శీతాకాలపు మధ్యాహ్నాల్లో , పొలాల్లో పని ముగించుకుని , ఇంటిలోని చిన్నోలు తమ ఉద్యోగాల కొరకు దూరంగా ఉన్నప్పుడు , హర్యాణాలోని సోనిపట్ జిల్లాలో హర్సానా కలాన్ గ్రామంలోని పురుషులు, చౌపాల్ (గ్రామ కూడలి) వద్ద తరచుగా పేకాడుతుంటారు లేదా నీడలో విశ్రాంతి తీసుకుంటారు.

అక్కడ స్త్రీలు ఎప్పుడూ కనిపియ్యరు.

"మహిళలు ఇక్కడికి ఎందుకు రావాలి?" అని స్థానిక నివాసి విజయ్ మండల్ అడిగాడు. "వారికి పని చేయడానికే సమయం లేదు. వో క్యా కరేంగే ఇన్ బడే అద్మియోన్ కే సాథ్ బైట్ కర్ ? [ఈ పెద్దమనుషుల మధ్య కూర్చుని వారు ఏమి చేస్తారు]?"

కొన్ని సంవత్సరాల క్రితం వరకు దాదాపు 5,000 మంది జనాభా మాత్రమే ఈ గ్రామంలో ఉండేవారు. ఢిల్లీ నుండి కేవలం 35 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఊరు జాతీయ రాజధాని ప్రాంతంలో భాగంగా ఉండేది. స్త్రీలు ముసుగులు లేదా పర్దా ధరించే అభ్యాసాన్ని ఖచ్చితంగా పాటించేవారు.

" మహిళలు చౌపాల్ వైపు చూసేవారు కూడా కాదు ," అని మండల్ చెప్పారు. దాదాపుగా గ్రామం మధ్యలో ఉన్న ఇది సమావేశాలు జరిగే ప్రదేశం. ఇక్కడ వివాదాలను పరిష్కరించడానికి పంచాయతీ సమావేశమవుతుంది. " పెహ్లే కి ఔరత్ సంస్కారీ థీ [గతంలో మహిళలు సంప్రదాయాలను గౌరవించేవారు] ," అని హర్సానా కలాన్ మాజీ సర్పంచ్ సతీష్ కుమార్ చెప్పారు.

" వారికి పరువు, గౌరవం గురించి మతింపు ఉండేది ," అని మండల్ చెప్పారు , " వారు చౌపాల్ వైపు నడిచినట్లయితే వారు ముసుగు ధరించేవారు ," అని అతను జోడించాడు , అతని ముఖంలో చిరునవ్వుతో ముడుతలు పడింది.

36 ఏళ్ల సైరాకు ఇవేమీ కొత్త కావు. ఆమె ఢిల్లీకి సమీపంలోని తన గ్రామమైన మజ్రా దాబాస్ నుండి 20 ఏళ్ల వధువుగా ఇక్కడికి వచ్చినప్పటి నుండి, గత 16 సంవత్సరాలుగా ఈ ఆదేశాలను చాలా వరకు అనుసరించింది. పురుషుల మాదిరిగా కాకుండా, ఆమె తన మొదటి పేరునే వాడుతుంది.

పెళ్లికి ముందే నేను నా భర్తను కలిసి ఉంటే , ఈ వివాహానికి నేను ఎప్పుడూ అంగీకరించేదానిని కాదు. ఈజ్ గావ్ మేన్ తో కాటే నా ఆతి [ఈ గ్రామానికి రావడానికి నేను ఎప్పటికీ అంగీకరించను] ,” అని సైరా చెప్పింది , కుట్టు మిషన్ సూది మరియు పర్పుల్ ఫ్యాబ్రిక్ మధ్య ఆమె వేళ్లు నేర్పుగా నడుస్తున్నాయి. ( ఈ కథలో ఆమె పేరు మరియు ఆమె కుటుంబ సభ్యులందరి పేర్లు మార్చబడ్డాయి. )

Saira stitches clothes from home for neighborhood customers. 'If a woman tries to speak out, the men will not let her', she says

సైరా పొరుగున ఉండే కస్టమర్ల కోసం ఇంటి నుంచే బట్టలు కుట్టిస్తుంది. ' ఒక మహిళ మాట్లాడటానికి ప్రయత్నించినా, పురుషులు మాట్లాడనివ్వరు,’ అని ఆమె చెప్పింది

ఈ ఊరిలో ఒక స్త్రీ మాట్లాడటానికి ప్రయత్నిస్తే , పురుషులు ఆమెను అనుమతించరు. మీ మాగాయన మాట్లాడగలిగినప్పుడు మీరు మాట్లాడవలసిన అవసరం ఏమిటి, అని అడుగుతారు . నా భర్త కూడా స్త్రీ ఇంట్లోనే ఉండాలని నమ్ముతాడు. నేను బట్టలు కుట్టడానికి కావాల్సిన మెటీరియల్‌ని కూడా కొనుక్కోవాలని చెప్పినా , లోపల ఉండటమే మంచిదని చెబుతాడు” అని సైరా చెప్పింది.

ఆమె భర్త, 44 ఏళ్ల సమీర్ ఖాన్, పొరుగున ఉన్న ఢిల్లీలోని నరేలాలో ఒక కర్మాగారంలో పనిచేస్తున్నాడు. అక్కడ అతను ప్లాస్టిక్‌ను తయారు చేస్తాడు. మగవాళ్లు ఆడవాళ్లను ఎలా చూస్తారో సైరాకు అర్థం కావడం లేదని తరచూ ఆమెతో చెబుతుంటాడు. “మీరు ఇంట్లో ఉంటే, మీరు సురక్షితంగా ఉంటారని అతను చెప్పాడు; బహార్ తో భేడియెన్ బైటే హైన్ [బయట తోడేళ్లు వేచి ఉన్నాయి], ”అని అంటాడని ఆమె వివరించింది.

అందువలన సైరా ఊళ్ళోని తోడేళ్ల వంటి మగవాళ్లకు దూరంగా ఇంట్లోనే కూర్చుంది. హర్యాణాలోని 64.5 శాతం గ్రామీణ మహిళలు ( జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే- 4 , 2015-16) మార్కెట్, ఆరోగ్య సదుపాయం లేదా గ్రామం వెలుపల ఏ ప్రదేశానికి ఒంటరిగా వెళ్లడానికి అనుమతించబడరు. ఆమె ప్రతి రొజూ మధ్యాహ్నం కిటికీకి దగ్గరగా ఉంచిన కుట్టు మిషన్‌పై బట్టలు కుడుతుంది. ఇక్కడ సూర్యరశ్మి పుష్కలంగా ఉంది. ఈ సమయంలో విద్యుత్తు ఆపివేయబడుతుంది. ఈ మధ్యాహ్నం పని ద్వారా ఆమెకు దాదాపు నెలకు రూ. 2,000, కొంత ఏకాంతం, ఇద్దరు కుమారులైన సోహైల్ ఖాన్, (16 ఏళ్లు) సన్నీ అలీ, (14) కోసం కొన్ని వస్తువులను కొనగలిగే సామర్థ్యం వస్తాయి.చాలా అరుదుగా సైరా తన కోసం ఏదైనా కొనుక్కుంటుంది.

సన్నీ జన్మించిన కొన్ని నెలల తర్వాత , సైరా ట్యూబల్ లైగేషన్ కోసం ప్రయత్నించింది - ట్యూబల్ లైగేషన్ ఆమె ఫెలోపియన్ ట్యూబ్‌లను మూసివేయడానికి జరిపే లాపరోస్కోపిక్ స్టెరిలైజేషన్ ప్రక్రియ. ఆ సమయంలో ఆమె ఉద్దేశం భర్త సమీర్‌కు తెలియదు.

సోనిపట్ జిల్లాలో, ప్రస్తుతం 15 నుండి 49 సంవత్సరాల వయస్సు గల వివాహిత మహిళల్లో గర్భనిరోధక వ్యాప్తి రేటు (CPR) 78 శాతం ఉంది (NFHS-4). ఇది మొత్తం హర్యాణా రాష్ట్రం (64 శాతం) కంటే ఎక్కువ.

కొడుకు పుట్టిన కొద్ది నెలల్లోనే సైరా సర్జరీ చేయించుకోవాలని రెండు సార్లు ప్రయత్నించింది. మజ్రా దాబాస్‌లోని ఆమె తల్లిదండ్రుల ఇంటికి సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో మొదటిసారిగా డాక్టర్ ఆమెను చూసి కనీసం పెళ్లి అయినట్టు కూడా ఆమె కనిపించట్లేదు అని చెప్పారు. రెండోసారి , అదే ఆసుపత్రిలో , ఆమె పెళ్లి చేసుకున్నట్లు నిరూపించడానికి తన కొడుకును తీసుకువెళ్లింది. "ఈ నిర్ణయం తీసుకోవడానికి నేను చాలా చిన్నదానినని డాక్టర్ నాకు చెప్పారు" అని సైరా చెప్పింది.

ఢిల్లీలోని రోహిణిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో , తన తల్లిదండ్రులతో ఉన్నప్పుడు , ఆమె ఈ ప్రక్రియను పూర్తి చేసింది. అప్పటికి అది మూడో ప్రయత్నం.

Only men occupy the chaupal at the village centre in Harsana Kalan, often playing cards. 'Why should women come here?' one of them asks
Only men occupy the chaupal at the village centre in Harsana Kalan, often playing cards. 'Why should women come here?' one of them asks

హర్సనా కలాన్‌లోని గ్రామ కేంద్రంలో చౌపాల్‌ను పురుషులు మాత్రమే ఆక్రమిస్తారు. తరచుగా పేకాడుతుంటారు. ' మహిళలు ఇక్కడికి ఎందుకు రావాలి ?' అని వారిలో ఒకరు అడుగుతారు

ఈసారి నేను నా భర్త గురించి అబద్ధం చెప్పాను. నేను నా కొడుకును తీసుకెళ్లి , నా భర్త మద్యపానానికి బానిస అని డాక్టర్‌కి చెప్పాను అని సైరా చెప్పింది. ఇప్పుడు సంఘటనల మధ్య నవ్వుతుంది కానీ ఆమె ఎందుకు అంతలా చేయాలనుకున్నదో స్పష్టంగా గుర్తుచేసుకుంది. “ఇంట్లో పరిస్థితులు చెడ్డవి - అణచివేత, నిరంతర పోరాటం. నాకు ఒక్క విషయం మాత్రమే ఖచ్చితంగా తెలుసు - నాకు ఎక్కువ మంది పిల్లలు వద్దు."

సైరా ఈ ప్రక్రియకు వెళ్ళిన రోజును గుర్తుచేసుకుంది: "ఆ రోజు వర్షం కురుస్తోంది. వార్డులోని గాజు తలుపు వెనుక నిలబడి ఉన్న మా చిన్న కొడుకు మా అమ్మ చేతుల్లో ఏడుస్తున్నట్లు నేను చూశాను. శస్త్రచికిత్స చేయించుకున్న ఇతర మహిళలు అప్పటికీ గాఢనిద్రలో ఉన్నారు [అనస్థీషియా వల్ల]. దాని ప్రభావం నాకు ముందుగానే తగ్గిపోయింది. నా బిడ్డకు ఆహారం ఎలా ఇవ్వగలనని నేను భయపడిపోయాను. నేను చాలా అశాంతిగా ఉంటిని."

ఈ విషయం తెలుసుకున్న సమీర్ నెలల తరబడి ఆమెతో మాట్లాడలేదు. ఆమె తనంతట తానుగా నిర్ణయం తీసుకుందని కోపం తెచ్చుకున్నాడు. అతను ఆమెను కాపర్-టి వంటి గర్భాశయ పరికరం (IUD) ఎంచుకొవాలని కోరుకున్నాడు , ఎందుకంటే అది మళ్లీ తీయించేసుకోవచ్చు. అయితే సైరా ఇక పిల్లలు వద్దని నిర్ణయించుకుంది.

“మాకు పొలాలు, గేదెలు ఉన్నాయి. ఇంటివాళ్లతో పాటు అన్నీ నేను మాత్రమే చూసుకునేదాన్ని. IUDని ఉపయోగిస్తున్నప్పుడు నాకు ఏదైనా జరిగితే? జీవితం లేదా గర్భనిరోధక సాధనాల గురించి పెద్దగా తెలియని, అతి కష్టం మీద 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన 24 ఏళ్ల యువకురాలిగా తాను ఎలా ఆలోచించిందో ఆమె గుర్తుచేసుకుంది.

సైరా తల్లి నిరక్షరాస్యురాలు. తండ్రి కాదు. కానీ అతను కూడా ఆమె చదువును కొనసాగించమని పట్టుబట్టలేదు. “స్త్రీ అంటే పశువులు తప్ప మరేమీ కాదు. దున్నపోతుల్లాగా, మన మెదడు కూడా మొద్దుబారిపోయింది.” అని సూదిలోంచి పైకి చూస్తూ చెప్పింది.

" హర్యాణాకే ఆద్మీ కే సామ్నే కిసీ కి నహిన్ చల్తీ [హర్యాణాలో ఆడవారు ఎవరూ మగవారిని ఎదిరించలేరు] ," అని ఆమె చెప్పింది. “ఆయన ఏది చెబితే అది జరుగుతుంది. ఏది వండమని చెబితే , ఆ వంటకం వండబడుతుంది - ఆహారం , బట్టలు , బయటకు వెళ్లడం , ప్రతిదీ అతను చెప్పినట్లే.” సైరా తన భర్త గురించి మాట్లాడటం మానేసి తన తండ్రి గురించి మాట్లాడటం ఏ సమయంలో ప్రారంభించిందో అర్థం కాని విషయం.

Wheat fields surround the railway station of Harsana Kalan, a village of around 5,000 people in Haryana
Wheat fields surround the railway station of Harsana Kalan, a village of around 5,000 people in Haryana

దాదాపు 5,000 మంది జనాభా ఉన్న హర్యాణాలోని హర్సానా కలాన్ రైల్వే స్టేషన్ చుట్టూ గోధుమ పొలాలు ఉన్నాయి.

సైరా పక్కనే నివసిస్తున్న ఆమె బంధువు 33 ఏళ్ల సనా ఖాన్ (ఆమె పేరు మరియు ఆమె కుటుంబ సభ్యులందరి పేర్లు ఈ కథనంలో మార్చబడ్డాయి),  పరిస్థితి భిన్నంగా ఉందని మీరు భావించవచ్చు. ఆమె ఎడ్యుకేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీతో, ఆమె ఉపాధ్యాయురాలిగా సర్టిఫికేట్ పొంది, ప్రాథమిక పాఠశాలలో పనిచేయాలని కోరుకుంది. కానీ ఇంటి వెలుపల పని చేసే అంశం వచ్చినప్పుడల్లా, ఆమె భర్త, అకౌంటింగ్ సంస్థలో ఆఫీస్ అటెండెంట్‌గా పనిచేస్తున్న 36 ఏళ్ల రుస్తోమ్ అలీ ఆమెను వెక్కిరించేవాడు: “నువ్వు బయట పనికి వెళ్లు. నేను బదులుగా ఇంట్లోనే ఉంటాను. నువ్వు ఒంటరిగా సంపాదించి ఈ కుటుంబాన్ని పోషించు.”

సనా దీని గురించిన సంభాషణ చాలా కాలం క్రిందటే, మానేసింది. “ఏమి లాభం? ఇది ఎలాగైనా వాదనగా మారుతుంది. మగవాళ్ళు ముందుండే దేశం ఇది. కాబట్టి మహిళలు సర్దుబాట్లు చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు, ఎందుకంటే వారు చేయకపోతే, ఇక దెబ్బలాటలు జరుగుతాయి, ” అని ఆమె తన వంటగది వెలుపల నిలబడి చెప్పింది.

సైరా మధ్యాహ్న వేళల్లో కుట్టినట్లే, సనా కూడా రోజులోని ఆ సమయాన్ని తన ఇంట్లో ప్రాథమిక పాఠశాల పిల్లలకు ట్యూషన్ చెప్పడానికి ఉపయోగిస్తుంది.  దానికి నెలకు వచ్చేది రూ. 5,000. అది ఆమె భర్త సంపాదించే దానిలో సగం. ఆమె తన పిల్లల కోసం చాలా ఖర్చు చేస్తుంది. కానీ హర్యాణాలోని 54 శాతం మంది మహిళల మాదిరిగా ఆమెకు స్వయంగా నిర్వహించగలిగే బ్యాంకు ఖాతా లేదు.

సనా, తనకు ఇద్దరు పిల్లలు మాత్రమే కావాలని ఎప్పుడూ అనుకుంది. అంతేగాక IUD వంటి గర్భనిరోధక చర్యలతో పిల్లల మధ్యలో విరామం తీసుకోవచ్చని ఆమెకు తెలుసు. ఆమెకు, రుస్తోమ్ అలీకి ముగ్గురు పిల్లలు - ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు.

2010లో తన మొదటి కుమార్తె అసియా జన్మించిన తర్వాత, సనా సోనిపట్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో IUDని ఉపయోగించారు. కొన్నాళ్లుగా, అది తనకు కావాల్సిన మల్టీలోడ్ ఐయుడి అని, కాపర్-టి కాదు అని భావించింది. ఎందుకంటే కాపర్ టి గురించి గ్రామంలోని చాలా మంది మహిళలలాగానే ఆమెకూ సందేహాలు ఉన్నాయి.

"ఒక కాపర్-Tకు  ఎక్కువ కాలం స్థానంలో ఉంటుంది. దీని వలన సుమారు 10 సంవత్సరాల పాటు గర్భం రాకుండా రక్షణ అందిస్తుంది. మల్టీలోడ్ IUD మూడు నుండి ఐదు సంవత్సరాల వరకు పని చేస్తుంది" అని హర్సానా కలాన్ గ్రామంలోని ఆరోగ్య ఉప కేంద్రంలో సహాయక నర్సు మరియు మంత్రసాని (ANM) నిషా ఫోగాట్ వివరించారు. "గ్రామంలో చాలా మంది మహిళలు మల్టీలోడ్ IUDని ఉపయోగిస్తున్నారు. అందుకే ఇది వారి మొదటి ఎంపికగా కొనసాగుతోంది. కాపర్-టి గురించి మహిళల సందేహాలు వారు ఒకరి నుండి ఒకరు విన్నదాని నుండి ఉత్పన్నమవుతాయి. "ఒక స్త్రీ గర్భనిరోధకం గురించి అసౌకర్యాన్ని చూపిస్తే, ఇతరులు కూడా దానిని ఉపయోగించడానికి ఇష్టపడరు,"  అని నిషా వివరించింది.

2006 నుండి హర్సానా కలాన్‌లో పనిచేసి గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్త (ఆశా) సునీతా దేవి ఇలా అన్నారు, “మహిళలు అధిక బరువులు ఎత్తకూడదని మరియు కాపర్-టిని చొప్పించిన తర్వాత ఒక వారం పాటు విశ్రాంతి తీసుకోవాలని అర్థం చేసుకోవాలి. దీని వలన ఆ పరికరం గర్భంలో సరైన స్థానంలో కుదురుకుంటుంది. కానీ వారు అలా చేయరు, లేదా చేయలేరు. అందువల్ల, ఇది అసౌకర్యాన్ని కలిగించవచ్చు. వారు తరచుగా ఫిర్యాదు చేస్తారు, ' మేరే కలేజే తక్ చడ్ గయా హై [పరికరం నా ఛాతీ వరకు వెళ్ళింది]."

Sana Khan washing dishes in her home; she wanted to be a teacher after her degree in Education. 'Women have no option but to make adjustments', she says
Sana Khan washing dishes in her home; she wanted to be a teacher after her degree in Education. 'Women have no option but to make adjustments', she says

సనా ఖాన్ తన ఇంట్లో గిన్నెలు కడుగుతుంది, ఆమె డిగ్రీ తర్వాత ఉపాధ్యాయురాలిగా పనిచేయాలని కోరుకుందని చెప్పింది. ' మహిళలకు సర్దుబాట్లు చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు ' అని ఆమె చెప్పింది

ఐయూడీని తొలగించేందుకు వెళ్లినప్పుడే సనా కాపర్-టి వాడుతున్నట్లు తెలిసింది. "నా భర్త, ఆ  ప్రైవేట్ హాస్పిటల్‌లోని డాక్టర్, ఇద్దరూ నాకు అబద్ధం చెప్పారు. నేను కాపర్-టి వాడుతున్నానని, మల్టీలోడ్ ఐయుడి వాడట్లేదని అతనికి [రుస్తోమ్ అలీ]కి తెలుసు, కానీ అతను నాకు నిజం చెప్పడానికి ఇష్టపడలేదు. నాకు తెలియగానే నేను అతనితో దెబ్బలాడాను, ” అని ఆమె చెప్పింది.

ఆమెకు ఎలాంటి అసౌకర్యం కలగలేదు కాబట్టి దెబ్బలాడడం అవసరమా అని మేము ఆమెను అడిగాము. "వారు నాకు అబద్ధం చెప్పారు. ఈ ప్రకారంగా చూస్తే, వారు నా శరీరంలో ఏదైనా చొప్పించవచ్చు. దాని గురించి కూడా అబద్ధం చెప్పవచ్చు," అని ఆమె సమాధానమిచ్చింది. "కాపర్-టి పరిమాణం గురించి మహిళలు భయపడతారు కాబట్టి నన్ను తప్పుదారి పట్టించమని డాక్టర్ తనకు సలహా ఇచ్చారని అతను [రుస్తోమ్ అలీ] నాకు చెప్పాడు."

IUD తొలగించబడిన తర్వాత, సనా 2014లో తన రెండవ కుమార్తె అక్షికి జన్మనిచ్చింది. దీనితో వారి కుటుంబం పూర్తి అయిందని ఆశించింది. కానీ 2017లో వారికి కొడుకు పుట్టే వరకు కుటుంబం నుండి ఒత్తిడి కొనసాగింది. “వారు కొడుకును ఆస్తిగా చూస్తారు, కాని కుమార్తెల గురించి అదే విధంగా భావించరు, ”ఆమె చెప్పింది.

హర్యాణాలో 1,000 మంది అబ్బాయిలకు 834 మంది బాలికలు (సెన్సస్ 2011). దేశంలోనే అత్యల్ప బాలల లింగ నిష్పత్తులలో (0-6 వయస్సు-సమూహానికి) హర్యాణా ఒకటి. ఇక సోనిపట్ జిల్లాలో ఆ సంఖ్య 1,000 మంది అబ్బాయిలకు 798 మంది బాలికలగా ఉంది. మగపిల్లలకు ప్రాధాన్యత ఉన్నట్లే,  ఆడపిల్లల పట్ల అసహనం కూడా ఉంటుంది. బలమైన పితృస్వామ్య పరిస్థితులలో కుటుంబ నియంత్రణ నిర్ణయాలు చాలా వరకు భర్త, కుటుంబ పెద్ద ద్వారా ప్రభావితమవుతాయని కూడా విస్తృతంగా నమోదు చేయబడింది. NFHS-4 డేటా ప్రకారం హర్యాణాలో కేవలం 70 శాతం మంది మహిళలు తమ సొంత ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన నిర్ణయాలలో పాల్గొంటున్నారు. అదే పురుషులులో అయితే ఇది 93 శాతం ఉంది.

కాంత శర్మ ( ఆమె పేరు, ఆమె కుటుంబ సభ్యులందరి పేర్లు ఈ కథనంలో మార్చబడ్డాయి ), సైరా, సనా నివసించే పరిసరాల్లోనే నివసిస్తుంది.ఆమె కుటుంబంలో అయిదుమంది ఉన్నారు - భర్త, 44 ఏళ్ల సురేష్ శర్మ , నలుగురు పిల్లలు. పెళ్లయిన మొదటి రెండేళ్లలో అషు, గుంజన్ అనే ఇద్దరు కుమార్తెలు జన్మించారు. రెండో కూతురు పుట్టిన తర్వాత కాంత ట్యూబెక్టమీ చేయించుకోవాలని దంపతులు కలిసి నిర్ణయించుకున్నారు, కాని అత్తమామలు అంగీకరించలేదు.

“దాదికి [తండ్రి తరపు అమ్మమ్మ] మనవడు కావాలి. ఆ మనవడి కోసం, మేము నలుగురు పిల్లలను కన్నాము. పెద్దలు కోరుకుంటే అది జరుగుతుంది. నా భర్త కుటుంబంలో పెద్ద కొడుకు. కుటుంబ నిర్ణయాన్ని మేము అగౌరవపరచలేకపోయాము, ”అని అంటుంది 39 ఏళ్ల కాంతా. తన కుమార్తెలు సంవత్సరాల తరబడి చదువులో రాణించి సాధించిన ట్రోఫీలను చూస్తూ మురిసిపోతుంది.

Kanta's work-worn hand from toiling in the fields and tending to the family's buffaloes. When her third child was also a girl, she started taking contraceptive pills
Kanta's work-worn hand from toiling in the fields and tending to the family's buffaloes. When her third child was also a girl, she started taking contraceptive pills

పొలాల్లో శ్రమించడం , కుటుంబానికి చెందిన గేదెలను మేపడం వలన కాంతా చేయి పాడయిపోయింది. తన మూడో సంతానం కూడా ఆడపిల్ల అయినప్పుడు , ఆమె గర్భనిరోధక మాత్రలు తీసుకోవడం ప్రారంభించింది

నూతన వధూవరులు గ్రామానికి వచ్చినప్పుడు, సునీతా దేవి వంటి ఆశా వర్కర్లు వారిని దృష్టిలో పెట్టుకుంటారు. కానీ తరచుగా, మొదటి సంవత్సరం చివరిలో మాత్రమే వారితో మాట్లాడతారు. “ఇక్కడ చాలా మంది యువ వధువులు వివాహం అయిన మొదటి సంవత్సరంలోనే గర్భం దాల్చుతారు. పుట్టిన తర్వాత, మేము ఆమె ఇంటికి వెళ్లి, అత్తగారి సమక్షంలో కుటుంబ నియంత్రణ పద్ధతుల గురించి ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాము. తరువాత, కుటుంబంతా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు, వారు మాకు తెలియజేస్తారు, ”అని సునీత చెప్పారు.

“లేకపోతే అత్తగారు మాపై కోపం తెచ్చుకుని, ' హమారీ బహు కో క్యా పట్టీ పధా కే చలీ గయీ హొ [నా కోడలికి ఏమి నేర్పించావు] అని మమ్మల్ని అడుగుతుంది." అని సునీత చెప్పింది.

మూడవ సంతానం కూడా ఆడపిల్ల అయినప్పుడు, కాంతా గర్భనిరోధక మాత్రలు తీసుకోవడం ప్రారంభించింది, ఆమె భర్త తన అత్తమామలకు తెలియకుండా వాటిని తీసుకొచ్చాడు. మాత్రలు ఆపేసిన నెలల తర్వాత, కాంత మళ్లీ గర్భవతి అయింది, ఈసారి కొడుకుతో. ఈసారి విచిత్రం ఏంటంటే ఆ మగ పిల్లాడిని చూడటానికి ముందే కాంత అత్తగారు 2006లో మరణించారు. ఒక సంవత్సరం తర్వాత, కాంత తన కొడుకు రాహుల్‌కు జన్మనిచ్చింది.

అప్పటి నుండి కాంతనే కుటుంబంలో పెద్ద మహిళ అయింది. ఆమె IUDని ఉపయోగించాలని ఎంచుకుంది. ఆమె కుమార్తెలు చదువుతున్నారు; పెద్ద అమ్మాయి నర్సింగ్‌లో BSc చేస్తున్నది. కాంత ఇంకా తన కూతురి పెళ్లి గురించి ఇప్పుడే ఆలోచించడం లేదు.

"వారు చదువుకోవాలి, విజయం సాధించాలి. మన కుమార్తెలు వారు కోరుకున్నది సాధించడంలో మనం సహాయం చేయకపోతే, వారి భర్తలు మరియు అత్తమామలు చదువుకు సహాయం చేస్తారని మనం ఎలా ఆశించగలం? మా కాలం వేరు. అది పోయింది, ” అన్నది కాంతా.

ఆమెకు కాబోయే కోడలు గురించి అడిగితే, “ఆమె ఇష్టం," అని కాంతా చెప్పింది. “ఆమె ఏమి చేయాలనేది, [గర్భనిరోధకం] ఏమి ఉపయోగించాలనుకుంటోంది అనేది ఆమె చేతిలోనే ఉంది. మా సమయంలో భిన్నంగా ఉండేది; అది ఇప్పుడు పోయింది."

పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా లో భాగంగా, PARI మరియు కౌంటర్ మీడియా ట్రస్ట్ కలిసి గ్రామీణ భారతదేశంలో కౌమారదశలో ఉన్న బాలికలు మరియు యువతులపై దేశవ్యాప్త రిపోర్టింగ్ ప్రాజెక్ట్ ను చేస్తున్నారు. అట్టడుగున ఉన్నా ఎంతో కీలకమైన ఈ సమూహాల స్థితిగతులను అన్వేషించడానికి, సాధారణ ప్రజల గొంతులను, వారి అనుభవాలను వినిపించడానికి ఈ ప్రాజెక్టు కృషి చేస్తుంది.

ఈ వ్యాసాన్ని ప్రచురించాలనుకుంటున్నారా? ఐయితే [email protected] కి ఈమెయిల్ చేసి అందులో [email protected] కి కాపీ చేయండి.

అనువాదం : జి విష్ణు వర్ధన్

انوبھا بھونسلے ۲۰۱۵ کی پاری فیلو، ایک آزاد صحافی، آئی سی ایف جے نائٹ فیلو، اور ‘Mother, Where’s My Country?’ کی مصنفہ ہیں، یہ کتاب بحران زدہ منی پور کی تاریخ اور مسلح افواج کو حاصل خصوصی اختیارات کے قانون (ایفسپا) کے اثرات کے بارے میں ہے۔

کے ذریعہ دیگر اسٹوریز Anubha Bhonsle
Sanskriti Talwar

سنسکرتی تلوار، نئی دہلی میں مقیم ایک آزاد صحافی ہیں اور سال ۲۰۲۳ کی پاری ایم ایم ایف فیلو ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Sanskriti Talwar
Illustration : Priyanka Borar

پرینکا بورار نئے میڈیا کی ایک آرٹسٹ ہیں جو معنی اور اظہار کی نئی شکلوں کو تلاش کرنے کے لیے تکنیک کا تجربہ کر رہی ہیں۔ وہ سیکھنے اور کھیلنے کے لیے تجربات کو ڈیزائن کرتی ہیں، باہم مربوط میڈیا کے ساتھ ہاتھ آزماتی ہیں، اور روایتی قلم اور کاغذ کے ساتھ بھی آسانی محسوس کرتی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Priyanka Borar
Series Editor : Sharmila Joshi

شرمیلا جوشی پیپلز آرکائیو آف رورل انڈیا کی سابق ایڈیٹوریل چیف ہیں، ساتھ ہی وہ ایک قلم کار، محقق اور عارضی ٹیچر بھی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز شرمیلا جوشی
Translator : G. Vishnu Vardhan

G. Vishnu Vardhan obtained a Post-graduation Diploma in Rural development and management from Hyderbad. Currently he works with ICRISAT in tribal agency area of Utnoor, Telangana.

کے ذریعہ دیگر اسٹوریز G. Vishnu Vardhan