భారతదేశ మొదటి న్యాయశాఖా మంత్రి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, కొత్త పార్లమెంట్ భవనంలో జరుగుతోన్న కార్యకలాపాలను సంశయాత్మక దృష్టితో చూసివుండేవారు. ఎందుకంటే, "రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తే, దానిని తగలబెట్టే మొదటి వ్యక్తిని నేనే" అని చెప్పినవారు కదా ఆయన.

పార్లమెంటులో 2023లో ఆమోదం పొందిన పౌరుల రాజ్యాంగ హక్కులకు భంగం కలిగించే ముఖ్యమైన కొత్త బిల్లులను గురించి PARI గ్రంథాలయం సునిశిత పరిశీలన.

అటవీ (సంరక్షణ) సవరణ చట్టం, 2023 విషయాన్నే తీసుకోండి. భారతదేశంలోని అడవులు సరిహద్దులకు సమీపంలో ఉంటే, ఇక వాటిలోకి ఎవరికీ ప్రవేశముండదు. అనేక దేశాలతో అంతర్జాతీయ సరిహద్దులను పంచుకునే ఈశాన్య భారతదేశాన్నే ఉదాహరణగా తీసుకోండి. భారతదేశపు అటవీ ప్రాంతంలో 50 శాతానికి పైగా ఉన్న ఈశాన్య ప్రాంతంలోని 'వర్గీకరించని అడవులు', ఇప్పుడు సవరణ తర్వాత సైనిక, ఇంకా ఇతర అవసరాలకు ఉపయోగించబడతాయి.

డిజిటల్ గోప్యత విషయంలో, ఒక కొత్త చట్టం - భారతీయ నాగరిక్ సురక్ష (రెండవ) సంహిత చట్టం - దర్యాప్తు సమయంలో ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌ల వంటి డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకోవడాన్ని దర్యాప్తు సంస్థలకు సులభతరం చేస్తుంది. ఈ విధంగా గోప్యతకు సంబంధించి పౌరుల ప్రాథమిక హక్కును సందిగ్ధంలో పడేస్తుంది. అదేవిధంగా టెలికమ్యూనికేషన్ సేవల అధీకృత సంస్థ ద్వారా ధృవీకరించబడిన బయోమెట్రిక్ ఆధారిత గుర్తింపును ఉపయోగించాలని కొత్త టెలికమ్యూనికేషన్స్ చట్టం నిర్దేశిస్తుంది. బయోమెట్రిక్ డేటాను సంగ్రహించి, దానిని చేర్చి పెట్టడం వలన గోప్యత, సైబర్ భద్రతలను గురించిన తీవ్రమైన ఆందోళనలు తలెత్తుతాయి.

ఈ కొత్త శాసన చర్యలు 2023లో భారతదేశ పార్లమెంటరీ సమావేశాల్లో అమలులోకి వచ్చాయి. 72 ఏళ్ళ పార్లమెంటు చరిత్రలో తొలిసారిగా, డిసెంబర్ 2023లో జరిగిన శీతాకాల సమావేశాల్లో 146 మంది ప్రతిపక్ష పార్లమెంటు సభ్యులు (ఎంపీలు) బహిష్కరణకు గురయ్యారు. ఇది ఒకే సెషన్‌లో అత్యధిక సంఖ్యలో జరిగిన బహిష్కరణలకు గుర్తుగా మిగిలింది.

రాజ్యసభ సభ్యులు 46 మంది, లోక్‌సభ సభ్యులు 100 మంది బహిష్కరణకు  గురికావడంతో క్రిమినల్‌ చట్ట సవరణపై చర్చ జరిగినప్పుడు విపక్షాల బెంచీలు ఖాళీగా కనిపించాయి.

భారతీయ క్రిమినల్ చట్టాలను సంస్కరించి, వలసవాద అంశాలను నిర్మూలించే లక్ష్యంతో ఈ చర్చ లోక్‌సభలో మూడు బిల్లులను ప్రవేశపెట్టింది: ఇండియన్ పీనల్ కోడ్, 1860; క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, 1973; ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, 1872. భారతీయ న్యాయ (రెండవ) సంహిత, 2023 (బిఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా (రెండవ) సంహిత, 2023 (బిఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య (రెండవ) బిల్లు, 2023 (బిఎస్‌బి)- ఈ మూడూ వరుసగా ఈ ప్రధాన చట్టాల స్థానంలో వచ్చాయి. 13 రోజుల్లోనే, డిసెంబర్ 25న, రాష్ట్రపతి ఆమోదం పొందిన ఈ బిల్లులు జూలై 1, 2024న అమల్లోకి వస్తాయి.

భారతీయ న్యాయ (రెండవ) సంహిత, 2023 ( BNS ) చట్టం ప్రధానంగా ఇప్పటికే ఉన్న నిబంధనలను పునర్నిర్మించినప్పటికీ, BNS బిల్లు రెండవ పునరుక్తి ద్వారా మునుపటి భారతీయ శిక్షాస్మృతి, 1860 ( IPC ) నుంచి భిన్నమైన ముఖ్యమైన సవరణలను ప్రవేశపెట్టింది

"భారతదేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రతలకు విఘాతం కలిగించే చర్యల" పరిధిని విస్తరిస్తూ, ఈ చట్టం దేశద్రోహ నేరాన్ని (ఇప్పుడు కొత్త పరిభాషలో పేరు ఉన్న) అట్లే నిలిపివుంచింది. ప్రతిపాదిత సెక్షన్ 152 దేశద్రోహ కేసులకు సంబంధించి "హింసను ప్రేరేపించడం" లేదా "ప్రజా (జీవన) భద్రతకు భంగం కలిగించడం" వంటి మునుపటి నిబంధనలను మించిపోయింది. దీని ప్రకారం, "ఏదైనా చర్యను చేయటం లేదా చేసేలా ప్రేరేపించడం, వేర్పాటువాద లేదా సాయుధ తిరుగుబాటును ప్రేరేపించడం లేదా విధ్వంసక కార్యకలాపాలను నిర్వహించడం" దేశద్రోహంగా పరిగణించబడుతుంది.

BNS చట్టం రెండవ పునరుక్తిలోని మరొక ముఖ్యమైన సవరణ IPC లోని 377 సెక్షన్‌ను తీసివేయడం: “ఎవరైనా స్వచ్ఛందంగా ఏదైనా పురుషుడు, స్త్రీ లేదా జంతువుతో ప్రకృతికి విరుద్ధంగా ఇంద్రియ సంబంధమైన సంభోగం చేస్తే, వారికి యావజ్జీవ జైలు శిక్ష విధించబడుతుంది [...]." అయితే, ఈ కొత్త చట్టంలో అవసరమైన నిబంధనలు లేకపోవడంతో ఇతర జెండర్‌లకు చెందినవారికి లైంగిక దాడుల నుంచి, వేధింపుల నుంచి ఎలాంటి రక్షణ లభించడం లేదు.

BNSS చట్టంగా పిలిచే భారతీయ నాగరిక్ సురక్ష (రెండవ) సంహిత చట్టం 2023, 1973 నాటి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌ ను అధిగమించింది. ఈ చట్టపరమైన మార్పుతో, పోలీసు కస్టడీకి అనుమతించే కాలాన్ని మొదట్లో ఉన్న 15 రోజుల నుండి గరిష్టంగా 90 రోజులకు పొడిగించడం ద్వారా గణనీయమైన పెడమార్గాన్ని పట్టింది. నిర్బంధ వ్యవధిని ఇలా పొడిగించటం ప్రత్యేకించి మరణ శిక్ష, జీవిత ఖైదు, లేదా కనీసం 10 సంవత్సరాల జైలు శిక్ష వంటి తీవ్రమైన నేరాలకు వర్తిస్తుంది.

అంతేకాకుండా, గోప్యత హక్కును దారుణంగా ఉల్లంఘించే విధంగా, పరిశోధనల సమయంలో ఏజెన్సీలు ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌ల వంటి డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకోవడాన్ని ఈ చట్టం అనుమతిస్తుంది.

భారతీయ సాక్ష్య (రెండవ) చట్టం , 2023, మొత్తమ్మీద 1872 నాటి భారతీయ సాక్ష్యాధారాల చట్టం నిర్మాణాన్ని కనీస సవరణలతో నిలుపుకుంది.

అటవీ (సంరక్షణ) చట్టం, 1980 ని భర్తీ చేయటం కోసం అటవీ (సంరక్షణ) సవరణ చట్టం, 2023 వచ్చింది. సవరించిన చట్టం దాని నిబంధనల ప్రకారం కొన్ని రకాల భూమికి మినహాయింపు ఇస్తుంది. ఇందులో:

"(ఎ) రైలు మార్గం లేదా ప్రభుత్వం నిర్వహించే ప్రజా రహదారి వెంట ఉన్న అటవీ భూమి, ఏదైనా నివాసానికి లేదా రైలు వెళ్ళేందుకు దారితీసే మార్గం. ఇది గరిష్టంగా 0.10 హెక్టార్లకు మించకుండా ఉండాలి;

(బి) సబ్-సెక్షన్ (1)లోని క్లాజ్ (ఎ) లేదా క్లాజ్ (బి)లో పేర్కొనని భూముల్లో పెంచిన చెట్టు, చెట్ల పెంపకం, లేదా తిరిగి అడవిని పెంచుతున్నవి; ఇంకా

(సి) అటవీ భూమి:

(i) అంతర్జాతీయ సరిహద్దులు, లేదా నియంత్రణ రేఖ, లేదా వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నవి, దేశీయ ప్రాముఖ్యం, దేశీయ భద్రతకు సంబంధించిన వ్యూహాత్మక ప్రాజెక్ట్ నిర్మాణానికి ఉపయోగించాలని ప్రతిపాదించబడిన; లేదా

(ii) భద్రతా సంబంధిత వ్యవస్థ నిర్మాణం కోసం ఉపయోగించేందుకు ప్రతిపాదించిన, పది హెక్టార్ల వరకూ భూమి; లేదా

(iii) రక్షణ సంబంధిత ప్రాజెక్ట్ లేదా పారామిలిటరీ బలగాలు లేదా ప్రజా ప్రయోజనాల ప్రాజెక్ట్‌ల కోసం ఒక శిబిరం నిర్మాణం కోసం ఉపయోగించాలని ప్రతిపాదించబడినది [...].”

ఈ సవరణలో వాతావరణ సంక్షోభం, పర్యావరణ క్షీణతకు సంబంధించిన పర్యావరణ ఆందోళనల గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం.

టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023 , డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం 2023 ( DPDP చట్టం ), బ్రాడ్‌కాస్టింగ్ సర్వీసెస్ (నియంత్రణ) బిల్లు 2023ను ఆమోదించటంతో భారతదేశ డిజిటల్ రంగంపై గణనీయమైన ప్రభావాలను కలిగి ఉండే కొన్ని శాసనపరమైన చర్యలను కూడా పార్లమెంట్ ప్రవేశపెట్టింది. ఇవి పౌరుల డిజిటల్ హక్కులు, రాజ్యాంగబద్ధంగా హామీ ఇవ్వబడిన గోప్యతా హక్కులపై ప్రభావం చూపుతాయి, ఆన్‌లైన్ కంటెంట్‌ను నియంత్రిస్తాయి, టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను ఒక నియంత్రణా పద్ధతిలో బలవంతంగా మూతపడేలా చేస్తాయి.

విపక్షాల గళం లేకపోవడంతో, టెలికమ్యూనికేషన్స్ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందిన కేవలం నాలుగు రోజులకే డిసెంబర్ 25న రాష్ట్రపతికి చేరింది. ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం, 1885 , ఇండియన్ వైర్‌లెస్ టెలిగ్రాఫీ చట్టం, 1933 ని సంస్కరించే ప్రయత్నంలో ఈ చట్టం నియంత్రణ ఫ్రేమ్‌వర్క్‌లను ఆధునీకరించడానికి ప్రయత్నిస్తుంది;

"(ఎ) [...] నిర్దిష్ట సందేశాలు లేదా నిర్దిష్ట రకాల సందేశాలను స్వీకరించడానికి వినియోగదారుల నుంచి ముందస్తు సమ్మతి;

(బి) వినియోగదారుల ముందస్తు అనుమతి లేకుండా నిర్దిష్ట సందేశాలు లేదా నిర్ధిష్ట రకాల సందేశాలను అందుకోకుండా చూసుకోవడానికి, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రిజిస్టర్‌ల తయారీ, నిర్వహణ. ఈ రిజిస్టర్‌ను "డోంట్ డిస్టర్బ్" రిజిస్టర్‌గా పిలుస్తారు; లేదా

(సి) ఈ విభాగాన్ని ఉల్లంఘిస్తున్నట్లుగా వాళ్ళు కనుగొన్న ఏదైనా మాల్‌వేర్ లేదా నిర్ధిష్ట సందేశాల గురించి నివేదించడానికి వినియోగదారులను అనుమతించే యంత్రాంగాన్ని సృష్టించడం.”

అత్యవసర పరిస్థితుల్లో నేర కార్యకలాపాలను ప్రేరేపించకుండా నిరోధించడానికి "ఏదైనా అధీకృత సంస్థ నుండి ఏదైనా టెలికమ్యూనికేషన్స్ సర్వీస్ లేదా టెలికమ్యూనికేషన్స్ నెట్‌వర్క్‌పై తాత్కాలిక నియంత్రణను" తీసుకునేందుకు ఈ చట్టం ప్రభుత్వానికి అధికారం ఇస్తుంది.

ఈ నిబంధన ప్రజా భద్రతను సంరక్షించే పేరుతో టెలికామ్ నెట్‌వర్క్‌లో కమ్యూనికేషన్‌లను పర్యవేక్షించడానికి, నియంత్రించడానికి అధికారులకు గణనీయమైన అధికారాలను అందిస్తుంది.

ప్రధాన చట్టాలలో చేసిన ఈ సంస్కరణలను దేశ హోమ్ మంత్రి ప్రకటించినట్లుగా 'పౌర-కేంద్రీకృతమైనవి'గా పిలుస్తున్నారు. ఈశాన్య ప్రాంతంలోని ఆదివాసీ సముదాయాలు - మన దేశ పౌరులు - 'వర్గీకరించని అడవులకు' దగ్గరగా నివసించేవారు, వారి జీవనోపాధిని, సంస్కృతిని, చరిత్రను కోల్పోతారు. కొత్త అటవీ సంరక్షణ (సవరణ) చట్టం ప్రకారం వారి హక్కులకు ఇకపై రక్షణ ఉండదు.

క్రిమినల్ చట్టం సవరణలు పౌరుల డిజిటల్ హక్కులతో పాటు రాజ్యాంగపరంగా హామీ ఉన్న గోప్యతా హక్కుకు కూడా భంగం కలిగిస్తాయి. ఈ చట్టాలు పౌరుల హక్కులకు, నేరానికి సంబంధించి తీసుకునే చట్టపరమైన చర్యల మధ్య సమతుల్యతను సాధించటంలో సవాళ్ళను ఎదుర్కొంటాయి. అందువల్ల ఈ సవరణలను జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.

కేంద్ర ప్రభుత్వ పరిభాషలో 'పౌర-కేంద్రీకృతం' అంటే ఏమిటో తెలుసుకోవడానికి దేశ రాజ్యాంగ ప్రధాన రూపశిల్పి, ఖచ్చితంగా ఆసక్తి కలిగి ఉంటారు.

కవర్ డిజైన్: స్వదేశ శర్మ

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

PARI Library

दीपांजलि सिंह, स्वदेशा शर्मा और सिद्धिता सोनावने की भागीदारी वाली पारी लाइब्रेरी टीम, आम अवाम के रोज़मर्रा के जीवन पर केंद्रित पारी के आर्काइव से जुड़े प्रासंगिक दस्तावेज़ों और रपटों को प्रकाशित करती है.

की अन्य स्टोरी PARI Library
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

की अन्य स्टोरी Sudhamayi Sattenapalli