“నా దగ్గర సెల్ ఫోన్ లేదు, సర్కారోళ్ల దగ్గర నా పేరెట్లా రాయించుకోవాలి?” అని అడిగింది కుని తమలియా. ఆమె తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా, అన్నారం గ్రామంలో ఇటుకబట్టీల్లో పనిచేస్తుంది. అమెని, పిల్లల్ని శ్రామిక్ రైలు ఎక్కించడానికి పేర్లు రిజిస్టర్ చేసే పనిమీద మేము అక్కడికి వచ్చామేమో అనుకుంది.
వలస కార్మికులు బయటికి ప్రయాణం చెయ్యాలంటే తెలంగాణ ప్రభుత్వపు వెబ్సైట్ లో వాళ్ల సెల్ ఫోన్ నంబర్ ని నమోదు చెయ్యాలి. ఒరిస్సాకి తిరిగి వచ్చే కార్మికులకి ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నమోదుని తప్పనిసరి చేసింది.
ఆమె బాధగా కొడుకుల వైపు చూస్తూ “వీళ్ల ఆధార్ కార్డ్ లు కూడా ఊర్లో వదిలేసి వచ్చాను. వీళ్లని రైల్లో ఎక్కనిస్తారా?” అనడిగింది. భక్త, 15, జగన్నాథ్, 9, వీళ్ళిద్దరు ఆమె కొడుకులు. తన వయసు సుమారు 40 ఏళ్ళు ఉండొచ్చని కుని చెప్పింది. కానీ ఆధార్ కార్డ్ లో మాత్రం అమె వయసు 64 ఏళ్లని ఉంది. “ఈ కార్డ్ లో ఏముందో నాకు తెలీదు. వాళ్ళు ఏదో కంప్యూటర్ లో రాసుకున్నారు.” అంది.
నవంబర్ 2019 లో ఆమె ఇసుకబట్టీలో పనికి చేరింది. ఈ సంవత్సరం మే నెల కల్లా గడువు పూర్తయ్యి తిరిగి ఒరిస్సా వెళ్ళిపోవాల్సి ఉంది. కానీ లాక్డౌన్ వల్ల ఆ విధవరాలు, ఏమీ అర్థంకానీ అయోమయంలో పడిపోయింది. ఆమె ఇటుకపని మొదటిసారి చేస్తుంది. దెముహయాని లోని, బౌధ్ జిల్లా కంటమల్ బ్లాక్ నుండి ఆమె పిల్లల్తో కలిసి ట్రక్ లో గుమ్మడిదల మండలం, అన్నారం గ్రామానికి చేరుకుంది.
కుని పిల్లల్తో కలిసి అన్నారం వచ్చిన కొన్ని వారాలకి , 42 ఏళ్ల సుమిత్రా ప్రధాన్ కూడా ఒరిస్సా నుంచి అక్కడికి వచ్చింది. ఆమెతో పాటు ఆమె భర్త గోపాల్ రౌత్, 40 వాళ్ల ఐదుగురు పిల్లల్తో సహా వచ్చాడు. బలాంగిర్ టిట్లాఘర్ బ్లాక్ లోని, శగద్ఘట్ గ్రామం నుంచి వాళ్లు బట్టీలకి వచ్చారు. వాళ్ల పెద్దకొడుకు 20 ఏళ్ల రాజు కూడా అమ్మానాన్నలతో కలిసి పనిచేస్తాడు. వాళ్ళు ఇల్లొదిలి వచ్చేముందు ఇటుక కాంట్రాక్టర్ వాళ్ల ముగ్గురికీ కలిపి ఇక్కడ పని చెయ్యడానికి 75,000 రూపాయిలు ఇచ్చాడు.
ఈ విడత బట్టీల్లో కొన్ని నెలలు పనిచేశాక, మార్చి నాటికి కోవిడ్ – 19 గురించిన వార్తలు తెలుస్తున్నకొద్దీ సుమిత్రకి వైరస్ గురించి కంగారు మొదలైంది. ఆమె పిల్లలు జుగాల్, 9 రింకి, 7 రూప, 4 లకి జబ్బు చేస్తుందేమో అని భయపడింది. “పదేళ్లలోపు పిల్లలకి కరోనా వస్తుందని అంటున్నారు. మాకు తిరిగి వెళ్ళిపోవాలని ఉంది. కానీ మా యజమాని ఇంకో వారం రోజులు పనిచేస్తేనే మా గడువు పూర్తవుతుందని, అప్పుడే మేము వెళ్ళొచ్చనీ అంటున్నాడు. ఇప్పుడు మేము రైలెక్కాలంటే మా పేర్లు రాయించాలని తెలంగాణ సర్కారు వాళ్ళు అంటున్నారు.” అని చెప్పింది సుమిత్ర.
మేము అన్నారంలో కార్మికులని కలిసినప్పుడు అక్కడ ఎండ 44 డిగ్రీలుంది. ఇటుకలు మోసే పని నుంచి కుని ఒక గంట విరామం తీసుకుంది. ఇటుకలు ఊరికే పేర్చి కట్టిన తన గుడిసెలోకి మమ్మల్ని తీసికెళ్ళింది. లోపల ఏమాత్రం చోటు లేదు. ఇంటి పైకప్పులో సగం ఒక ఆస్బెస్టాస్ రేకుతో, ఇంకో సగం ఒక ప్లాస్టిక్ పట్టా కప్పి అది ఎగిరిపోకుండా రాళ్ళు మోపు చేసి ఉంది. ఎండని తట్టుకోడానికి ఇది చాలా మంచి ఏర్పాటు అనిపించింది. కుని మాతో మాట్లాడుతూ మిగిలిపోయిన అన్నాన్ని, మట్టినేల పైన కట్టెలపొయ్యి మీద కలబెట్టింది. పొయ్యిలో ఉన్న నిప్పురవ్వల వల్ల అన్నం ఇంకా వేడిగా ఉంది.
వారానికి ఆరురోజులు, ఉదయం ఆరు నుంచి రాత్రి పది గంటల వరకూ ఇటుకబట్టీలో పనిచేస్తూనే ఉంటానని ఆమె మాతో చెప్పింది. పనిరోజుల్లో పొద్దునొకసారి, సాయంత్రం ఒకసారి స్నానం, వంట, భోజనం, బట్టలుతకటం, అంట్లు తోమటం లాంటి పనులకోసం, ఆమె రోజుకి రెండుసార్లు పనినుంచి విరామం తీసుకుంటుంది. కొంతమందినైతే రోజులో ఒక్కసారే వెళ్ళనిస్తారు. “వాళ్ళు ఇటుకలు తయారు చేస్తారు. వాళ్ళు కదలకుండా చాలాసేపు ఇటుకలు చేస్తూ ఉంటారు. వాళ్లకి కూలీ కొంచం ఎక్కువిస్తారు. నాది ఇటుకలు మోసే పనే కాబట్టి కూలీ తక్కువ.” అని చెప్పింది.
బట్టీనుంచి ఇటుకలు ఎండబెట్టే చోటుకి వెళ్లడానికి 10 నిముషాలు పడుతుంది. ఆ సమయంలో కుని ఇటుకలు పేర్చడం, మొయ్యటం, దింపడం మళ్ళీ తిరిగి ఇటుకలున్న చోటకి వచ్చి పేర్చడం చేస్తుంది. ఇటుకలు మోసేవాళ్ళు మధ్యలో ఖాళీ లేకుండా తిరుగుతూనే ఉంటారు. “ఆడవాళ్ళు ఒకసారికి 12 నుండి 16 ఇటుకల వరకూ మొయ్యగలరు. మగవాళ్లు ఎక్కువ మోస్తారు. వాళ్లకి కూలి కూడా ఎక్కువే,” అని చెప్తూ ఒక పలకలాంటిదాన్ని తలమీద సరిగ్గా నిలబెడుతూ ఇటుకలు మోస్తున్న ఒక స్త్రీని చూపించింది కుని. మగవాళ్ళు భుజాలమీద బరువుని ఆపుతూ ఒక్కోవైపున 17 ఇటుకల్ని మొయ్యటం మాకు కనపడింది.
కుని పనిచేస్తున్న బట్టీ అన్నారంలో ఉన్న మిగతా బట్టీల కంటే చిన్నది. అక్కడి ఆవరణలో ఉంటున్న కార్మీకులకి కనీస సౌకర్యాలు లేవు. వాళ్లకి టాయిలెట్లు లేవు. ఒక సిమెంట్ టాంక్ లోని నీళ్లని అన్ని అవసరాలకి వాడుకోవాలి. “మేము ఈ టాంక్ దగ్గరే స్నానం చెయ్యడం, బట్టలు ఉతుక్కోవడం చేస్తాం. టాయిలెట్ కి వెళ్లాలంటే అక్కడ ఆరుబయట వెళ్ళడమే,” అ దగ్గర్లో కనబడుతున్న ఒక మైదానాన్ని చూపిస్తూ చెప్పింది కుని. “తాగడానికి, వంటకి టాంక్ నుంచే నీళ్ళు తీసుకొస్తాం.”
నవంబర్ లో దెముహయాని నుంచి వచ్చేటప్పుడు కుని కి 25,000 బయానా గా రావల్సి ఉంది. ఇది ఇటుకలు తయారుచేసేవాళ్లకంటే 10000 తక్కువ. “కానీ వాళ్ళు నాకు 15,000 మాత్రమే ఇచ్చారు. మే నెలలో పని పూర్తయ్యాక మిగతా డబ్బులిస్తారని సర్దార్ (కాంట్రాక్టర్) చెప్పాడు. ఇప్పుడైతే తిండికి, మిగతా ఖర్చులకి కలిపి వారానికి 400 రూపాయలు ఇస్తారు. నా భర్త చనిపోయాక పిల్లల్ని పోషించడం కష్టమైపోయింది.” అంది.
పోయినేడాది కుని భర్త కొన్నాళ్ళు మంచంపట్టి తర్వాత చనిపోయాడు. “ఆయనకి మోకాళ్ళు దెబ్బతిన్నాయని డాక్తర్ చెప్పారు. వాళ్ళు చెప్పిన మందులు కొనటానికి, మంచి తిండి పెట్టడానికి మా దగ్గర డబ్బుల్లేవు,” నీళ్ళుగా ఉన్న గంజి గిన్నెమీద అల్యూమినియం ప్లేటు మూతపెడుతూ అందామె.
ఊర్లో ఉన్నప్పుడు కుని వ్యవసాయకూలీగా వరి, పత్తి పొలాల్లో పనిచేసేది. ఆమెకి రోజుకి 150 రూపాయలు కూలి ఇచ్చేవాళ్ళు. “కాకపోతే రోజూ పని దొరికేది కాదు. ఎప్పుడైనా ఎవరైనా పిలిస్తే పనికెళ్ళెదాన్ని. ఇద్దరు పిల్లల్ని పెంచడానికి ఆ డబ్బులు సరిపోయేవి కాదు. సర్దార్ ప్రతి ఏడాది ఊరికొచ్చి ఇటుకబట్టీలో పని చెయ్యడానికి మనుషుల్ని తీసుకెళ్తాడు. నేను రావడం మాత్రం ఇదే మొదటిసారి.” అని వివరంగా చెప్పింది.
కుని వాళ్ళు మహార్ అనే షెడ్యుల్ కులానికి చెందినవాళ్ళు. ఈ విడత అన్నారం బట్టీలకి వచ్చిన వాళ్లల్లో వాళ్ల ఊరినుంచి వచ్చిన కుటుంబం ఇదొక్కటే. వీళ్లలో ఎక్కువమంది ఒరిస్సాలోని బలాంగిర్, నౌపాడ జిల్లాలనుంచి వచ్చారు. కలహండి, ఆర్గార్ ల నుండి కూడా కొందరు వచ్చారు. నవంబర్ 2019 నుండి మే 2020 వరకూ బట్టీల్లో పనిచేసిన వాళ్లలో 110 మంది పెద్దవాళ్ళు, 37 మంది పిల్లలు ఉన్నారు.
సుమిత్ర, గోపాల్, రాజులు కూడా ఝాలా అనే షెడ్యుల్ కులానికి చెందినవాళ్ళే. ఊర్లో ఉన్నప్పుడు వాళ్ళు జూన్ నుంచి నవంబర్ వరకూ కౌలు రైతులుగా పనిచేసేవాళ్ళు. “మేము 3-4 ఎకరాల పొలాన్ని కౌలుకి తీసుకుని మా దగ్గరున్న డబ్బుల్ని బట్టి పత్తి, వరి పండించేవాళ్లం. ఒక్కోసారి పొలాల్లో రోజుకూలీలుగా వెళ్తే నాకు రోజుకి 150, నా భార్యకి 120 రూపాయిలు కూలీ ఇచ్చేవాళ్ళు. ఆడవాళ్లకి తక్కువ కూలి ఇస్తారు. మా ఇద్దరి సంపాదన కలిపినా ఇల్లు నడపడానికి సరిపోయేది కాదు.” అని చెప్పాడు గోపాల్.
సుమిత్ర లాగే అక్కడున్న మిగతా తల్లిదండ్రులు కూడా కరోనావైరస్ గురించి భయపడుతున్నారని శరత్ చంద్ర మల్లిక్ చెప్పారు. ఆయన రోడ్దవతల బట్టీల పిల్లలకోసం నడుస్తున్న స్కూల్లో టీచర్ గా పని చేస్తున్నారు. ఆ స్కూల్ ని రాష్ట్ర విద్యా శాఖ కింద, ఒక స్వచ్చంద సంస్థ నడుపుతుంది. “ఈ వైరస్ గురించి ఇక్కడి చిన్నపిల్లల తల్లిదండ్రులంతా భయపడుతున్నారు. యువకుల కన్నా పిల్లలకీ ముసలివాళ్లకీ వైరస్ తేలిగ్గా సోకుతుందని వాళ్లు విన్నారు. రోజూ వార్తల్లోనో, తెలిసినవాళ్లు చెప్పే మాటల్లోనో కేసులు పెరుగుతున్నట్టు వాళ్లకి తెలుస్తుంది.” అని చెప్పారు మల్లిక్.
బట్తీల పిల్లలకి స్కూల్లో పుస్తకాలిచ్చి మధ్యాహ్న భోజనం పెడతారు. కానీ లాక్డౌన్ లో బడి మూసెయ్యడం వల్ల రెండునెల్లుగా మే చివరి వరకూ, ఈ కూలీలు పిల్లలకి తిండి పెట్టడానికి వాళ్ల కూలి డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది.
కుని వాళ్ల అబ్బయి భక్త, ఆమెకి తెలంగాణకి తోడు రావడానికి ఎనిమిదో క్లాస్లో చదువు మానేశాడు. చిన్నబ్బాయి జగన్నాథ్ ఈ ప్రయాణం కోసమే మూడో క్లాస్ సగంలో వదిలేశాడు. పిల్లల్ని ఊర్లో వదలడం ఇష్టంలేక ఆమె తనతోపాటు తీసుకొచ్చింది. “పిల్లలు ఇక్కడ స్కూల్లో చదువుకోవచ్చని సర్దార్ చెప్పాడు. కానీ మేమిక్కడికొచ్చాక భక్త ని చేర్చుకోలేదు,” అని చెప్పింది. బట్టీల స్కూల్లో 14 ఏళ్లలోపు పిల్లల్ని మాత్రమే చేర్చుకుంటారని కుని కి తెలియదు. భక్త వయసు 15 అవ్వడం వల్ల అతన్ని చేర్చుకోలేదు. భక్త వాళ్లమ్మకి ఇటుకలు మొయ్యడం లో సాయం చేస్తాడు. కానీ ఆ పిల్లాడికి కూలీ డబ్బులు రావు.
సుమిత్ర రెండో కొడుకు సుబాయ్ కి 16 ఏళ్ళు. కాబట్టి అతను కూడా స్కూల్ కి వెళ్లలేడు. “అతను బట్టీ పక్కనే ఉన్న కోళ్ల ఫాం లో పనిచేస్తాడు. ఇప్పటికైతే ఇతనికి కూలీ డబ్బులేం రాలేదు. వెళ్ళిపోయేముందు వాళ్ల యజమాని మొత్తం కూలి ఇవ్వొచ్చు,” అని గోపాల్ చెప్పాడు.
లాక్డౌన్ లో కూడా కుని కి వారానికి 400 రూపాయిలు వస్తున్నా కూడా బట్టీల బయట అన్నీ మూసెయ్యడం వల్ల వాళ్లకున్న కొద్దిపాటి డబ్బులతో నెట్టుకురావదం కష్టమైంది. “గంజి కాసుకునే బియ్యపునూక ఇదివరికి కిలో 20 రూపాయిలుండేది. ఇప్పుడు 35 కి అమ్ముతున్నారు,“ అంది కుని. ఏప్రిల్ లో వలస కార్మికులకి ఒక్కొకరికి ప్రభుత్వం అందించిన 12 కిలోల బియ్యం, 500 రూపాయిల డబ్బులు ఆమెకి చేరాయి. కానీ మే నెలలో ఏమీ రాలేదు.
సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్, జి. వీరారెడ్డి గారు చెప్పినదాని ప్రకారం, ఏప్రిల్ లో ప్రభుత్వం వలస కూలీలకి బియ్యం, డబ్బులు ఇవ్వమని ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఒక సర్క్యులర్ వచ్చింది. “ఇప్పటికే బట్టీల్లో జీతం తీసుకుంటున్న కూలీలకి ఈ సహాయం వర్తించదని, పనులు పోగొట్టుకుని కూలీ డబ్బులు రాని కార్మికులకి మాత్రమే సహాయం అందాలని అందులో ఉంది.” అని చెప్పారు.
కూలీలు నివశిస్తున్న అరకొర సౌకర్యాల గురించి అడిగినప్పుడు “ వాళ్ల యజమానులతో వాళ్లకి దగ్గర సంబంధాలుంటాయి. జిల్లా అధికారులు వాటిల్లో కల్పించుకోరు,” అని చెప్పారు.
మే 22 వ తారీఖున మేము బట్టీలు చూడ్దానికి వెళ్ళినప్పుడు, ప్రతాప్ రెడ్డి అనే లేబర్ కాంట్రాక్టర్, ఇంటికి వెళ్ళిపోవాలన్న కార్మికుల కోరిక గురించి మాట్లాడుతూ వాళ్లని ఇక్కడ బాగా చూసుకుంటున్నామని, పని పూర్తవ్వగానే తిరిగి పంపేస్తామని చెప్పారు.
వీలైనంత త్వరగా ఇంటికి తిరిగి వెళ్ళాలని సుమిత్ర, కుని ఇద్దరూ ఆదుర్దాగా ఉన్నారు. “తిరిగి నవంబర్లో బట్టీలకి వస్తాం. ఇప్పుడు పిల్లలకి కరోనా వస్తుందేమో అని భయంగా ఉంది, ఇక్కణ్ణుంచి వెళ్ళిపోవాలి.” అని సుమిత్ర చెప్పింది.
లాక్డౌన్ లో కుని ఇంకో విషయానికి కూడా భయపడుతుంది. “వర్షాకాలం మొదలౌతుంది. సరైన సమయంలో ఊరికెళ్లకపోతే పొలాల్లో పనులు దొరకవు, అక్కడ ఏ సంపాదనా లేకుండా గడపాల్సొస్తుంది.”
కొత్త సంగతి
: మేము వాళ్లని కలిసిన మరుసటి రోజు, మే 23 న బట్టీల్లోని కార్మికులందర్నీ శ్రామిక్ రైలెక్కించి ఒరిస్సా పంపేశారు. జూన్ 2 న, ఒక ప్రజావ్యాజ్యానికి స్పందిస్తూ ఒరిస్సాకి వలసకూలీలందర్నీ వాళ్ల సొంత వూర్లకి తిరిగి పంపాలని హైకోర్ట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
జూన్ 9 న, తెలంగాణ లేబర్ కమీషనర్, హైకోర్టుకి ఒక నివేదిక సమర్పించారు. 16,253 మంది వలస కార్మీకులు ఇటుకబట్టీల్లో ఉన్నారని, వాళ్ల యజమానులు వాళ్లకి సౌకర్యాలు అందిస్తున్నారని ఆ నివేదికలో ఉంది. జూన్ 11 న ఐదు శ్రామిక్ రైళ్ళు తెలంగాణ నుండి 9.200 మంది కార్మికులని తీసుకెళ్తున్నాయని రాష్ట్ర ఎడ్వకేట్ జెనరల్, హైకోర్టుకి చెప్పారు. మిగిలిన ఇటుక కార్మీకులకోసం జూన్ 12 న మరికొన్ని రైళ్ళు నడుస్తాయని కూడా ఆయన చెప్పారు.
అనువాదం: బి. స్వాతికుమారి