ఝార్ఖండ్‌లోని బోరోతికాలో, సంక్లిష్టమైన గర్భాన్ని మోస్తున్న ఒక మహిళ వైద్యులను చూడడానికి సరిహద్దులను దాటి ఒడిశా వెళ్ళవలసి వస్తుంది.
ఆమె ఒక్కతే కాదు - మీరు గ్రామీణ భారతదేశంలో నివసిస్తున్న మహిళ అయితే, గైనకాలజిస్టును లేదా సర్జన్‌ను కూడా చూసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇక్కడి సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సిహెచ్‌సి) ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలలో అవసరమైనదానికంటే 74.2 శాతం ప్రసూతి వైద్యుల, గైనకాలజిస్ట్‌ల కొరతను ఎదుర్కొంటున్నాయి.
మీరు అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నబిడ్డకు తల్లి అయితే, సిఎచ్‌సిలో శిశువైద్యుని సంప్రదించడానికి కొంత సమయం పట్టవచ్చు. ఎందుకంటే, అవసరమైన పిల్లల వైద్యుల నుంచి సాధారణ వైద్యుల వరకూ దాదాపు 80 శాతం వైద్యఉద్యోగాలు ఇంకా భర్తీ కాలేదు.
వీటన్నిటితో పాటు మరిన్ని విషయాలు గ్రామీణ ఆరోగ్య గణాంకాలు 2021-22 ద్వారా మనకు తెలుసు. ఇవే కాకుండా ముఖ్యమైన ఇతర నివేదికలు, పరిశోధనా పత్రాలు, స్థిరమైన డేటా, చట్టాలు, సమావేశాలు PARI హెల్త్ ఆర్కైవ్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ భారతదేశంలోని మహిళల ఆరోగ్య స్థితిని వివరించడానికి, బాగా అర్థం చేసుకోవడానికి కీలకమైన అనుకూల బిందువులుగా పనిచేస్తాయి.
ఈ విభాగం భారతదేశంలో మహిళల ఆరోగ్యం, ప్రత్యేకించి గ్రామీణప్రాంతాల మహిళల ఆరోగ్యం అనిశ్చిత స్వభావాన్ని తెలియజేస్తుంది. పునరుత్పత్తి ఆరోగ్యం నుండి లైంగిక హింస వరకు, మానసిక ఆరోగ్యం నుండి కోవిడ్-19 ప్రభావం వరకు, PARI హెల్త్ ఆర్కైవ్ మహిళల ఆరోగ్యానికి సంబంధించిన అనేక అంశాలను కవర్ చేస్తుంది - 'రోజువారీ ప్రజల రోజువారీ జీవితాలను' కవర్ చేయాలనే PARI ఆదేశాన్ని బలపరుస్తుంది.









