల్లో ఏది దేనికి సంబంధించిందో కూడా కార్య‌క‌ర్త‌లు గుర్తించ‌లేని అస్థిర‌ ప‌రిస్థితి ఏర్ప‌డింది`` అన్నారు నీతూ. ఇలా హేతుబ‌ద్ధ‌త లేని వేత‌నాల చెల్లింపుల వ‌ల్ల ఆశా కార్య‌క‌ర్త‌లు వ్య‌క్తిగ‌తంగా కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కువ స‌మ‌యం విధుల్లోనే వుండ‌డం, దామాషా ప‌ద్ధ‌తి ప్ర‌కారం వేత‌నాల చెల్లింపుల్లేక‌పోవ‌డం వ‌ల్ల కుటుంబాల్లో ఒత్తిళ్లు కూడా పెరిగాయి. దీంతో చాలామంది ఆశా కార్య‌క‌ర్త‌లు త‌మ విధుల నుంచి త‌ప్పుకున్నారు కూడా.

“దీనికితోడు ఆశా కార్య‌క‌ర్త‌లు ప్ర‌యాణాలు, ఇత‌ర అవ‌స‌రాల కోసం రోజుకు 100 నుంచి 250 రూపాయ‌లు త‌మ సొంత డ‌బ్బును ఖ‌ర్చుపెట్టాల్సివ‌స్తుంది. వేర్వేరు స‌బ్‌సెంట‌ర్ల‌ను సందర్శిస్తూ, పేషెంట్ల‌ను ఆస్ప‌త్రుల‌కు తీసుకుపోవ‌డం, వారినుంచి స‌మాచారం సేక‌రించ‌డం అనే ప్ర‌క్రియ నిరంత‌రం జ‌రుగుతూనేవుంటుంది. మేము గ్రామాల్లో కుటుంబ నియంత్రణ అవ‌గాహ‌న స‌మావేశాలు నిర్వ‌హించ‌డానికి వెళ్లినప్పుడు చాలా వేడిగా, ఎండగా ఉంటుంది. అక్క‌డికి హాజ‌ర‌య్యేవారికి చిరుతిండ్లు, శీత‌ల / వేడి పానీయాల్ని మేమే ఏర్పాటు చేయాల్సివుంటుంది. లేక‌పోతే మ‌హిళ‌లు రారు. కాబ‌ట్టి మాలో మేమే త‌లాకొంత వేసుకుని ఈ బాధ్య‌త‌ను పూర్తిచేస్తుంటాం”, అని వివ‌రించారు శీత‌ల్‌.

రెండున్న‌ర గంట‌ల‌పాటు సాగిన ఆశాల స‌మ్మెలో స్ప‌ష్టంగా ప‌లు డిమాండ్లున్నాయి. ఆశా వర్కర్లు, వారి కుటుంబాలకు ప్రభుత్వంతో ఎంపానెల్ చేయబడిన ప్రైవేట్ ఆసుపత్రులలో కూడా సేవల్ని పొందేందుకు వీలుగా వారికి ఆరోగ్య కార్డు ఇవ్వ‌డం; త‌మ‌కు పెన్ష‌న్‌ అర్హ‌త క‌ల్పించ‌డం; ఇప్ప‌టిదాకా రెండు పేజీల్లో చింద‌ర‌వంద‌ర‌గా వున్న‌షీట్ల‌కు బ‌దులుగా సుల‌భ‌మైన ప్రొఫైల్‌ ఫార్మాట్‌ను రూపొందించి కార్య‌క‌ర్త‌లంద‌రికీ అందించ‌డం; కండోమ్‌లు, శానిటైజేష‌న్ సామ‌గ్రిని ఇంట్లో దాచ‌డం సౌక‌ర్య‌వంతం కాదు కాబ‌ట్టి, వాటిని దాచ‌డానికి స‌బ్‌సెంట‌ర్ల‌లో ప్ర‌త్యేకంగా అల్మ‌రాల ఏర్పాటు మొద‌లైన డిమాండ్ల‌ను ఆశాలు ప్ర‌భుత్వం ముందుంచారు. హోళీకి మూడు రోజుల ముందు నీతూ కొడుకు ఆమె అల్మ‌రాలో దాచివుంచిన `బెలూన్ల‌` గురించి అడిగాడు. అవి కండోమ్‌ల‌ని కొడుక్కి ఎలా చెప్ప‌గ‌ల‌దామె?

మ‌రీ ముఖ్యంగా ఆశా కార్య‌క‌ర్త‌లు త‌మ విధుల‌కు త‌గిన గౌర‌వం, గుర్తింపు కావాల‌ని కోరుకుంటున్నారు.

Many ASHAs have lost track of how much they are owed. Anita (second from left), from Kakroi village, is still waiting for her dues
PHOTO • Pallavi Prasad

చాలా మంది ఆశాలకు ప్రభుత్వం తమకు తమకు ఇంకా ఎంత చెల్లింపులు చేయాలో కూడా సరిగ్గా తెలియదు. కాక్రోయి గ్రామానికి చెందిన అనిత(ఎడమ నుండి రెండో స్థానం), ఇంకా తనకు రావలసిన చెల్లింపులకు ఎదురుచూస్తోంది

"జిల్లా లోని అనేక ఆసుపత్రుల లోని ప్రసవాల గదుల వద్ద 'ఆశాలకు ప్రవేశం లేదు' అనే బోర్డు మీకు కనిపిస్తుంది" అని ఛావీ ఆక్రోశంతో చెప్పారు. ``మేము అర్థ‌రాత్రి వేళ‌ల్లో కూడా మ‌హిళ‌ల‌ను ప్ర‌స‌వాల కోసం ఆసుప‌త్రులకు తీసుకువెళ్తుంటాం. గర్భిణులు మమ్మల్ని ఉండమని అడుగుగుతారు, ఎందుకంటే వారికి, వారి కుటుంబాలకు ఆ సమయంలో మా నుండి ధైర్యం కావాలి.  కానీ, అక్క‌డి సిబ్బంది మ‌మ్మ‌ల్ని లోప‌లికి రానివ్వ‌రు. చలో నిక్లో హాన్ సే (వెళ్లిపోండి ఇక్క‌డినుంచి), అని గ‌ద్దిస్తారు. వారు మ‌మ్మ‌ల్ని త‌మ‌కంటే త‌క్కువ‌వారిగా చూస్తారు`` అని వివ‌రించింది నీతూ. ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాలు, ప్ర‌స‌వాల ఆసుప‌త్రుల్లో  నిరీక్షణ గదులు లేనప్పటికీ, చాలా మంది ఆశా కార్యకర్తలు స‌ద‌రు గ‌ర్భిణి, వారి కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి అక్క‌డే రాత్రిపూట బస చేస్తుంటారు.

మ‌ధ్యాహ్నం మూడు గంట‌లు కావ‌స్తోంది. స‌మ్మెలు జ‌రుగుతున్న ప్రాంతాల్లో మ‌హిళ‌లు అల‌సిపోతున్నారు. వారు తిరిగి ప‌నిలోకి వెళ్లాల్సివుంది. సునీత ఇంకా అరుస్తూనే వుందిలా. ''ప్ర‌భుత్వం మ‌మ్మ‌ల్ని సేవా కార్య‌కర్త‌ల్లాగా కాక, అధికారికంగా ప్ర‌భుత్వ ఉద్యోగులుగా ప‌రిగ‌ణించాలి. స‌ర్వేల‌కు మ‌మ్మ‌ల్నిదూరంగా వుంచాలి. అప్పుడే మా బాధ్య‌త‌ల్ని మేము స‌క్ర‌మంగా నిర్వ‌హించ‌గ‌లుగుతాం. మా ప‌నికి త‌గ్గ వేత‌నాల‌ను చెల్లించాలి''.

ఇక నెమ్మ‌దిగా ఆశా కార్య‌క‌ర్త‌లు అక్క‌డినుంచి మ‌ళ్లీ త‌మ విధుల్లో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ‘కామ్ పక్కా, నౌకరి కచ్చి’ , అని సునీత నిన‌దిస్తోంది. ఆశాలు వెంట‌నే స్పందిస్తున్నారు స‌హించ‌లేం, స‌హించ‌లేం , అని - తొలిసారి కంటే ఇంకా పెద్ద గొంతుతో. "మా హక్కుల సాధ‌న కోసం హర్తాళ్ (సమ్మె)లో కూర్చోవడానికి కూడా మాకు సమయం లేదు, క్యాంపులు, స‌ర్వేల మ‌ధ్య‌నే మేము మా స‌మ్మెల‌ను షెడ్యూల్ చేసుకోవాలి` అని చెప్పింది శీత‌ల్ న‌వ్వుతూ , ఆ తరవాత త‌న తలను దుపట్టాతో కప్పుకుని, రోజువారీ లాగే ఇళ్ల సందర్శ‌న‌ల‌కు బ‌య‌ల్దేరింది.

పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా లో భాగంగా, PARI మరియు కౌంటర్ మీడియా ట్రస్ట్ కలిసి గ్రామీణ భారతదేశంలో కౌమారదశలో ఉన్న బాలికలు మరియు యువతులపై దేశవ్యాప్త రిపోర్టింగ్ ప్రాజెక్ట్ ను చేస్తున్నారు. అట్టడుగున ఉన్నా ఎంతో కీలకమైన ఈ సమూహాల స్థితిగతులను అన్వేషించడానికి, సాధారణ ప్రజల గొంతులను, వారి అనుభవాలను వినిపించడానికి ఈ ప్రాజెక్టు కృషి చేస్తుంది.

ఈ వ్యాసాన్ని ప్రచురించాలనుకుంటున్నారా? ఐయితే [email protected] కి ఈమెయిల్ చేసి అందులో [email protected] కి కాపీ చేయండి.

అనువాదం: సురేష్ వెలుగూరి

انوبھا بھونسلے ۲۰۱۵ کی پاری فیلو، ایک آزاد صحافی، آئی سی ایف جے نائٹ فیلو، اور ‘Mother, Where’s My Country?’ کی مصنفہ ہیں، یہ کتاب بحران زدہ منی پور کی تاریخ اور مسلح افواج کو حاصل خصوصی اختیارات کے قانون (ایفسپا) کے اثرات کے بارے میں ہے۔

کے ذریعہ دیگر اسٹوریز Anubha Bhonsle
Pallavi Prasad

پلّوی پرساد ممبئی میں مقیم ایک آزاد صحافی، ینگ انڈیا فیلو اور لیڈی شری رام کالج سے گریجویٹ ہیں۔ وہ صنف، ثقافت اور صحت پر لکھتی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Pallavi Prasad
Illustration : Priyanka Borar

پرینکا بورار نئے میڈیا کی ایک آرٹسٹ ہیں جو معنی اور اظہار کی نئی شکلوں کو تلاش کرنے کے لیے تکنیک کا تجربہ کر رہی ہیں۔ وہ سیکھنے اور کھیلنے کے لیے تجربات کو ڈیزائن کرتی ہیں، باہم مربوط میڈیا کے ساتھ ہاتھ آزماتی ہیں، اور روایتی قلم اور کاغذ کے ساتھ بھی آسانی محسوس کرتی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Priyanka Borar
Series Editor : Sharmila Joshi

شرمیلا جوشی پیپلز آرکائیو آف رورل انڈیا کی سابق ایڈیٹوریل چیف ہیں، ساتھ ہی وہ ایک قلم کار، محقق اور عارضی ٹیچر بھی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز شرمیلا جوشی
Translator : Suresh Veluguri

Suresh Veluguri is one of the first generation Technical Writers in India. A senior journalist by profession. He runs VMRG international, an organisation that offers language services.

کے ذریعہ دیگر اسٹوریز Suresh Veluguri