ఫుల్వతియా తన వంతు కోసం ఎదురు చూస్తుండగా ఆమె తమ్ముడైన పన్నెండేళ్ల శంకర్ లాల్ ఉల్లాసంగా సైకిల్ తొక్కుకుంటూ దగ్గరే ఉన్న వేప చెట్టు వరకు వెళ్ళాడు. “ఈరోజు నేనొక్కదాన్నే చక్కర్లు కొట్టి త్వరగా వచ్చేస్తాను”, ఆ పదహారేళ్ళ అమ్మాయి అంది. “రేపటి నుంచి ఐదు రోజుల పాటు ఎలాగూ సైకిల్ తొక్కలేను. బట్ట వాడుతున్నప్పుడు అలా చేయడం ఇబ్బందిగా ఉంటుంది”, రోడ్డు పక్కన ఓ కుక్కపిల్లని నిమురుతూ చెప్పింది.

ఫుల్వతియా (పేరు మార్చబడింది) రేపు తన ఋతుక్రమం మొదలవ్వచ్చని అనుకుంటుంది. కానీ ఈసారి -ఇంతకు మునుపు నెలల లాగ- తనకి బడి నుంచి ఫ్రీగా సానిటరీ నాప్కిన్లు అందవు. “సాధారణంగా మాకు నెలసరి మొదలయ్యాక ప్యాడ్లు అందుతాయి. కానీ ఇప్పుడు ఏదైనా బట్ట దొరికితే అదే వాడతా.”

ఉత్తర ప్రదేశ్ లోని చిత్రకూట్ జిల్లాలోని తన బడి, దేశంలో మిగతా బడులలాగే,కోవిడ్19 లాక్డౌన్ వల్ల మూసేసి ఉంది.

ఫుల్వతియా తన తల్లిదండ్రులు, ఇద్దరు అన్నదమ్ముళ్లతో కర్వి తెహసిల్ లోని తరౌహా గ్రామంలో సోనీపూర్ అనే తండాలో ఉంటుంది. ఆమెకు ఇద్దరు అక్కలు ఉన్నారు, వాళ్ళిద్దరికి పెళ్లై వేరే చోట ఉంటున్నారు. తను పదవ తరగతి పరీక్షలు రాసి పది రోజుల విరామం తర్వాత తిరిగి బడికి వెళ్లాల్సిన సమయంలో, మార్చి24న, లాక్డౌన్ ప్రకటించారు. తను కర్వి బ్లాక్ లోని రాజకీయ బాలిక ఇంటర్ కాలేజీలో చదువుతోంది.

“వేరే దేనికీ వాడని ఒక బట్ట ముక్క కోసం వెతుకుతాను- అదే వాడతాను. రెండోసారి వాడే ముందు దాన్ని ఉతుకుతాను,” అంటుంది ఫుల్వతియా. ముదురు ఛాయ ఉన్న ఆమె పాదాల కాలివేళ్లని అలంకరించిన రాణీ రంగు గోళ్ళ పెయింట్ పై -చెప్పులు లేకుండా నడవడం వల్ల కాబోలు- రేగిన దుమ్ము అంటుకొని ఉంది.

Phoolwatiya, 16, says, 'We normally get pads there [at school] when our periods begin. But now I will use any piece of cloth I can'
PHOTO • Jigyasa Mishra

పదహారేళ్ల ఫ్యూల్వతియా చెబుతుంది, 'సాధారణంగా మాకు నెలసరి మొదలయ్యాక ప్యాడ్లు అందుతాయి. కానీ ఇప్పుడు ఏదైనా బట్ట దొరికితే అదే వాడతా'

ఈ పరిస్థితి ఫుల్వతియాది మాత్రమే కాదు. ఉత్తరప్రదేశ్ లోని తన లాంటి లక్షల మంది అమ్మాయిలు బడులలో ఉచితంగా పంపిణీ చేసే సానిటరీ ప్యాడ్లు పొందడానికి అర్హులు. ఫుల్వతియా లాగా ఎంత మంది అవి తీసుకున్నారో ఒక సంఖ్య మేము కనిపెట్టలేకపోయాం. కానీ ఆ సంఖ్యలో పదో వంతు అయినా, పది లక్షల మంది పైనే పేద కుటుంబాలకు చెందిన అమ్మాయిలకు ఇప్పుడు ఉచిత నాప్కిన్లు అందుబాటులో లేనట్టే.

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ల స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనే రిపోర్ట్ ప్రకారం యూపీలో ఆరు నుంచి పన్నెండో తరగతి చదువుతున్న అమ్మాయిల సంఖ్య 10.86 మిలియన్. ఈ అంకెలు 2016-17 వి, ఈ సంవత్సర డేటా మాత్రమే చివర డేటాగా లభ్యమైంది.

కిశోరి సురక్ష యోజన (దేశంలోని అన్ని ప్రాంతాలకి విస్తరించి ఉన్న భారతదేశ ప్రభుత్వ కార్యక్రమం) ద్వారా ఆరు నుంచి పన్నెండో తరగతిలో ఉన్న అమ్మాయిలు అందరూ ఉచితంగా సానిటరీ నాప్కిన్లు పొందడానికి అర్హులు. ఉత్తరప్రదేశ్ లో ఈ కార్యక్రమాన్ని 2015లో అప్పటి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రారంభించారు

*****

ఆ బట్టను ఉతికిన తర్వాత తను ఎక్కడ ఆరేస్తుంది? “నేను దాన్ని ఇంటి లోపల ఎవరికీ కనిపించని చోట పెడతాను. మా నాన్న గానీ అన్నతమ్ముళ్లని గానీ దానిని చూడనివ్వలేను,” అంటుంది ఫుల్వతియా. ఇతర చోట్ల లాగే ఋతుస్రావం కోసం వాడి, ఉతికిన వస్త్రాన్ని ఎండలో ఆరేయకపోవడం ఇక్కడ చాలా మంది అమ్మాయిలకి, మహిళలకకి సాధారణ విషయం- ఇలా ఇంట్లో ఉన్న పురుషుల నుంచి ఆ బట్టలను దాచడం కోసం ఇలా చేస్తారు.

Before the lockdown: Nirasha Singh, principal of the Upper Primary School in Mawaiya village, Mirzapur district, distributing sanitary napkins to students
PHOTO • Jigyasa Mishra

లాక్ డౌన్ కి ముందు మీర్జాపూర్ జిల్లాలోని మావయా గ్రామంలో అప్పర్ ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపాల్ నిరశ సింగ్, విద్యార్థినులకు సానిటరి పాడ్స్ పంచుతున్నారు

ఆ బట్టను ఉతికిన తర్వాత తను ఎక్కడ ఆరేస్తుంది? “నేను దాన్ని ఇంటి లోపల ఎవరికీ కనిపించని చోట పెడతాను. మా నాన్న గానీ అన్నతమ్ముళ్లని గానీ దానిని చూడనివ్వలేను,” అంటుంది ఫుల్వతియా. ఇతర చోట్ల లాగే ఋతుస్రావం కోసం వాడి, ఉతికిన వస్త్రాన్ని ఎండలో ఆరేయకపోవడం ఇక్కడ చాలా మంది అమ్మాయిలకి, మహిళలకకి సాధారణ విషయం

యూనిసెఫ్ సూచించినట్లుగా , “ఋతుస్రావం గురించి సమాచారం లేకపోవడం వల్ల నష్టపరిచే అపోహలు, వివక్షకు దారి తీస్తుంది. అంతే కాక అమ్మాయిలకు సాధారణ బాల్యం యొక్క అనుభవాలు, ఇతర కార్యకలాపాలు కోల్పోయేలా చేస్తుంది.”

“ఋతుక్రమంలో స్రావాలని శోషించడానికి మెత్తటి కాటన్ వస్త్రాన్ని వాడడం సురక్షితమైనదే, కానీ అది శుభ్రంగా ఉండి, ఉతికి, సూర్యకాంతి నేరుగా తగిలేట్టు ఆరేస్తేనే. అలా అయితేనే సూక్ష్మక్రిముల ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో వీటి గురించి సరైన జాగ్రత్తలు తీసుకోక పోవడం వల్ల వారికి (అమ్మాయిలు, మహిళలకి) యోని సంబందిత ఇన్ఫెక్షన్లు సాధారణ సమస్య,” అంటారు లక్నోలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలోని సీనియర్ గైనకాలజిస్టు అయిన డా.నీతూ సింగ్. ఫుల్వతియా లాంటి అమ్మాయిలు ప్యాడ్ల బదులు తిరిగి అపరిశుభ్రంగా ఉండే బట్టలు వాడడం మొదలు పెట్టారు- దీని వల్ల వాళ్ళు అలెర్జీలకి, వ్యాధులకు గురయ్యే అవకాశాలు ఎక్కువ.

“మా బడిలో మాకు జనవరిలో 3-4 ప్యాకెట్ల ప్యాడ్లు ఇచ్చారు,” అంటుంది ఫుల్వతియా. “కానీ ఇప్పుడు అవి అయిపోయాయి.” మార్కెట్లో ఉన్నవి ఆమె కొనలేకపోతుంది. నెలకి కనీసం 60 రూపాయలు ఆమె ఖర్చు పెట్టాల్సి రావచ్చు. అన్నిటికన్నా చౌక అయినది ఆరు ప్యాడ్లు ఉన్న 30 రూపాయల ప్యాకెట్. ఆమెకి నెలకి రెండు ప్యాకెట్లు అవసరం పడచ్చు.

తన తల్లిదండ్రులు, అన్నయ్య అందరూ రోజు కూలీకి పని చేసే వ్యవసాయ కూలీలు, వీళ్లంతా కలిసి మామూలు రోజుల్లో రోజుకి 400 రూపాయలు సంపాదిస్తారు. “ఇప్పుడు సంపాదన మహా అంటే రోజుకి 100 రూపాయలకి పడిపోయింది, మాకెవరు పొలాల్లో పని కూడా ఇవ్వట్లేదు,” అంటారు ఫుల్వతియా తల్లి 52 ఏళ్ల  రామ్ ప్యారీ, తన మనవడికి ఖిచిడీ తినిపిస్తూ.

ప్రత్యామ్నాయ డెలివరీ మార్గాలు ఇక్కడ లేవు. “ప్రస్తుతం ప్రాథమిక అవసరాలు అయిన రేషన్, ఆహారం మీదే మా దృష్టి పెడుతున్నాం. ఈ స్థితిలో ప్రాణాలు కాపాడడం మా ప్రాధాన్యత,” అని చిత్రకూట్ జిల్లా మేజిస్ట్రేట్ శేష్ మణి పాండే మాతో అన్నారు.

Ankita (left) and her sister Chhoti: '... we have to think twice before buying even a single packet. There are three of us, and that means Rs. 90 a month at the very least'
PHOTO • Jigyasa Mishra
Ankita (left) and her sister Chhoti: '... we have to think twice before buying even a single packet. There are three of us, and that means Rs. 90 a month at the very least'
PHOTO • Jigyasa Mishra

అంకిత(ఎడమ), ఆమె చెల్లెలు చోటి: '...కానీ మేము ఒక ప్యాకెట్ కొనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. మేము ముగ్గురం ఉన్నాం, అంటే నెలకి కనీసం 90 రూపాయలు అవుతుంది'

నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ( NFHS-4 ) చెప్పిన దాని ప్రకారం 2015-16 సంవత్సరంలో దేశంలో 15 నుంచి 24 వయస్సులో ఉన్న 62 శాతం యువతులు ఇంకా ఋతుక్రమంలో రక్షణ కోసం బట్టనే వాడతారు. అయితే ఉత్తరప్రదేశ్ లో ఈ సంఖ్య 81 శాతం వరకు ఉంది.

మే 28న ఋతుక్రమ పరిశుభ్రత దినోత్సవం వచ్చినప్పుడు ఈ విషయంలో పెద్దగా సంతోషించేదేమి ఉండదు.

*****

ఈ సమస్య అన్ని జిల్లాల్లో సాధారణమైనదిగా కనిపిస్తుంది. “లాక్డౌన్ కి ఒక రోజు ముందే మాకు ప్యాడ్లు కొత్తవి అందాయి, అవి పంపిణీ చేయడానికి ముందే బడి మూసేయాల్సి వచ్చింది,” అన్నారు లక్నో జిల్లా గోసైగంజ్ బ్లాక్ లోని సలౌలి గ్రామంలో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాల ప్రిన్సిపాల్ అయిన యశోదానంద్ కుమార్.

“నేను ఎల్లప్పుడూ నా విద్యార్థుల ఋతుక్రమ ఆరోగ్యం గురించి పట్టించుకున్నాను. వాళ్ళకి ప్యాడ్లు ఇవ్వడమే గాక ప్రతి నెల అమ్మాయిలతో, మహిళా సిబ్బందితో ఋతుక్రమ పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యత గురించి మీటింగ్ పెట్టేదాన్ని. కానీ ఇప్పుడు దాదాపు రెండు నెలల నుంచి బడి మూసేసి ఉంది,” అని ఫోన్లో అన్నారు నిరశా సింగ్. ఆవిడ మీర్జాపూర్ జిల్లాలో మవైయా గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలకి ప్రిన్సిపాల్. “నా విద్యార్థులలో చాలా మందికి ప్యాడ్లు లభించే దగ్గర్లో ఉన్న దుకాణాలు అందుబాటులో లేవు. ఇంకా చాలామంది దాని కోసం నెలకి 30-60 రూపాయలు ఖర్చు పెట్టరని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.”

చిత్రకూట్ జిల్లాలోని పదిహేడేళ్ల అంకితా దేవి, తన చెల్లెలు పద్నాలుగేళ్ల ఛోటి (పేర్లు మార్చబడ్డాయి) మాత్రం ఖచ్చితంగా అంత డబ్బు ఖర్చు పెట్టరు. ఫుల్వతియా ఇంటి నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న చితారా గోకుల్పూర్ గ్రామంలో నివసిస్తున్న ఈ టీనేజ్ బాలికలు కూడా బట్టనే వాడడం మొదలుపెట్టారు. వాళ్ళ అక్క కూడా అంతే చేస్తుంది, మేము వెళ్ళినప్పుడు తను లేదు.  అంకిత, పదకొండో తరగతి, ఛోటి, తొమ్మిదో తరగతి, ఇద్దరూ ఒకే బడికి వెళ్తారు- చితారా గోకుల్పూర్ లోని శివాజీ ఇంటర్ కాలేజ్. వాళ్ళ నాన్న రమేష్ పహాడీ (పేరు మార్చబడింది), ఒక స్థానిక ప్రభుత్వ కార్యాలయంలో సహాయకుడిగా పని చేస్తూ నెలకి పది వేలు సంపాదిస్తారు.

The Shivaji Inter College (let) in Chitara Gokulpur village, where Ankita and Chhoti study, is shut, cutting off their access to free sanitary napkins; these are available at a pharmacy (right) three kilometers from their house, but are unaffordable for the family
PHOTO • Jigyasa Mishra
The Shivaji Inter College (let) in Chitara Gokulpur village, where Ankita and Chhoti study, is shut, cutting off their access to free sanitary napkins; these are available at a pharmacy (right) three kilometers from their house, but are unaffordable for the family
PHOTO • Jigyasa Mishra

చితారా  గోకుల్పూర్ గ్రామంలో అంకిత, చోటి  చదివే శివాజీ ఇంటర్ కాలేజ్(ఎడమ)ని మూసేశారు. దీనివలన వాళ్ళకి సానిటరీ పండ్లు అందుబాటులో లేకుండా పోయాయి. వారి  ఇంటికి మూడు కిలోమీటర్లపై దూరంలో ఉన్న మందుల షాపులోని సానిటరీ ప్యాడ్లు వారు కొనలేని ఖరీదుతో ఉన్నాయి

“ఈ రెండు నెలల జీతం వస్తుందో లేదో నాకు ,” అన్నారాయన. “మా ఇంటి యజమాని నాకు ఇంటి కిరాయి గురించి గుర్తు చేయడానికి ఫోన్ చేస్తూ ఉన్నారు.” రమేష్ ఉత్తరప్రదేశ్ లోని బండా జిల్లా వాస్తవ్యుడు, పని కోసం ఇక్కడికి వలస వచ్చాడు.

సమీప ఫార్మసీ తమ ఇంటి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉందని అంకిత చెప్పింది. వాళ్ళింటికి కేవలం 300 మీటర్ల దూరంలో ప్యాడ్లు లభ్యమయ్యే  ఒక కిరాణా దుకాణం ఉంది. “కానీ మేము 30 రూపాయలు పెట్టి ఒక ప్యాకెట్ కొనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి,” అంటుంది అంకిత. “మేము ముగ్గురం ఉన్నాం, గుర్తుందిగా, అంటే నెలకి కనీసం 90 రూపాయలు అవుతుంది.”

ఇక్కడ చాలా మంది అమ్మాయిల దగ్గర ప్యాడ్లు కొనడానికి డబ్బులు లేవని స్పష్టంగా తెలుస్తుంది. “లాక్డౌన్ తర్వాత సానిటరీ ప్యాడ్ల అమ్మకంలో ఎలాంటి పెరుగుదల లేదు,” అన్నారు రామ్ బర్సైయా. చిత్రకూట్ లోని సీతాపూర్ పట్టణంలో ఆయన నడుపుతున్న ఫార్మసీలో ఆయనతో మాట్లాడాను. వేరే చోట్లలో కూడా పరిస్థితి ఇదేనని తెలుస్తుంది.

అంకిత మార్చిలో హై స్కూల్ పరీక్షలు రాసింది. “పరీక్షలు బాగా జరిగాయి. పదకొండో తరగతిలో నేను బయాలజీ ఎంచుకోవాలని అనుకుంటున్నాను. నిజానికి, నేను కొంతమంది సీనియర్‌లను వారి పాత బయాలజీ టెక్స్ట్ బుక్స్ కోసం అడిగాను, కానీ అప్పుడు స్కూళ్లు మూతబడ్డాయి, ” అని ఆమె చెప్పింది.

బయాలజీ ఎందుకు? “అమ్మాయిలకు, మహిళలకు చికిత్స చేస్తాను,” అని నవ్వుతూ చెప్పింది. “కానీ ఆ విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలో ఇంకా తెలీదు.”

పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా లో భాగంగా, PARI మరియు కౌంటర్ మీడియా ట్రస్ట్ కలిసి గ్రామీణ భారతదేశంలో కౌమారదశలో ఉన్న బాలికలు మరియు యువతులపై దేశవ్యాప్త రిపోర్టింగ్ ప్రాజెక్ట్ ను చేస్తున్నారు. సమాజం లో కీలకమైన పాత్రను పోషించే అట్టడుగు వర్గాల పరిస్థితులను అన్వేషించడానికి, సాధారణ ప్రజల గొంతులను, వారి అనుభవాలను వినిపించడానికి ఈ ప్రాజెక్టు కృషి చేస్తుంది.

ఈ వ్యాసాన్ని ప్రచురించాలనుకుంటున్నారా ? అయితే [email protected]కి మెయిల్ చేసి [email protected] కి కాపీ చేయండి.

అనువాదం: దీప్తి సిర్ల

Jigyasa Mishra

جِگیاسا مشرا اترپردیش کے چترکوٹ میں مقیم ایک آزاد صحافی ہیں۔ وہ بنیادی طور سے دیہی امور، فن و ثقافت پر مبنی رپورٹنگ کرتی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Jigyasa Mishra
Illustration : Priyanka Borar

پرینکا بورار نئے میڈیا کی ایک آرٹسٹ ہیں جو معنی اور اظہار کی نئی شکلوں کو تلاش کرنے کے لیے تکنیک کا تجربہ کر رہی ہیں۔ وہ سیکھنے اور کھیلنے کے لیے تجربات کو ڈیزائن کرتی ہیں، باہم مربوط میڈیا کے ساتھ ہاتھ آزماتی ہیں، اور روایتی قلم اور کاغذ کے ساتھ بھی آسانی محسوس کرتی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Priyanka Borar

پی سائی ناتھ ’پیپلز آرکائیو آف رورل انڈیا‘ کے بانی ایڈیٹر ہیں۔ وہ کئی دہائیوں تک دیہی ہندوستان کے رپورٹر رہے اور Everybody Loves a Good Drought اور The Last Heroes: Foot Soldiers of Indian Freedom کے مصنف ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز پی۔ سائی ناتھ
Series Editor : Sharmila Joshi

شرمیلا جوشی پیپلز آرکائیو آف رورل انڈیا کی سابق ایڈیٹوریل چیف ہیں، ساتھ ہی وہ ایک قلم کار، محقق اور عارضی ٹیچر بھی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز شرمیلا جوشی
Translator : Deepti

Deepti is a Social Activist. She likes to question.

کے ذریعہ دیگر اسٹوریز Deepti