ఆమె వేరే ఆదివాసీ ఆడవారితో కలిసి పొలంలో పనిచేస్తుండగా, వారి ఊరు సలిహా నుంచి ఒక యువకుడు వారివైపు వేగంగా పరిగెత్తుతూ అరిచాడు. “వారు ఊరి మీద దాడి చేశారు. మీ నాన్నని ఘోరంగా కొడుతున్నారు. మన ఇళ్లన్నీ వెతుకుతున్నారు.”
“వారు” అంటే బ్రిటిష్ పోలీసులు, బ్రిటిష్ రాజ్యాన్ని ధిక్కరిస్తున్నాయి అనుకునే గ్రామాల పై విరుచుకుపడ్డారు. అనేక ఇతర గ్రామాలను ధ్వంసం చేశారు, తగలబెట్టారు, వారి ధాన్యం దోచుకున్నారు. తిరుగుబాటుదారులకు తమ స్థానాన్ని చూపించారు.
డేమతి డే, సబర్- సబర్ తెగకు చెందిన ఒక ఆదివాసీ అమ్మాయి. ఆమె సలిహాకి తనతో ఉన్న 40 మంది యువతులతో పాటు పరిగెట్టింది. “మా నాన్న నేల మీద పడి ఉన్నాడు, రక్తం కారుతోంది,” అన్నది వయసుడిగిన ఆ స్వాతంత్య్ర యోధురాలు . “అతని కాలిలో తుపాకి గుండు దిగింది.”
వయసురీత్యా మసకబారుతున్న తలపుల మధ్య ఈ జ్ఞాపకం ఆమె ఉత్తేజపరిచింది. “నాకు పట్టలేని కోపం వచ్చి ఆ ఆఫీసర్ మీదికి తుపాకీతో వెళ్లాను. ఆ రోజుల్లో మేము లాఠీలు పట్టుకుని వెళ్ళేవాళ్ళం పొలాల్లో పనికైనా, అడవిలోకైనా. ఉన్నట్టుండి జంతువులు మీద పడితే మన దగ్గర కాపాడుకోవడానికి ఏదోటి ఉండాలి.” అన్నది.
ఒక్కసారి ఆ ఆఫీసర్ మీద ఆమె దాడి చేయగానే ఆమెతో ఉన్న 40 మంది యువతులు మిగిలిన సిబ్బంది మీదకు వారి లాఠీలతో దూసుకువెళ్లారు. “ఆ వెధవని వీధి చివర వరకు పరిగెత్తించా,” అన్నదామె. కోపంగానే అన్నది కాని పక్కున నవ్వింది. “అలా కొట్టుకుంటూ పోవడమే. అతను తిరిగి నన్నేమైనా అనడానికి కూడా అతనికి అవకాశం ఇవ్వలేదు. నేనలా చేస్తానని అతను ఊహించలేదు. అతను తప్పించుకోడానికి పరిగెత్తుతూనే ఉన్నాడు.” ఆమె అతన్ని కొడుతూ ఊరంతా పరుగెత్తించింది. ఆమె అప్పుడు తన తండ్రిని అక్కడ నుంచి ఎత్తి మోసుకుని వచ్చేసింది. అతన్ని తరవాత అరెస్ట్ చేశారు, కానీ అది వేరే నిరసనకు దారి తీసింది. కార్తీక్ సబర్ అక్కడి బ్రిటిష్ వ్యతిరేకోద్యమాలకు కీలక కార్యదర్శి.



