మేము జీపు దిగుతూనే, భయాందోళనతో రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్స్ వారి వారి స్థానాలకు చేరుకున్నారు. ఈ పోలీస్ స్టేషన్ స్పెషల్ ఫోర్సెస్ రక్షణలో ఉంది. మా వద్ద ఉన్న కెమెరా ఈ పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. ఈస్ట్ గోదావరి జిల్లాలోని ఈ ప్రాంతాలలో పోలీస్ స్టేషన్ లను ఫోటో తీయడం నిషేధించబడింది.
స్టేషన్ లోపలినుంచే హెడ్ కానిస్టేబుల్ మా వివరాలు అడిగి తెలుసుకున్నారు. "ఓ, జర్నలిస్టులా?" పరిస్థితి కొంచెం చల్లబడింది. "మీరు కొంచెం మరీ ఆలస్యంగా స్పందించడంలేదు?" అని అడిగాను నేను. "మీ స్టేషన్ పై దాడి జరిగి 75 సంవత్సరాలు అవుతుంది."
"ఏమో అండి, ఎవరికి తెలుసు" అన్నారు ఆయన తాత్వికంగా. "మళ్లీ ఇవాళ మధ్యాహ్నమే దాడి జరగొచ్చు."
ఆంధ్రప్రదేశ్లోని ఈ గిరిజన ప్రాంతాలు 'ఏజెన్సీ' ఏరియాగా పిలవబడతాయి. 1922 ఆగస్టులో ఈ ప్రాంతం ఒక తిరుగుబాటుకు వేదికైంది. మొదట్లో ఈ తిరుగుబాటు కేవలం ఈ ప్రాంత ప్రజల ప్రకోపంలా కనిపించినప్పటికి, కొద్ది కాలంలోనే అది రాజకీయ రంగును పులుముకుంది. తాను గిరిజనుడు కాకపోయినా, అల్లూరి రామచంద్రరాజు (సీతారామరాజు), ఈ మన్యం తిరుగుబాటులో గిరిజనులకు సారధ్యం వహించారు. వీరు కేవలం తమ సమస్యల పరిష్కారం కొరకు పోరాడలేదు. 1922 నాటికి, బ్రిటిష్ పాలనను అంతు చేయడానికి పోరాడారు. ఈ తిరుగుబాటుదారులు ఏజెన్సీ ఏరియాలోని పోలీస్ స్టేషన్ల మీద దాడుల ద్వారా వారి లక్ష్యాలను తెలియజేసారు. దీనిలో భాగంగా వారు రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ మీద కూడా దాడి చేశారు.
ఈ ప్రాంతపు ప్రజలు ఏ సమస్యల వలన 75 సంవత్సరాల క్రితం బ్రిటీషువారిపై తిరగబడ్డారో, ఆ సమస్యలు నేటికి అలానే మిగిలున్నాయి.








