“ఇప్పుడు ఇదివరకులాగా కాదు. ఇప్పటి ఆడవారికి కుటుంబనియంత్రణ గురించి బాగా తెలుసు.” అన్నది సలా ఖాతూన్. ఆమె ఒక చిన్న ఇటుక ఇంటి కాంతివంతమైన వరండాలో, సముద్రపు రంగులో ఉన్న గోడల మధ్య నుంచుని ఉన్నది.

ఆమె మాటలు అనుభవంతో వచ్చినవే. పోయిన దశాబ్దంలో ఆమె, ఆమె మేనల్లుడి భార్య షమ పర్వీన్, బీహార్ మధుబని జిల్లాలోని హసన్‌పూర్ గ్రామంలో కుటుంబ నియంత్రణ, ఋతు పరిశుభ్రతకు అనధికారిక సలహాదారులయ్యారు.

వీరిని ఆడవారు ఎక్కువగా గర్భ నిరోధక పద్ధతుల గురించి, పిల్లల మధ్య ఎడం తీసుకునే గర్భ నిరోధక పద్ధతుల గురించి, పిల్లల ఇమ్యూనైసేషన్ల గురించి ఇంకా ఎన్నో విషయాల గురించి వీరిని అడుగుతుంటారు.  కొందరైతే హార్మోన్ల కాంట్రాసెప్టివ్ ఇంజెక్షన్లని గురించి అడిగి, అవసరమైతే  రహస్యంగా తీసుకుంటారు.

షమ వాళ్ళ ఇంటిలో ఒక మూల, అల్మారాలో  కొన్ని ఇంజక్షన్ వయల్ తో పాటు బ్లిస్టర్ ప్యాక్ వేసిన మందులు ఉంచిన ఆ చిన్న క్లినిక్ లో, 40 ఏళ్ళు అప్పుడే దాటిన  షమ, 50 ఏళ్ళు దాటిన సలా- ఇద్దరిలో ఎవరూ శిక్షణ పొందిన నర్సులు కారు, కండరాలకు ఇన్జెక్షన్ ఇస్తారు. “కొన్నిసార్లు ఆడవారు ఒకరే వస్తారు, ఇంజక్షన్ తీసుకుని వెంటనే వెళ్ళిపోతారు. వాళ్ళింటి దగ్గర ఎవరికీ ఏమి తెలియనవసరం లేదు.” అన్నది సలా. మిగిలిన వారు వారి భర్తలతోనో, ఆడ బంధువులతోనో వస్తారు.

ఒక దశాబ్దం కిందటి పరిస్థితితో చూస్తే, ఇది చాలా పెద్ద మార్పు. అప్పట్లో 2500 మంది ఉన్న ఫుల్ల్పరాస్ బ్లాక్, సైని గ్రామ్ పంచాయత్ లోని హసన్‌పూర్ లో , కుటుంబ నియంత్రణ అసలు పాటించేవారు కాదు.

ఈ మార్పు ఎలా వచ్చింది? “ ఏ అందర్ కి బాత్ హై (అది లోపలి కథ)”, అన్నది షమ.

In the privacy of a little home-clinic, Salah Khatun (left) and Shama Parveen administer the intra-muscular injection
PHOTO • Kavitha Iyer

ఇంటిలో గోప్యంగా నడిపే క్లినిక్ లో, కండరాల్లో ఇంజక్షన్ ఇస్తున్న సలా ఖాతూన్(ఎడమ)), షమ పర్వీన్

గతంలో హసన్‌పూర్ లో గర్భనిరోధక వినియోగం తక్కువగా ఉండడం, రాష్ట్రంలోని ఇదివరకటి పరిస్థితిని కూడా సూచిస్తుంది - NFHS-4 (2015-16) బీహార్‌లో మొత్తం సంతానోత్పత్తి రేటు 3.4 ఉందని పేర్కొంది.  ఇది అఖిల భారత దేశపు సంఖ్య అయిన 2.2 కంటే గణనీయంగా ఎక్కువ. (TFR- Total Fertility Rate అనేది ఒక స్త్రీ తన సంతానాన్ని కనగలిగే సంవత్సరాలలో సగటున ప్రసవించే పిల్లల సంఖ్య.)

NFHS-5 (2019-20) లో రాష్ట్ర TFR, 3 కి పడిపోయింది. అంతేగాక, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే యొక్క 4, 5 రౌండ్‌ల మధ్య, రాష్ట్రంలో గర్భనిరోధక వినియోగంలో పెరుగుదల - 24.1 శాతం నుండి 55.8 శాతానికి చేరింది.

మహిళలకు స్టెరిలైజేషన్ ప్రక్రియ అయిన ట్యూబల్ లైగేషన్, కుటుంబ నియంత్రణలో ప్రధానమైన పద్ధతిగా  కొనసాగుతోంది. ప్రస్తుతం వాడే అన్ని ఆధునిక పద్ధతుల్లో, ట్యూబల్ లైగేషన్ పద్ధతి 86 శాతం వాడుకలో ఉంది (NFHS-4). రాబోయే NFHS-5 లో దీనిపై వివరణాత్మక డేటా కోసం ఇంకా ఎదురుచూడవలసి ఉంది.  అయితే రాష్ట్ర విధానంలో, పిల్లల మధ్య ఎడాన్ని నిర్ధారించే కొత్త పద్ధతులను అర్థం చేసుకోవడమే ఇప్పుడు కీలకమైన అంశం. ఇందులో ఇంజెక్ట్ చేయగల గర్భనిరోధకం కూడా ఉంది.

హసన్‌పూర్‌లో కూడా, సలా షమ గమనించినట్లుగా, ఎక్కువ మంది మహిళలు గర్భనిరోధకం కోసం ప్రయత్నిస్తున్నారు - వారు ప్రధానంగా మాత్రలు వాడినా,  హార్మోన్ల ఇంజెక్షన్‌ను కూడా తీసుకుంటున్నారు. ఈ ఇంజక్షన్ ను డిపో-మెడ్రాక్సీ ప్రొజెస్టెరాన్ అసిటేట్ (DMPA) అని పిలుస్తారు. దీనిని భారతదేశంలో 'డెపో-ప్రోవెరా', 'పరి' అన్న పేరులతో విక్రయిస్తున్నారు. ప్రభుత్వ డిస్పెన్సరీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 'అంతరా' అనే బ్రాండ్ పేరుతో DMPAని అందిస్తున్నాయి. 2017లో భారతదేశంలో వీటి ఉత్పత్తి మొదలుపెట్టేవరకు, లాభాపేక్ష లేని సంస్థలద్వారా, లేదా వ్యక్తులు, ప్రైవేట్ సంస్థల ద్వారా పొరుగునే ఉన్న నేపాల్ నుండి 'డిపో' ని బీహార్‌కి దిగుమతి చేసేవారు. ఒక్క ఇంజక్షన్ ఖరీదు 245 నుండి  350 రూపాయిల వరకు ఉండేది. కానీ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలోను, ఆసుపత్రులలోను ఇది ఉచితంగా లభించేది.

ఈ ఇంజెక్షన్‌ వలన అవాంఛనీయ ప్రభావాలు కూడా ఉన్నాయి. డిస్మెనోరియా (అధిక లేదా బాధాకరమైన రక్తస్రావం) నుండి అమినోరియా (రక్తస్రావం లేకపోవడం), మొటిమలు, బరువు పెరగడం, బరువు తగ్గడం, ఋతుక్రమంలో లోపాలు వంటి ఎన్నో దుష్ప్రభావాల గురించి మహిళల హక్కుల సంఘాలు, ఆరోగ్య కార్యకర్తలు 1990లలో ఆందోళన వ్యక్తం చేసి, దీనిని సంవత్సరాల తరబడి ప్రతిఘటించారు. మహిళల ఆరోగ్య భద్రతపై సుదీర్ఘ నిరసనలు, ఈ ఇంజక్షన్ పై ఒకే వరసన జరిగిన క్లినికల్ ట్రయళ్లు, వివిధ సమూహాల నుండి అభిప్రాయ సేకరణ వంటి ప్రక్రియల కారణంగా DMPA 2017 వరకు భారతదేశంలో ఉత్పత్తిని జరగకుండా నిలువరించగలిగారు. కాని ఇప్పుడు దీనిని మన దేశంలోనే ఉత్పత్తి చేస్తున్నారు.

బీహార్‌లో 2017 అక్టోబరులో అంతరా అనే పేరుతో ఇంజెక్షన్ ప్రారంభించబడింది. జూన్ 2019 నాటికి ఇది అన్ని పట్టణ మరియు గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాలలో అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ డేటా ప్రకారం, ఆగస్టు 2019 నాటికి 4,24,427 డోసులు అందించబడ్డాయి, ఇది దేశంలోనే అత్యధికం. ఒకసారి డోసు తీసుకున్న మహిళల్లో 48.8 శాతం మంది రెండవ డోస్ కూడా పొందారు.

Hasanpur’s women trust Shama and Salah, who say most of them now ensure a break after two children. But this change took time

హసన్‌పూర్‌లోని మహిళలు షమ, సలాను విశ్వసిస్తున్నారు, వారిలో ఎక్కువ మంది ఇద్దరు పిల్లల తర్వాత ఎడం తీసుకుంటున్నారని చెప్పారు. కాని ఈ మార్పు రావడానికి చాలా సమయం పట్టింది

రెండు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పాటు DMPAని ఉపయోగించడం గురించి ఆందోళనలు ఉన్నాయి. అధ్యయనం చేయబడిన ప్రమాదాలలో ఎముక ఖనిజ సాంద్రత కోల్పోవడం (ఇంజెక్షన్‌ను నిలిపివేసినప్పుడు తిరిగి మారుతుందని నమ్ముతారు) ముఖ్యమైనది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) DMPAని ఉపయోగించే మహిళల ఆరోగ్యాన్ని ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి సమీక్షించాలని సిఫార్సు చేసింది.

షమ, సలా భద్రత విషయంలో ఎటువంటి రాజీ పడేది లేదని నొక్కి చెప్పారు. హైపర్‌టెన్సివ్ మహిళలకు ఇంజెక్ట్ చేయదగిన గర్భనిరోధకం ఇవ్వకూడదు కాబట్టి, ప్రతిసారి ఇంజెక్షన్ ఇవ్వడానికి ముందు రక్తపోటును తనిఖీ చేసేలా ఇద్దరు ఆరోగ్య సంరక్షణ వాలంటీర్లను నియమించారు. ఇంతవరకు ఈ ఇంజక్షన్ వలన దుష్ప్రభావాల కలిగాయని ఎవరూ తమకు ఫిర్యాదు చేయలేదని వారు చెప్పారు.

గ్రామంలో ఎంత మంది మహిళలు డెపో-ప్రోవెరాను ఉపయోగిస్తున్నారనే దానిపై వారి వద్ద డేటా లేదు. కానీ స్పష్టంగా, ఇది  చాలా ప్రసిద్ధమైన గర్భనిరోధక సాధనమని తెలుస్తోంది. ఇది గోప్యత కు భరోసా ఇవ్వడమే కాక, ఒకసారి ఈ ఇంజక్షన్ ను  వేయించుకున్నాక మరో మూడు నెలల వరకు గర్భం దాల్చే అవకాశం ఉండదు. అంతేగాక, సంవత్సరానికి కొన్ని నెలలు మాత్రమే నగరాల నుండి ఇంటికి తిరిగి వచ్చే పురుషులతో, వివాహమైన స్త్రీలు అతి  తక్కువ వ్యవధిలో జాగ్రత్తపడడానికి ఇది చాలా సులభమైన పద్ధతి. (హెల్త్‌కేర్ వర్కర్లు మరియు వైద్య పత్రాలు చివరి డోస్ తీసుకున్న మహిళలలో మూడు నెలల వరకు ఈ ఇంజక్షన్ పనిచేసి,  ఆ తరవాత కొన్ని నెలలకు వారిలో సంతానోత్పత్తి తిరిగి వస్తుందని చెబుతున్నాయి.)

1970ల చివరలో వికేంద్రీకృత ప్రజాస్వామ్యం, స్వయం ఆధారిత కమ్యూనిటీ నుండి ప్రేరణ పొంది, వినోబా భావే మరియు జయప్రకాష్ నారాయణ్ అనుచరులు స్థాపించిన ఘోఘర్దిహ ప్రఖండ్ స్వరాజ్య వికాస్ సంఘ్ (GPSVS), ఇక్కడ చేసిన పని మధుబనిలో హార్మోన్ల ఇంజెక్షన్‌కు ఆదరణ పెరగడానికి మరొక కారణం.. (వికాస్ సంఘ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇమ్యునైజేషన్ డ్రైవ్‌లు, స్టెరిలైజేషన్ క్యాంపులతో కలిసి పనిచేస్తుంది, 1990ల చివరలో 'టార్గెట్' విధానం గురించి తరచుగా విమర్శలు ఎదుర్కొంది).

ముస్లింలు అధికంగా ఉండే హసన్‌పూర్ గ్రామంలో, 2000 సంవత్సరంలో GPSVS, మహిళలను స్వయం సహాయక బృందాలుగా మహిళా మండలాల్లో మరియు ఇతర గ్రామాలలో నిర్వహించడం ప్రారంభించినప్పుడు పోలియో ఇమ్యునైజేషన్,  కుటుంబ నియంత్రణ కోసం పాటుపడింది. సలా ఒక చిన్న-పొదుపు సమూహంలో సభ్యురాలయ్యి షమను కూడా చేరమని   ప్రోత్సహించింది.

గత మూడు సంవత్సరాలుగా, GPSVS నిర్వహించిన ఋతుస్రావం, పారిశుద్ధ్యం, పోషకాహారం, కుటుంబ నియంత్రణల పై శిక్షణా కార్యక్రమాలకు ఈ ఇద్దరు మహిళలు హాజరయ్యారు. వికాస్ సంఘ్ పనిచేసే మధుబని జిల్లాలోని దాదాపు 40 గ్రామాలలో, మహిళలు విక్రయించగలిగే ఋతు పరిశుభ్రత ఉత్పత్తులు, కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలతో కూడిన కిట్-బ్యాగ్‌తో 'సహేలీ నెట్‌వర్క్'ని కూడా సంస్థ మహిళలకు సమకూర్చడం ప్రారంభించింది. ఇది మహిళల ఇంటి వద్దకు గర్భనిరోధకతను తీసుకువచ్చింది - అది కూడా తీర్పులు ఇవ్వని సహచరుల ద్వారా. 2019లో, DPMA ఇంజెక్షన్ కూడా ‘పరి’ అన్న పేరుతొ ఈ  కిట్ లో భాగమైంది.

Salah with ANM Munni Kumari: She and Shama learnt how to administer injections along with a group of about 10 women trained by ANMs (auxiliary-nurse-midwives) from the nearby PHCs
PHOTO • Kavitha Iyer

ANM మున్నీ కుమారితో సలా: ఆమె, షమ, సుమారు 10 మంది మహిళల బృందంతో కలిసి ఇంజెక్షన్లు ఎలా వేయాలో సమీపంలోని PHCల నుండి శిక్షణ పొందిన ANMల (సహాయక-నర్స్-మిడ్‌వైవ్‌లు) ద్వారా నేర్చుకున్నారు

“సహేలీ నెట్‌వర్క్‌లోని దాదాపు 32 మంది మహిళలు ఇప్పుడు సేల్స్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నారు. మేము వారిని స్థానిక హోల్‌సేల్ వ్యాపారితో అనుసంధానించాము, అతని నుండి వారు హోల్‌సేల్ ధరలకు పెద్దమొత్తంలో కొనుగోలు చేస్తారు,” అని మధుబనిలో ఉన్న GPSVS చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమేష్ కుమార్ సింగ్ చెప్పారు. దీని కోసం సంస్థ, ప్రారంభ మూలధనంతో కొంతమంది మహిళలకు సహాయం చేసింది. “వారు విక్రయించే ప్రతి వస్తువు పై 2 రూపాయిలు సంపాదిస్తారు,” అని సింగ్ చెప్పారు.

హసన్‌పూర్‌లో, తక్కువ సంఖ్యలో మహిళలు క్రమం తప్పకుండా ఇంజెక్షన్‌ను ఎంచుకోవడం ప్రారంభించినప్పుడు, వారు ముందు డోస్ అయిన మూడు నెలల రెండు వారాల తర్వాత మాత్రమే తదుపరి డోస్ తీసుకునేలా చూసుకోవలసివచ్చేది. షమ, సలా, ఇంకా  సుమారు 10 మంది మహిళల బృందంతో పాటుగా,  సమీపంలోని PHCల నుండి శిక్షణ పొందిన ANMల ద్వారా  (సహాయక-నర్స్-మిడ్‌వైవ్‌లు)ఇంజెక్షన్లు ఎలా వేయాలో నేర్చుకున్నారు. (హసన్‌పూర్‌లో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రం(PHC) లేదు; సమీప PHCలు16, 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫుల్‌పరస్, ఝంఝర్‌పూర్‌లో ఉన్నాయి.)

ఫుల్‌పరాస్ పిహెచ్‌సిలో అంతరా ఇంజెక్షన్ తీసుకున్న వారిలో ఉజ్మా (పేరు మార్చబడింది), అనే యువతి ఉంది. ఈమె ముగ్గురు పిల్లల తల్లి, ఆమె తన పిల్లలను ఒకరి వెనుక ఒకరిని వెంటవెంటనే ప్రసవించింది. “నా భర్త ఉద్యోగం కోసం ఢిల్లీకి, ఇతర ప్రాంతాలకు వెళ్తాడు. అతను ఇంటికి తిరిగి వచ్చినప్పుడల్లా సూయ్ [ఇంజెక్షన్] తీసుకోవడం సరైందేనని మేము నిర్ణయించుకున్నాము. ఇప్పుడు కాలం చాలా కష్టంగా ఉంది, మేము పెద్ద కుటుంబాన్ని భరించలేము.” అని ఆమె చెప్పింది. ఉజ్మా ఇప్పుడు ట్యూబల్ లిగేషన్ ద్వారా "శాశ్వత" పరిష్కారాన్ని గురించి ఆలోచిస్తున్నట్టు చెప్పింది.

‘మొబైల్ హెల్త్ వర్కర్స్’గా శిక్షణ పొందిన మహిళలు ఉచితంగా అంతరా ఇంజక్షన్ తీసుకోవాలనుకునే మహిళలను తాము నమోదు చేసుకోవలసిన పిహెచ్‌సిలకు అనుసంధానించడంలో కూడా సహాయపడతారు. గ్రామస్థాయి అంగన్‌వాడీలు కూడా చివరికి మహిళలకు అంతరా ఇంజెక్షన్లను అందుబాటులో ఉంచాలని భావిస్తున్నారు, అని షమ, సలా చెప్పారు. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ యొక్క మాన్యువల్ ప్రకారం మూడవ దశ సబ్-సెంటర్లలో కూడా గర్భనిరోధక  ఇంజెక్షన్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది.

ప్రస్తుతం గ్రామంలోని చాలా మంది మహిళలు ఇద్దరు పిల్లల తర్వాత "విరామం"ని పాటిస్తున్నారని షమ చెప్పింది.

అయితే ఈ మార్పు హసన్‌పూర్‌ వరకు రావడానికి సమయం పట్టింది. " లంబా లగా [దీనికి చాలా సమయం పట్టింది ]," అని షామా చెప్పారు, "కానీ మేము సాధించాము."

యాభయేళ్ళకు వయసుకు దగ్గరగా ఉన్న షమా భర్త రెహ్మతుల్లా అబు, MBBS డిగ్రీ లేనప్పటికీ, హసన్‌పూర్‌లో మెడికల్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతని మద్దతుతో, 15 సంవత్సరాల క్రితం, షమ మదర్సా బోర్డులో ఇంటర్మీడియట్ కు ప్రీ-డిగ్రీ సర్టిఫికేషన్ అయిన అలీమ్-స్థాయి పరీక్షను పూర్తి చేసింది. ఇటువంటి మద్దతు ఉండడం, మహిళలతో ఆమె చేసిన పని, షమాకు, తన భర్తతో కలిసి కొన్నిసార్లు డెలివరీల కోసం వెళ్లడానికి లేదా వారి ఇంటిలోని క్లినిక్‌ ద్వారా రోగులను సౌకర్యవంతంగా ఉంచడానికి ధైర్యాన్ని ఇచ్చింది.

PHOTO • Kavitha Iyer

షమ, సలా లు ముస్లింలు ఎక్కువగా ఉండే తమ గ్రామంలో, గర్భనిరోధకం విషయంలో మతపరమైన విశ్వాసాల వలన సున్నితంగా చర్చలు జరపవలసి ఉంటుందని అనుకోరు. బదులుగా, సమాజం కాలక్రమేణా విషయాలను భిన్నంగా చూడటం ప్రారంభించిందని వారు అంటున్నారు

షమ 1991లో వివాహమై నేటి సుపాల్ జిల్లాలోని దుబియాహి నుండి హసన్‌పూర్‌కి వచ్చినప్పుడు ఆమె బాలవధువు, కనీసం కౌమారాన్ని కూడా చేరలేదు. “నేను ఇంతకు ముందు కఠినమైన పర్దా ను పాటించేదానిని; నేను మొహల్లా ను కూడా చూడలేదు,” అని ఆమె చెప్పింది. మహిళా సమూహంతో ఆమె చేసిన పని ఆమెను పూర్తిగా మార్చింది. “ఇప్పుడు నేను పిల్లల పూర్తి ఆరోగ్య తనిఖీ చేయగలను. నేను ఇంజెక్షన్లు చేయడం సెలైన్ డ్రిప్‌ను పెట్టడం కూడా వచ్చు. ఇత్నా కర్ లేతే హై [నాకు ఆ మాత్రం వచ్చును],” అని ఆమె చెప్పింది.

షమ, రెహ్మతుల్లా అబూ దంపతులకు ముగ్గురు పిల్లలు. పెద్ద కొడుకు 28 ఏళ్లయినా పెళ్లి చేసుకోలేదని ఆమె గర్వంగా చెబుతోంది. ఆమె కుమార్తె గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి బీఈడీ కోర్సులో చేరాలనుకుంటుంది. "మాషల్లా, ఆమె ఉపాధ్యాయురాలు అవుతుంది," అని షమ సంతోషంతో అన్నది. చిన్న కొడుకు కాలేజీలో చదువుతున్నాడు.

హసన్‌పూర్‌లోని మహిళలు తమ కుటుంబాన్ని చిన్నగా ఉంచుకోమని చెప్పే షమ మాటలను  శ్రద్ధగా వింటారు. “వారు వేరే ఆరోగ్య సమస్యలతో కొన్నిసార్లు నా వద్దకు వస్తారు. అప్పుడు నేను వారికి గర్భ నిరోధకత గురించి కూడా సలహా ఇస్తాను. కుటుంబం ఎంత చిన్నదైతే, కుటుంబం లోని వారు అంత సంతోషంగా ఉంటారు.”

షమ తన విశాలమైన ఇంటి వరండాలో రోజువారీ తరగతులను నిర్వహిస్తుంది, ఆమె ఇంటి గోడల పై రంగు ఊడివచ్చేస్తున్నా దాని స్తంభాలు, తోరణాలు 5 నుండి 16 సంవత్సరాల వయస్సుగల సుమారు 40 మంది విద్యార్థులకు చక్కని వెలుతురున్న బోధనా స్థలంగా మారుస్తాయి. ఆమె చదువుతో బాటుగా ఎంబ్రాయిడరీ లేదా కుట్టు, సంగీతం కూడా నేర్పిస్తుంది. ఇక్కడ, యుక్తవయసులో ఉన్న అమ్మాయిలు కూడా ఏమైనా సందేహాలుంటే షమ వద్దకు వస్తారు.

ఆమె పూర్వ విద్యార్థులలో గజాలా ఖాతున్ కు 18 సంవత్సరాలు. “తల్లి గర్భమే బిడ్డకు మొదటి మదర్సా. నేర్చుకోవడం దగ్గరనుంచి మంచి ఆరోగ్యం పొందడం వరకు - అన్ని అక్కడే మొదలవుతాయి,” అని ఆమె షమ నుండి నేర్చుకున్న ఒక పంక్తిని మళ్లీ మళ్లీ చెబుతుంది. “నెలసరి సమయంలో ఏమి చేయాలి అనేదాని నుండి పెళ్లి చేసుకోవడానికి సరైన వయస్సు ఎంత వరకు, అనేవన్నీ నేను నేర్చుకున్నాను. నా కుటుంబంలోని మహిళలందరూ ఇప్పుడు గుడ్డ  కాక శానిటరీ ప్యాడ్‌లను ఉపయోగిస్తున్నారు. నేను పోషకాహారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటాను. నేను ఆరోగ్యంగా ఉంటే, భవిష్యత్తులో నాకు ఆరోగ్యవంతమైన పిల్లలు పుడతారు.” అని ఆమె చెప్పింది.

సలా (ఆమె కుటుంబం గురించి పెద్దగా మాట్లాడదానికి ఇష్టపడదు) మాటలను కూడా చుట్టుపక్కలవారు  నమ్ముతారు. ఆమె ఇప్పుడు హసన్‌పూర్ మహిళా మండలానికి చెందిన తొమ్మిది పొదుపు గ్రూపులకు నాయకురాలు. ఒక్కొక్క గ్రూపులో 12-18 మంది మహిళలు నెలకు 500 - 750 రూపాయిలు పొదుపుచేస్తారు. ఈ గ్రూపులు నెలకోసారి సమావేశమవుతాయి. ఈ గ్రూపులలో, అనేక మంది యువ తల్లులు ఉన్నారు, వారితో సలా గర్భ నిరోధకత గురించి చర్చిస్తుంది.

Several young mothers often attend local mahila mandal meetings where Salah encourages discussions on birth control
PHOTO • Kavitha Iyer

అనేక మంది యువ తల్లులు మహిళా మండలి సమావేశాలకు వస్తారు, వారితో సలా గర్భ నిరోధకత గురించి చర్చిస్తుంది

1970ల చివరలో మధుబనికి చెందిన GPSVS వ్యవస్థాపక సభ్యుడు, మాజీ ఛైర్మన్ జితేంద్ర కుమార్ ఇలా అంటారు, “మా 300 మహిళా సంఘాలకు కస్తూర్బా మహిళా మండలాలు అని పేరు పెట్టారు.  ఇలాంటి సంప్రదాయవాద సమాజాలలో [హసన్‌పూర్] గ్రామ మహిళల సాధికారతను సాకారం చేయడమే మా ప్రయత్నం.” షమా, సలా వంటి వాలంటీర్లను విశ్వసించడానికి అన్ని రంగాలలో పనిచేసే స్వభావం వలన కమ్యూనిటీలు వారి మాటలను వింటాయని, అతను నొక్కి చెప్పారు. “పల్స్ పోలియో వలన అబ్బాయిలతో వంధత్వం వస్తుందని ఇక్కడి ప్రాంతాలలో పుకార్లు కూడా ఉండేవి. మార్పు రావడానికి సమయం పడుతుంది…”

షమ, సలా లు తమ ముస్లింలు ఎక్కువగా ఉండే గ్రామంలో గర్భనిరోధకం విషయంలో మతపరమైన విశ్వాసాల గురించి సున్నితమైన చర్చలు జరపవలసి ఉంటుందని అనుకోరు. బదులుగా, సమాజమే కాలక్రమేణా విషయాలను భిన్నంగా చూడటం ప్రారంభించిందని వారు అంటున్నారు.

"నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను," అని షమ అన్నది. “గత సంవత్సరం, BA డిగ్రీ ఉన్న నా బంధువు మళ్లీ గర్భవతి అయింది. ఆమెకు అప్పటికే ముగ్గురు పిల్లలు. ఆఖరి ప్రసవానికి ఆమెకు ఆపరేషన్ కూడా జరిగింది. నేను ఆమెను జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాను, ఆమె పొత్తికడుపు తెరుచుకుంది. ఆమెకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలున్నాయి. ఈసారి గర్భాశయాన్ని తొలగించడానికి, ఆమె మరొక శస్త్రచికిత్స చేయించుకోవలసి వచ్చింది. ఈ ఆపరేషన్ కోసం, వారు మొత్తం మీద 3-4 లక్షల రూపాయిలు ఖర్చుపెట్టవలసి వచ్చింది.” ఇటువంటి సంఘటనలు ఇతర స్త్రీలు సురక్షితమైన గర్భనిరోధక పద్ధతులను గురించి కనుక్కుని పాటించడానికి ప్రేరేపిస్తాయి.

ప్రజలు ఇప్పుడు గుణా (పాపం) అంటే ఏమిటో సూక్ష్మంగా అర్ధం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని సలా చెప్పారు. "నా మతంలో కూడా మీరు మీ బిడ్డను చూసుకోవాలి, బిడ్డ ఆరోగ్యాన్ని చూసుకోవాలి, బిడ్డకు మంచి బట్టలు ఇవ్వాలి, బాగా పెంచాలి అని ఉంది ..." అని ఆమె చెప్పింది. “ ఏక్ దర్జన్ యా ఆధా దర్జన్ హమ్ పైదా కర్ లియే [మనం డజను లేదా అరడజను మంది పిల్లలకు జన్మనిచ్చి] ఆ తరవాత వారిని గాలికి వదిలేస్తే ఎలా  –  మనం పుట్టించిన పిల్లలను విడిచిపెట్టి, వారి తిండి వారిని వెతుక్కోనివ్వమని మతం ఆదేశించదు..”

పాత భయాలు తొలగిపోయాయి, అన్నది సలాహ్. “అత్తగారు ఇకపై ఇంటిపై ఆధిపత్యం వహించడం లేదు. కొడుకు సంపాదించి తన భార్యకి డబ్బు పంపుతాడు. ఆమే ఇంటికి ముఖియా [ముఖ్యమంత్రి]. పిల్లల మధ్య అంతరం ఉంచడం, గర్భాశయంలోని పరికరం లేదా మాత్రలు లేదా ఇంజెక్షన్ ఉపయోగించడం గురించి మేము ఆమెకు బోధిస్తాము. ఆమెకు ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు ఉంటే, శస్త్రచికిత్స [స్టెరిలైజేషన్] చేయించుకోమని కూడా మేము ఆమెకు సలహా ఇస్తున్నాము.”

ఈ ప్రయత్నాలకు హసన్‌పూర్‌ ప్రజలు బాగానే స్పందించారు. సలాహ్ ప్రకారం: " లైన్ పె ఆ గయే [ప్రజలు ఒక దారిలో పడ్డారు]."

పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా లో భాగంగా, PARI మరియు కౌంటర్ మీడియా ట్రస్ట్ కలిసి గ్రామీణ భారతదేశంలో కౌమారదశలో ఉన్న బాలికలు మరియు యువతులపై దేశవ్యాప్త రిపోర్టింగ్ ప్రాజెక్ట్ ను చేస్తున్నారు. సమాజంలో కీలకమైన పాత్రను పోషించే అట్టడుగు వర్గాల పరిస్థితులను అన్వేషించడానికి, సాధారణ ప్రజల గొంతులను, వారి అనుభవాలను వినిపించడానికి ఈ ప్రాజెక్టు కృషి చేస్తుంది.

ఈ వ్యాసాన్ని ప్రచురించాలనుకుంటున్నారా? అయితే  [email protected] కి మెయిల్ చేసి [email protected] కి కాపీ పెట్టండి.

అనువాదం: అపర్ణ తోట

Kavitha Iyer

کویتا ایئر گزشتہ ۲۰ سالوں سے صحافت کر رہی ہیں۔ انہوں نے ’لینڈ اسکیپ آف لاس: دی اسٹوری آف این انڈین‘ نامی کتاب بھی لکھی ہے، جو ’ہارپر کولنس‘ پبلی کیشن سے سال ۲۰۲۱ میں شائع ہوئی ہے۔

کے ذریعہ دیگر اسٹوریز Kavitha Iyer
Illustrations : Labani Jangi

لابنی جنگی مغربی بنگال کے ندیا ضلع سے ہیں اور سال ۲۰۲۰ سے پاری کی فیلو ہیں۔ وہ ایک ماہر پینٹر بھی ہیں، اور انہوں نے اس کی کوئی باقاعدہ تربیت نہیں حاصل کی ہے۔ وہ ’سنٹر فار اسٹڈیز اِن سوشل سائنسز‘، کولکاتا سے مزدوروں کی ہجرت کے ایشو پر پی ایچ ڈی لکھ رہی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Labani Jangi
Editor and Series Editor : Sharmila Joshi

شرمیلا جوشی پیپلز آرکائیو آف رورل انڈیا کی سابق ایڈیٹوریل چیف ہیں، ساتھ ہی وہ ایک قلم کار، محقق اور عارضی ٹیچر بھی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز شرمیلا جوشی
Translator : Aparna Thota

Aparna Thota is a writer (Telugu & English) based out in Hyderabad. ‘Poorna’ and ‘Bold & Beautiful’ are her published works.

کے ذریعہ دیگر اسٹوریز Aparna Thota