33 ఏళ్ళ ఆరేటి వాసు పైన 23 కేసులు, అతని తల్లి ఎ. సత్యవతి (55) పైన ఎనిమిది క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని వారి గ్రామమైన తుందుర్రులో, వాసును ప్రలోభాలకు, బెదిరింపులకు గురిచేసి, మూడుసార్లు కటకటాల వెనక్కి నెట్టారు. సెప్టెంబర్ 2016 నుండి ఇప్పటిదాకా అతను మొత్తం 67 రోజులు జైలులో గడిపారు. అతని తల్లి 45 రోజులు జైలులో ఉన్నారు.

"నేను చేసినదంతా ఆర్‌టిఐ (సమాచార హక్కు చట్టం) కింద దరఖాస్తు చేయటమే!" అని ఆయన చెప్పారు.

ఆయన చేసిన పనికి వచ్చిన ఫలితం అంత మామూలుగా లేదు. తుందుర్రులో పోలీసుల దాడులు, బెదిరింపులు, ప్రజలను వారి ఇళ్లలో నుండి బయటకు లాగి, వారిని నిర్బంధంలో ఉంచడం ఇప్పుడు సాధారణ చర్యలుగా మారిపోయాయి. అలాగే తుందుర్రులోనే కాకుండా పొరుగు గ్రామాలయిన భీమవరం మండలం జొన్నలగరువు, నరసాపురం మండలంలోని కె.బేతపూడిలో కూడా ఈ పోలీసు చర్యలు సాధారణమైపోయాయి. ఈ మూడు గ్రామాలూ పశ్చిమగోదావరి జిల్లాలోనే ఉన్నాయి.

ఇక్కడి గ్రామస్థులు - ఎక్కువగా చిన్న రైతులు, మత్స్యకారులు, కార్మికులు. వీళ్ళందరూ గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ (GMAFP-జిఎమ్ఎఎఫ్‌పి) ఏర్పాటును నిరసిస్తున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంతంలోని గాలీ నీరూ కలుషితమై, తమ జీవనోపాధిని నాశనం చేస్తాయని వారు భావిస్తున్నారు. ఈ ఫుడ్ పార్క్ చేపలు, రొయ్యలు, పీతలు  వంటి ఉత్పత్తులను ప్రాసెస్ చేసి యూరోపియన్ యూనియన్, అమెరికాలలోని మార్కెట్లకు ఎగుమతి చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక్కడ ఏర్పడిన 'జిఎమ్ఎఎఫ్‌పి వ్యతిరేక ఆందోళనల కమిటీ', "జిఎమ్ఎఎఫ్‌పి ఈ ప్రక్రియలో రోజుకు కనీసం 1.5 లక్షల లీటర్ల నీటిని ఉపయోగిస్తుంది. తద్వారా ప్రతిరోజూ దాదాపు 50,000 లీటర్ల కాలుష్యాలతో నిండిన నీటిని విడుదల చేస్తుంది" అని నొక్కి చెప్పింది. జిఎమ్ఎఎఫ్‌పి నుండి విడుదలయ్యే కలుషితమైన నీరు ఈ జిల్లా నుంచి గొంతేరు కాలువ ద్వారా సముద్రంలోకి విడుదలవుతుంది.

A man and a woman standing in a doorway
PHOTO • Sahith M.
A woman holding out her hand to show the injuries on her palm.
PHOTO • Sahith M.

తుందుర్రు గ్రామానికి చెందిన ఆరేటి వాసు, అతని తల్లి సత్యవతి. వీరిద్దరిపై మొత్తం 31 కేసులు ఉన్నాయి. కుడి: నిరసన ప్రదర్శన సమయంలో సత్యవతి చేతికి అయిన గాయం

వాస్తవానికి అక్టోబరు 30, 2017 నాటి ప్రభుత్వ ఉత్తర్వు, "జిఎమ్ఎఎఫ్‌పి ప్లాంట్ నుంచి ఉత్పన్నమయ్యే కలుషిత నీటిని ఎఫ్ల్యూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ద్వారా శుద్ధి చేసి, రోజుకు 3,00,000 లీటర్ల నీటిని చినగొల్లపాలెం వద్ద సముద్రంలోకి పంపే విధంగా ఒక పైప్‌లైన్ నిర్మిస్తారని” పేర్కొంది. కానీ అటువంటి పైప్‌లైన్ లేదా ట్రీట్‌మెంట్ ప్లాంట్ నిర్మాణం కనుచూపు మేరలో కూడా కనిపించడంలేదని ఆందోళన కమిటీ పేర్కొంది. గొంతేరు కాలువలోకి పెద్ద ఎత్తున కలుషిత నీరు వెళ్లే సమస్య ఉందని స్థానిక మీడియా కూడా నివేదించింది.

ప్రైవేటుగా సేకరించిన దాదాపు 57 ఎకరాల భూమిలో ఈ ప్రణాళికపై పని 2015లో ప్రారంభమైంది. ఇది ఈ సంవత్సరం అమలులోకి రానుంది. "మా కంపెనీ పర్యావరణ సంబంధిత కార్బన్ ప్రభావాన్ని వీలైనంత తక్కువ చేయడానికి ప్రయత్నిస్తుంది. సంప్రదాయక వనరుల స్థానంలో ప్రత్యామ్నాయ ఇంధన వనరులయిన గాలి, సౌర, జలం వంటివాటిని ఉపయోగిస్తామ”ని ఆ కంపెనీ 'విజన్ స్టేట్‌మెంట్' పేర్కొంది.

గ్రామస్థులు ఆపైన చెప్పిన సమాచారాన్ని ఒక భ్రమగా కొట్టిపారేశారు. ఈ ప్రాజెక్ట్ గురించి సమాచారం కోరుతూ ఆరేటి వాసు ఆర్‌టిఐ దరఖాస్తు (సమాచార హక్కు చట్టం కింద) చేయడంతో వివాదం రాజుకుంది. వాసు తన గ్రామంలో ‘మీ సేవ’ కేంద్రాన్ని నడుపుతున్నారు. ఈ కేంద్రాలు బిల్లు చెల్లింపులు, ప్రభుత్వ సేవల కోసం దరఖాస్తు చేసుకోవటం వంటి (ఔట్‌సోర్సింగ్ మరియు ప్రైవేట్) సౌకర్యాలను ప్రజలకు అందించడానికి రాష్ట్రం చేపట్టిన ఒక చర్య.

వాసు మొదటిసారి జైలుకు వెళ్ళినప్పుడు, అతని తల్లి ఆక్వా ఫుడ్ పార్కుకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించడం ప్రారంభించారు. సత్యవతి ఇంతలోనే తన కొడుకుపై ఉన్న ఛార్జ్ షీట్‌లో “ఇతరులు” జాబితా కింద తన పేరును కూడా చేర్చినట్లు తెలుసుకున్నారు.

Coconut trees
PHOTO • Sahith M.
Cans of drinking water stored underneath a table in a house
PHOTO • Sahith M.

గోదావరి డెల్టాపై మరింత ప్రభావాన్ని చూపబోతోన్న మెగా ఆక్వా ఫుడ్ పార్క్ స్థలం. ఇక్కడి ప్రజలు ఇప్పటికే తాగునీటి కోసం ప్లాస్టిక్ డబ్బాలలో వచ్చే నీటిపై ఆధారపడి బతుకుతున్నారు

తాము కేవలం శాంతిభద్రతలను కాపాడుతున్నామని పోలీసులు చెబుతున్నారు. కాని ఇక్కడ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల (ప్రాథమిక సమాచార నివేదికలు) కాపీలను ఈ రిపోర్టర్ సేకరించారు. ఈ నివేదికలలో చాల తీవ్రమైన విపరీత ఆరోపణలు కనిపిస్తాయి. "35 ఏళ్ళలో నాకు పోలీసులతో ఎప్పుడూ పని పడిందిలేదు. అయినప్పటికీ వాళ్ళు నన్ను హత్యాయత్నంతో సహా మొత్తం తొమ్మిది కేసుల్లో ఇరికించారు," అని సత్యవతి చెప్పారు. ఆమె ఒక్కరే కాదు. చాలామంది గ్రామస్థులు ఇప్పుడు కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగవలసి వస్తోంది, కొన్నిసార్లు వారానికి రెండుసార్లు కూడా.

వ్యవసాయాన్ని తీవ్రంగా నాశనం చేయడమే కాకుండా, గొంతేరు కాలువలోకి ఈ కలుషిత నీరు వెళ్ళడం వల్ల సమీపంలోని చేపల వేటపై ఆధారపడిన 18 గ్రామాలు నాశనమవుతాయని ఈ ప్రాంతంలోని మత్స్య కార్మికుల సంఘం నాయకుడు బర్రె నాగరాజు చెప్పారు. "ఈ ఫ్యాక్టరీ మాలాంటి 40,000మంది పైన  ప్రభావం చూపుతుంది" అని ఆయన చెప్పారు.

భూగర్భ జలాలను విచక్షణారహితంగా తోడేయడం, ఇతర ప్రాజెక్టులకు మళ్ళించటం వంటివి ఇప్పటికే చాలా సంక్షోభాన్ని సృష్టించాయి. గత కొన్నేళ్లుగా గోదావరి డెల్టాలో నీరు పుష్కలంగా ఉన్నా, గ్రామస్థులు తాగునీటి కోసం పెద్దపెద్ద ప్లాస్టిక్ డబ్బాలపైనే ఆధారపడవలసి వస్తున్నది. అలాంటి డబ్బాల అమ్మకం ఇప్పుడు జోరుగా సాగుతోంది. జిఎమ్ఎఎఫ్‌పి ఈ పరిస్థితిని మరింత దిగజారుస్తుందని ప్రజలు భయపడుతున్నారు.

ఆక్వా ఫుడ్‌పార్క్‌ పక్కనే ఉన్న జొన్నలగరువు గ్రామానికి చెందిన కోయ మహేశ్ అనే వ్యవసాయ కూలీ మాట్లాడుతూ, “ఈ ఫ్యాక్టరీ గ్రామంలోని సారవంతమైన భూములను ధ్వంసంచేసి, వ్యవసాయ కూలీల జీవనాధారాన్ని దెబ్బతీస్తుంది,” అన్నారు. దళితులు ఎక్కువగా నివసించే అతని గ్రామంలో అందరూ ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఇది తమకు ఉన్న ఒక ప్రధాన మంచినీటి వనరైన గొంతేరు కాలువను కలుషితం చేస్తున్నదని, అలాగే ఫ్యాక్టరీ నుంచి వచ్చే దుర్వాసన వల్ల గ్రామంలో నివసించలేని పరిస్థితి నెలకొందని కూడా వారు ఆరోపిస్తున్నారు.

A man sitting on a chair outdoors
PHOTO • Sahith M.
Portrait of a man outdoors with his hands folded across his chest
PHOTO • Sahith M.
Portrait of a man sitting on a chair
PHOTO • Sahith M.

కోయ మహేశ్ (ఎడమ), సముద్రాల వెంకటేశ్వరరావు (కుడి)పై కూడా పలు కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాజెక్టు వల్ల తమ సముదాయానికి చెందిన 40,000 మందిపై ప్రతికూల ప్రభావం పడుతుందని మత్స్య కార్మికుల నాయకుడు బర్రె నాగరాజు (మధ్యలో) చెప్పారు

జొన్నలగరువులోని కేవలం 70 ఇళ్ళున్న దళితవాడకు చెందిన 20 మందికి పైగా దళితులపై పలు కేసులు నమోదయ్యాయి. హత్యాయత్నం కేసుతో సహా తొమ్మిది కేసులు మహేశ్‌పై ఉన్నాయి. అతను మొదట 53 రోజులు, ఆ తరువాత కూడా ఆరు రోజుల పాటు జైలులో ఉన్నారు. ఆక్వా పార్కుకు వ్యతిరేకంగా జరిగిన సమావేశానికి హాజరైన తర్వాత అతని భార్య కీర్తన పైన కూడా కేసు పెట్టినట్లు వాళ్ళకు తెలిసింది. "బెదిరించటం, భయపెట్టడం మామూలైపోయాయి," అని కీర్తన చెప్పింది. అంతర్జాతీయ మహిళా దినం సందర్భంగా విజయవాడలో జరిగిన ఒక నిరసన కార్యక్రమంలో, "పోలీసులు ఒక గర్భిణీని కూరగాయల బస్తాను విసిరేసినట్లు పోలిస్ వ్యాన్‌లోకి విసిరి పడేశారు" అని ఆమె గుర్తు చేసుకున్నది.

ఈ విషయంలో ఇక్కడ ఎలాంటి వయస్సు మినహాయింపులు ఉండవు. గ్రామంలో ప్రతి సంవత్సరం జరిగే కబడ్డీ ఆటను ముందస్తు అనుమతి తీసుకోకుండా నిర్వహిస్తున్నారంటూ పిల్లలను కూడా పోలీసులు పోలీసు స్టేషన్‌కు తరలించారు. గత కొన్ని సంవత్సరాలుగా కబడ్డీ ఆట ఇక్కడ ఎటువంటి సమస్యలు లేకుండా సాగుతూవస్తోంది, కానీ ఎప్పటినుంచైతే గ్రామస్తులు నిరసనలలో పాల్గొనడం ప్రారంభించారో అప్పటినుంచి పరిస్థితి మారిపోయింది.

A bunch of women standing outside a house
PHOTO • Sahith M.

'...ఈ రోజున మేం రోడ్లపైకి వచ్చి జైలుకు వెళ్తున్నాం' అంటోన్న సముద్ర సత్యవతి

ఇక్కడ జరుగుతున్న సంఘటనల గురించి వివరణ కోరుతూ ఈ రిపోర్టర్ ఇఛ్చిన ఇమెయిల్‌కు జిఎమ్ఎఎఫ్‌పి ప్రతిస్పందించలేదు. అయితే, ఫుడ్ పార్క్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆనంద వర్మ, ప్రాజెక్ట్‌పై లేవనెత్తుతున్న సందేహాలకు నిజంగా ఎటువంటి ఆధారాలు లేవనీ, అలాగే ప్రాజెక్ట్ నుంచి ఎటువంటి వ్యర్థాలు వెలికి రావనీ (జీరో డిశ్చార్జ్) చెప్పారు. నీటిని, అన్ని రకాల వ్యర్థాలను శుద్ధి చేసి, రీసైకిల్ చేస్తారని తెలిపారు (ది హిందూ బిజినెస్‌లైన్, అక్టోబర్ 17, 2016).

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టును సమర్థించారు. "ఆక్వా ఫుడ్ పార్క్‌ను ఆపాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. ఈ కర్మాగారం వల్ల నష్టమేమీ లేదు," అని 2016 ఫిబ్రవరి 25న ఏలూరులో జరిగిన బహిరంగ సభలో ఆయన చెప్పారు. "దీని ద్వారా విడుదలయ్యే కాలుష్యాలను, అవశేషాలను వడపోసి, పైపులైన్ ద్వారా సముద్రంలోకి మళ్ళిస్తారు. ఇదే స్థలంలో ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతుంది.”

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తొలిసారిగా ఈ ఆక్వా పార్కుకు అనుమతి లభించింది. కానీ తెలుగుదేశం పార్టీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత దాని నిర్మాణాన్ని త్వరితం చేసింది. గత రెండేళ్లలో 300 మందికి పైగా గ్రామస్థులపై కేసులు నమోదయ్యాయి. మెగా ఆక్వా ఫుడ్ పార్క్ "కాలుష్య రహితమైనది" అని టీడీపీ అధికార ప్రతినిధి వైవీబీ రాజేంద్ర ప్రసాద్ నొక్కిచెప్పారు.

అయితే స్థానికులు మాత్రం అందుకు భిన్నమైన వాస్తవ స్థితిని  ఎదుర్కొంటున్నారు. వారిలో అసంతృప్తి మరుగుతూ ఉంది. "ఈ ఫ్యాక్టరీ ఇక్కడికి రాకముందు, నేను ఎన్నడూ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి ఎరుగను," అని సమీపంలోని కె. బేతపూడి గ్రామానికి చెందిన రైతు సముద్రాల వెంకటేశ్వరరావు చెప్పారు. ప్రస్తుతం రావుపై హత్యాయత్నం, నేరపూరిత కుట్ర ఆరోపణలతో సహా 17 కేసులు ఉన్నాయి. ఆయన రోడ్డుపై నిరసనకు కూర్చోవడంతో ఇది ప్రారంభమైంది. "ఆ రాత్రి నన్ను పోలీసులు పట్టుకుపోయి 53 రోజులు జైలులో పెట్టారు" అన్నారాయన.

అదే గ్రామానికి చెందిన మరో నివాసి సముద్ర సత్యవతి ఇలా అంటున్నారు: “ఇంతకుముందు, ఇక్కడి మహిళలలో చాలామంది తమ వాకిట ముందర ముగ్గులు వేయడానికి మాత్రమే ఇళ్ళ నుండి బయటకు వచ్చేవారు. కానీ ఇప్పుడు మేం రోడ్లపైకి వచ్చి జైలుకు కూడా వెళ్తున్నాం. ఒక్క ఫ్యాక్టరీ వల్ల వేలాదిమంది ఎందుకు నష్టపోవాలి?" ఇక్కడే నాలుగు సంవత్సరాల పాటు శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు చేసిన మరికొంతమంది ఇలా అంటున్నారు: “మరుసటి రోజు కర్మాగారానికి సంబంధించిన యంత్రాలు వస్తున్నాయని మమ్మల్ని రాత్రివేళ లాగడం, కొట్టడం, నిర్బంధించడం న్యాయమేనా? మా ప్రాణం పోయినా ఈ ప్లాంట్ నిర్మాణాన్ని మొదలుపెట్టనివ్వం."

ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రైవేట్ కర్మాగారానికి ప్రభుత్వం ఎందుకు మద్దతిస్తోందని కె.బేతపూడికి చెందిన జె.సత్యనారాయణ ఆశ్చర్యపోతున్నారు. "ఈ నాటికి కూడా, పోలీసు రక్షణ లేకుండా ఫ్యాక్టరీలో ఒక్క ఇటుక కూడా పెట్టలేరు," అని ఆయన సూటిగా చెప్పారు.

అనువాదం: పద్మావతి నీలంరాజు

Sahith M.

ساہتھ ایم حیدرآباد سنٹرل یونیورسٹی سے پولیٹیکل سائنس میں ایم فل کر رہے ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Sahith M.
Editor : Sharmila Joshi

شرمیلا جوشی پیپلز آرکائیو آف رورل انڈیا کی سابق ایڈیٹوریل چیف ہیں، ساتھ ہی وہ ایک قلم کار، محقق اور عارضی ٹیچر بھی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز شرمیلا جوشی
Translator : Padmavathi Neelamraju

Padmavathi is a retired school teacher with more than 35 years of experience in teaching English. With an interest in Telugu and English literature, she pens her experiences through blogs and newspapers.

کے ذریعہ دیگر اسٹوریز Padmavathi Neelamraju