అగ్రవర్ణ యువకుడొకడు, బాజ్రా (సజ్జ) పొలాల్లో భన్వారీ దేవి 13 ఏళ్ల కూతురిపై అత్యాచారం చేసినప్పుడు, ఆమె ఒక లాఠీ పట్టుకుని స్వయంగా తానే ఆ బలాత్కారం చేసినవాడిని వెతుక్కుంటూ వెళ్ళింది. పోలీసుల మీద, న్యాయస్థానాల మీద ఆమెకి నమ్మకం లేదు. కాని ఈ విధంగా కూడా, అహిరోఁ కా రామ్‌పురాలోని పెత్తందారీ కులాలవాళ్ళు ఆమెకి పరిహారం దక్కనివ్వలేదు. “మా గ్రామ కుల పంచాయతీవారు నాకు న్యాయం చేస్తానని మాటిచ్చారు. కాని రామ్‌పురా నుంచి నన్నూ నా కుటుంబాన్నీ బయటికి గెంటేసారు,” అన్నారామె. అజ్మేర్ జిల్లాకి చెందిన ఈ పల్లెటూరిలో ఈ అత్యాచారం జరిగి సుమారు ఒక దశాబ్దం అవుతున్నా, ఇంకా ఇక్కడ ఎవరికీ శిక్ష పడలేదు.

కాని రాజస్థాన్‌కి ఇది కొత్తేమీ కాదు. ఈ రాష్ట్రంలో ప్రతి 60 గంటలకి సగటున ఒక దళిత మహిళ అత్యాచారానికి గురవుతోంది.

షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్ నివేదిక సమాచారం ప్రకారం, 1991 నుంచి 1996 వరకు దళిత మహిళలపై జరిగిన అత్యాచారాలకు సంబంధించిన దాదాపు 900 దావాలు పోలీసుల వద్ద నమోదయ్యాయి. అంటే ఏడాదికి ఇంచుమించు 150 దావాలు - లేదా 60 గంటలకి ఒకటి. (కొన్ని నెలలపాటు రాష్ట్రపతి పాలన విధించినప్పుడు తప్ప, ఆ సమయంలో ఈ రాష్ట్రం పూర్తిగా భారతీయ జనతా పార్టీ అధీనంలో ఉంది.) ఈ అంకెలు వాస్తవాన్ని కొలవలేవు. ఇటువంటి నేరాలు చాలా మటుకు వెలుగులోకి రాకుండా ఉండిపోయే హీన పరిస్థితి, దేశంలో అన్ని రాష్ట్రాలలో కన్నా కూడా ఈ రాష్ట్రంలోనే మరీ ఎక్కువ.

ధోల్‌పుర్ జిల్లా నక్సోడాలో, అతి దారుణమైన అత్యాచారానికి గురైన ఒక బాధితుడు ఆ గ్రామం నుంచి పారిపోయారు. ఏప్రిల్ 1998లో, రామేశ్వర్ జాటవ్ అనే ఒక దళితుడు, పెద్దకులానికి చెందిన ఒక గుజ్జర్‌కి ఇచ్చిన 150 రూపాయల అప్పుని తిరిగి అడుగుదామని అనుకున్నారు. కాని అది కొరివితో తల గోక్కున్నట్టు అయింది. అతని పొగరుకి విపరీతమైన కోపం వచ్చిన గుజ్జర్ల సమూహం, అతని ముక్కు దూలానికి రంధ్రం చేసి, ఒక మీటర్ పొడుగు, 2 మిల్లీమీటర్ల మందం ఉన్న జనపనార దారాలు రెండు తీసుకుని ఉంగరంగా చుట్టి, అతని ముక్కు పుటాలలోకి దూర్చారు. దాన్ని పట్టుకుని అతన్ని ఆ ఊరంతా తిప్పుతూ ఊరేగించారు.

ఈ ఘటన పత్రికలలో పడి దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది. విదేశాల్లో కూడా పత్రికలలోనూ, టీవీ ద్వారా ఈ వార్త విస్తృతంగా ప్రచారమైంది. ఇంత ప్రాచుర్యం పొందినా కూడా, న్యాయం దక్కే విషయంలో ఏం లాభం లేకపోయింది. దీని వెనక, గ్రామంలో హడలు పుట్టించే పరిస్థితులు, క్షేత్ర స్థాయిలో ప్రతికూలంగా పనిచేసే అధికార వర్గాల హస్తం ఉంది. సంచలన వార్తలు, అద్భుతమైన దృశ్యాలు, అన్నీ పక్కకు తప్పుకున్నాక, విలేఖరులకు ఈ దావా మీద ఆసక్తి పోయింది. మానవ హక్కుల సంఘాలు కూడా ఆ దారే పట్టినట్టున్నాయి. జరిగిన ప్రచారం వలన కలిగిన పరిణామాలను బాధితులే ఎదుర్కోవలసి వచ్చింది. రామేశ్వర్, న్యాయస్థానంలో తన మాటను మొత్తానికే మార్చేశారు. అవును, అత్యాచారం జరిగింది. కానీ అది చేసింది అతను నమోదు చేసిన ఫిర్యాదులో పేర్కొన్న ఆరుగురు మాత్రం కాదు. దోషిని అతను గుర్తుపట్టలేకపోయారు.

ఎంతో వివరంగా అతని గాయాలను నమోదు చేసిన ఉన్నత వైద్యాధికారి కూడా ఇప్పుడు తనకు అవేమీ గుర్తులేనట్టుగా విజ్ఞప్తి చేసారు. అవును, ఆ గాయాలతో రామేశ్వర్ అతని దగ్గరకి వచ్చింది నిజమే. కాని అంతటి అసాధారణమైన గాయాలు తనకు ఎలా తగిలాయో బాధితుడు తనతో చెప్పారో లేదో ఆ వైద్యాధికారికి గుర్తులేదు.

Mangi Lai Jatav and his wife in Naksoda village in Dholupur district. A man and a woman standing outside a hut
PHOTO • P. Sainath

ముక్కు దూలానికి జనపనారను ఉంగరంలా  బిగించి రామేశ్వర్ జాటవ్‌ని ఊరేగించిన నక్సోడా గ్రామంలోని తమ ఇంటి వద్ద జాటవ్ తల్లిదండ్రులు: ‘మేమిక్కడ బిక్కు బిక్కుమంటూ భయంతో జీవిస్తున్నాం

రామేశ్వర్ తండ్రి, మంగీలాల్ ప్రతికూల సాక్షిగా మారిపోయారు. “మేమేం చేయగలమనుకుంటున్నారు?” నక్సోడాలో ఆయన నన్ను అడిగారు. “మేమిక్కడ బిక్కు బిక్కుమంటూ భయంతో జీవిస్తున్నాం. అధికారులు మాకు పూర్తి విరుద్ధంగా ఉన్నారు. ఆ గుజ్జర్లు ఏ క్షణాన్నైనా మా అంతు చూడవచ్చు. ఎందరో పలుకుబడి ఉన్నవాళ్ళు, అలాగే పోలీసుల్లో కొంత మంది కూడా మమ్మల్ని బలవంతపెట్టారు.” అన్నారాయన. రామేశ్వర్ ఊరు వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పటికే ఈ దావా ఖర్చులు భరించడానికి మంగీలాల్ తన కుటుంబానికి చెందిన కేవలం మూడు బిఘా ల భూమిలో ఒక బిఘా ని అమ్మేశారు కూడా.

ప్రపంచం దృష్టిలో ఇది ఒక క్రూరమైన చర్య. రాజస్థాన్‌లో మాత్రం, ఎన్నో వేల ‘ఇతర ఐ.పి.సి.’ (భారతీయ శిక్షాస్మృతి లేదా ఇండియన్ పీనల్ కోడ్) దావాలలో ఇది కూడా ఒకటి. అంటే హత్య, అత్యాచారం, దహనం, తీవ్రమైన గాయం వంటివి కాకుండా ఇతర దావాలన్నమాట. 1991-96 మధ్యలో, ప్రతి నాలుగు గంటలకీ ఇటువంటి ఒక దావా నమోదయ్యేది.

భరత్‌పూర్ జిల్లా సెంథరీలో ఏడేళ్ళ నుంచి పెళ్ళిళ్ళు జరగడంలేదని ఆ గ్రామవాసులు చెప్తున్నారు. ఖచ్చితంగా పురుషులకైతే జరగడంలేదు. జూన్, 1992లో ఉద్రేకించిన అగ్రవర్ణాల మూక ఒకటి సెంథరీ మీద దండెత్తినప్పటినుంచి ఇదే పరిస్థితి. వాళ్ళు ఆరుగుర్ని చంపారు, ఎన్నో ఇళ్ళని నాశనం చేశారు. హత్యకి గురైన వారిలో కొంతమంది, వారు దాక్కుని ఉన్న బిటోరా ని (పిడకల గూడు) ఆ మూక కావాలని తగలబెట్టడంతో, సజీవదహనం అయ్యారు.

A pile of dung cakes
PHOTO • P. Sainath
A pile of dung cakes
PHOTO • P. Sainath

సెంథరీ గ్రామంలో, ఒక పాకలో ఉన్న ఇలాంటి బిటోరా (పిడకల గూడు) పై ఉద్రేకించిన అగ్రవర్ణాల మూక దండెత్తి, ఆరుగురు మనుషుల్ని చంపారు

“సెంథరీలోని ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోగలుగుతున్నారు, ఎందుకంటే పెళ్ళయ్యాక వాళ్ళు ఆ పల్లె వదిలి వెళ్ళిపోతారు కదా,” అన్నారు భగవాన్ దేవి. “కాని మగవాళ్ళకు అలా కాదు. కొంతమంది మగవాళ్ళు పెళ్ళి చేసుకోడానికి ఊరు వదిలి వెళ్ళిపోయారు. ఎవరికీ వాళ్ళ కూతుళ్ళని ఇక్కడకి పంపించడం ఇష్టం లేదు. వాళ్ళకి తెలుసు, ఇప్పుడు మా మీద దాడి జరిగినా, పోలీసులు గానీ న్యాయస్థానాలు గానీ, ఎవ్వరూ మాకు సహాయం చేయరని.”

ఆమె అపనమ్మకంలో వాస్తవం ఉంది. హత్యలు జరిగిన ఏడేళ్ళకి కూడా ఈ విషయంలో ఇంకా ఆరోపణలు నమోదు కాలేదు.

ఇది కూడా కొత్తేమీ కాదు. ఈ రాష్ట్రంలో ప్రతి తొమ్మిది రోజులకి ఒకసారి ఒక దళితుడి హత్య జరుగుతోంది.

ఇదే ఊరిలో బిటోరా మంటల నుంచి బతికి బయటపడిన తన్ సింగ్ అనే వ్యక్తి ఉన్నారు (కవర్ ఫొటో చూడండి). ఆ ఘటనలో అతని శరీరం 35 శాతం కాలిపోయినట్టు వైద్యుడి నివేదిక చూపిస్తోంది. అతని చెవులు చాలా మటుకు దెబ్బతిన్నాయి. చంపబడిన వాళ్ళల్లో అతని సోదరుడు కూడా ఉండటం వల్ల అతను పొందిన కాస్తంత నష్టపరిహారం కూడా అతని వైద్యానికే సరిపోయింది. “ఖర్చులు పెట్టుకోడానికి నా దగ్గరున్న చిన్న స్థలం కూడా అమ్మేయాల్సి వచ్చింది,” కుమిలిపోతూ అన్నారు ఆ యువకుడు. దీనితో పాటు జైపూర్ వెళ్ళినప్పుడల్లా కేవలం ప్రయాణ ఖర్చుల కోసమే ఎన్నో వందల రూపాయలు ఖర్చు పెట్టవలసి వస్తోంది.

తన్ సింగ్ కేవలం ఒక గణాంకంగా మిగిలిపోయారు. ఈ రాష్ట్రంలో ప్రతి 65 గంటలకి ఒక దళితుడు ఇంకొకరి చేతుల్లో తీవ్రమైన గాయానికి గురవుతాడు.

టోంక్ జిల్లా రాహోలీలో, కొంతమంది స్థానిక బడిపంతుళ్ళు ప్రేరేపించగా దళితుల ఇళ్ళను తగులబెట్టడం వంటి చాలా దాడులు జరిగాయి. “ఎంతో నష్టం జరిగింది,” అన్నారు అంజు ఫుల్వారియా. ఆమె దళిత సర్పంచ్‌ గా ఎన్నికయ్యారు కాని, “తప్పుడు ఆరోపణలు చేసి నన్ను ఆ స్థానం నుంచి తాత్కాలికంగా తొలగించారు,” అని చెప్పుకొచ్చారు. ఇలా చేసినందుకు ఎవరికీ శిక్ష పడలేదన్న విషయం ఆమెకేమీ ఆశ్చర్యాన్ని కలిగించలేదు.

రాజస్థాన్‌లో ప్రతి ఐదు రోజులకి సగటున ఒక దళితుడి ఇంటిని లేదా ఆస్తిని తగులబెట్టడం జరుగుతోంది. ఏది తగులబెట్టినా, ఆ అపరాధులకి శిక్ష పడే అవకాశాలు మాత్రం చాలా తక్కువ .

మృదువుగా మాట్లాడే రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్, దళితులకి విరుద్ధంగా వ్యవస్థాగత పక్షపాతం ఉందని భావించడంలేదు. ఆ భయంకరమైన గణాంకాలు, ఇలాంటి దావాలను నమోదు చేయటంలో ఈ రాష్ట్రానికున్న నిబద్ధతను నిరూపిస్తున్నాయని ఆయన అభిప్రాయం. “దావాలు సరిగా నమోదు చేయటంలేదనే అభియోగాలు లేని అతి కొద్ది రాష్ట్రాల్లో ఈ రాష్ట్రం కూడా ఒకటి. మేమింత శ్రద్ధగా ఉండటం వల్లనే ఎక్కువ దావాలు నమోదవుతున్నాయి, అందువల్ల నేరాల గణాంకాలు కూడా ఎక్కువగా ఉంటాయి,” అన్నారు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే రాజస్థాన్‌లో దోషనిర్ధారణ రేటు కూడా మెరుగైనదని ఆయన నమ్మకం.

Anju Phulwaria, the persecuted sarpanch
PHOTO • P. Sainath

అంజు ఫుల్వారియా రాహోలీకి ఎంపికైన దళిత సర్పంచ్. కాని, “తప్పుడు ఆరోపణలు చేసి నన్ను ఆ స్థానం నుంచి తాత్కాలికంగా తొలగించారు,” అని ఆమె అంటున్నారు

అంకెలు ఏం చెబుతున్నాయి? మాజీ జనతా దళ్ పార్లమెంట్ సభ్యుడు థాన్ సింగ్, 90ల్లో దళితుల మీద జరిగిన నేరాలపై విచారణ చేసిన ఒక కమిటీలో సభ్యుడు. “దోషనిర్ధారణ రేటు ఇంచుమించు మూడు శాతం ఉంటుంది,” అని అతన్ని నేను అతని జైపూర్ నివాసంలో కలిసినప్పుడు నాతో చెప్పారు.

ధోల్‌పుర్ జిల్లాలో నేను న్యాయస్థానాలకు వెళ్ళినప్పుడు, అక్కడ దోషనిర్ధారణ రేటు ఇంకా తక్కువని తెలిసింది. 1996 నుంచి 1998 వరకు మొత్తంమీద అటువంటి 359 దావాలు సెషన్స్ కోర్టుకు వెళ్ళాయి. కొన్నిటిని వేరే న్యాయస్థానాలకు మార్చారు, లేదంటే ఇంకా ఎటూ తేలకుండా ఉన్నాయి. కాని ఇక్కడ దోషనిర్ధారణ రేటు 2.5 శాతం కన్నా తక్కువగా ఉంది.

ధోల్‌పుర్‌లోని ఒక ఉన్నతస్థాయి పోలీసు అధికారి నాతో ఇలా అన్నారు: “న్యాయస్థానాలు ఎన్నో అబద్ధపు దావాలతో నిండి ఉన్నాయన్న ఒకే ఒక విషయం గురించి నేను విచారపడతాను. 50 శాతానికి పైగా ఎస్.సి./ఎస్.టి. దావాలు తప్పుడు ఫిర్యాదులే. అలాంటి దావాల వలన జనాలు అనవసరంగా వేధింపులపాలవుతారు.”

రాజస్థాన్‌లో చాలా మటుకు పెద్దకులాలకు చెందిన పోలీసు అధికారులలో ప్రబలంగా ఉన్న అభిప్రాయమే ఇతనిది కూడా. (ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి పోలీసు శాఖని సి.ఆర్.పి. - చారంగ్-రాజపుత్ పోలీస్ - అని పిలుస్తారు. అంటే పోలీసు శాఖలో 90ల వరకు ఈ రెండు అగ్ర కులాలదే ఆధిపత్యం.).

సామాన్య ప్రజలు, ముఖ్యంగా పేదవారు, బలహీనులు, అబద్ధాలు చెప్తారన్న అభిప్రాయం పోలీసులలో బాగా పాతుకుపోయింది. ఈ మొత్తం సముదాయాలలో జరిగిన అత్యాచారాలపై వేసిన దావాలను చూస్తే, విచారణ తరువాత మొత్తంలో 5 శాతం (జాతీయ సగటు) తప్పుడు దావాలుగా తేలుతాయి. రాజస్థాన్‌లో సగటున 27 శాతం అత్యాచారాల దావాలను ‘తప్పుడు’ దావాలుగా ప్రకటించారు.

ఇదెలా ఉందంటే, ఈ రాష్ట్రంలోని మహిళలు మిగిలిన రాష్ట్రాలలోని మహిళల కంటే ఐదు రెట్లు ఎక్కువ అబద్ధాలు చెప్తారని అన్నట్టు. ఈ అంకెలకు అంతకన్నా మంచి వివరణ ఒకటుంది. ఆడవాళ్ళకి వ్యతిరేకంగా తీవ్రమైన పక్షపాతం వ్యవస్థలో పాతుకుపోయుంది. ఈ ‘తప్పుడు అత్యాచారాల’ సమాచారం అన్ని సముదాయాలలోనూ కనిపిస్తుంది. కాని వివరంగా అవలోకనం చేస్తే దళితులు, ఆదివాసులు ఈ పక్షపాతానికి ఎక్కువగా గురవుతారని బయటపడడానికే అవకాశాలెక్కువ. ఒక్క మాటలో చెప్పాలంటే, మిగిలిన వర్గాలతో పోలిస్తే, ఈ రెండు వర్గాల వారే ఎక్కువగా అత్యాచారాలకి గురవుతారు.

దళితులు చట్టాన్ని, ప్రత్యేకించి  ఎస్.సి., ఎస్.టి. (అత్యాచారాల నిరోధక) చట్టం 1989ని, దుర్వినియోగం చేస్తున్నారని నేను రాజస్థాన్‌లో ఎక్కడికి వెళితే అక్కడ అందరూ ఎంతో ఖచ్చితంగా చెప్పారు. అన్నిటికీ మించి, ఈ చట్టంలో అందరూ భయపడే 3వ విభాగం ఎక్కువగా దుర్వినియోగమవుతోంది. ఈ విభాగం ద్వారా దళితుల, ఆదివాసుల మీద కులతత్వంతో అపరాధాలు చేసినవారికి ఐదేళ్ళ వరకు కారాగార శిక్షతో పాటు, జరిమానా కూడా విధించవచ్చు

కానీ వాస్తవానికి, ఇలాంటి కఠిన శిక్ష ఏ నేరస్థుడికీ పడినట్టు ఒక్క దావా కూడా నాకు కనిపించలేదు.

ధోల్‌పుర్‌లో కూడా, మామూలుగా దళితులపై చేసిన నేరాలకు విధించే కొన్ని శిక్షలు, దోషులను కట్టడి చేసేలా కనిపించవు. రూ. 100, రూ. 250, లేదా రూ. 500ల జరిమానా, లేదంటే ఒక నెల సాధారణ కారాగార శిక్ష - అంతే. నేను చూసినంత వరకు అన్నిటికన్నా కఠినమైన శిక్ష ఆరు నెలల సాధారణ ఖైదు. ఒక దావాలో అయితే, నిందితుడిని బెయిల్ మీద ‘పరిశీలన’ కింద ఉంచారు. ఇటువంటి దావాలలో ఈ పరిశీలన అనే భావన ఈ విలేఖరికి మరెక్కడా ఎదురవలేదు.

ఈ ఉదాహరణ ధోల్‌పుర్ ఒక్కదానిదే కాదు. ఎస్.సి./ ఎస్.టి. ప్రత్యేక న్యాయస్థానం వద్ద దోషనిర్ధారణ రేటు 2 శాతం కన్నా కొంచెం తక్కువేనని టోంక్ జిల్లా ప్రధాన కార్యాలయంలో మేం తెలుసుకున్నాం.

ఇది గణాంకాల వరకు మాత్రమే. కాని న్యాయస్థానానికి వెళుతోన్న ఒక దళితుడు తీసుకోవలసిన చర్యలు, దాటవలసిన అడ్డంకులు, ఇందులోని ప్రక్రియలు, ప్రమాదాలు ఏమిటన్నది మరో కథ.

ఈ రెండు-భాగాల కథనం మొదట జూన్ 13, 1999న ది హిందూ పత్రికలో ప్రచురితమయింది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇచ్చే మానవ హక్కుల జర్నలిజం గ్లోబల్ అవార్డుని, ఆ పురస్కారం ప్రారంభమైన సంవత్సరం (2000)లోనే ఈ కథనం గెలుచుకుంది.

అనువాదం: అఖిల పింగళి

پی سائی ناتھ ’پیپلز آرکائیو آف رورل انڈیا‘ کے بانی ایڈیٹر ہیں۔ وہ کئی دہائیوں تک دیہی ہندوستان کے رپورٹر رہے اور Everybody Loves a Good Drought اور The Last Heroes: Foot Soldiers of Indian Freedom کے مصنف ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز پی۔ سائی ناتھ
Translator : Akhila Pingali

Akhila Pingali is a freelance translator and writer from Visakhapatnam.

کے ذریعہ دیگر اسٹوریز Akhila Pingali