దట్టమైన తూరుపు కనుమల వెనగ్గా, సూర్యాస్తమవుతున్నప్పుడు; కీచుమనే కొండ మైనా పిట్టల అరుపులు, పారా మిలటరీ దళాల బూటు శబ్దాల కింద నలిగిపోయేవి. ఆ దళాలు మళ్ళీ పల్లెల్ని కాపలా కాస్తున్నాయి. ఆ సాయంత్రాలంటేనే ఆమెకు అత్యంత భయం కలిగేది.

ఆమెకు దేమాతి అన్న పేరెందుకు పెట్టారో తెలియదు. "ఆమె మా గ్రామాన్నుండి బ్రిటీషు సైన్యాన్ని ఒంటి చేత్తో నిర్భయంగా వెంటాడిన స్త్రీమూర్తి," అని అమ్మ ఎంతో ఉద్వేగంతో చెప్పేది. కానీ అమ్మ దేమాతిలా ధైర్యవంతురాలు కాదు, చాలా పిరికి మనిషి.

కడుపు నొప్పి, ఆకలి దప్పులతో; చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఇంట్లో రోజుల తరబడి ఉండటం, అనుమానాస్పద కళ్ళని, భయపెట్టే చూపుల్ని, నిరంతరం అరెస్టుల్ని, చిత్రహింసల్ని; మనుషులు చచ్చిపోవడం వీటితో కలిసి జీవించింది. అప్పుడు, అడవి, అందులోని చెట్లూ, సెలయేళ్ళూ ఎల్లప్పుడూ ఆమెతోనే తోడుగా ఉండేవి. అక్కడి సాలువ పూల పరిమళాలు వాళ్ళమ్మని గుర్తుచేసేవి; అడవిలో వాళ్ళ అమ్మమ్మ పాటల ప్రతిధ్వనుల్ని వినేది. ఇవి తోడుగా ఉంటే చాలు కదా, తానెన్ని కష్టాలనన్నా ఓర్చుకోగలనని అనుకునేది.

ఆమెకిప్పుడివన్నీ తెలుసని నిరూపించేందుకొక కాగితం కావాలి. లేకపోతే ఇంట్లోంచి, ఊళ్ళోంచి, తన సొంత నేల్లోంచి ఆమెను తరిమేందుకు సిద్దమయ్యారు. గాయాల్ని మాన్పగల శక్తి ఉన్న చెట్లూ, పొదల సంగతి; ఆకూ బెరళ్ళ పేర్ల గురించీ ఆమెకు నాన్న నేర్పింది సరిపోదంటున్నారు. వాళ్ళమ్మతో కలసి పళ్ళనీ, గింజల్నీ; వంట చెరుకునీ ఏరేందుకెళ్ళినప్పుడల్లా, ఆమె తను పుట్టిన చెట్టు నీడను చూపెట్టేది. మామ్మ అడవి గురించిన పాటలు నేర్పేది. పక్షుల్ని చూస్తూ, వాటి ప్రతిధ్వనుల్ని వింటూ; ఆమె తన తమ్ముడితో కలసి అక్కడ తను కలియ తిరిగేది.

కానీ, చిన్న నాటి ఆటలు, కధలూ పాటలూ, ఆనాటి జ్ఞానమంతా దేనికన్నా ఆధారం చూపిస్తాయా? తన పేరుకున్న అర్ధమేమిటో, ఏ స్త్రీమూర్తి పేరును తనకు పెట్టారో అని ఎడతెగని ఆశ్చర్యంతో ఆలోచిస్తూనే కూర్చునేది. అసలు దేమాతీ తాను ఈ అడవికి బంధువునని ఎలా నిరూపించుకుని ఉంటుంది?

సుధన్వ దేశ్ పాండే కవితను వినండి

Demathi Dei Sabar is known as ‘Salihan’ after the village in Nuapada district where she was born. She was closing in on 90 when PARI met her in 2002. Her incredible courage unrewarded and – outside her village – largely forgotten, living in degrading poverty
PHOTO • P. Sainath

నువాపాడా పుట్టిన దేమతి డీ సబర్ ను ఆమె గ్రామం లో 'సాలిహాన్' అని పిలుస్తారు. 2002 లో పి. సాయినాథ్ ఆమెను కలిసినప్పుడు ఆమె 90 ఏళ్ళ వయసు పైబడి ఉంది. (ఆ కథ లింక్ క్రింద ఉంది). అద్భుతమైన ఆమె ధైర్యాన్ని ఏ ప్రభుత్వమూ గుర్తించలేదు. ఆమె గ్రామం వెలుపల - పేదరికంలో జీవించే ఆమెని ఇంచుమించుగా అందరూ మర్చిపోయారు

విశ్వరూప సందర్శనం *

ఆ ఫొటోలో,
ఆమె అక్కడే నవ్వుతూ కూర్చుంది
మట్టితో అలికిన తన చిన్ని పూరి గుడిసె
గుమ్మంలో

ఆమె నవ్వే
అశ్రద్దగా కట్టుకున్న చీరెలోని
కుంకుమ రంగుకు గాఢతను అద్దింది

అది ఆమె నవ్వే
ఆఛ్చాదన లేని భుజాలపై చర్మానికి
మెడ కింది కాలర్ బోన్ కి
వెండి జలతారునద్దుతోంది

ఆమె నవ్వే
తన చేతిపై గల టాటూలోని
ఆకుపచ్చని దారుల్ని వెతుకుతోంది

అది ఖచ్చితంగా ఆమె నవ్వే
నెరిసి చిక్కుపడ్డ పసుప్పచ్చని జుట్టుని
సముద్రపు అలల్లా ఎగసిపడవేస్తోంది

అది ఆమె నవ్వే
కంటి శుక్లాల వెనుక పాతేసిన
జ్ఞాపకాలతో కళ్ళను వెలిగిస్తోంది

ఆ వయసుడిగిన దేమాతీనే
ఆమె నోట్లోని పళ్ళూగుతుండగా
చాలా సేపు నవ్వుతుండగానే చూస్తుండిపోయాను

ఆ మునిపళ్ళ మధ్యనున్న ఖాళీలోంచి
ఆకలిగొన్న కడుపులోని అగాధంలోని
అగాధంలోకి
ఆమె నన్ను లాక్కుని పోయింది

కళ్ళు చూసీ చూడలేనంత
చిక్కటి చీకటిలోంచి
ఏ దేవ కిరీటాలూ ధరించకుండా
రాజముద్రికలూ, చక్ర గదల్లేకుండా
లక్ష సూర్యుళ్ళ కాంతి ప్రకాశంతో
ఒకే ఒక్క చేతి లాఠీతో
దుర్భలమైన శరీరాకృతిలో
ఆ దేమాతీ నిలుచుంది

ఆమె లోంచి
ఏకాదశ రుద్రులు
ద్వాదశ ఆదిత్యులు
వసుని ఎనిమిదిమంది కొడుకులు
ఇద్దరు అశ్వనీ పుత్రులూ
నలభై తొమ్మిది మారుతి, యక్ష గంధర్వ గణాసురుల
సిద్ద యోగీశ్వరులందరూ

ఆమెలోంచే జనిస్తున్నట్టు
ఆమె లోంచే లయిస్తున్నట్టు --

నలభై సాలిహా అమ్మాయిలు
ఎనభై లక్షల నాలుగు వందల వేల చరణ కన్యలు **
ఉద్యమాల్లా
విప్లవాల్లా
స్వప్న స్వాప్నికుల్లా

తిరుగుబాటులోని కోపోద్రిక్త స్వరంలా
విరిగిపడుతున్న గిరి శిఖరాల్లా
ఆరావళీల్లా
గిర్నారీల్లా

అమ్మా నాన్న
నా సమస్త బ్రహ్మండమూ
ఆమెలోంచే జనిస్తున్నట్టు
ఆమెలోకే లయిస్తున్నట్టు --


దేమతి గురించి రాసిన తొలి కథనం ఇక్కడ .

ఆడియో: సుధన్వ దేశ్ పాండే జన నాట్య మంచి లో నటి, దర్శకురాలు, లెఫ్ట్ వార్డ్ బుక్స్ కు సంపాదకురాలు.

కవర్ ఇల్లస్ట్రేషన్: పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాలోని ఒక చిన్న పట్టణానికి చెందిన లాబాని జంగి, కోల్‌కతాలోని సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ సోషల్ సైన్సెస్‌లో బెంగాలీ కార్మిక వలసలపై పిహెచ్‌డి చేస్తున్నారు. ఆమె స్వంతంగా చిత్రకళను అభ్యసించారు. ప్రయాణాలు ఇష్టపడతారు.

* విశ్వరూప దర్శనం అనేది భగవద్గీత 11 వ అధ్యాయంలో అర్జునుడికి తన నిజమైన, విశ్వరూపాన్ని క్రిష్ణ చూపించడం. ఈ అధ్యయనం ఈ రూపాన్ని వేల కళ్ళు, నోళ్లు, చేతులు అనేక ఆయుధాలు పట్టుకుని, అనంతమైన విశ్వాన్ని ఎందరో  దేవుళ్ళు, దేవతలు, సజీవంగా ఉన్నవి, లేనివి తో వివరంగా కనిపిస్తుంది.

** చరణ్ కన్య:  గుజరాత్‌లోని తన కుగ్రామంపై దాడి చేయడానికి వచ్చిన సింహాన్ని కర్రతో తరిమివేసిన చరణ్ తెగకు చెందిన 14 ఏళ్ల బాలిక శౌర్యం గురించి, జవర్‌చంద్ మేఘని రాసిన అత్యంత ప్రసిద్ధ గుజరాతీ కవితల్లో ఒక కవితా శీర్షిక.

అనువాదం: శ్రీరామ్ పుప్పల

Pratishtha Pandya

پرتشٹھا پانڈیہ، پاری میں بطور سینئر ایڈیٹر کام کرتی ہیں، اور پاری کے تخلیقی تحریر والے شعبہ کی سربراہ ہیں۔ وہ پاری بھاشا ٹیم کی رکن ہیں اور گجراتی میں اسٹوریز کا ترجمہ اور ایڈیٹنگ کرتی ہیں۔ پرتشٹھا گجراتی اور انگریزی زبان کی شاعرہ بھی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Pratishtha Pandya
Translator : Sreeram Puppala

Sreeram has done his Master’s in agriculture, presently is working in a bank. He loves poetry immensely.

کے ذریعہ دیگر اسٹوریز Sreeram Puppala