దేవూ భోరే గత 30 ఏళ్ళుగా తాళ్ళను తయారుచేస్తున్నారు. బలహీనంగా ఉండే దూది పోగులను మరింత సాగే గుణం కలిగిన దారాల నుండి వేరు చేయడం. ఒక్కొక్కటి 1.5-2 కిలోల బరువున్న నూలు కట్టలను తయారుచేయడానికి, తన ఇంట్లో నేల మీద నుంచి దాదాపు తొమ్మిది అడుగుల ఎత్తులో ఉన్న పైకప్పుకు బిగించి ఉన్న కొక్కేనికి ఆ దారాలను సాగదీసి కట్టడం. ఏడు గంటల్లో అలాంటి 10 కట్టలను, ఇలా వారానికి మూడుసార్లు తయారుచేయడం.

పత్తి అయితే కుటుంబ వ్యాపారంలోకి ఆలస్యంగా ప్రవేశించింది. అయితే కొన్ని తరాలపాటు అతని కుటుంబం కిత్తనార మొక్క నుండి తాళ్ళు తయారుచేసింది. అదింక కుదరకపోవడం వలన వాళ్ళు పత్తికి మారారు. నైలాన్ తాళ్ళ విస్తరణతో ఇప్పుడు అది కూడా ఒక సతాయించే వృత్తి అయిపోయింది.

దేవూ చిన్నతనంలో, మరాఠీలో ఘాయ్‌పాత్ అనీ, స్థానికంగా ఫడ్ అని కూడా పిలిచే కిత్తనార మొక్కలను సేకరించడానికి అతని తండ్రి మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు గ్రామాల సమీపంలోని అడవులకు, 10 కిలోమీటర్ల దూరం నడిచివెళ్ళేవారు. అతను తిరిగి వచ్చేటపుడు సుమారు 15 కిలోల బరువుతో వచ్చేవారు. ఆకులకున్న ముళ్ళ అంచులను తీసేసి వారం రోజుల పాటు నీళ్ళలో ఊరబెట్టి, ఆ పైన రెండు రోజులు ఆరబెట్టేవారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత తాడు తయారీకి రెండు కిలోల పీచు లభిస్తుంది. దేవూ తల్లి మైనాబాయి కూడా ఈ పని చేసేవారు. అప్పటికి పదేళ్ళ వయసున్న దేవూ ఈ పనిలో పాలుపంచుకునేవాడు.

1990ల ప్రారంభంలో భోరేలు, ఇంకా ఇతర కుటుంబాలు కిత్తనార పీచుకు బదులుగా పత్తి నూలును ఉపయోగించడం ప్రారంభించారు - పత్తి ఎక్కువ కాలం మన్నుతుంది. అంతేకాకుండా, “జనం అడవులను నరికివేశారు. ఫడ్ కంటే నూలును ఉపయోగించడం సులభం (కిత్తలి మొక్కను ఎక్కువసేపు నీటిలో నానబెట్టడం, ఎండబెట్టడం వల్ల)." అంటారు దేవూ.

1990ల చివరి వరకు, అతని గ్రామంలో దాదాపు 100 కుటుంబాలు తాళ్ళను తయారుచేసేవని దేవూ అంచనా వేస్తున్నారు. దేవూ బెళగావ్ జిల్లా చికోడి తాలూకా బోరగావ్ గ్రామంలో నివసిస్తున్నారు. చౌకైన నైలాన్ తాళ్ళు రావడంతో రాబడి తగ్గడం మొదలయింది. దీంతో చాలామంది సమీప గ్రామాలలో వ్యవసాయ పనుల వైపు మొగ్గు చూపారు, లేదా సమీపంలోని ఇచల్‌కరంజి, కాగల్ పట్టణాల్లోని మరమగ్గాలపై పనిచేయడానికి, లేదా ఆటో విడిభాగాల వర్క్‌షాప్‌లలోనూ, ఇతర కర్మాగారాలలోనూ పనులు చేసేందుకు వెళ్ళారు.

PHOTO • Sanket Jain

బోరగావ్ గ్రామంలోని భోరే కుటుంబంలో ఇప్పుడు తాళ్ళు తయారుచేస్తూ కష్టపడుతున్నది ముగ్గురు సభ్యులు మాత్రమే - దేవూ, అతని భార్య నందుబాయి, వారి కుమారుడు అమిత్

ఈ గ్రామంలోని భోరే కుటుంబంలో ఇప్పుడు తాళ్ళు తయారుచేస్తూ కష్టపడుతున్నది ముగ్గురు సభ్యులు మాత్రమే - దేవూ, అతని భార్య నందుబాయి, వారి పెద్ద కుమారుడు అమిత్. అమిత్ భార్య సవిత టైలరింగ్ పని చేస్తుంది. చిన్న కొడుకు భరత్ (25) కాగల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో కార్మికుడిగా ఉండగా, ఇద్దరు వివాహిత కుమార్తెలు మాలన్, శాలన్‌లు గృహిణులు.

"శతాబ్దాలుగా, మా కులం మాత్రమే తాళ్ళు తయారుచేస్తోంది" అని 58 ఏళ్ళ దేవూ చెప్పారు. ఆయన షెడ్యూల్డ్ కులమైన మాతంగ్ సముదాయానికి చెందినవారు. "నేను మా పూర్వీకుల కళారూపాన్ని సజీవంగా ఉంచాను." తాళ్ళు తయారుచేసే తన కుటుంబంలో దేవూ నాల్గవ తరానికి చెందినవారు. అతను 2వ తరగతి వరకు చదివాడు, కానీ అతని తల్లితండ్రులకు అతనిని మరింత చదివించే స్తోమత లేదు. రోజులో మూడు గంటలు వారికున్న నాలుగు ఆవులకు పాలు తీసేపని చేయటం వల్ల పాఠశాలకు వెళ్ళే సమయం దొరకడం కూడా దేవూకు కష్టమైంది.

కుటుంబ వృత్తిని చేపట్టడానికి ముందు, దేవూ ఇచల్‌కరంజిలో 10 సంవత్సరాల పాటు ఇళ్ళకు రంగులేసే పనిని చేశారు. కుటుంబానికి చెందిన ఒక ఎకరం పొలంలో వర్షంపై ఆధారపడి వేరుశనగ, సోయాబీన్, కూరగాయలను అడపాదడపా సాగు చేసేవారు. ఇది జరిగిన ఆరేళ్ల తర్వాత, దేవూ తన 28వ ఏట తాళ్ళ తయారీలో తన తండ్రి కృష్ణ భోరేతో చేరారు.

దేవూ ఇప్పుడు పత్తి నూలును ఇచల్‌కరంజిలో (బోరగావ్ నుండి 15 కిలోమీటర్లు) క్వింటాల్‌కు 3,800 రూపాయలకు కొంటున్నారు. భోరే కుటుంబం ప్రతి రెండు వారాలకు ఒక క్వింటాల్ (100 కిలోలు) పత్తి నూలును ఉపయోగించి ఒక్కొక్కటి పన్నెండు అడుగుల పొడవు, 550 గ్రాముల బరువు కలిగిన 150 తాళ్ళను, మరికొన్ని చిన్న తాళ్ళను కూడా తయారుచేస్తుంది.

అతను వారానికి మూడు రోజులు నూలును తయారుచేస్తారు. మిగిలిన రోజుల్లో ఆయన ఆర్.కె. నగర్‌లోని తన ఇంటి వెలుపల ఉన్న మట్టి రోడ్డు పక్కన 120 అడుగుల పొడవున నూలును సాగదీస్తారు. తాడుకు ఒక చివరన అమిత్ నడిపించే ఒక యంత్రం ఉంటుంది. దానికి ఆరు చిన్న కొక్కేలు కట్టి ఉంటాయి. మరొక చివర నందుబాయి భోర్ ఖడీ లేదా టి(T)-ఆకారపు తులాదండంతో కూర్చుని ఉంటారు. దానికి కూడా నూలు కట్టలు కట్టివుంటాయి.

మరొక తులాదండాన్ని తిప్పినప్పుడు అది కొక్కేన్ని గుండ్రంగా తిప్పి, నూలును మెలిపెడుతుంది. దేవూ నూలు కట్టల మధ్య ఒక చెక్క కార్లా లేదా 'టాప్'ని ఉంచి, దానిని ఆ నూలు మొత్తం పొడవునా కదిలిస్తారు. దాంతో అవి గట్టిగా, సమానంగా మెలితిరుగుతాయి. ఈ మెలితిరగడం దాదాపు 30 నిమిషాలు పడుతుంది, ఇంకా ఇందుకు ముగ్గురు వ్యక్తుల శ్రమ అవసరం. ఇదంతా పూర్తయిన తర్వాత, ఈ నూలు తాడులా పేనడానికి సిద్ధంగా ఉంటుంది.

PHOTO • Sanket Jain

‘మేం కష్టపడి పనిచేస్తాం, కానీ సంపాదించలేం. జనం ఈ తాళ్ళను మా దగ్గర కాకుండా, పట్టణాల్లోని హార్డ్‌వేర్ దుకాణాల్లో కొంటారు'. రోడ్డు పక్కన అమ్మే తాళ్ళ కంటే దుకాణాల్లోని తాళ్ళు మంచివని వాళ్ళు నమ్ముతారు

కొన్నిసార్లు, ఆర్డర్‌ను బట్టి, దేవూ తాడును తయారుచేయడానికి ముందు నూలుపోగులకు రంగులు వేస్తారు. రంగు పొడిని – 250 గ్రాముల ధర రూ. 260 - కొనుగోలు చేయడానికి అతను నెలకు రెండుసార్లు మహారాష్ట్రలోని మిరాజ్ పట్టణానికి బస్సులో 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించి వెళ్తారు. ఆ రంగుపొడిని ఐదు లీటర్ల నీటిలో కలిపి, దానిలో నూలును ముంచుతారు. తడి నూలు ఎండటానికి సుమారు రెండు గంటలు పడుతుంది.

దేవూ కుటుంబం రైతుల కోసం రెండు రకాల తాళ్ళను తయారుచేస్తుంది: ఎద్దు మెడలో కట్టే మూడు అడుగుల పొడవైన కండా , నాగలికి కట్టే 12 అడుగుల పొడవైన కాసరా . కాసరా ను పండించిన పంటలను మోపులు కట్టడానికీ, కొన్ని ఇళ్ళల్లో శిశువుల కోసం పైకప్పు నుంచి ఊయల కట్టడానికీ కూడా ఉపయోగిస్తారు. భోరేలు ఈ తాళ్ళను కర్ణాటకలోని సోందల్గా, కరాద్గా, అక్కోళ్, భోజ్, గళతగా గ్రామాలలోనూ, మహారాష్ట్రలోని కురుంద్‌వాడ్‌లోని వారపు మార్కెట్లలోనూ విక్రయిస్తారు. రంగులు వేసిన కాసరా తాళ్ళ జత రూ. 100, రంగువేయని తాళ్ళ జత రూ. 80; అదేవిధంగా, రంగులు వేసిన కండా జత రూ. 50, రంగువేయని జత రూ. 30కి అమ్ముతారు.

"మాకు దీని నుండి పెద్ద సంపాదనేమీ ఉండదు," అని 30 ఏళ్ల అమిత్ చెప్పారు. భోరేలు ప్రతి రోజూ చేసే ఎనిమిది గంటల పనికి సగటున ఒక్కొక్కరికి రూ. 100 - నెలవారీ కుటుంబ ఆదాయం కేవలం రూ. 9,000 - సంపాదిస్తారు. "ఏటా బేందరా లేదా పోళ్యా పండుగ (జూన్-ఆగస్టులో, ఎద్దులకు అంకితం చేసిన పండుగ) సమయంలో రంగుల తాళ్ళకు చాలా డిమాండ్ ఉంటుంది" అని దేవూ చెప్పారు. అతనికి తన కుటుంబం మొత్తానికీ కలిపి ఉన్న ఒక ఎకరం భూమి (సమష్టిగా నలుగురు సోదరుల స్వంతం) నుండి రూ. 10,000 వార్షిక కౌలు వస్తుంది. ఈ భూమిని కౌలుకు ఇచ్చారు.

"ఇప్పుడు మనకు (వ్యవసాయంలో) ఎద్దులు ఎక్కువగా కనిపించడం లేదు" అని దేవూ చెప్పారు. “ఇప్పుడు వ్యవసాయం యంత్రాలతోనే నడుస్తోంది. అలాంటప్పుడు ఈ తాళ్ళు ఎవరు కొంటారు?” ప్రస్తుతం  50 ఏళ్ళ పైబడిన వయస్సులో ఉన్న నందుబాయి, మహారాష్ట్రలోని జైసింగ్‌పూర్ పట్టణంలోని ఒక వ్యవసాయ కూలీల కుటుంబానికి చెందినవారు. తనకు 15 సంవత్సరాల వయస్సులో వివాహం అయినప్పటి నుండి ఆమె తాళ్ళను తయారుచేస్తున్నారు. “ఎక్కువ కాలం మన్నే ప్లాస్టిక్, నైలాన్ తాళ్ళ కారణంగా ఈ (నూలు) తాళ్ళకు గిరాకీ పడిపోయింది. మేమింక ఈ తాళ్ళ తయారీ వ్యాపారాన్ని రెండేళ్ళు కూడా కొనసాగించలేం,” అన్నారు నందుబాయి.

ఈ వ్యాపారం ద్వారా వచ్చే అతి తక్కువ రాబడితో నిరుత్సాహపడిన అమిత్, “పెద్ద దుకాణదారులు చక్కగా కూర్చుని మేం తయారుచేసిన తాళ్ళను అమ్మి డబ్బు సంపాదిస్తారు. మేం కష్టపడి పనిచేస్తాం కానీ సంపాదన ఉండటం లేదు. జనం ఈ తాళ్ళను మా దగ్గర కొనరు, పట్టణాల్లోని హార్డ్‌వేర్ దుకాణాల్లో కొంటారు." అన్నారు. రోడ్డు పక్కన అమ్మే తాళ్ళ కంటే దుకాణాల్లోని తాళ్ళు మంచివని వాళ్ళు నమ్ముతారు.

PHOTO • Sanket Jain

ఒక్కొక్కటి 1.5 నుండి 2 కిలోల బరువుడే నూలు కట్టలను తయారు చేయడానికి తన ఇంటి నేల మీద నుండి పైకప్పులో ఉన్న కొక్కెం వరకూ పత్తి దారాలను సాగదీసి కడుతోన్న దేవూ

PHOTO • Sanket Jain

దేవూ భోరే తండ్రి కాలంలో , కుటుంబం తాళ్ళను తయారుచేయడానికి ఒక చెక్క యంత్రాన్ని ఉపయోగించేది . ఇప్పుడు వారు 20 కిలోల కంటే ఎక్కువ బరువుండే ఇనుప యంత్రాన్ని ఉపయోగిస్తున్నారు

PHOTO • Sanket Jain

నూలు కట్టలోని దారాలను గుండ్రంగా తిరిగే కొక్కేలకు ముడివేసి , అవి దృఢంగా తయారుకావడానికి వాటిని మెలితిప్పుతారు . తరువాత వాటిని కలిపి తాడుగా పేనుతారు

PHOTO • Sanket Jain

వారి ఇంటి బయట ' రోప్ - వాక్ ' వద్ద తాడును తయారుచేస్తున్న దేవూ , ఆయన కుటుంబం . ఒక చివర యంత్రం , మరో చివర భోర్‌ఖడీ లేదా టి - ఆకారపు తులాదండం ఉంటుంది

PHOTO • Sanket Jain

మహారాష్ట్రలోని మిరాజ్‌ పట్టణం నుంచి కొనుగోలు చేసిన రంగు పొడిని నీటిలో కలుపుతున్నారు . దేవూ , ఆయన పెద్ద కుమారుడు అమిత్ నూలు దారలను రంగులో ముంచుతారు . 10 నిమిషాల పాటు రంగు నీళ్ళలో నానబెట్టిన తర్వాత , వాటిని రెండు గంటలపాటు ఎండలో ఆరబెట్టాలి

PHOTO • Sanket Jain

దారాలను మెలితిప్పడం , వాటికి రంగులు వేయడం చాలా క్లిష్టమైన ప్రక్రియ . దీనిని దేవూ , నందుబాయి , అమిత్‌లు కలిసి చేస్తారు

PHOTO • Sanket Jain

రోప్ - వాక్ ఒక చివర అమిత్ నడిపించే యంత్రం , మరొక చివర నందుబాయి

PHOTO • Sanket Jain

తాడును సాగదీయటం , రంగు వేయడం , మొదలైన తాడు పేనటమనే బహుళ - దశల ప్రక్రియలో భోరే కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేకమైన పని ఉంటుంది

PHOTO • Sanket Jain

దారాల మధ్య చెక్క కార్లా లేదా టాప్ ను ఉంచిన దేవూ . ఇలా చేయటం వలన అవి దృఢంగానూ , సమానంగానూ మెలితిరుగుతాయి

PHOTO • Sanket Jain

చుట్టుపక్కల గ్రామాల మార్కెట్లలో అమ్మడం కోసం తాళ్ళను తయారుచేసేందుకు భోరే కుటుంబం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు పనిచేస్తుంది

PHOTO • Sanket Jain

అనేక ప్రక్రియల తర్వాత సిద్ధమైన తాళ్ళు . మార్కెట్ కి తీసుకెళ్ళేందుకు 12 అడుగుల పొడవుండే తాళ్ళను మడతపెడుతోన్న అమిత్ , దేవూ

కనుమరుగవుతోన్న భారతదేశపు గొప్ప తాళ్ళ తయారీ మాయాజాలం ఫొటో ఆల్బమ్‌ను కూడా చూడండి.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Sanket Jain

Sanket Jain is a journalist based in Kolhapur, Maharashtra. He is a 2022 PARI Senior Fellow and a 2019 PARI Fellow.

Other stories by Sanket Jain
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli