మదురై జిల్లాలోని ట్రాన్స్ జానపద కళాకారులకు సంవత్సరంలోని మొదటి ఆరు నెలలు చాలా కీలకమైనవి. ఈ కాలంలో, గ్రామాలు స్థానికంగా జరుపుకునే పండుగలనూ, దేవాలయాలు సాంస్కృతిక కార్యక్రమాలనూ నిర్వహిస్తాయి. కానీ లాక్‌డౌన్‌ల సమయంలో, ఎక్కువగా జనం గుమిగూడటంపై విధించిన ఆంక్షలు తమిళనాడులోని సుమారు 500 మంది ట్రాన్స్ మహిళా కళాకారులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపాయి.

అటువంటి మహిళలలో మాగీ కూడా ఒకరు. మదురై నగరానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న విలన్‌గుడి పట్టణంలో ఆమె నివాసముండే రెండు గదుల ఇల్లు ఆమె వంటి ఇతర ట్రాన్స్ మహిళలకు ఆశ్రయంగానూ, వాళ్ళు కలుసుకునే ప్రదేశంగానూ ఉంటోంది. నాటిన విత్తనాలు మొలకెత్తడాన్ని సూచిస్తూ పాడే సంప్రదాయక కుమ్మి పాట్టు (కుమ్మి పాటలు)ను ఈ జిల్లాలో ప్రదర్శించే కొద్దిమంది ట్రాన్స్ మహిళలలో మాగీ కూడా ఒకరు. తమిళనాడులో ప్రతి ఏడాదీ జూలై మాసంలో పదిరోజుల పాటు ఉత్సవంగా సాగే మూలైపరి పండుగలో, ఈ పాటలను వర్షం కోసం, భూసారం పెరిగేందుకు, మంచి పంటల కోసం ప్రార్థిస్తూ గ్రామ దేవతలకు సమర్పిస్తారు.

ఆమె స్నేహితులు, ఆమెతో పనిచేసేవారు ఈ పాటలకు నాట్యం చేస్తారు. ఇది చాలాకాలంగా వారికొక ఆదాయ వనరుగా ఉంది. కానీ కరోనా లాక్‌డౌన్‌ల కారణంగా, జూలై 2020లోగానీ, ఈ నెలలో కానీ ఆ పండుగను నిర్వహించలేదు (చూడండి: మదురైలో జానపద ట్రాన్స్ కళాకారుల విషాదం ). వారి ఇతర సాధారణ ఆదాయ వనరు - మదురై చుట్టుపక్కల లేదా బెంగళూరులో కూడా దుకాణాల నుండి డబ్బు వసూలు చేయడం కూడా దాదాపుగా నిలిచిపోయింది. దానితో రూ. 8,000 నుండి రూ. 10,000 వరకూ ఉండే వారి నెలవారీ ఆదాయం, ఈ లాక్‌డౌన్‌ల సమయంలో దాదాపు ఏమీ లేకుండాపోయింది.

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

కె. స్వస్తిక (ఎడమ) 24 ఏళ్ళ వయసున్న కుమ్మి నర్తకి-ప్రదర్శకురాలు. ట్రాన్స్ మహిళ అయినందుకు ఎదురైన వేధింపులను తట్టుకోలేక, ఆమె బి.ఎ. డిగ్రీ చదువు మానేయవలసి వచ్చింది. అయినా తనకు ఉద్యోగం దొరుకుతుందనే ఆశతో ఇప్పటికీ ఆ విద్య గురించి ఆమె కలలు కంటూవుంటారు. ఆమె తన జీవనోపాధి కోసం దుకాణాల నుండి డబ్బును కూడా వసూలు చేస్తుంటారు. కానీ ఆ పనితో పాటు ఆదాయం కూడా లాక్‌డౌన్‌ల వల్ల దెబ్బతిన్నాయి.

బికామ్ డిగ్రీ చదివినా 25 ఏళ్ళ భవ్యశ్రీ (కుడి)కి ఉద్యోగం దొరకలేదు. ఆమె కూడా కుమ్మి నర్తకి-ప్రదర్శకురాలు. ఇతర ట్రాన్స్ మహిళలతో ఉన్నప్పుడు మాత్రమే తాను సంతోషంగా ఉంటానని ఆమె చెప్పారు. మదురైలో ఉన్న తన కుటుంబాన్ని చూసేందుకు వెళ్ళాలనుకున్నప్పటికీ, ఆమె అక్కడికి వెళ్లడం మానేశారు. ఎందుకంటే, "నేను ఇంటికి వెళ్లినప్పుడల్లా వాళ్ళు నన్ను ఇంట్లోనే ఉండమని చెబుతారు. బయట ఎవరితోనూ మాట్లాడవద్దని చెప్తుంటారు" అని భవ్యశ్రీ అన్నారు.

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

ఆర్. షిఫానా (ఎడమ) 23 ఏళ్ళ కుమ్మి నృత్య కళాకారిణి- ఆమె ట్రాన్స్ మహిళగా నిరంతరం వేధింపులకు గురికావడంతో, రెండవ సంవత్సరంలోనే కళాశాలకు వెళ్లడం మానేశారు. కానీ తన తల్లి పట్టుదలతో తిరిగి చదువు ప్రారంభించి, బికామ్ డిగ్రీని పొందారు. మార్చి 2020లో లాక్‌డౌన్‌లు ప్రారంభమయ్యేంత వరకు మదురైలోని దుకాణాల నుండి డబ్బు వసూలు చేయడం ద్వారా ఆమె తన జీవనోపాధిని పొందుతూవుండేవారు.

వి. అరసి (మధ్య)కి 34 ఏళ్ళు. తమిళ సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, అలాగే ఎంఫిల్, బిఎడ్ డిగ్రీలు ఉన్న కుమ్మి నర్తకి-ప్రదర్శకురాలు. తన తోటి విద్యార్థులచే వేధింపులకు గురైనప్పటికీ, ఆమె తన చదువుపై దృష్టి పెట్టగలిగారు. చదువు పూర్తయ్యాక ఆమె ఉద్యోగం కోసం అనేక చోట్ల దరఖాస్తు చేశారు, కానీ నిరుద్యోగిగా మిగిలిపోయారు. లాక్‌డౌన్‌లకు ముందు, ఆమె కూడా తన ఖర్చులను గడుపుకోవడానికి దుకాణాల నుండి డబ్బు వసూలు చేయవలసి వచ్చేది.

ఐ. శాలిని (కుడి) 30 ఏళ్ళ కు మ్మి నృత్య కళాకారిణి. వేధింపులను ఎదుర్కొనలేక 11వ తరగతిలో ఉండగా హైస్కూల్ చదువు మానేశారు. ఆమె కూడా దుకాణాల నుండి డబ్బు వసూలు చేస్తారు. 15 ఏళ్ళుగా ప్రదర్శనలు ఇస్తున్నారు, కానీ లాక్‌డౌన్‌లు ప్రారంభమైనప్పటి నుండి, తన ఖర్చులు గడుపుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. తన తల్లిని చూడాలని తహతహలాడుతున్నానని, తన తల్లితో ఉండాలని కోరుకుంటున్నానని చెబుతూ, "నేను చనిపోయేలోగా, మా నాన్న కనీసం ఒక్కసారైనా నాతో మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను." అన్నారు శాలిని.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Reporting : S. Senthalir

ایس سینتلیر، پیپلز آرکائیو آف رورل انڈیا میں بطور رپورٹر اور اسسٹنٹ ایڈیٹر کام کر رہی ہیں۔ وہ سال ۲۰۲۰ کی پاری فیلو بھی رہ چکی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز S. Senthalir
Photographs : M. Palani Kumar

ایم پلنی کمار پیپلز آرکائیو آف رورل انڈیا کے اسٹاف فوٹوگرافر ہیں۔ وہ کام کرنے والی خواتین اور محروم طبقوں کی زندگیوں کو دستاویزی شکل دینے میں دلچسپی رکھتے ہیں۔ پلنی نے ۲۰۲۱ میں ’ایمپلیفائی گرانٹ‘ اور ۲۰۲۰ میں ’سمیُکت درشٹی اور فوٹو ساؤتھ ایشیا گرانٹ‘ حاصل کیا تھا۔ سال ۲۰۲۲ میں انہیں پہلے ’دیانیتا سنگھ-پاری ڈاکیومینٹری فوٹوگرافی ایوارڈ‘ سے نوازا گیا تھا۔ پلنی تمل زبان میں فلم ساز دویہ بھارتی کی ہدایت کاری میں، تمل ناڈو کے ہاتھ سے میلا ڈھونے والوں پر بنائی گئی دستاویزی فلم ’ککوس‘ (بیت الخلاء) کے سنیماٹوگرافر بھی تھے۔

کے ذریعہ دیگر اسٹوریز M. Palani Kumar
Editor : Sharmila Joshi

شرمیلا جوشی پیپلز آرکائیو آف رورل انڈیا کی سابق ایڈیٹوریل چیف ہیں، ساتھ ہی وہ ایک قلم کار، محقق اور عارضی ٹیچر بھی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز شرمیلا جوشی
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

کے ذریعہ دیگر اسٹوریز Sudhamayi Sattenapalli