లద్దాఖ్‌లోని సురు లోయ గ్రామాలు వేసవి నెలల్లో జీవనోత్సాహంతో పొంగిపొరలుతుంటాయి. పచ్చని పొలాల గుండా జలజల ప్రవహించే జలపాతాలతో, శిఖరాగ్రాలలో మంచు కప్పిన పర్వతాలు చుట్టుముట్టి ఉన్న ఈ ప్రదేశాలలో అనేక రకాల అడవి పువ్వులు విరివిగా విరబూసి ఉంటాయి. పగటి ఆకాశాన్ని అందమైన నీలిమబ్బు కమ్మివుండగా, ప్రశాంతమైన రాత్రి ఆకాశంలో పాలపుంత మిలమిలలాడుతుంది!
కర్గిల్ జిల్లాలోని ఈ లోయలోని పిల్లలు తమ చుట్టూ ఆవరించి ఉన్న ప్రకృతితో ఒక సంవేదనాత్మకమైన సంబంధాన్ని కలిగివుంటారు. ఈ ఫోటోలు 2021లో తాయ్ సురు గ్రామంలో తీసినవి. ఈ గ్రామంలోని అమ్మాయిలు కొండలవంటి బండరాళ్ళపైకి ఎక్కుతుంటారు, వేసవిలో పూలను, శీతాకాలంలో మంచును సేకరిస్తారు, ప్రవాహాల్లో గెంతులేస్తారు. బార్లీ పొలాల్లో ఆడుకోవడం వేసవికాలంలో వారికెంతో ఇష్టమైన పని.
కర్గిల్ చాలా మారుమూల ప్రాంతం. కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లో ఉన్న రెండు జిల్లాలలోని మరో జిల్లా, ప్రముఖ పర్యాటక ప్రదేశం అయిన లేహ్‌కు ఇది చాలా దూరంలో ఉంటుంది.
ఇతర ప్రాంతాలకు చెందిన చాలామంది కర్గిల్, కశ్మీర్ లోయలో ఉందని తికమకపడతారు, కానీ అది ఎంతమాత్రం నిజం కాదు. కశ్మీర్‌లో సున్నీ ముస్లిమ్‌లు ఎక్కువగా ఉంటారు. కర్గిల్‌లోని మెజారిటీ ప్రజల మత విశ్వాసం షియా ఇస్లామ్.
సురు లోయలోని షియా ముస్లిమ్‌లు, కర్గిల్ పట్టణానికి దక్షిణంగా 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాయ్ సురును ఒక ముఖ్యమైన మతకేంద్రంగా భావిస్తారు. ఇక్కడి ప్రజలకు, మహమ్మదీయుల నూతన సంవత్సరంలోని మొదటి నెల - ముహర్రం - మొహమ్మద్ ప్రవక్త మనవడు ఇమామ్ హుస్సేన్ కోసం ఆచరించే సంతాప మాసం. అక్టోబరు 10, 680న కర్బలా(ఇప్పటి ఇరాక్) యుద్ధంలో హుస్సేన్, అతని సహచరులు 72 మంది మరణించారు.
ఈ ముహర్రం సందర్భంగా పాటించే ఆచారాలలో పురుషులు, మహిళలు కూడా పాల్గొంటారు. జూలూస్ లేదా దస్తా అని పిలిచే ఊరేగింపులు చాలా రోజులపాటు జరుగుతాయి. వీటిలో అతిపెద్దదైన ఆశూరా మొహర్రం పదవ రోజున జరుగుతుంది. ఇది హుస్సేన్, అతని పరివారం కర్బలాలో అమరవీరులైన రోజు. కొంతమంది పురుషులు గొలుసులు, బ్లేడ్‌లతో తమని తాము శిక్షించుకునే ( కా మా ౙాని ) ఆచారాన్ని పాటిస్తారు. ప్రతి ఒక్కరూ తమ ఛాతీపై కొట్టుకుంటారు ( సీనా ౙాని ).
ఆశూరా కు ముందు రోజు రాత్రి, మహిళలు మసీదు నుంచి ఇమామ్ బా రా (సమావేశ మందిరం) వరకు ఊరేగింపుగా వెళతారు. వెళ్ళే దారిపొడవునా మర్సియా , నోహాల ను (విలాపాలు, శోకగీతాలు) జపిస్తూ వెళతారు. ( ఆశూరా ఈ సంవత్సరం ఆగస్టు 8-9 తేదీలలో వస్తుంది.)
హుస్సేన్, అతని సహచరులు చేసిన ప్రతిఘటననూ, త్యాగాన్నీ గుర్తుచేసుకోవడానికి ప్రతి ఒక్కరూ ముహర్రం సందర్భంగా ఇమామ్ బా రా లో రోజుకు రెండుసార్లు మజ్లిస్ (మతపరమైన సమావేశం) కోసం సమావేశమవుతారు. హాలులో వేర్వేరు ప్రదేశాల్లో కూర్చొని, పురుషులు (బాలురు కూడా), మహిళలు కర్బలా యుద్ధం, సంబంధిత సంఘటనల గురించి ఆఘా (మతాధిపతి) చెప్పే కథనాలను వింటారు.
అయితే, ఆ హాలుకు పైన ఉన్న అంతస్తులో అమ్మాయిలు కూర్చునేందుకు మధ్య మధ్య రంధ్రాలున్న బాల్కనీ ఉంది. ఈ ప్రదేశం నుంచి వారికి దిగువన జరిగేదంతా కనిపిస్తుంది. దీనిని ' పింజ్రా ' లేదా పంజరం అని పిలుస్తారు. ఈ పదం నిర్బంధాన్ని, ఊపిరాడనితనాన్ని గుర్తుకు తెస్తుంది. అయితే, ఈ ప్రదేశం మాత్రం అమ్మాయిలు స్వేచ్ఛగా ఉండేలా, వారికి ఆటలాడుకునే వీలుని కూడా కలిగిస్తుంది.
ఇమామ్ బారా లోని శోకతరంగం తారాస్థాయికి చేరిన తరుణంలో, అమ్మాయిల హృదయాలు ఒక్కసారిగా దుఃఖంతో నిండిపోయి, వారు కూడా తల వంచుకుని ఏడవడం ప్రారంభిస్తారు. కానీ వారి ఏడుపు ఎంతోసేపు నిలబడదు.
ముహర్రం శోక మాసం అయినప్పటికీ, పిల్లల ప్రపంచంలో మాత్రం అది తమ స్నేహితులను కలుసుకోవడానికీ, గంటల తరబడి, అర్ధరాత్రి వరకూ కూడా, వారితో కలిసి గడిపేందుకూ వారికి అవకాశం కలిగిస్తుంది. కొంతమంది అబ్బాయిలు తమను తాము కొరడాలతో కొట్టుకుంటారు, కానీ ఆ ఆచారం అమ్మాయిలకు నిషేధం. అమ్మాయిలు సాధారణంగా మిగిలినవాళ్ళు ఇదంతా చేస్తుండటాన్ని చూస్తుంటారంతే.
సాధారణంగా ముహర్రం గురించి ఆలోచించినప్పుడు, చిరిగిన బట్టలు, ముస్లిం యువకులు వీపుపై రక్తం వచ్చేలా కొట్టుకోవడం వంటివి మాత్రమే మన దృష్టికి వస్తాయి. కానీ దుఃఖాన్ని వ్యక్తం చేయటానికి ఇతర మార్గాలు కూడా ఉన్నాయి. సరళత, శోకంతో నిండి ఉండే స్త్రీల తీరు దీనికి మంచి ఉదాహరణ.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి