అక్కడి తహసిల్ కార్యాలయంలో ఇంకా ఆ జెండాను దాచి ఉంచారు. ప్రతీ ఆగష్టు 18 న ఆ చోట ఆ పతాకాన్ని ఎగరేస్తారు. ఉత్తరప్రదేశ్ లోని గాజిపూర్ జిల్లాలో ఉన్న ఆ ప్రాంతపు ప్రజలు 1942 లో ఆ ఆగష్టు18 న బ్రిటిషు వారి పాలన నుంచి స్వాతంత్య్రం ప్రకటించుకొన్నారు. మహమ్మదాబాద్ తహశీల్దార్ ఓ సమూహం మీద కాల్పులు జరిపించారు. షేర్ పూర్ గ్రామానికి చెందిన ఎనిమిదిమందిని చంపించారు. ఆ పోయిన వాళ్ళంతా కాంగ్రెస్ నేత శివపూజన్ రాయ్ బృందానికి చెందిన వాళ్ళు. మహమ్మద్ పూర్ తెహసిల్ భవనం మీద త్రివర్ణాన్ని ఎగర వేస్తున్నప్పుడు వాళ్ళందర్నీ కాల్చిచంపారు.
అప్పటికే కుతకుతలాడుతున్న ఆ జిల్లాలో బ్రిటీషు వారు ఆగష్టు పదో తారీఖున 129 మంది నాయకుల మీద అరెస్టు వారెంటు జారీ చేసేసరికి పోరాటం పెల్లుబికింది. పందొమ్మిదో తారీఖు కల్లా గాజిపూర్ ప్రాంతమంతా అప్పటికి స్థానికులు అదుపులోకి తెచ్చుకుని మూడురోజులు ప్రభుత్వాన్ని నడిపారు.
ఆనాటి జిల్లా గజెటీర్. ‘గ్రామం తర్వాత గ్రామం పీడన, లూటీ దోపిడీలకు గురి అయ్యాయి. అలానే గ్రామాలన్నింటిని తగలబెట్టారు.’ మిలటరీ దళాలూ, పోలీసు అశ్విక దళాలూ క్విట్ ఇండియా ఆందోళనకారుల్ని నలిపివేసాయి. మరికొద్ది దినాల్లో జిల్లా వ్యాప్తంగా దాదాపు నూటయాభై మంది తుపాకీ గుళ్ళకు గురి అయ్యారు. అధికారులూ, పోలీసులూ కలగలిసి ప్రజల నుంచి ముప్పై అయిదు లక్షలు దోచుకున్నారని రికార్డులు చెపుతున్నయి. డెబ్భై నాలుగు గ్రామాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. గాజిపూర్ ప్రజలంతా కలిసి నాలుగున్నర లక్షల అపరాధ రుసుము కట్టాల్సి వచ్చింది. ఆ రోజుల్లో అది చాలా పెద్ద మొత్తం.
షేర్ పూర్ గ్రామం అధికారుల ప్రత్యేకమైన కన్నెర్రకు గురి అయ్యింది. ఆ గ్రామపు దళితులందరిలోకి పెద్దవాడయిన హరిశరణ్ రామ్ అనే ఆయన ఆనాటి విషయాలను జ్ఞాపకం చేసుకొన్నారు : "మనుషుల సంగతి సరేసరి. ఊళ్ళో ఒక్క పిట్ట కూడా మిగల్లేదు. పారిపోగలిగిన వాళ్ళంతా పారిపోయారు. ఊళ్ళో లూటీ అడ్డూ ఆపూ లేకుండా సాగిపోయింది." అది ఒక్క షేర్ పూర్ గ్రామానికే సంబంధించిన విషయం కాదు- మొత్తం గాజిపూర్ ప్రాంతమంతటికీ గుణపాఠం నేర్పాల్సిన అవసరం ఉంది కదా...1850 ల నుంచీ నీలిమందు కామందుల మీద విరుచుకుపడటం , బ్రిటీషు దొరతనం మీద తిరుగుబాటు చేయ్యడం - అంతటి ఘనచరిత్ర ఉందా ప్రాంతానికి. లాఠీ దెబ్బలూ , బుల్లెట్లూ ఇప్పుడు ఆ ప్రాంతానికి ఆ పాఠాలు నేర్పాయి.






