మీరు 6-14 సంవత్సరాల వయస్సు గల పిల్లలైతే, మీ చుట్టుపక్కల పాఠశాలల్లో "ఉచిత మరియు నిర్బంధ విద్య" పొందే హక్కు మీకు ఉంది. దీనిని నిర్ణయించే చట్టమైన – పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం (RTE) ను భారత ప్రభుత్వంవారు 2009లో రూపొందించారు.
కానీ ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాకు చెందిన తొమ్మిదేళ్ల చంద్రికా బెహెరా దాదాపు రెండేళ్లుగా పాఠశాలకు దూరంగా ఉంటోంది. దానికి కారణం అన్నిటికంటే సమీప పాఠశాల ఇప్పటికీ చాలా దూరంలో, అంటే ఆమె ఇంటికి దాదాపు 3.5 కిలోమీటర్ల దూరంలో ఉండటమే.
గ్రామీణ భారతదేశంలో బోధన, అభ్యాస పద్ధతులు స్థిరంగా లేవు. చట్టాలు, విధానాలు తరచుగా కాగితాలపై కనిపిస్తాయి కానీ అమలుకు మాత్రం నోచుకోవు . కానీ కొన్ని సందర్భాల్లో తమ వినూత్న ఆలోచనలు, దృఢ వ్యక్తిత్వం కలిగిన కొద్ది మంది ఉపాధ్యాయులు వ్యవస్థలోని సవాళ్లను అధిగమించి నిజమైన మార్పును తీసుకొస్తున్నారు.
ఉదాహరణకు, కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని సంచార ఉపాధ్యాయుడిని తీసుకోండి. లిద్దర్ లోయలోని గుజ్జర్ స్థావరంలో సంచార సముదాయానికి చెందిన చిన్న పిల్లలకు బోధించడానికి నాలుగు నెలల పాటు ఆయన ఆ స్థావరంలోనే బస చేశారు. తమ పరిమిత వనరులను వీలైనంత మేర ఉపయోగించుకోవడానికి ఉపాధ్యాయులు వినూత్న పద్ధతులను కూడా ప్రయత్నిస్తున్నారు. కోయంబత్తూరులోని విద్యా వనం పాఠశాలలోని ఉపాధ్యాయులు తమ విద్యార్థులను జన్యుమార్పిడి పంటలపై చర్చించేలా చేశారు. వారిలో చాలామంది ఆంగ్లం మాట్లాడే మొదటి తరం వారు. కానీ వారంతా సేంద్రీయ బియ్యం విలువను, మరెన్నో విషయాలను తెలియజేస్తూ ఆంగ్లంలో చర్చిస్తున్నారు.
PARI గ్రంథాలయాన్ని సందర్శించడం ద్వారా మీరు తరగతి గదుల్లోకి అడుగుపెట్టి, అభ్యాస ఫలితాల దృక్కోణాన్ని, భారతదేశంలోని విద్యా స్థితి యొక్క మెరుగైన చిత్రాన్ని చూడవచ్చు. మేము గ్రామీణ విద్య అందుబాటు, నాణ్యత, అంతరాలపై నివేదికలను పొందుపరుస్తాము. లైబ్రరీలోని ప్రతి ముద్రిత పత్రంతో పాటు ఒక చిన్న సారాంశం ఉంటుంది. అందులో ప్రధాన అంశాలు ప్రముఖంగా కనిపిస్తాయి.







