"వాన మళ్ళ ఆగిపోయింది," అనుకుంటా ధర్మ గారెల్ చేతికట్టే సాయంతో తన పొలం దిక్కుకు నడుస్తున్నడు. “జూన్ ఒక ఇచ్చంత్రమైన నెలగా మారింది. రోజు 2-3 గంటల దాకా వాన పడుతది. అది కొన్నిమాట్లా పేసరుకాయ డళ్లుల్లెక్క పడితే, కొన్నిమాట్లా భారీగా ఇసిరి ఇసిరి కొడతది. అయితే ఇంతగనం వాన దంచినా కొన్ని గంటలకల్లా మళ్ళా వశంగాని వేడి ఉంటది. అప్పుడు ఆ వేడి భూమిలోని తేమ పీర్శకపోతది. దాంతోని నేల మళ్ల పొడిగా మారిపోద్ది. గిట్ల అయితాంటే మొలకలు ఎట్ల పెరుగుతయి?"
గారెల్‌పాడు, థానే జిల్లాలోని షాహాపూర్ తాలూకాలో 15 వార్లీ కుటుంబాలకు చెందిన ఆదివాసీ గ్రామం. ఆ గ్రామంల ఎనభై ఏళ్ల గారెల్ ఇంకా అతని కుటుంబం, తమకున్న ఎకరం పొలంల వరి సాగు చేసెటోల్లు. 2019 జూన్‌ల ఆళ్ళు నాటేసిన వరి పంట పూర్తిగా ఎండిపోయింది. ఆ నెలలో, 11 రోజులకు కేవలం 393 మి.మీ (సగటున 421.9 మి.మీ కంటే తక్కువ) వాన మాత్రమే పడ్డది.
వాళ్ళు అలుకుడు చేసిన వరి కూడా మొలకెత్తనే లేదు - కానీ దగ్గరదగ్గరా రూ. 10,000 దాకా నష్టపోయినరు. విత్తనాలు, ఎరువులు, ఒక ట్రాక్టర్ కిరాయి, ఇతర సాగు ఖర్చులు కలిపి అంత అయినయి.
"ఆగస్టులో మాత్రమే సాధారణ వర్షపాతంతో భూమి చల్లబడటం సురువు అయింది. రెండోతాప విత్తునాలు అలుకుతే నన్న మల్ల పంట పండుతుందని, కొంత ఫాయిదా ఉంటదని నేను ఖచ్చితంగా అనకున్న,” అని 38 ఏళ్ల ధర్మ కొడుకు, రాజు అన్నడు.
ఆ వర్షాభావ జూన్ తర్వాత, జూలైలో, ఆ తాలూకాలో చానా వర్షం (1586.8 మి.మీ) పడింది - ఆడ సాధారణ వర్షపాతం 947.3 మి.మీ. దీనితోటి, గారెల్ కుటుంబం ఆ రెండో పంట మీద ఆధారపడ్డది. కానీ ఆగస్టు నాటికి వానా చానా తీవ్రంగా మారింది - అది అక్టోబర్ దాకా అట్లనే పడ్డది. థానే జిల్లాలోని ఏడు తాలూకాలలో 116 రోజుల్లో దాదాపు 1,200 మిల్లీమీటర్ల అధిక వర్షపాతం నమోదైంది.
“మొక్కలు పెరిగేతందుకు సెప్టెంబర్ వరకు తగినంత వర్షం పడ్డది. మనుషులమే కడుపు పగిలిపోయే దాకా తినము. అసోంటిది చిన్న చిన్న మొలకలు ఎక్కువ నీళ్ళు ఎందుకు కోరుకుంటయి.?”, అని రాజు అంటడు. అక్టోబరులో కురిసిన వానలు, గారెల్ కుటుంబ పొలాన్ని ముంచెత్తినయి. "మేము సెప్టెంబర్ చివరి వారంల వరిని కోసి కట్టలుగా కట్టి, పేరుసుడు మొదలుపెట్టినము," అని 35 ఏళ్ల రైతు అయిన సవిత యాదికి చేసుకున్నది. ఈమె రాజు భార్య. “మేము ఇంకా మిగిలిన పంటను కోయవలసి ఉండే. అక్టోబర్ 5 తర్వాత ఆదాటున భారీ వర్షం కురిశింది. పేర్చిన పంటలను వీలైనంత వరకు ఇంట్లకు తీసుకపోయేటందుకు ప్రయత్నం చేసినం. కానీ నిమిషాల వ్యవధిలోనే మా పొలం ముంపుకు గురైంది…”
ఆగస్ట్‌లో ఏసిన రెండవ పంట నుండి, గారెల్ 3 క్వింటాళ్ల వరిని కాపాడుకోగలిగారు - ఇదివరకు అయితే వాళ్ళు ఒక్కో పంటకు 8-9 క్వింటాళ్ల దాకా పండించేటోళ్ళు.












