“ఏమి చెప్పను? నా వెన్ను విరిగింది, నా పక్కటెముక బయటకి పొడుచుకు వచ్చింది" అని బిబాబాయి లోయారే అన్నది. “నా పొత్తికడుపు లోపలి వెళ్ళిపోయింది, గత 2 లేదా 3 సంవత్సరాలుగా నా పొట్ట,వెన్ను కలిసిపోయాయి. డాక్టర్ నా ఎముకలు బోలుగా మారాయని చెప్పారు.”

ముల్షి బ్లాక్‌లోని హదాషి గ్రామంలోని ఆమె ఇంటికి ఆనుకుని ఉన్న, టిన్ షీట్‌లతో తయారుచేసిన వంటగదిలో, మసక వెలుతురులో మేము కూర్చున్నాము. దాదాపు 55 ఏళ్ల వయసున్న బీబాబాయి గిన్నెలో మిగిలిపోయిన అన్నాన్ని మట్టి పొయ్యి మీద వేడి చేస్తోంది. ఆమె నాకు కూర్చోవడానికి ఒక చెక్క పాట్ (పీట) ఇచ్చి తన పనులను చేసుకుంటోంది. ఆమె మధ్యలో లేచినప్పుడు, ఆమె గడ్డం దాదాపు ఆమె మోకాళ్లను తాకేలా నడుము నుండి ఆమె పూర్తిగా వంగి పోయినట్లుండడం నేను చూశాను. ఆమె గొంతుకు కూర్చున్నప్పుడు, ఆమె మోకాళ్లు, చెవులను తాకుతున్నాయి.

గత 25 ఏళ్లలో బోలు ఎముకల వ్యాధి, నాలుగు సర్జరీలు బిబాబాయిని ఈ విధంగా చేశాయి. మొదట, ఆమె ట్యూబెక్టమి చేయించుకుంది, ఆ తర్వాత హెర్నియాకు శస్త్రచికిత్స, తరువాత గర్భాశయ శస్త్రచికిత్స, ఆపై ఆమె ప్రేగులు, పొత్తికడుపులో  కొవ్వు కండరాలలో కొంత భాగాన్ని తొలగించే ఆపరేషన్ చేయించుకుంది.

“నాకు 12 లేదా 13 సంవత్సరాల వయస్సులో పెళ్లి జరిగింది, నేను వయస్సులోకి రాగానే [ఆమెకు మొదటి పీరియడ్ వచ్చింది] పెళ్ళిచేసినా, మొదటి ఐదేళ్లు నేను గర్భం దాల్చలేదు,” అని బీబాబాయి చెప్పింది, ఆమె పాఠశాలకు వెళ్ళలేదు. ఆమె భర్త, మహిపతి లోయారే - అందరూ అప్పా అని పిలుస్తారు- ఆమె కంటే 20 సంవత్సరాలు పెద్దవాడు, ప్రస్తుతం జిల్లా పరిషత్ పాఠశాలలో రిటైర్డ్ ఉపాధ్యాయుడు, పూణే జిల్లాలోని ముల్షి బ్లాక్‌లోని వివిధ గ్రామాలలోని పాఠశాలల్లో పనిచేశాడు. లోయరే కుటుంబం, వారి వ్యవసాయ భూమిలో వరి, బెంగాల్ పప్పు, బీన్స్ మరియు చిక్కుళ్ళు పండిస్తున్నారు. వారికి ఒక జత ఎద్దులు, ఒక గేదె, ఒక ఆవు, దాని దూడ కూడా ఉన్నాయి. ఆవు ఇచ్చే పాలు వారికి అదనపు ఆదాయాన్ని సమకూరుస్తాయి. మహిపతికి పెన్షన్ కూడా వస్తుంది.

"నా పిల్లలందరూ ఇంట్లోనే పుట్టారు," అని బిబాబాయి చెప్పింది. ఆమెకు 17 ఏళ్ల వయసులో మొదటి సంతానం, అబ్బాయి పుట్టాడు. “మేము మా తల్లిదండ్రుల ఇంటికి [“కొండ శ్రేణికి ఆవల” ఉన్న గ్రామంలో] పక్కా రోడ్డు, వాహనాలు లేని కారణంగా ఎద్దుల బండిలో వెళ్తున్నాము. దారిలో నా  ఉమ్మనీటి సంచి పగిలింది. నాకు ప్రసవం అక్కడే జరిగి, ఆ ఎద్దుల బండిలోనే నా మొదటి బిడ్డ పుట్టాడు.” అని బిబాబాయి గుర్తుచేసుకుంది. ప్రసవ సమయంలో చినిగిన కండరానికి ఆమెకు ఎపిసియోటమి (episiotemy- ప్రసవ సమయంలో కొందరికి యోని కింది కణజాలం చిరిగిపోతుంది, కొన్నిసార్లు కావాలనే ప్రసవం తేలికగా అవడానికి కత్తిరిస్తారు, రెండు సమయాలలోను తిరిగి కుట్లు వేస్తారు, దానినే ఎపిసియోటమి అంటారు) చేశారు. కానీ అదెక్కడ  జరిగిందో ఆమెకి గుర్తు లేదు.

'My back is broken and my rib cage is protruding. My abdomen is sunken, my stomach and back have come together...'
PHOTO • Medha Kale

'నా వెన్ను విరిగి, పక్కటెముక బయటకు పొడుచుకు వచ్చింది. నా పొత్తికడుపు లోపలికి వెళ్ళిపోయింది, నా పొట్ట, వెన్ను కలిసిపోయాయి...'

ఆమె రెండవ గర్భధారణ సమయంలో, హదాషికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్ద గ్రామమైన కోల్వాన్‌లోని ఒక ప్రైవేట్ క్లినిక్‌లోని వైద్యులు ఆమె హిమోగ్లోబిన్ తక్కువగా ఉందని, పిండం పెరుగుదల కూడా సాధారణం కంటే తక్కువగా ఉందని చెప్పారని బిబాబాయి గుర్తు చేసుకున్నది. గ్రామంలోని ఓ నర్సు నుంచి 12 ఇంజక్షన్లు, ఐరన్ మాత్రలు వేయించుకున్నట్లు ఆమెకు గుర్తుంది. నెలలు నిండిన తర్వాత, బీబాబాయ్ ఒక అమ్మాయికి జన్మనిచ్చింది. “పుట్టిన బిడ్డ  ఎప్పుడూ ఏడవలేదు, ఏ శబ్దమూ చేయలేదు. తన ఊయలలో పడుకుని, పైకప్పు వైపు చూస్తూ ఉండేది. ఆమె మామూలుగా లేదని మేము వెంటనే గ్రహించాము.”

బీబాబాయి మరో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది, ఇద్దరూ మగపిల్లలు. అందరిలోకి చిన్నవాడైన ఆమె నాల్గవ సంతానం, చీలిక పెదవి, అంగిలితో పుట్టాడు. “నేను అతనికి పాలు తాగిస్తే, అది అతని ముక్కు నుండి బయటకు వచ్చేది. వైద్యులు [కొల్వాన్‌లోని ఒక ప్రైవేట్ క్లినిక్‌లో] 20,000 రూపాయల ఖర్చుతో కూడిన శస్త్రచికిత్స గురించి మాకు చెప్పారు. అయితే అప్పట్లో మేం ఉమ్మడి కుటుంబంలో ఉండేవాళ్లం. నా భర్త తండ్రి, అన్నయ్య [శస్త్రచికిత్స అవసరాన్ని] పెద్దగా పట్టించుకోలేదు, నా బిడ్డ ఒక నెలలోనే మరణించాడు,” అని బిబాబాయి బాధగా చెప్పింది.

ఆమె పెద్ద కొడుకు ఇప్పుడు వారి కుటుంబానికి చెందిన పొలంలో పనిచేస్తున్నాడు, ఆమె మూడవ సంతానమైన  చిన్న కొడుకు, పూణేలో ఎలివేటర్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు.

తన నాల్గవ బిడ్డ మరణించిన తర్వాత, హదాషికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూణేలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో బిబాబాయి ట్యూబెక్టమీ చేయించుకుంది. అప్పటికి ఆమె వయసు 20 ఏళ్లు. ఆమె పెద్ద బావగారు  ఆ ఖర్చులు చూసుకున్నారు, ఆమెకు ఆ వివరాలు గుర్తు లేవు. స్టెరిలైజేషన్ ప్రక్రియ జరిగిన కొన్ని సంవత్సరాలకు, ఆమెకు దీర్ఘకాలిక కడుపునొప్పి వచ్చి, పొట్టకు ఎడమ వైపున పెద్ద ఉబ్బెత్తుగా ఏదో ఏర్పడింది - బిబాబాయి అది కేవలం 'గ్యాస్' అని చెప్పినప్పటికీ, వైద్యులు హెర్నియాని నిర్ధారించారు. ఇది ఆమె గర్భాశయం మీద నొక్కుకుపోయి చాలా ఘోరమైన బాధను అనుభవించేది. పుణెలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో హెర్నియాకు ఆపరేషన్ చేశారు. ఆ ఖర్చులన్నీ ఆమె మేనల్లుడు చూసుకున్నాడు. ఆమెకు ఎంత ఖర్చయిందో తెలియదు.

Bibabai resumed strenuous farm labour soon after a hysterectomy, with no belt to support her abdominal muscles
PHOTO • Medha Kale

బిబాబాయి గర్భసంచిని తొలగించిన వెంటనే, పొత్తికడుపు కండరాలను పట్టి ఉంచడానికి బెల్టును వాడకుండానే కఠినమైన వ్యవసాయ పనిని తిరిగి ప్రారంభించింది

ఆ తర్వాత, ఆమె 30 ఏళ్ళ చివరలో, బిబాబాయికి నెలసరిలో అధిక రుతుస్రావం అవడం మొదలైంది. "రక్తస్రావం ఎంత విపరీతంగా ఉండేది అంటే, పొలంలో పని చేస్తున్నప్పుడు, రక్తం గడ్డలు గడ్డలుగా నేలమీద పడిపోయేది, నేను వాటిని మట్టితో కప్పేసేదాన్ని," అని ఆమె గుర్తుచేసుకుంది. రెండు సంవత్సరాల పాటు దీనిని భరించిన తర్వాత, బీబాబాయి ఒక ప్రైవేట్ వైద్యుడిని మళ్లీ కలుసుకున్నది. కొల్వాన్‌లోని క్లినిక్‌లో ఆమె గర్భాశయం పాడైపోయిందని (' పిష్వి నాస్లియే ') అత్యవసరంగా తొలగించాలని చెప్పాడు.

కాబట్టి, ఆమె 40 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, పూణేలోని ఒక ప్రసిద్ధ ప్రైవేట్ ఆసుపత్రిలో బిబాబాయికి గర్భాశయాన్ని తొలగించే శస్త్రచికిత్స జరిగింది. ఆమె జనరల్ వార్డులో వారం రోజులు గడిపింది. "శస్త్రచికిత్స తర్వాత వైద్యులు [కడుపు కండరాలకు మద్దతు ఇవ్వడానికి] ఒక బెల్ట్‌ను సూచించారు, కానీ నా కుటుంబం ఎప్పుడూ బెల్ట్ కొనలేదు," అని బిబాబాయి చెప్పింది; బహుశా వారు బెల్ట్ ఎంత ముఖ్యమో గ్రహించలేదు. ఆమెకు తగినంత విశ్రాంతి లభించలేదు, పైగా వెంటనే తిరిగి పొలం పని చేయడం మొదలుపెట్టింది.

ఈ శస్త్రచికిత్స తర్వాత 1 నుండి 6 నెలల వరకు ఎలాంటి శ్రమతో కూడిన కార్యకలాపాలు చేపట్టవద్దని సలహా ఇచ్చినప్పటికీ, వ్యవసాయ రంగంలోని మహిళలు "ఇంత కాలం విశ్రాంతి తీసుకునే పరిస్థితిలో ఉండరు" కాబట్టి వారు సాధారణంగా వెంటనే పనికి తిరిగి వస్తారని ఒక పేపర్ పేర్కొంది. ప్రీమెనోపాజ్(Premenopause- ఋతుచక్రం ఇంకా ఆగిపోని దశ)లో ఉన్న గ్రామీణ మహిళల్లో గర్భాశయ శస్త్రచికిత్స గురించి  నీలంగి సర్దేశ్‌పాండే రచించిన ఈ పేపర్, ఏప్రిల్ 2015లో ఇంటర్నేషనల్ రీసెర్చ్ జర్నల్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌ లో ప్రచురితమైంది.

చాలా కాలం తర్వాత, బిబాబాయి కొడుకుల్లో ఒకరు, రెండు బెల్టులు తెచ్చారు. కానీ ఆమె ఇప్పుడు వాటిని ఉపయోగించలేదు. "మీరు చూడండి, నాకు పొత్తికడుపు అంటూ ఏమి లేదు, ఈ బెల్ట్ కూడా సరిపోదు," అని ఆమె చెప్పింది. గర్భాశయాన్ని తొలగించిన రెండు సంవత్సరాల తర్వాత, పూణేలోని మరో ప్రైవేట్ ఆసుపత్రిలో బిబాబాయికి (తేదీలు, సంవత్సరాల వంటి వివరాలు ఆమెకు గుర్తులేవు) మరొక శస్త్రచికిత్స జరిగింది. "ఈసారి, పేగులు కూడా [పాక్షికంగా] తీసేశారు" అని ఆమె చెప్పింది. తన తొమ్మిది గజాల చీరలోని ముడిని కిందకి లాగి, ఆమె దాదాపుగా పుటాకారమైన పొత్తికడుపుని నాకు చూపించింది. అక్కడ అసలు మాంసం, కండరాలు ఏమి లేవు, ముడుతలుపడ్డ చర్మం మాత్రమే ఉంది.

ఈ పొత్తికడుపు శస్త్రచికిత్సకు సంబంధించిన వివరాలు కాని, చేయించుకోవల్సిన కారణాలు కాని, బిబాబాయి సరిగ్గా గుర్తులేవు.  కాని శస్త్రచికిత్స అనంతరం మూత్రాశయం, ప్రేగులు, మూత్రనాళాలకు తరచుగా గాయాలు అవుతాయని,  గర్భాశయాన్ని తొలగించిన తరవాత తలెత్తే సమస్యలలో ఇవి కూడా ఒకటని సర్దేశ్‌పాండే పేపర్ స్పష్టంగా చెబుతుంది. పూణే సతారా జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్వ్యూ చేసిన 44 ప్రీమెనోపౌసల్ మహిళల్లో దాదాపు సగం మంది, గర్భాశయ శస్త్రచికిత్స చేయించుకున్నారు. శస్త్రచికిత్స తరవాత మూత్రవిసర్జనలో ఇబ్బందులు, పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి ఉండేదని  చెప్పారు. చాలామంది శస్త్రచికిత్స తర్వాత దీర్ఘకాలం పాటు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నామని, శస్త్రచికిత్సకు ముందు వారు అనుభవించిన కడుపు నొప్పి ఇప్పటికీ తగ్గలేదని చెప్పారు.

Despite her health problems, Bibabai Loyare works hard at home (left) and on the farm, with her intellactually disabled daughter Savita's (right) help
PHOTO • Medha Kale
Despite her health problems, Bibabai Loyare works hard at home (left) and on the farm, with her intellactually disabled daughter Savita's (right) help
PHOTO • Medha Kale

ఆమెకు ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ, బిబాబాయి లోయారే తన మానసికంగా ఇంకా ఎదగని కుమార్తె సవిత (కుడి) సహాయంతో ఇంట్లో (ఎడమ), పొలంలో కష్టపడి పని చేస్తుంది

వీటన్నింటితో పాటు, బీబాబాయికి గత 2 నుండి 3 సంవత్సరాలుగా తీవ్రమైన బోలు ఎముకల వ్యాధి వచ్చింది. గర్భాశయాన్ని తొలగించడం, ముందే ఋతుచక్రం ఆగిపోవడం వలన హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి తరచుగా బోలు ఎముకల వ్యాధి బారిన పడతారు.  బీబాబాయి ఇప్పుడు నిద్రపోతున్నప్పుడు కూడా తన వీపును నిఠారుగా ఉంచలేదు. ఆమె సమస్య ‘ఆస్టియోపొరోటిక్ కంప్రెషన్ ఫ్రాక్చర్స్ విత్ సెవెరె కిఫోసిస్ (osteoporotic compression fractures with severe kyphosis)' గా నిర్ధారించబడింది. ఆమె 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న, పారిశ్రామిక పట్టణమైన పింప్రి-చించ్‌వాడ్‌లోని చిఖాలీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

ఆమె తన రిపోర్టులున్న ప్లాస్టిక్ సంచిని నాకు ఇచ్చింది. ఇంత తీవ్రమైన నొప్పి, అనారోగ్యంతో నిండిన జీవితాన్ని గురించి చెప్పడానికి, ఆమె ఫైల్‌లో కేవలం మూడు షీట్‌లు, ఒక ఎక్స్-రే రిపోర్టు, కొన్ని మందుల కొనుగోలు రసీదులు మాత్రమే ఉన్నాయి. ఆమె జాగ్రత్తగా ఒక ప్లాస్టిక్ పెట్టెను తెరిచి, ఆమె నొప్పిని,  అసౌకర్యాన్ని తగ్గించే క్యాప్సూల్స్ స్ట్రిప్‌ను నాకు చూపించింది. విరిగిన బియ్యంతో నిండిన బస్తాను శుభ్రం చేయడం వంటి ఏదైనా కఠినమైన పనిని ఆమె చేయవలసి వచ్చినప్పుడు ఆమె తీసుకునే నాన్-స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు ఇవి.

"కఠినమైన శారీరక శ్రమ, ఈ కొండ ప్రాంతాలలో రోజువారీ కష్టాలు, పైగా పోషకాహార లోపం ఉండడం వలన, మహిళల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాలు ఉంటాయి," అని డాక్టర్ వైదేహి నగార్కర్ చెప్పారు. ఈమె హదాషి నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పౌడ్ గ్రామంలో గత 28 సంవత్సరాలుగా వైద్యం చేస్తున్నారు. "మా ఆసుపత్రిలో, పునరుత్పత్తి సంబంధ వ్యాధుల కోసం ఆరోగ్య సంరక్షణను కోరుకునే మహిళల సంఖ్యలో నేను కొంత మంచి మార్పును చూస్తున్నాను, అయితే ఐరన్ లోపం, అనీమియా, ఆర్థరైటిస్, బోలు ఎముకల వ్యాధి వంటి దీర్ఘకాలిక రుగ్మతలు ఇప్పటికీ చికిత్సను అందుకోవడం లేదు."

"ఎముకల ఆరోగ్యం, వ్యవసాయ పనిలో సమర్థతకు చాలా  కీలకమైనది. ముఖ్యంగా వృద్ధులలో, ఈ ఆరోగ్య సమస్య, పూర్తిగా నిర్లక్ష్యం చేయబడుతుంది," అని ఆమె అన్నారు.

The rural hospital in Paud village is 15 kilometres from Hadashi, where public health infrastructure is scarce
PHOTO • Medha Kale

పౌడ్ గ్రామంలోని గ్రామీణ ఆసుపత్రి హదాషి నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఇక్కడ ప్రజారోగ్య మౌలిక సదుపాయాలు చాలా తక్కువగా ఉన్నాయి

బీబాబాయికి ఆమె ఎందుకు అంతగా బాధపడిందో తెలుసు: “ఆ రోజుల్లో [20 సంవత్సరాల క్రితం], రోజంతా, ఉదయం నుండి రాత్రి వరకు, మేము పని చేసేవాళ్లం. ఇది కష్టమైన పని. [ఆమె ఇంటికి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న] కొండపై ఉన్న మా పొలాల్లో ఆవు పేడను ఏడు నుండి ఎనిమిది సార్లు తిరిగి మా పొలంలో కుప్ప చేసేవారిమి. బావి నుండి నీరు తెచ్చేవాళ్లం, పొయ్యి కోసం కర్రపుల్లలు ఏరుకునే వారం...”

ఇప్పుడు కూడా, బీబాబాయి తన పెద్ద కొడుకు, కోడలు సాగుచేసే వ్యవసాయ భూమిలో సహాయం చేస్తుంది. "మీకు తెలుసా, ఒక రైతు కుటుంబం ఎప్పుడూ విశ్రాంతి తీసుకోదు, " అని ఆమె అన్నది. "పైగా స్త్రీకి, ఆమె గర్భవతిగా ఉందా లేదా అనారోగ్యంతో ఉందా అనే పట్టింపు లేదు."

936 జనాభా కలిగిన గ్రామమైన హదాషిలో ప్రజారోగ్య మౌలిక సదుపాయాలు చాలా తక్కువగా ఉన్నాయి. సమీప ఆరోగ్య ఉప కేంద్రం కొల్వాన్‌లో ఉంటే, సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 14 కిలోమీటర్ల దూరంలోని కులే గ్రామంలో ఉంది. బిబాబాయి చాలా దశాబ్దాలుగా ప్రైవేట్ ప్రాక్టీషనర్లు, ప్రైవేట్ ఆసుపత్రుల నుండి ఆరోగ్య సంరక్షణను పొందడానికి  కొంతవరకు ఇదే కారణం కావచ్చు - అయినప్పటికీ ప్రతిసారి ఏ వైద్యులను, ఏ ఆసుపత్రులను సంప్రదించాలనే  నిర్ణయాలు ఆమె ఉమ్మడి కుటుంబంలోని పురుషులు తీసుకుంటారు.

గ్రామీణ మహారాష్ట్రలోని చాలామంది వ్యక్తుల మాదిరిగా కాకుండా, బీబాబాయికి ఎప్పుడూ భగత్‌ లు (సాంప్రదాయ వైద్యం చేసేవారు) లేదా దేవ్‌రుషీ లు (విశ్వాస వైద్యం చేసేవారు) పట్ల విశ్వాసం లేదు. ఆమె గ్రామంలో కేవలం ఒకసారి మాత్రమే వీరిని కలిసింది. “నన్ను ఒక పెద్ద గుండ్రటి ప్లేటులో కూర్చోబెట్టి, చిన్నపిల్లల మీద పోసినట్లు, నా తలమీద నీళ్ళు పోశాడు. నేను దానిని అసహ్యించుకున్నాను. అది ఒక్కసారి మాత్రమే,” అని ఆమె గుర్తుచేసుకుంది. ఆధునిక వైద్యంపై ఆమెకున్న విశ్వాసం, ఆమె భర్త చదువుకుని, పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేయడం వలన కూడా వచ్చి ఉండవచ్చు.

ఈలోగా అప్పాకు మందు వేసే సమయం అయింది. అతను బిబాబాయిని పిలిచాడు. దాదాపు 16 సంవత్సరాల క్రితం, పదవీ విరమణకు రెండు సంవత్సరాల ముందు, పక్షవాతం వలన  అతను మంచం పట్టాడు. అప్పకి  ఇప్పుడు 74 ఏళ్ళు. అతను తనంతట తానుగా మాట్లాడలేడు, తినలేడు, కదలలేడు. కొన్నిసార్లు అతను తన మంచం మీద నుండి తలుపు వరకు దేకుతూ వస్తాడు. నేను వారి ఇంటికి వచ్చిన మొదటిసారి వచ్చినప్పుడు, బీబాబాయి నాతో మాట్లాడటం వలన అతని మందు ఇవ్వడం ఆలస్యం అయింది. అప్పుడు అతను అతను కోపం తెచ్చుకున్నాడు.

బిబాబాయి అతనికి రోజుకు నాలుగు సార్లు తినిపిస్తుంది, అతని సోడియం లోపానికి చికిత్స చేయడానికి మందులు, ఉప్పునీరు ఇస్తుంది. 16 ఏళ్లుగా తన ఆరోగ్య సమస్యలతో సంబంధం లేకుండా సమయానికి, ప్రేమతో ఇలా చేస్తోంది. ఆమె పొలం పని, ఇంటి పని కూడా వీలైనంత వరకు చేయడానికి కష్టపడుతుంది. దశాబ్దాల తరబడి శ్రమ, వేదన, అనారోగ్యం తర్వాత కూడా, ఆమె చెప్పినట్లుగా, ఈ రైతు ఇంటి మహిళ ఎప్పుడూ విశ్రాంతి తీసుకోదు.

పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా లో భాగంగా, PARI మరియు కౌంటర్ మీడియా ట్రస్ట్ కలిసి గ్రామీణ భారతదేశంలో కౌమారదశలో ఉన్న బాలికలు మరియు యువతులపై దేశవ్యాప్త రిపోర్టింగ్ ప్రాజెక్ట్ ను చేస్తున్నారు. అట్టడుగున ఉన్నా ఎంతో కీలకమైన ఈ సమూహాల స్థితిగతులను అన్వేషించడానికి, సాధారణ ప్రజల గొంతులను, వారి అనుభవాలను వినిపించడానికి ఈ ప్రాజెక్టు కృషి చేస్తుంది.

ఈ వ్యాసాన్ని ప్రచురించాలనుకుంటున్నారా? అయితే [email protected]కి ఈమెయిల్ చేసి అందులో [email protected]కి కాపీ చేయండి.

అనువాదం: అపర్ణ తోట

Medha Kale

میدھا کالے پونے میں رہتی ہیں اور عورتوں اور صحت کے شعبے میں کام کر چکی ہیں۔ وہ پیپلز آرکائیو آف رورل انڈیا (پاری) میں مراٹھی کی ٹرانس لیشنز ایڈیٹر ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز میدھا کالے
Illustration : Priyanka Borar

پرینکا بورار نئے میڈیا کی ایک آرٹسٹ ہیں جو معنی اور اظہار کی نئی شکلوں کو تلاش کرنے کے لیے تکنیک کا تجربہ کر رہی ہیں۔ وہ سیکھنے اور کھیلنے کے لیے تجربات کو ڈیزائن کرتی ہیں، باہم مربوط میڈیا کے ساتھ ہاتھ آزماتی ہیں، اور روایتی قلم اور کاغذ کے ساتھ بھی آسانی محسوس کرتی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Priyanka Borar
Series Editor : Sharmila Joshi

شرمیلا جوشی پیپلز آرکائیو آف رورل انڈیا کی سابق ایڈیٹوریل چیف ہیں، ساتھ ہی وہ ایک قلم کار، محقق اور عارضی ٹیچر بھی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز شرمیلا جوشی
Translator : Aparna Thota

Aparna Thota is a writer (Telugu & English) based out in Hyderabad. ‘Poorna’ and ‘Bold & Beautiful’ are her published works.

کے ذریعہ دیگر اسٹوریز Aparna Thota