మధ్యాహ్నమవుతోంది. చక్కగా తయారైవున్న నర్తకి గొలాపి గోయరి, ఇంట్లో వేచి ఉన్నారు. బడి ఈడు అమ్మాయిలు ఎనిమిది మంది ఆమె దగ్గరకు వచ్చినప్పుడు ఆమె తన దేహానికి చుట్టుకొన్న పసుపు చారల దొఖోనా ను సర్దుకుంటున్నారు. ఆ అమ్మాయిలంతా అస్సామ్‌లోని బోడో సముదాయానికి చెందిన సంప్రదాయక దొఖోనాల ను, ఎరుపు రంగు అర్నాయి (స్టోల్స్)లను ధరించారు.

"నేను ఈ చిన్నపాపలకు మా బోడో నృత్యాలను నేర్పుతున్నాను," అని బోడో సముదాయానికే చెందిన గొలాపి చెప్పారు. ఆమె బక్సా జిల్లా, గోల్‌గాఁవ్ గ్రామంలో నివసిస్తున్నారు.

బోడోలాండ్‌లోని బక్సాతోపాటు కోక్రాఝర్, ఉదాల్‌గురి, చిరంగ్ జిల్లాలను అధికారికంగా బోడోలాండ్ టెరిటోరియల్ రీజియన్ (బిటిఆర్) అంటారు. స్వయంప్రతిపత్తి కలిగిన ఈ ప్రాంతంలో ఇతర మూలవాసులతో పాటు ప్రధానంగా అస్సామ్‌లో షెడ్యూల్డ్ తెగగా జాబితా చేసిన బోడో ప్రజలు నివసిస్తారు. బిటిఆర్ భూటాన్, అరుణాచల్ ప్రదేశ్ పర్వత పాదాల దిగువన, బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉంది.

"వారు స్థానికంగా జరిగే పండుగలు, కార్యక్రమాలలో కూడా ప్రదర్శనలు ఇస్తారు," అని ముప్ఫై ఏళ్ళు నిండిన గొలాపి చెప్పారు. 2022 నవంబర్‌లో ఉపేంద్ర నాథ్ బ్రహ్మ ట్రస్ట్ (UNBT) ద్వారా 19వ యుఎన్ బ్రహ్మ సోల్జర్ ఆఫ్ హ్యుమానిటీ అవార్డును పొందిన PARI వ్యవస్థాపక సంపాదకుడు, పాత్రికేయుడు పి. సాయినాథ్ గౌరవార్థం ఒక ప్రదర్శనను నిర్వహించడానికి ఆమె తన ఇంటిని ఇచ్చారు.

బోడో సముదాయానికి చెందిన నృత్యకారులు, స్థానిక సంగీతకారులు ప్రదర్శన ఇస్తోన్న వీడియోను చూడండి

ఈ ప్రదర్శన కోసం నృత్యకారులు సిద్ధపడుతుండగా, గోబర్ధన బ్లాక్‌కు చెందిన స్థానిక సంగీతకారులు గొలాపి ఇంటి వద్ద ఏర్పాట్లు చేయడం ప్రారంభించారు. ప్రతి ఒక్కరు ఖోత్ గోస్‌లా జాకెట్‌తో పాటు ఆకుపచ్చ, పసుపు రంగుల అర్నాయిలు లేదా మఫ్లర్‌లను తమ తల చుట్టూ ధరించారు. సాధారణంగా బోడో పురుషులు ఈ దుస్తులను సాంస్కృతిక, లేదా మతపరమైన పండుగల సమయంలో ధరిస్తారు.

సాధారణంగా బోడో పండుగల సమయంలో వాయించే తమ వాయిద్యాలను వారు బయటకు తీశారు: సిఫుంగ్ (పొడవైన పిల్లంగోవి), ఖామ్ (డోలు), సెర్జా (వాయులీనం). అర్నాయి లతో అలంకరించిన ప్రతి వాయిద్యం, సంప్రదాయ 'బొందురామ్' డిజైన్‌తో స్థానికంగా రూపొందించినది.

సంగీత విద్వాంసుల్లో ఒకరైన, ఖామ్‌ ను వాయించే ఖురుందావొ బసుమతారీ అక్కడ చేరిన స్థానిక ప్రేక్షకుల చిన్న గుంపును ఉద్దేశించి ప్రసంగించారు. తాను సుబొన్‌ శ్రీ, బాగురుంబా నృత్యాలను ప్రదర్శిస్తానని ఆయన వారికి తెలియజేశారు. “ బాగురుంబా ను సాధారణంగా వసంత ఋతువులో పంటల సాగు సమయంలో, లేదా పంట కోతల తర్వాత, బయిసాగు పండుగ సమయంలో ప్రదర్శిస్తారు. వివాహాల సమయంలో కూడా దీనిని ఆనందంతో ప్రదర్శిస్తారు.”

రంజిత్ బసుమతారీ సెర్జా (వాయులీనం) వాదనను చూడండి

నృత్యకారులు వేదికపైకి రాగానే, రంజిత్ బసుమతారీ ముందుకు వచ్చాడు. తానొక్కడే చేసిన సెర్జా వాదనతో ఆ ప్రదర్శనను ముగించాడు. ఒక ఆదాయ వనరుగా వివాహాలలో కూడా వాయులీన వాదనం చేసే అతికొద్ది మంది ప్రదర్శనకారులలో అతను కూడా ఒకరు. ఈ సమయంలోనే గొలాపి తన అతిథులకోసం ఉదయం అంతా కష్టపడి తయారుచేసిన ఆహారాన్ని సిద్ధంచేయడానికి అక్కడి నుంచి జారుకున్నారు.

ఆమె సొబాయ్ జమ్ సమో (నత్తలతో కలిపి వండిన మినపపప్పు), వేయించిన భంగున్ చేపలు, ఒన్లా జమ్ దావో బెదొర్ (బియ్యంపిండితో చేసే కోడి కూర), అరటి పువ్వు, పంది మాంసం, జనుము ఆకులు, బియ్యపు సారాయి, పక్షి కన్ను మిరప వంటి వంటకాలను బల్లపై పరిచారు. ఆ ముందు రోజు నుండి ఆకర్షణీయమైన ప్రదర్శనలను చూసిన తర్వాత ఆనందించే విందు ఇది.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Himanshu Chutia Saikia

Himanshu Chutia Saikia is an independent documentary filmmaker, music producer, photographer and student activist based in Jorhat, Assam. He is a 2021 PARI Fellow.

Other stories by Himanshu Chutia Saikia
Text Editor : Riya Behl

Riya Behl is Senior Assistant Editor at People’s Archive of Rural India (PARI). As a multimedia journalist, she writes on gender and education. Riya also works closely with students who report for PARI, and with educators to bring PARI stories into the classroom.

Other stories by Riya Behl
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli