"నేను అనేకసార్లు 108 (అంబులెన్స్ సర్వీస్) కోసం కాల్ చేయటానికి ప్రయత్నించాను. ప్రతిసారీ ఆ లైన్ బిజీగా ఉండటమో లేదా అందుబాటులో లేకపోవటమో జరిగింది." గర్భాశయ సంబంధిత వ్యాధితో బాధపడుతోన్న అతని భార్య, మందులు వాడుతున్నప్పటికీ తీవ్రంగా జబ్బుపడింది. అప్పటికి చీకటిపడిపోయింది, ఆమె నొప్పులు ఎక్కువైపోయాయి. ఆమెకు ఎలాగైనా వైద్యసహాయం అందించాలని గణేశ్ పహారియా తీవ్రంగా కోరుకుంటున్నారు.

"చివరకు నేను సహాయం చేస్తాడనే ఆశతో స్థానిక మంత్రి సహాయకుడు ఒకరిని పట్టుకోగలిగాను. [ఎన్నికల] ప్రచారం సమయంలో అతను మాకు సహాయం చేస్తానని వాగ్దానం చేశాడు," గణేశ్ గుర్తుచేసుకున్నారు. అయితే, తానక్కడ లేనని చెప్పి ఆ సహాయకుడు తప్పించుకున్నాడు. "అతను మాకు సహాయం చేయకుండా తప్పుకున్నాడు."

కలవరపడిన గణేశ్ ఇంకా ఇలా చెప్పారు, "అంబులెన్స్ దొరికినట్టయితే, నేనామెను [పెద్ద నగరాలైన] బొకారోలోనో, రాంచీలోనో ఒక మంచి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళగలిగేవాడిని." అందుకు మారుగా ఆయన ఒక బంధువు వద్ద రూ. 60,000 అప్పుచేసి, తన భార్యను స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్ళాల్సివచ్చింది.

"ఎన్నికల సమయంలో వాళ్ళు - ఇది జరుగుతుంది, అది జరుగుతుంది... మేం గెలిచేందుకు సహాయపడండి - అంటూ ఎన్నో రకాల మాటలు చెపుతారు. కానీ ఆ తర్వాత, నువ్వు వాళ్ళను కలవటానికి వెళ్ళినప్పుడు వారి దగ్గర నీకోసం సమయమే ఉండదు," చెప్పారు 42 ఏళ్ళ ఆ గ్రామ పెద్ద. తన పహారియా (పహాడియా అని కూడా అంటారు) సముదాయానికి కనీస సదుపాయాలను కూడా ఈ రాజ్యం కల్పించలేదని ఆయన చెప్పారు.

పాకుర్ జిల్లా, హిరణ్‌పుర్ బ్లాక్‌లోని ఒక చిన్న కుగ్రామం ధన్‌ఘరా. ఈ గ్రామంలో పహారియా ఆదివాసీ తెగకు చెందిన 50 కుటుంబాలు నివాసముంటున్నాయి. రాజమహల్ పర్వత శ్రేణిలోని ఒక కొండ పక్కనే ఉన్న ఈ మారుమూల గ్రామానికి చేరుకోవాలంటే, పూర్తిగా పాడైపోయిన రహదారిపై ఎనిమిది కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలి.

"మా ప్రభుత్వ పాఠశాల పాడుబడిపోయింది. మేం ఒక నూతన భవనం కోసం అడిగాం, కానీ అది ఎక్కడ?" గణేశ్ అడుగుతారు. సముదాయానికి చెందిన అనేకమంది పిల్లలు బడిలో చేరకపోవటంతో, రాష్ట్రప్రభుత్వ ఆదేశాల ప్రకారం మధ్యాహ్న భోజన పథకం వీరికి వర్తించదు.

PHOTO • Ashwini Kumar Shukla
PHOTO • Ashwini Kumar Shukla

ఎడమ: ధన్‌ఘరా గ్రామ పెద్ద గణేశ్ పహాడియా. వోట్లు కావాలని వచ్చే రాజకీయనాయకులు అనేక వాగ్దానాలు చేస్తారు, కానీ ఆ తర్వాత వాటిని నెరవేర్చటంలో విఫలమవుతారని ఆయన అన్నారు. కుడి: 2024 లోక్‌సభ ఎన్నికలలో ఒక రోడ్డు వేయిస్తామని ఈ గ్రామ ప్రజలకు వాగ్దానం చేసి నెలలు గడచిపోయినా ఏమీ జరగలేదు

తమ గ్రామానికీ, పక్కనే ఉండే గ్రామానికీ మధ్య ఒక రోడ్డు కావాలని కూడా ఈ సముదాయంవారు అడిగారు. "మీరే చూడండి, ఈ రోడ్డు ఎలా ఉందో," చిన్న చిన్న రాళ్ళతో నిండివున్న కచ్చా దారిని చూపిస్తూ అన్నారు గణేశ్. గ్రామంలో ఒకే ఒక చేతి పంపు ఉన్న విషయాన్ని కూడా ఆయన ఎత్తిచూపారు. దీనివలన తమ వంతు కోసం ఎదురుచూస్తూ వరుసలో నిలుచోవాల్సిన భారం కూడా మహిళలపై పడింది. "ఆ సమయంలో మా డిమాండ్లన్నీ తీరుస్తామని మాకు వాగ్దానం చేశారు. వోట్లు అయిపోగానే, అందరూ మర్చిపోతారు!" అన్నారు గణేశ్.

హిరణ్‌పుర్ బ్లాక్‌లోని ధన్‌ఘరా గ్రామ ప్రధాన్‌ గా 42 ఏళ్ళ గణేశ్ పనిచేస్తున్నారు. ఈమధ్యనే జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికలలో, ఝార్ఖండ్‌లోని పాకుర్ జిల్లా సంథాల్ పరగణా ప్రాంతంలో నేతలు ప్రచారం చేశారనీ, కానీ సముదాయం కోసం వొరగబెట్టింది మాత్రం ఏమీ లేదనీ ఆయన అన్నారు.

ఝార్ఖండ్ శాసనసభలో ఉన్న 81 స్థానాలకు ఎన్నికలు రెండు దశల్లో జరుగుతాయి - మొదటి దశ నవంబర్ 13న; పాకుర్ వోటు వేసే రెండవ దశ నవంబర్ 20న. ఈ ఎన్నికల పోరు అధికారంలో ఉన్న ఝార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలోని ఇండియా (INDIA) కూటమికి, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్‌డిఎకి మధ్య జరుగుతోంది.

ఈ గ్రామం లిట్టిపారా నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019లో జరిగిన ఎన్నికలలో ఝార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందిన దినేశ్ విలియమ్ మరాండి 66,675 వోట్లతో గెలవగా, బిజెపికి చెందిన డానియెల్ కిస్కూకు 52,772 వోట్లు వచ్చాయి. ఈసారి జెఎమ్ఎమ్ అభ్యర్థిగా హేమల్ ముర్ము, బిజెపి అభ్యర్థిగా బాబూధన్ ముర్ములు పోటీ చేస్తున్నారు.

గతంలో చేసిన వాగ్దానాలు అనేకం ఉన్నాయి. "2022లో జరిగిన గ్రామ కౌన్సిల్ సభలో అభ్యర్థులు గ్రామంలో పెళ్ళి జరిగితే వంటపాత్రలు అందజేస్తామని వాగ్దానం చేశారు," గ్రామ నివాసి మీనా పహాడిన్ చెప్పారు. అయితే అలా చెప్పినప్పటి నుంచి ఒక్కసారి మాత్రమే అలా జరిగింది.

లోక్ సభ ఎన్నికల సమయంలో "వాళ్ళు మాకు ఒక వెయ్యి రూపాయలు ఇచ్చారు, అంతే మాయమయ్యారు. హేమంత్ [జె ఎమ్ఎమ్ కార్యకర్త] వచ్చాడు, ప్రతి మహిళకూ పురుషునికీ వెయ్యి రూపాయల చొప్పున ఇచ్చాడు, ఎన్నికలలో గెలిచాడు, ఇప్పుడు కార్యాలయంలో హాయిగా ఆనందిస్తున్నాడు," అని ఆమె చెప్పారు.

PHOTO • Ashwini Kumar Shukla
PHOTO • Ashwini Kumar Shukla

ఎడమ: మీనా పహాడిన్ ప్రతి రోజూ వంటచెరకునూ చిరోతాను సేకరించేందుకు 10-12 కిలోమీటర్ల దూరం నడుస్తారు. వాటిని ఆమె విక్రయిస్తారు. కుడి: గ్రామంలో సౌర శక్తితో నడిచే ఏకైక చేతిపంపు వద్ద నీరు నింపుకుంటున్న మహిళలు

ఝార్ఖండ్ 32 ఆదివాసీ తెగలకు ఆవాసం. వారిలో ఎక్కువమంది  ప్రత్యేకించి దుర్బలమైన ఆదివాసీ సమూహాలైన అసుర్, బిర్‌హోర్, బిర్జియా, కొర్వా, మల్ పహారియా, పహారియా, సౌరియా పహారియా, సవర్ వంటి తెగలకు చెందినవారు. 2013 నాటి ఈ నివేదిక ప్రకారం, ఝార్ఖండ్‌లో మొత్తం పివిటిజి జనాభా నాలుగు లక్షలకు పైగా ఉంటుంది.

వారి కొద్దిపాటి జనసంఖ్యలు, అక్కడక్కడా విసిరేసినట్లుండే గ్రామాలు వారిలో ఉండే తక్కువ అక్షరాస్యత, ఆర్థిక సవాళ్ళు, పురాతన వ్యవసాయ సాంకేతికతపై ఆధారపడటం వంటివాటితో సరిపోలుతున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా ఇదేమీ పెద్దగా మారలేదు. చదవండి: పి. సాయినాథ్‌ రచించిన Everybody loves a good drought పుస్తకం నుండి సంగ్రహించిన The hills of hardship .

" గాఁవ్ మే జ్యాదాతర్ లోగ్ మజ్దూరీ హీ కర్తా హై, సర్వీస్ మే తో నహీ హై కోయీ. ఔర్ యహాఁ ధాన్ కా ఖేత్ భీ నహీ హై. ఖాళీ పహాడ్ పహాడ్ హై [గ్రామ ప్రజల్లో ఎక్కువమంది శ్రామికులుగానే పనిచేస్తారు; ఇక్కడ ఎవరూ సర్వీస్ (ప్రభుత్వ ఉద్యోగాలు)లో లేరు. మాకిక్కడ వరిపొలాలు కూడా లేవు, ఎక్కడ చూసినా మొత్తం కొండలే," గణేశ్ PARIతో చెప్పారు. మహిళలు అడవికి వెళ్ళి కట్టెలను, చిరోతా [స్వెర్టియా]ను సేకరించి మార్కెట్‌లో అమ్ముతారు.

పహారియా (పహాడియా అని కూడా అంటారు) తెగవారు ఝార్ఖండ్‌లోని సంథాల్ పరగణా ప్రాంతంలో చాలా ముందునుంచీ జీవనం సాగిస్తున్నవారు. వారు మూడు శాఖాలుగా విభజించి ఉన్నారు: సౌరియా పహారియా, మల్ పహారియా, కుమార్‌భాగ్ పహారియా. ఈ మూడు శాఖలూ కూడా కొన్ని శతాబ్దాలుగా రాజ్‌మహల్ కొండలలో నివసిస్తున్నారు.

వీరు, బిసిఇ(BCE) 302లో చంద్రగుప్త మౌర్యుని పాలనా సమయంలో భారతదేశానికి వచ్చిన గ్రీకు దౌత్యవేత్త, చరిత్రకారుడు మెగస్తనీస్ పేర్కొన్న మాలీ తెగకు చెందిన వారని చారిత్రక రికార్డులు సూచిస్తున్నట్టుగా ఈ పత్రిక పేర్కొంది. వారి చరిత్ర అంతా సంథాలులతో, బ్రిటిష్ వలస పాలనతో సంఘర్షణలతో సహా పోరాటాలతో నిండివుంది. ఈ పోరాటాలు వారిని వారి పూర్వీకుల మైదానాల నుండి బలవంతంగా నిర్వాసితులను చేసి కొండలలోకి నెట్టివేశాయి. వారిపై బందిపోట్లు, పశువుల దొంగలు అని ముద్ర వేశారు

“ఒక సముదాయంగా పహారియాలు అణచివేతకు గురయ్యారు. వారు గతంలో సంథాలులతో, బ్రిటిష్‌వారితో చేసిన పోరాటాలలో భారీగా నష్టపోయారు, వారింక ఆ అఘాతం నుండి కోలుకోలేదు," అని జార్ఖండ్‌లోని దుమ్కాలో ఉన్న సిదో-కాన్హూ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తోన్న డాక్టర్ కుమార్ రాకేష్ ఈ నివేదిక లో రాశారు.

PHOTO • Ashwini Kumar Shukla
PHOTO • Ashwini Kumar Shukla

ఎడమ: మీనా ఇంటిపక్కనే పేర్చివున్న కట్టెల పోగు. అందులో కొన్ని కట్టెలను వంటచేసుకోవటానికి ఉపయోగిస్తారు, మరి కొన్నిటిని అమ్ముతారు. కుడి: అడవినుంచి సేకరించిన చిరోతాను ఎండబెట్టిన తర్వాత సమీపంలో ఉండే మార్కెట్లలో కిలోగ్రాము 20 రూపాయలకు అమ్ముతారు

*****

తేలికపాటి శీతాకాలపు ఎండలో పిల్లలు ఆడుకుంటున్న శబ్దాలు, మేకల అరుపులు, అప్పుడప్పుడూ కోడికూతలు ధన్‌గరా గ్రామంలో వినవస్తుంటాయి.

మీనా పహాడిన్ తన ఇంటి బయట కొందరు మహిళలతో తమ సొంత మాల్తో భాషలో మాట్లాడుతున్నారు. "మేము జుగ్‌బాసీలం. అంటే ఏమిటో మీకు తెలుసా?" ఆమె ఈ రిపోర్టర్‌ను అడిగారు. "అంటే ఈ పర్వతాలు, అడవి మా నివాసమని అర్థం," వివరించారామె.

ప్రతిరోజూ ఆమె ఇతర మహిళలతో కలిసి పొద్దున్నే 8 లేదా 9 గంటలకల్లా అడవికి బయలుదేరతారు, మధ్యాహ్నానికి తిరిగివస్తారు. "అడవిలో చిరోతా ఉంటుంది; దాని సేకరణలోనే మేం రోజంతా గడుపుతాం. తర్వాత దాన్ని ఎండబెట్టి అమ్మడానికి తీసుకువెళ్తాం," మట్టితో కట్టిన తన ఇంటిముందు ఎండబెట్టిన కొమ్మలవైపు చూపిస్తూ చెప్పారామె.

"కొన్నిసార్లు మాకు రోజులో ఒక కిలో దొరుకుతుంది, కొన్నిసార్లు మూడు, ఒకోసారి అదృష్టముంటే ఐదు కిలోలు కూడా దొరుకుతుంది. ఇది చాలా కష్టమైన పని," చెప్పారామె. చిరోతా కిలో ఒక్కింటికి 20 రూపాయల చొప్పున అమ్ముడవుతుంది. చిరోతా లో అనేక ఔషధ గుణాలున్నాయి, జనం దాన్ని కషాయంగా చేసుకొని తాగుతారు. "పెద్దలు, పిల్లలు - ఎవరైనా దీన్ని తాగొచ్చు. అది కడుపుకు చాలా మంచిది," అన్నారు మీనా.

ప్రతిరోజూ అడవికి వెళ్ళిరావడానికి 10-12 కిలోమీటర్ల దూరం నడిచే మీనా, చిరోతా తో పాటు కట్టెలను కూడా సేకరిస్తారు. "కట్టెల మోపులు చాలా బరువుంటాయి, అయినా ఒక్కో మోపు కేవలం 100 రూపాయలకే అమ్ముడవుతుంది," చెప్పారామె. ఎండిన కట్టెల మోపులు 15-20 కిలోగ్రాముల బరువుంటాయి, కానీ కట్టెలు పచ్చిగా ఉంటే అవి 25-30 కిలోల బరువుంటాయి.

ప్రభుత్వం వాగ్దానాలు చేయటమే తప్ప వాటిని ఎన్నడూ నెరవేర్చదనే గణేశ్ అభిప్రాయంతో మీనా ఏకీభవించారు. "ఇంతకుముందు, ఎవరూ మా దగ్గరకు వచ్చేవారు కూడా కాదు, కానీ గత రెండేళ్ళుగా జనం రావటం మొదలెట్టారు," అన్నారామె. "అనేకమంది ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు మారిపోయారు కానీ మా పరిస్థితి మాత్రం ఏమీ మారలేదు. మాకు దక్కిందల్లా విద్యుత్తు, రేషన్లు మాత్రమే."

"ఉన్న ప్రదేశం నుంచి వెళ్ళగొట్టబడటం, నిర్వాసితులు కావటమనేది ఝార్ఖండ్ ఆదివాసులు ఇప్పటికీ ఎదుర్కొంటున్న సమస్యలుగానే ఉన్నాయి. ప్రధాన స్రవంతి అభివృద్ధి కార్యక్రమాలు ఈ సమూహపు సామాజిక-సాంస్కృతిక విశిష్టతను గుర్తించడంలో విఫలమయ్యాయి, 'అందరికీ ఒకే చెప్పుల సైజు సరిపోతుంది' అనే విధానాన్ని అనుసరించాయి,” అని రాష్ట్రంలోని ఆదివాసీ జీవనోపాధులపై వచ్చిన ఈ 2021 నివేదిక పేర్కొంది.

PHOTO • Ashwini Kumar Shukla
PHOTO • Ashwini Kumar Shukla

పహారియా ఆదివాసుల సంఖ్య తక్కువగా ఉండటం, వారు మరింత మారుమూలగా ఉండేందుకు తోడ్పడింది, వాళ్ళు రోజువారీ ఆర్థిక సవాళ్ళను ఎదుర్కొంటూనే ఉన్నారు. గత కొన్ని దశాబ్దాలలో మారిందేమీ పెద్దగా లేదు. కుడి: ధన్‌ఘరాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల. కొన్నేళ్ళుగా కొత్త బడి కట్టిస్తామని రాజకీయ నాయకులు వాగ్దానాలు చేస్తున్నప్పటికీ, ఆ వాగ్దానాన్నెప్పుడూ నిలుపుకోలేదని గ్రామవాసులు చెప్పారు

"పనులేమీ లేవు! అసలు పనులు లేవంతే. అందుకే మేం బయటకు పోవాల్సివస్తోంది," వలసపోయిన 250-300 మంది ప్రజల గురించి మాట్లాడుతూ అన్నారు మీనా. "బయటకు వెళ్ళటమంటే చాలా కష్టం; చేరుకోవటానికి మూడు నుంచి నాలుగు రోజులు పడుతుంది. ఇక్కడే పనులు ఉండివుంటే, ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు మేం వెంటనే తిరిగిరాగలుగుతాం."

పహారియా సముదాయంవారు, డాకియా యోజన కింద ప్రతి కుటుంబానికి 35 కిలోల రేషన్‌ను వారి ఇంటి వద్దనే పొందేందుకు అర్హులు. అయితే, 12 మంది సభ్యులతో కూడిన తన కుటుంబానికి ఇది సరిపోదని మీనా అన్నారు. "ఒక చిన్న కుటుంబానికి సరిపోవచ్చు, కానీ మాకు ఇది 10 రోజులక్కూడా రాదు," అన్నారామె

తన గ్రామ పరిస్థితులను గురించి చెప్తూ, పేదల పాట్లను పట్టించుకునేవారెవరూ లేరని ఆమె అన్నారు. "మాకు ఇక్కడ కనీసం ఒక అంగన్‌వాడీ కూడా లేదు," అని మీనా పేర్కొన్నారు. దేశీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం, ఆరు నెలల నుండి ఆరు సంవత్సరాల వయస్సు గల పిల్లలు, గర్భిణులు అంగన్‌వాడీల ద్వారా అనుబంధ పౌష్టికాహారం పొందేందుకు అర్హులు.

మీనా తన చేతిని నడుము వరకూ పైకెత్తి చూపిస్తూ, “ఇతర గ్రామాలలో, ఇంత ఎత్తులో ఉన్న పిల్లలకు సత్తు , చిక్కుళ్ళు, అన్నం, పప్పు... వంటి పౌష్టికాహార లభిస్తోంది, కానీ మాకు అవేవీ లభించవు,” అన్నారు. "పోలీయో చుక్కలు మాత్రమే," అంటూ ఆమె, “రెండు గ్రామాలకూ కలిపి ఒక అంగన్‌వాడీ ఉంది, కానీ వారు మాకు ఏమీ ఇవ్వరు," అన్నారు.

ఇంతకీ గణేశ్ తన భార్య వైద్య ఖర్చుల కోసం చేసిన అప్పు రూ. 60,000, వడ్డీతో సహా అలా మిగిలే ఉంది. “ కా కహే కైసే, దేంగే, అబ్ కిసీ సే లియే హై తో దేంగే హై... థోడా థోడా కర్ కే చుకాయేంగే, కిసీ తరహ్ [ఎలా తీరుస్తానో నాకు తెలియదు. నేను ఒకరి నుండి అప్పు తీసుకున్నాను కాబట్టి ఎలాగైనా దాన్ని తిరిగి చెల్లించాల్సిందే,”] అని ఆయన ఈ రిపోర్టర్‌తో చెప్పారు

"మేం ఎవరి దగ్గరనించీ ఏమీ తీసుకోం. మేం ఎప్పుడూ వేసేవాళ్ళకే వోటు కూడా వెయ్యం; మాకు నిజంగా ప్రయోజనకారిగా ఉండేవారికే వోటేస్తాం." ఈ ఎన్నికల గురించి మీనా దృఢంగా నిశ్చయించుకున్నారు.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Ashwini Kumar Shukla

Ashwini Kumar Shukla is a freelance journalist based in Jharkhand and a graduate of the Indian Institute of Mass Communication (2018-2019), New Delhi. He is a PARI-MMF fellow for 2023.

Other stories by Ashwini Kumar Shukla
Editor : Priti David

Priti David is the Executive Editor of PARI. She writes on forests, Adivasis and livelihoods. Priti also leads the Education section of PARI and works with schools and colleges to bring rural issues into the classroom and curriculum.

Other stories by Priti David
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli