అంబాపాణీ నివాసితులు ఔత్సాహిక పార్లమెంటు సభ్యులు ఒకరికో లేదా ఇద్దరికో ఆతిథ్యం ఇచ్చే అవకాశం వస్తే చాలా గొప్పగా ఆస్వాదిస్తారు; వారికి ఇంటి విసుర్రాయి ద్వారా విసిరిన తాజా పిండితో చేసిన మొక్కజొన్న భాకరీలనో లేదా సరదాగా చెట్టుపైకి దూసుకుపోయి పిల్లలు కోసుకు తెచ్చే తీపి చరోళీ పండ్లనో తినిపిస్తారు.
అయితే, చెప్పుకోదగ్గ రాజకీయ ప్రతినిధులెవ్వరూ వారిని సందర్శించలేదు - ప్రజలు మొదటిసారి వెదురు, మట్టి, పేడతో తమ ఇళ్ళను నిర్మించుకున్నప్పటి నుండి గడిచిన ఐదు దశాబ్దాలలో ఒక్కసారి కూడా అలా జరగలేదు. కఠినమైన రాళ్ళతో నిండిన సాత్పురా పర్వతాల చెల్లాచెదురు వాలుల వరుసలో ఉన్న ఈ కుగ్రామం, మోటారు వాహనాలు నడిచే సమీప రహదారి నుండి 13 కిలోమీటర్ల ఎత్తులో ఉంది.
818 మంది జనాభా (జనగణన 2011) ఉండే అంబాపాణీ గ్రామానికి రహదారి లేదు, విద్యుత్ లేదు, నీటి సరఫరా లేదు, మొబైల్ ఫోన్ నెట్వర్క్ లేదు, చౌక ధరల దుకాణం లేదు, ప్రాథమిక వైద్య కేంద్రం లేదు, అంగన్వాడీ కేంద్రం కూడా లేదు. ఇక్కడ నివాసముండేవారంతా రాష్ట్రంలో షెడ్యూల్డ్ తెగగా గుర్తింపు పొందిన పావరా ఆదివాసీ సముదాయానికి చెందినవారు. ఇక్కడి 120 కుటుంబాలలోని చాలామంది తమ వంశావళి మధ్యప్రదేశ్లో మూలాలు కలిగి ఉన్న నాలుగు లేదా ఐదు పెద్ద గోత్రాల నుండి ఉద్భవించిందని భావిస్తున్నారు. మధ్యప్రదేశ్ ఇక్కడికి ఉత్తరాన కేవలం 30 కి.మీ కాకివేటు దూరంలో ఉంది.
నెట్వర్క్ దరిచేరని ప్రాంతంలో ఉండటం వలన ఇక్కడ టెలివిజన్ సెట్లు లేదా స్మార్ట్ఫోన్లు లేవు. మహిళల మంగళసూత్రాల గురించి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన హెచ్చరికల నుంచి, రాజ్యాంగాన్ని పరిరక్షించాలన్న కాంగ్రెస్ ప్రబోధాల వరకు, 2024 లోక్సభ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన చురుకైన ఉపాఖ్యానాలు (ఎపిసోడ్లు) ఏవీ కూడా అంబాపాణీ ఓటర్లకు చేరలేదు.
ఆకర్షణీయమైన ఎన్నికల వాగ్దానం ఏమై ఉంటుందని అడిగినప్పుడు, "బహుశా ఒక రహదారి," అన్నారు ఉంగ్యా గుర్జా పావరా. 56 ఏళ్ళ ఉంగ్యా ఈ కుగ్రామంలో అసలైన స్థిరనివాసులలో ఒకరి వంశానికి చెందినవారు. దాదాపు ఒక దశాబ్దం క్రితం ఈయన తన ఇంటి కోసం ఒక స్టీల్ అల్మైరా కొనేందుకు డబ్బును ఆదా చేసినప్పుడు, నలుగురు వ్యక్తులు 75 కిలోల ఆ అల్మైరాను "ఒక స్ట్రెచర్ లాగా" ఎత్తుకుని పైకి తీసుకెళ్ళారు.
ఇక్కడికి 13 కిలోమీటర్ల దిగువన ఉన్న మొహరాళే బజారుకు తమ వ్యవసాయ ఉత్పత్తులను వీరు ద్విచక్ర వాహనాల మీద చేరవేస్తుంటారు. ఒక్కో తడవకు గరిష్టంగా ఒక్కో క్వింటాల్ చొప్పున ప్రమాదకరమైన వాలుల గుండా, ఎత్తుకుంటూ దించుకుంటూ, మూల మలుపులను దారి మళ్ళింపులను దాటుకుంటూ, జారిపోయే కంకర మీదుగా, పర్వత ప్రవాహాలను దాటుకుంటూ, అప్పుడప్పుడూ ఎదురుపడే ఎలుగుబంట్లను తప్పించుకుంటూ, కిందకు చేరవేస్తారు.
"ఏదేమైనా మరోవైపు చూస్తే, ఒక రహదారి వలన కలప అక్రమ రవాణా పెరుగుతుందేమో అనే సంగతి కూడా ఆలోచించాలి," సాలోచనగా అన్నారు ఉంగ్యా.



















