పద్దెనిమిదేళ్ళ సుమిత్ (అసలు పేరు కాదు) ఛాతీ పునర్నిర్మాణ శస్త్రచికిత్స గురించి వివరాలు తెలుసుకునేందుకు హరియాణాలోని రోహతక్‌లో ఉన్న జిల్లా వైద్యశాలకు మొదటిసారి వెళ్ళినప్పుడు, అతన్ని కాలిన గాయాలున్న పేషంట్‌గా చేర్చుకోవాల్సి ఉంటుందని చెప్పారు.

ఒక అబద్ధం. భారతదేశంలోని ట్రాన్స్‌జెండర్ సముదాయానికి చెందినవారు తాము పుట్టిన శరీరం నుండి, తమకు సౌకర్యంగా ఉండే శరీరంలోకి మారాలని అనుకుంటే, సంక్లిష్టమైన వైద్య-చట్టపరమైన ప్రయాణాన్ని ఆవరించి ఉన్న సాచివేత ధోరణిని ఛేదించటానికి ఈ అబద్ధాన్ని చెప్పవలసి ఉంటుంది. అయినప్పటికీ, ఆ అబద్ధం కూడా ఇక్కడ పని చేయలేదు.

వాడుకగా 'టాప్ సర్జరీ' అని పిలిచే ఈ శస్త్రచికిత్స చేయాలంటే సుమిత్‌కు రాతపని, అంతులేని మానసిక నిర్ధారణలు, వైద్య సంప్రదింపులు, అప్పులతో సహా లక్ష రూపాయలకు పైగా ఖర్చు, దెబ్బతిన్న కుటుంబ సంబంధాలు, పూర్వం ఉన్న రొమ్ముల పట్ల అతనిలో ఉన్న మార్పులేని అయిష్టత - ఇలా మరో ఎనిమిదేళ్ళ కాలం అవసరమయింది. ఎట్టకేలకు రోహ్‌తక్‌కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిస్సార్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ చికిత్స జరిగింది.

ఇది జరిగిన ఏడాదిన్నర తర్వాత కూడా 26 ఏళ్ళ సుమిత్ నడిచేటప్పుడు తన భుజాలను వంచుతూనే ఉన్నాడు. శస్త్రచికిత్సకు ముందు సంవత్సరాలలో - అతని రొమ్ములు అవమానానికీ అసౌకర్యానికీ మూలంగా ఉన్నప్పుడు - అలా వంగి నడవటం అతనికి అలవాటుగా ఉండేది.

భారతదేశంలో సుమిత్ వంటి ఎంత మంది వ్యక్తులు తాము పుట్టినప్పటి జెండర్ కంటే భిన్నమైన జెండర్‌తో గుర్తించబడ్డారనే దాని గురించి ఇటీవలి లెక్కలు లేవు. జాతీయ మానవ హక్కుల కమిషన్ సహకారంతో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, 2017లో భారతదేశంలో ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సంఖ్య 4.88 లక్షలు గా ఉంది.

2014 నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు లో, ‘మూడవ జెండర్’ను, ‘తమను తాము గుర్తించుకున్న’ జెండర్‌తో తమ గుర్తింపును కోరే వారి హక్కును గుర్తిస్తూ, వారి ఆరోగ్య సంరక్షణకు హామీ ఇవ్వాలని ప్రభుత్వాలను నిర్దేశిస్తూ సుప్రీమ్ కోర్ట్ ఒక మైలురాయి తీర్పును జారీ చేసింది. ఐదు సంవత్సరాల తరువాత, జెండర్ స్థిరీకరణ శస్త్రచికిత్సలు, హార్మోన్ థెరపీ, మానసిక ఆరోగ్య సేవలు వంటి సమగ్ర ఆరోగ్య సంరక్షణ సేవలను ఈ సమాజానికి అందించడంలో ప్రభుత్వాల పాత్రను గురించి ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల (హక్కుల పరిరక్షణ) చట్టం, 2019 మళ్ళీ నొక్కి చెప్పింది.

PHOTO • Ekta Sonawane

హరియాణాలోని రోహ్‌తక్ జిల్లాకు చెందిన సుమిత్, ఆడపిల్లగా పుట్టాడు. మూడు సంవత్సరాల వయస్సులో కూడా, గౌనులు ధరించినప్పుడు తనకు విచారంగా ఉండేదని సుమిత్ గుర్తుచేసుకున్నాడు

శాసన సంబంధమైన ఈ మార్పులకు ముందటి సంవత్సరాలలో, అనేకమంది ట్రాన్స్ వ్యక్తులకు శస్త్రచికిత్సతో తమ లింగాన్ని మార్చుకునే (జెండర్-స్థిరీకరణ శస్త్రచికిత్స అని కూడా పిలుస్తారు) అవకాశం ఉండేదికాదు. ఇందులో ముఖానికి చేసే శస్త్రచికిత్స, ఛాతీ లేదా జననేంద్రియాలకు చేసే 'టాప్' లేదా 'దిగువ' శస్త్రచికిత్స ప్రక్రియలున్నాయి.

అటువంటి శస్త్రచికిత్స చేయించుకునే అవకాశం లేనివాళ్ళలో -ఎనిమిదేళ్ళ సుదీర్ఘ కాలం పాటు, 2019 తర్వాత కూడా - సుమిత్ ఉన్నాడు.

హరియాణాలోని రోహ్‌తక్ జిల్లాలో ఒక దళిత కుటుంబంలో ఆడపిల్లగా పుట్టిన సుమిత్ తన ముగ్గురు తోబుట్టువులకు ఒక రకంగా తల్లివంటివాడు. వారి కుటుంబంలో మొదటి తరం ప్రభుత్వ ఉద్యోగి అయిన సుమిత్ తండ్రి, చాలా వరకు కుటుంబానికి దూరంగా ఉండేవాడు. అతని తల్లిదండ్రుల మధ్య సరైన సంబంధాలు ఉండేవికావు. రోజువారీ వ్యవసాయ కూలీలుగా పనిచేసే అతని తాతలు, సుమిత్ చిన్నతనంలోనే చనిపోయారు. సుమిత్‌పై గణనీయంగా పడిన ఇంటి బాధ్యతలు, ఇంటి పెద్ద కుమార్తె ఇంటి సంరక్షణా బాధ్యతలను ఎలా నెరవేర్చాలని జనం అనుకునేవారో ఆ అవగాహనకు అనుగుణంగానే ఉండేవి. కానీ అది సుమిత్ గుర్తింపుతో సరితూగేదికాదు. "నేను అబ్బాయిగానే ఆ బాధ్యతలన్నింటినీ నెరవేర్చాను," అని అతను చెప్పాడు.

తనకు మూడేళ్ళ వయసప్పుడు కూడా, గౌనులు ధరించినప్పుడు తనకు ఆందోళనగా అనిపించేదనే విషయాన్ని సుమిత్ గుర్తు చేసుకున్నాడు. ఊరట కలిగించే సంగతేమిటంటే, హరియాణాలోని క్రీడా సంస్కృతి వలన ఆడపిల్లలు తటస్థంగా, ఒకోసారి అబ్బాయిలు ధరించే విధంగా, క్రీడా దుస్తులను ధరించడం సర్వసాధారణం. “నేను ఎదుగుతున్నప్పుడు ఎప్పుడూ నేను కోరుకున్న దుస్తులే వేసుకున్నాను. నా [టాప్] శస్త్రచికిత్సకు ముందు కూడా, నేను అబ్బాయిగానే జీవించాను,” అని సుమిత్ చెప్పాడు, కానీ అప్పటికీ ఏదో సరిగ్గా లేనట్టే అనిపించేది.

13 సంవత్సరాల వయస్సులో, సుమిత్ తన భౌతిక శరీరాన్ని తాను ఎలా భావిస్తున్నాడో అందుకు అనుగుణంగా - ఒక అబ్బాయిగా - ఉండాలనే బలమైన కోరికను పెంచుకోవడం ప్రారంభించాడు. "నాకు శరీరం సన్నగా ఉండి, రొమ్ముల కణజాలం ఉండేది కాదు. కానీ నాకు అసహ్యంగా అనిపించడానికి అది సరిపోయేది,” అని అతను చెప్పాడు. ఆ భావనకు మించి, సుమిత్‌కు తన డిస్ఫోరియాను (ఒక వ్యక్తికి తన జీవసంబంధమైన లింగానికీ, తన జెండర్ గుర్తింపుకూ మధ్య ఉన్న అసమతుల్యత కారణంగా కలిగే అసౌకర్యం) గురించి వివరించగల సమాచారం లేదు

ఆ విషయంలో ఒక నేస్తం అతన్ని కాపాడేందుకు వచ్చింది.

ఆ సమయంలో సుమిత్ తన కుటుంబంతో కలిసి ఒక అద్దె ఇంట్లో నివసించేవాడు, ఆ ఇంటి యజమాని కుమార్తెతో స్నేహం చేశాడు. ఆమెకు ఇంటర్నెట్ సదుపాయం ఉంది. అతను కోరుతున్న ఛాతీ శస్త్రచికిత్స గురించిన సమాచారాన్ని తెలుసుకోవడంలో ఆమె అతనికి సహాయపడింది. నెమ్మదిగా సుమిత్ బడిలో వివిధ స్థాయిలలో డిస్ఫోరియాను అనుభవించిన ఇతర ట్రాన్స్ అబ్బాయిల సముదాయాన్ని కనుక్కోగలిగాడు. ఆ అబ్బాయి ఆసుపత్రికి వెళ్లడానికి తగినంత ధైర్యాన్ని కూడగట్టుకోవడానికి ముందు కొన్ని సంవత్సరాల పాటు ఆన్‌లైన్‌లోనూ, స్నేహితుల నుండి కూడా సమాచారాన్ని సేకరించాడు.

అది 2014. 18 ఏళ్ళ సుమిత్ తన ఇంటికి సమీపంలో ఉండే బాలికల పాఠశాలలో 12వ తరగతి పూర్తి చేశాడు. అతని తండ్రి పనికి వెళ్ళాడు, అతని తల్లి ఇంట్లో లేదు. అతనిని ఆపడానికి గానీ, ప్రశ్నించడానికో లేదా మద్దతు ఇవ్వడానికి గానీ ఎవరూ లేకపోవడంతో, అతను ఒంటరిగానే రోహ్‌తక్ జిల్లా ఆసుపత్రికి నడిచాడు, రొమ్ములను తొలగించే ప్రక్రియ గురించి సందేహిస్తూ అడిగాడు.

PHOTO • Ekta Sonawane

ట్రాన్స్ పురుషులకు అవకాశాలు ముఖ్యంగా పరిమితంగా ఉంటాయి. వారి విషయంలో జిఎఎస్ చేయటం కోసం ఒక గైనకాలజిస్ట్, ఒక యూరాలజిస్ట్, ఒక పునర్నిర్మాణం చేసే ప్లాస్టిక్ సర్జన్‌తో సహా చాలా నైపుణ్యం కలిగిన నిపుణుల అవసరం ఉంది

అతనికి వచ్చిన ప్రతిస్పందన గురించి చాలా విషయాలను ప్రత్యేకంగా చెప్పవచ్చు.

ఒళ్ళు కాలిన పేషెంట్‌గా రొమ్ము పునర్నిర్మాణ శస్త్రచికిత్స చేయించుకోవచ్చని అతనికి చెప్పారు. రోడ్డు ప్రమాద కేసులతో సహా ప్రభుత్వ ఆసుపత్రులలో కాలిన గాయాల విభాగం ద్వారా అవసరమైనప్పుడు ప్లాస్టిక్ సర్జరీ నిర్వహించడం అసాధారణమేమీ కాదు. కానీ సుమిత్‌ను వాస్తవానికి అతను కోరుకున్న శస్త్రచికిత్స గురించి ప్రస్తావించకుండా, కాలినగాయాల పేషెంట్‌గా కాగితాలపై స్పష్టంగా అబద్ధమాడుతూ నమోదు చేసుకోమని అడిగారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రొమ్ము పునర్నిర్మాణ శస్త్రచికిత్స లేదా కాలిన గాయాలకు సంబంధించి చేసే ఏదైనా శస్త్రచికిత్స కోసం అటువంటి మినహాయింపు ఉన్నట్టుగా ఏ నియమం సూచించనప్పటికీ - అతను ఎటువంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని కూడా అతనికి చెప్పారు.

సుమిత్ తర్వాతి ఒకటిన్నర సంవత్సరాలు ఆసుపత్రికి వస్తూ పోతూ ఉండేలా ఆశపడటానికి ఇది తగినంత కారణమే. ఆ సమయంలోనే తాను చెల్లించాల్సిన వేరే రకమైన ఖర్చు ఉందని అతను గ్రహించాడు - అది మానసికమైనది.

"[అక్కడ] వైద్యులు చాలా తీర్పరులుగా (judgemental) ఉండేవారు. నేను భ్రాంతిలో ఉన్నానని వాళ్ళు అనేవాళ్ళు. 'నువ్వెందుకు శస్త్రచికిత్స చేయించుకోవాలనుకుంటున్నావు?', 'నువ్వు  ఇలాగే ఉంటే నచ్చిన ఆడవారితో ఉండొచ్చు కదా' వంటి మాటలు చెప్పేవారు. [వారిలో] ఆరేడుమంది నాపై బాంబులు విసిరినట్లు ప్రశ్నలు విసరడం వల్ల నేను దిగులుపడ్డాను,” సుమిత్ గుర్తుచేసుకున్నాడు.

"రెండుమూడుసార్లు 500-700 ప్రశ్నలున్న పత్రాలను నింపడం నాకు గుర్తుంది." ప్రశ్నలు రోగి గురించిన వైద్య, కుటుంబ చరిత్ర, మానసిక స్థితి, వ్యసనాలేవైనా ఉంటే వాటికీ సంబంధించినవి. కానీ యువ సుమిత్‌కి మాత్రం అవి కొట్టిపడేస్తున్నట్లుగా అనిపించేవి. "నా శరీరంలో నేను సంతోషంగా లేనని వారు అర్థం చేసుకోలేదు, అందుకే నేను టాప్ సర్జరీని కోరుకున్నాను," అంటూ ముగించాడతను.

సానుభూతి లేకపోవడాన్ని పక్కన పెడితే, భారతదేశంలోని ట్రాన్స్ సముదాయానికి మద్దతు ఇచ్చేందుకు అవసరమైన వైద్య నైపుణ్యాలలో కూడా అంతరం ఉంది. వారు జెండర్ స్థిరీకరణ సర్జరీల (జిఎఎస్) ద్వారా తమ జెండర్‌ను మార్చుకోవాలనుకుంటే ఆ అంతరం అలాగే మిగిలే ఉంది.

ఒక మగ నుండి ఆడగా మారే జిఎఎస్లో సాధారణంగా రెండు పెద్ద శస్త్రచికిత్సలు (రొమ్ము ఇంప్లాంట్లు, ప్లాస్టిక్ సర్జరీ ద్వారా యోనిని సృష్టించటం - వజినోప్లాస్టీ) ఉండగా, స్త్రీ నుంచి పురుషులుగా మారటమనేది సంక్లిష్టమైన ఏడు ప్రధాన శస్త్రచికిత్సల వరుసగా ఉంటుంది. వీటిలో మొదటిదైన ఎగువ శరీరం లేదా 'టాప్' సర్జరీలో ఛాతీ పునర్నిర్మాణం లేదా రొమ్ముల తొలగింపు ఉంటుంది.

“నేను [2012 ప్రాంతంలో] విద్యార్థిగా ఉండగా, [మెడికల్] సిలబస్‌లో అలాంటి విధానాల గురించిన ప్రస్తావన కూడా లేదు. మా ప్లాస్టిక్స్ సిలబస్‌లో కొన్ని పురుషాంగ పునర్నిర్మాణ విధానాలు ఉన్నాయి, [అయితే] అవి గాయాలైనప్పుడు, ప్రమాదాలు జరిగిన సందర్భంలో చేసేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి,” అని న్యూ ఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్‌లోని ప్లాస్టిక్ సర్జరీ విభాగం వైస్ చైర్మన్ డాక్టర్ భీమ్ సింగ్ నందా గుర్తుచేసుకున్నారు.

PHOTO • Ekta Sonawane

2019 ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల చట్టం, ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు అందించే వైద్య విధానాలకు సంబంధించిన పాఠ్యాంశాలను, పరిశోధనలను సమీక్షించాలని కోరింది. కానీ దాదాపు ఐదు సంవత్సరాల తరువాత కూడా, భారతీయ ట్రాన్స్‌జెండర్ సమాజానికి జిఎఎస్‌ను అందుబాటులోకి తేవడం, దానిని చౌకైనదిగా చేయడానికి ప్రభుత్వం నుండి పెద్ద ఎత్తున ప్రయత్నాలైతే జరగలేదు

ఇందులో ఒక మైలురాయి వంటిది, 2019 ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల చట్టం . ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు అందించే వైద్య విధానాలకు సంబంధించిన పాఠ్యాంశాలను, పరిశోధనలను సమీక్షించాలని ఈ చట్టం పిలుపునిచ్చింది. కానీ దాదాపు ఐదు సంవత్సరాల తరువాత కూడా, భారతీయ ట్రాన్స్‌జెండర్ సమాజానికి జిఎఎస్‌ను అందుబాటులోకి తేవడం, దానిని చౌకైనదిగా చేయడానికి ప్రభుత్వం నుండి పెద్ద ఎత్తున ప్రయత్నాలైతే జరగలేదు. ప్రభుత్వ వైద్యశాలలు కూడా చాలా వరకు ఎస్ఆర్ఎస్‌కు దూరంగా ఉన్నాయి.

ట్రాన్స్ పురుషులకు ఉండే అవకాశాలు ముఖ్యంగా చాలా పరిమితమైనవి. వారి విషయంలో జిఎఎస్ కోసం ఒక గైనకాలజిస్ట్, ఒక యూరాలజిస్ట్, ఒక పునర్నిర్మాణ ప్లాస్టిక్ సర్జన్‌తో సహా అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులు అవసరం. తెలంగాణ హిజ్రా ఇంటర్‌సెక్స్ ట్రాన్స్‌జెండర్ సమితికి చెందిన ట్రాన్స్ పురుషుడు, కార్యకర్త అయిన కార్తీక్ బిట్టు కొండయ్య మాట్లాడుతూ, "ఈ రంగంలో శిక్షణ, నైపుణ్యం కలిగిన వైద్య నిపుణులు చాలా తక్కువమంది ఉన్నారు; ప్రభుత్వ ఆసుపత్రులలో వాళ్ళు మరింత తక్కువమంది ఉన్నారు," అన్నారు.

ట్రాన్స్ వ్యక్తుల కోసం ఉన్న ప్రజా మానసిక ఆరోగ్య సేవల పరిస్థితి కూడా అంతే దుర్భరంగా ఉంది. రోజువారీ పరిస్థితులను ఎదుర్కోవడానికి ఒక సాధనంగా కంటే, ఏదైనా జెండర్-స్థిరీకరణ ప్రక్రియలు సాగడానికి ముందు కౌన్సెలింగ్ అనేది చట్టపరమైన అవసరం. ట్రాన్స్ వ్యక్తులు సైకాలజిస్టులు లేదా సైకియాట్రిస్ట్‌ల నుండి జెండర్ ఐడెంటిటీ డిజార్డర్ సర్టిఫికేట్‌ను, ఇంకా వారు అందుకు అర్హులని నిర్ధారిస్తూ ఒక అంచనా నివేదికను పొందాల్సివుంటుంది. సమాచార సమ్మతి, స్థిరీకరించబడిన జెండర్‌గా జీవించే వ్యవధి, జెండర్ డిస్ఫోరియా స్థాయి, వయస్సు అవసరాలు, స్థిరచిత్తానికి హామీగా సంపూర్ణ మానసిక ఆరోగ్య అంచనా- ఈ ప్రమాణాలలో ఉన్నాయి. వారానికి ఒకసారి సైకాలజిస్ట్ లేదా సైకియాట్రిస్ట్‌తో కనీసం ఒక సెషన్ నుండి గరిష్టంగా నాలుగు సెషన్ల వరకు ఈ ప్రక్రియ ఉంటుంది.

2014 నాటి సుప్రీమ్ కోర్ట్ తీర్పు వచ్చిన ఒక దశాబ్దం తర్వాత, సానుభూతితో కూడిన మానసిక ఆరోగ్య సేవలు, రోజువారీ పరిస్థితులను ఎదుర్కోవాలా లేదా సెక్స్ మార్పిడి ప్రయాణాలను ప్రారంభించాలా అని నిర్ణయించుకోవటం చాలా కీలకమైనదని, అయితే అది ఒక కలగానే మిగిలిపోయిందని ఈ సముదాయంలో ఒక ఏకాభిప్రాయం ఏర్పడింది.

"జిల్లా ఆసుపత్రిలో టాప్ సర్జరీ కోసం నా కౌన్సెలింగ్ దాదాపు రెండు సంవత్సరాల పాటు కొనసాగింది," అంటాడు సుమిత్. అయితే, చివరకు 2016లో అతను వెళ్లడం మానేశాడు. "ఎక్కడో ఒక బిందువు దగ్గర మీరు అలసిపోతారు."

అతని జెండర్‌ను స్థిరీకరించే ప్రయత్నం అతని అలసటను అధిగమించింది. సుమిత్ తాను ఎలా భావిస్తున్నాడు, ఇది సాధారణ అనుభవమా కాదా, జిఎఎస్ అంటే ఏమిటి, భారతదేశంలో దాన్ని తాను ఎక్కడ పొందగలడు అనే విషయాల గురించి మరింత పరిశోధించడానికి పూనుకున్నాడు.

సుమిత్ అప్పటికింకా తన కుటుంబంతో కలిసి జీవిస్తున్నందున ఇదంతా రహస్యంగా జరిగింది. అతను హెన్నా కళాకారుడిగానూ, దర్జీగానూ పనిచేయడం ప్రారంభించాడు. తాను చేయించుకోవాలని నిశ్చయించుకున్న టాప్ సర్జరీ కోసం తన ఆదాయంలో కొంత భాగాన్ని ఆదా చేయటం మొదలెట్టాడు.

PHOTO • Ekta Sonawane
PHOTO • Ekta Sonawane

మూడు రకాల ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ, తన అవసరాలన్నిటినీ తీర్చుకోవటం సుమిత్‌కు కష్టంగా మారింది. అతనికి నికరమైన పని దొరకటంలేదు, చెల్లించాల్సిన అప్పులు రూ. 90,000 ఉన్నాయి

సుమిత్ మళ్ళీ 2022లో ఒక ప్రయత్నం చేశాడు. తనవంటి ఒక ట్రాన్స్ పురుష నేస్తంతో కలిసి రోహ్‌తక్ నుండి హరియాణాలోని హిస్సార్ జిల్లాకు వంద కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించాడు. అతను కలుసుకున్న ప్రైవేట్ సైకాలజిస్ట్ తన కౌన్సెలింగ్‌ను రెండు సెషన్‌లలో ముగించారు. సుమిత్ వద్ద 2,300 రూపాయలు ఫీజుగా వసూలు చేసిన ఆయన, మరో రెండు వారాల్లో సుమిత్‌కు టాప్ సర్జరీ చేయవచ్చని చెప్పారు.

హిస్సార్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నాలుగు రోజుల పాటు చికిత్స పొందిన సుమిత్, శస్త్రచికిత్సతో సహా తన బస కోసం సుమారు రూ. లక్ష చెల్లించాడు. "ఇక్కడి డాక్టర్లు, ఇతర సిబ్బంది చాలా దయతోనూ, వినయంతోనూ ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో నేను అనుభవించినదానికి ఇది పూర్తిగా భిన్నమైన అనుభవం," అని సుమిత్ చెప్పాడు.

కానీ ఆ ఆనందం కొద్దికాలమే నిలిచింది

రోహ్‌తక్ వంటి చిన్న పట్టణంలో, LGBTQIA+ సముదాయానికి చెందిన చాలామంది వ్యక్తులకు ఒక టాప్ సర్జరీ అంటే తమ దాచి ఉంచిన లైంగిక ప్రాధాన్యాన్ని బహిరంగ పరచటం వంటిది. సుమిత్ రహస్యం ఇప్పుడు పగటి వెలుగంత స్పష్టమైపోయింది, అయితే అతని కుటుంబం దాన్ని ఒప్పుకోలేకపోయింది. శస్త్రచికిత్స జరిగిన కొన్ని రోజుల తర్వాత, అతను రోహ్‌తక్‌లోని తన ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, అతని వస్తువులన్నీ బయట విసిరేసివున్నాయి. “ఎటువంటి ఆర్థికమైన, లేదా భావోద్వేగ పరమైన భరోసా ఇవ్వకుండా నా కుటుంబం నన్ను వెళ్ళిపొమ్మని కోరింది. వారు నా పరిస్థితిని గురించి పట్టించుకోలేదు.” టాప్ సర్జరీ తర్వాత కూడా సుమిత్ చట్టబద్ధంగా మహిళ అయినప్పటికీ, రాబోయే ఆస్తి పంపకాలల గురించిన ఆందోళనలు మొదలయ్యాయి. "కొందరైతే నేను పనిచేసి, ఒక పురుషుడి నుండి కుటుంబం ఆశించే బాధ్యతలను నెరవేర్చాలని కూడా సూచించారు."

ఒక జిఎఎస్ తర్వాత, రోగులు కొన్ని నెలల పాటు నెమ్మదిగా ఉండాలని, సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆసుపత్రికి సమీపంలో నివసించాలని సూచించారు. ఇది ట్రాన్స్ వ్యక్తులపై, ముఖ్యంగా తక్కువ ఆదాయం కలిగినవారు లేదా అట్టడుగు నేపథ్యాల నుండి వచ్చిన వారిపై ఆర్థిక, రవాణా భారాన్ని పెంచుతుంది. సుమిత్ విషయంలో ప్రతిసారీ హిస్సార్‌కు వచ్చి తిరిగి వెళ్ళడానికి అతనికి మూడు గంటల సమయం, రూ. 700 డబ్బు ఖర్చయ్యేవి. ఆ విధంగా అతను కనీసం పదిసార్లు ఈ ప్రయాణం చేశాడు.

టాప్ సర్జరీ జరిగిన తరువాత, రోగులు వారి ఛాతీ చుట్టూ బైండర్లు అని పిలిచే బిగుతుగా ఉండే వస్త్రాలను కూడా చుట్టుకోవాలి. "భారతదేశంలోని వేడి వాతావరణంలో, [చాలా మంది] రోగులకు ఎయిర్ కండిషనింగ్ లేనందున, [ప్రజలు] శీతాకాలంలో శస్త్రచికిత్స చేయించుకోవడానికే ఇష్టపడతారు" అని డాక్టర్ భీమ్ సింగ్ నందా వివరించారు. చెమట వలన శస్త్రచికిత్స జరిగిన చోట చుట్టూ వేసిన కుట్లు ఇన్‌ఫెక్షన్ బారిన పడే అవకాశాలు పెరుగుతాయి.

సుమిత్‌కు సర్జరీ జరిగింది, అతన్ని ఇంటి నుండి బయటకు వెళ్ళగొట్టిందీ, ఉత్తర భారతదేశంలో మండిపోయే మే నెల వేసవి ఎండలలో. “[ఆ తర్వాత వారాలు] చాలా బాధాకరమైనవి, ఎవరో నా ఎముకలను నొక్కివేస్తున్నట్టు ఉండేది. బైండర్ వలన కదలడం కష్టంగా ఉండేది,” అని అతను గుర్తుచేసుకున్నాడు. "నేను నా ట్రాన్స్ గుర్తింపును దాచకుండా ఒక ప్రదేశాన్ని అద్దెకు తీసుకోవాలనుకున్నాను, కానీ నన్ను ఆరుగురు ఇంటి యజమానులు తిరస్కరించారు. నాకు శస్త్రచికిత్స జరిగిన తర్వాత ఒక్క నెల కూడా విశ్రాంతి తీసుకోలేకపోయాను,” అని సుమిత్ చెప్పాడు. అతనికి టాప్ సర్జరీ జరిగిన తొమ్మిది రోజుల తర్వాత, అతని తల్లిదండ్రులు అతన్ని ఇంటి నుండి బయటకు పంపేసిన నాలుగు రోజుల తర్వాత, సుమిత్ తాను ఎవరో అబద్ధం చెప్పకుండానే ఒక రెండు గదుల ఇంటికి మారాడు.

ఈ రోజున సుమిత్ ఒక హెన్నా కళాకారుడు, టైలర్, టీ దుకాణంలో సహాయకుడు, రోహ్‌తక్‌లో స్వతంత్రంగా కాయకష్టం చేసే మనిషి. అతను నెలకు రూ. 5-7,000 సంపాదించేందుకు చాలా కష్టపడుతున్నాడు. ఇందులో ఎక్కువ భాగం ఇంటి అద్దె, ఆహార ఖర్చులు, వంట గ్యాస్ బిల్లులు, విద్యుత్, అప్పులు చెల్లించడానికే సరిపోతుంది.

ఛాతీ శస్త్రచికిత్స చేయించుకోవడానికి సుమిత్ చెల్లించిన లక్ష రూపాయలలో, 2016-2022 మధ్య అతను పొదుపు చేసిన డబ్బు రూ. 30,000 ఉన్నాయి. మిగిలిన రూ. 70,000లలో రుణదాతల నుండి ఐదు శాతం వడ్డీకి తెచ్చినవి కొంత, మరికొంత స్నేహితుల నుండి వచ్చినవి.

PHOTO • Ekta Sonawane
PHOTO • Ekta Sonawane

ఎడమ: ఛాతీ శస్త్రచికిత్స చేయించుకోవడానికి సుమిత్ హెన్నా కళాకారుడిగానూ, టైలర్‌గానూ పనిచేశాడు. కుడి: ఇంటి వద్ద హెన్నా డిజైన్లను అభ్యాసం చేస్తోన్న సుమిత్

జనవరి 2024 నాటికి సుమిత్‌కు ఇంకా రూ. 90,000 బాకీలు ఉన్నాయి. దీనికి వడ్డీ నెలకు రూ. 4,000. “నేను సంపాదించే కొద్ది మొత్తంలో జీవనానికి అయ్యే ఖర్చులు, అప్పులకు కట్టవలసిన వడ్డీలను ఎలా గడుపుకోవాలో నాకు అర్థం కావడంలేదు. నాకు నికరమైన పని దొరకదు," అంటూ సుమిత్ లెక్కలు వేసుకున్నాడు. దాదాపు దశాబ్దం పాటు అతను గడిపిన కష్టతరమైన, ఒంటరి, ఖరీదైన జెండర్ మార్పిడి ప్రయాణం అతన్ని దెబ్బతీసింది. అతనికి ఆందోళన, నిద్రలేని రాత్రులు మిగిలాయి. “ప్రస్తుతం నాకు ఊపిరాడకుండా ఉంది. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడల్లా నన్ను ఆందోళన, భయం, ఒంటరితనం కమ్ముకుంటున్నాయి. ఇంతకుముందు ఇలా ఉండేది కాదు."

అతని కుటుంబ సభ్యులు - అతన్ని బయటకు గెంటేసిన ఒక సంవత్సరం తర్వాత అతనితో మాట్లాడటం కొనసాగించారు - అతను డబ్బు కోసం అడిగినప్పుడు, కొన్నిసార్లు సహాయం చేస్తారు.

సుమిత్ భారతదేశంలోని అతనివంటి చాలా మందికి లేని సౌకర్యమైన -తాను అనుకున్నట్టు జీవించగలిగే ట్రాన్స్ పురుషుడేమీ కాదు, పైగా ఒక దళిత వ్యక్తి మాత్రమే. 'నిజమైన పురుషుడు కాదు' అనే ముద్ర పడుతుందేమోననే భయం అతన్ని వెంటాడుతోంది. రొమ్ములు లేకపోవటంతో అతను మామూలుగా శారీరక శ్రమ చేసే మగవాడిలా పనులు చేయటం సులభమే, కానీ పురుషులకు ఉండేలా ముఖంపై వెంట్రుకలు లేకపోవటం, గంభీరమైన కంఠస్వరం లేకపోవటం, కండలు తిరిగిన దేహం లేకపోవటం వంటివి అతన్ని ఇతరులు అనుమానంగా చూసేలా చేస్తున్నాయి. అదే విధంగా అతనికి పుట్టుకతో వచ్చిన పేరు - అతనింకా చట్టబద్ధంగా మార్చుకోలేదు.

అతనింకా హార్మోన్ రీప్లేస్‌మెంట్ చికిత్స కోసం సిద్ధంగా లేడు; దాని దుష్ప్రభావాల గురించి అతనికి సరిగ్గా తెలియదు. “కానీ నేను ఆర్ధికంగా స్థిరపడిన తర్వాత అది చేయించుకుంటాను," అంటాడు సుమిత్.

అతను ఒకసారికి ఒక అడుగే వేస్తున్నాడు.

టాప్ సర్జరీ చేయించుకున్న ఆరు నెలల తర్వాత సుమిత్ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖలో తనను ట్రాన్స్ పురుషుడిగా నమోదు చేసుకున్నాడు. అది అతనికి దేశీయంగా గుర్తింపు పొందిన ట్రాన్స్‌జెండర్ సర్టిఫికేట్‌ను, గుర్తింపు కార్డును కూడా కేటాయించింది. అతనికి ఇప్పుడు అందుబాటులో ఉన్న సేవల్లో ఒక పథకం: సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిడ్యువల్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్‌ప్రైజ్ ( SMILE ). ఇది భారతదేశ పతాకనౌక అయిన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం కింద ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల కోసం జెండర్ స్థిరీకరణ సేవలను అందిస్తుంది.

"నేను పూర్తిగా మారిపోవటానికి ఇంకా ఏమేం శస్త్రచికిత్సలు చేయించుకోవాలో నాకింకా తెలియదు," అంటాడు సుమిత్. "అవన్నీ నెమ్మదిగా చేస్తాను. దస్తావేజులన్నింటిలోనూ నా పేరును కూడా మార్చుకుంటాను. ఇది కేవలం ఆరంభం మాత్రమే."

ఈ కథనం, భారతదేశంలో లైంగిక, జెండర్-ఆధారిత హింస (SGBV) నుండి బయటపడిన వారి సంరక్షణ కోసం సామాజిక, సంస్థాగత, నిర్మాణాత్మక అడ్డంకులపై దృష్టి సారించే దేశవ్యాప్త రిపోర్టింగ్ ప్రాజెక్ట్‌లో ఒక భాగం. ఇది డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ ఇండియా అందించిన ప్రేరణలో భాగం.

గుర్తింపును కాపాడటం కోసం హింస నుంచి బయటపడిన వ్యక్తుల, వారి కుటుంబ సభ్యుల పేర్లను మార్చాం.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Ekta Sonawane

ایکتا سوناونے ایک آزاد صحافی ہیں۔ وہ ذات، طبقہ اور جنسی شناخت سے متعلق امور پر لکھتی اور رپورٹ کرتی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Ekta Sonawane
Editor : Pallavi Prasad

پلّوی پرساد ممبئی میں مقیم ایک آزاد صحافی، ینگ انڈیا فیلو اور لیڈی شری رام کالج سے گریجویٹ ہیں۔ وہ صنف، ثقافت اور صحت پر لکھتی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Pallavi Prasad
Series Editor : Anubha Bhonsle

انوبھا بھونسلے ۲۰۱۵ کی پاری فیلو، ایک آزاد صحافی، آئی سی ایف جے نائٹ فیلو، اور ‘Mother, Where’s My Country?’ کی مصنفہ ہیں، یہ کتاب بحران زدہ منی پور کی تاریخ اور مسلح افواج کو حاصل خصوصی اختیارات کے قانون (ایفسپا) کے اثرات کے بارے میں ہے۔

کے ذریعہ دیگر اسٹوریز Anubha Bhonsle
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

کے ذریعہ دیگر اسٹوریز Sudhamayi Sattenapalli