తారిఖ్ అహ్మద్ ప్రాథమిక పాఠశాల పిల్లలకు మౌలిక విద్యను నేర్పుతూ పది సంవత్సరాలపాటు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 37 ఏళ్ల తారిక్ కేంద్ర సమగ్ర శిక్ష పథకం కింద 2009-2019 వరకూ విద్యా వాలంటీర్‌గా పనిచేశారు. తమ గొర్రెలను, మేకలను మేపడం కోసం లదాఖ్‌కు వలస వచ్చే బకర్‌వాల్ కుటుంబాల పిల్లలకు చదువు చెప్పడం కోసం అతనిని ఎత్తైన ప్రాంతమైన ద్రాస్‌కు పంపించారు.
కానీ 2019లో రాష్ట్రాన్ని జమ్మూ కశ్మీర్‌గానూ, లదాఖ్‌గానూ విభజించినప్పుడు ఆయన తన ఉద్యోగాన్ని కోల్పోయారు. జమ్మూ కశ్మీర్ నివాసి అయిన - ఆయన ఇల్లు రజౌరి జిల్లా, కాలాకోట్‌లో ఉంది - ఈయనకు జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి బయట ఉన్న పిల్లలకు బోధించే అవకాశం లేదు.
"రెండు వేర్వేరు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయడం వలన, మా పిల్లల విద్యా వ్యవస్థ గందరగోళంలో పడింది," సంచార తెగల పిల్లలను మరచిపోయినందుకు అధికారులను తప్పుపడుతూ అన్నారు తారిఖ్.
"కర్గిల్ జిల్లాలోని జీరో పాయింట్ నుంచి ద్రాస్ వరకూ ఈ ప్రాంతంలో మాకు సంచార పాఠశాలలు లేవు, సమయానుగుణ అధ్యాపకులు (seasonal teachers) అందుబాటులో లేరు. మా పిల్లలు చివరకు రోజంతా ఆ చుట్టుపక్కలే తిరుగుతూ ఆహారం కోసం స్థానికులను చికాకుపె ట్టేంతగా దిగజారారు," కాలాకోట్‌లోని బథేరా గ్రామ సర్పంచ్, షమీమ్ అహ్మద్ బజ్రాన్ అన్నారు.
వలస వచ్చినవారి కోసం జమ్మూ కశ్మీర్‌లో వేలకొద్దీ తాత్కాలిక పాఠశాలలు ఉన్నాయి, కానీ మే నుండి అక్టోబర్ మధ్య ఆరు నెలల పాటు లదాఖ్‌కు వలస వెళ్ళినప్పుడు తమ పిల్లలకు బడి తప్పిపోతుందని బకర్‌వాల్ సముదాయంవారు చెప్పారు. ఇక్కడ వారి పిల్లలు విద్యా బోధనతో సంబంధాన్ని కోల్పోతారు, తమ తోటి పిల్లలకంటే వెనుకబడిపోతారు. బకర్‌వాల్ సముదాయపు అక్షరాస్యత 32 శాతంగా ఉంది. ఇది రాష్ట్రంలోని షెడ్యూల్డ్ తెగలన్నింటిలోనూ అతి తక్కువ శాతమని షెడ్యూల్డ్ తెగల గురించి 2013లో వచ్చిన ఒక నివేదిక చెప్తోంది.
"మా పిల్లలు చదువుకోవాలనుకున్నా కూడా మేం చేయగలిగిందేమీ లేదు. మేం వలసపోయినప్పుడల్లా వారి చదువులు ఆగిపోతాయి. ఎందుకంటే అన్నిటికంటే దగ్గర పాఠశాల మాకు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది," ఐదేళ్ళ హుజైఫ్, మూడేళ్ళ షోయిబ్‌ల తండ్రి అంజాద్ అలీ బజ్రాన్ చెప్పారు. మినిమార్గ్ నుంచి ద్రాస్ వరకూ విస్తరించి నివాసముంటున్న 16 బకర్‌వాల్ కుటుంబాలలో ఈయన కుటుంబం కూడా ఒకటి.
"మేం రాజౌరి నుంచి వలసపోయేటప్పుడు మా పిల్లల్ని కూడా మాతోపాటు తీసుకెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే, ఐదారు నెలల పాటు మా కుటుంబం మాతో లేకుండా గడపటం మాకు సాధ్యంకాదు," అన్నారు ఈ 30 ఏళ్ళ పశుపోషకుడు.
ఆ ప్రాంతంలోని విద్యాధికారులు తమ నివేదికను సమర్పించిన తర్వాత మాత్రమే ఈ పాఠశాలలను ఏర్పాటు చేయగలమని రాజ్యం అంటోంది. "ఒక సంచార బృందం మా సరిహద్దులను (కశ్మీర్ నుంచి లదాఖ్‌లోని కర్గిల్‌కు) దాటి వెళ్ళినప్పుడు, లదాఖ్‌లోని కర్గిల్ ప్రధాన విద్యాధికారులకు (సిఇఒ) జమ్మూ కశ్మీర్ నుంచి వచ్చిన పౌరులపై ఎటువంటి పరిపాలనాపరమైన నియంత్రణ ఉండదు," అని డా. దీప్ రాజ్ కనేఠియా అన్నారు. పాఠశాల విద్యా విభాగానికి చెందిన సమగ్ర శిక్షా ప్రాజెక్ట్ సంచాలకులైన ఈయన, తన చేతులు కట్టేసినట్లయిందని చెప్పారు. "రాష్ట్రాన్ని రెండు వేర్వేరు కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చినందున కర్గిల్‌లో విద్యపై మాకు ఎటువంటి పరిపాలనా పరమైన నియంత్రణ ఉండదు."
వార్షిక విద్యా స్థితి నివేదిక (గ్రామీణప్రాంతం 2022) ప్రకారం, జమ్మూ కశ్మీర్‌లో 2022లో 55.5 శాతం మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. ఈ సంఖ్య 2018లో ఉన్న 58.3 శాతం కంటే తక్కువ.
లదాఖ్‌లోని కర్గిల్ ప్రాంతానికి వలసవచ్చిన ఈ సంచారజాతుల పిల్లలకు బోధించేందుకు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ఆరుగురు సీజనల్ ఉపాధ్యాయులను నియమించిందని, అయితే వారెవరూ అందుబాటులో లేరని సర్పంచ్ షమీమ్ చెప్పారు. "వారు వలసలకాలం ముగిసే సమయానికి, తాము ఎన్నడూ చేయని పనికి జీతం తీసుకోవడం కోసం, సంబంధిత సిఇఒతో వారి డ్యూటీ రోస్టర్‌పై సంతకం చేయించుకునేందుకు వస్తారు," అని అతను పేర్కొన్నారు.
"మేం నిస్సహాయులం. అందువల్లనే మా పిల్లలు కూడా పశువులను మేపడమో లేదా ఏదైనా శ్రమతో కూడిన పనులు చేయడమో చేస్తుంటారు," అన్నారు అంజాద్. "తమ పిల్లలు బాగా చదువుకొని మంచి భవిష్యత్తు కలిగి వుండాలని ఎవరికి మాత్రం ఉండదు?"
అదృష్టవశాత్తూ అంజాద్, ఇంకా మిగిలిన పశుపోషకుల పిల్లలకు వారితో పాటు శిక్షణ పొందిన ఉపాధ్యాయుడైన తారిఖ్ ఉన్నారు. ఇంకెంతమాత్రం సమగ్ర శిక్షా ఉద్యోగి కాకపోయినప్పటికీ, ఆయన మినిమార్గ్‌లోని బకర్‌వాల్ పిల్లలకు చదువు చెప్పడం మాత్రం మానలేదు. పిల్లలు ఆయన వద్ద ఆంగ్లం, లెక్కలు, సామాన్య శాస్త్రం, ఉర్దూ నేర్చుకుంటున్నారు. "నా సముదాయానికి చెందిన ఈ పిల్లలకు చదువు చెప్పటం నా బాధ్యతగా నేననుకుంటున్నాను. ఇలా చదువు చెప్పటం నాకు సంతోషంగానూ హాయిగా కూడా ఉంటుంది," అంటారు ఈ యువ బకర్‌వాల్.
ఆయనిప్పుడు జీతంపై పనిచేసే ఉపాధ్యాయుడు కాకపోవటం వలన, తన పశువులను కూడా కాస్తుంటారు. పొద్దున 10 గంటలకు వెళ్ళి సాయంత్రం 4 గంటలకు తిరిగివస్తుంటారు. తారిఖ్ కుటుంబానికి గొర్రెలూ మేకలూ కలిపి 60 జంతువులున్నాయి. ఆయన ఇక్కడ తన భార్యతోనూ, కూతురు రఫిక్ బానో తోనూ కలిసివుంటున్నారు.
ఈ యువ ఉపాధ్యాయుడి చదువు కూడా కొన్ని సవాళ్ళతోనే సాగింది. తన బడి రోజులను తలచుకుంటూ ఆయన, "నా చదువు ఎలాంటి పెద్ద అంతరాయాలు లేకుండా సాగేందుకు నేను శ్రీనగర్‌లోని మా బంధువుల ఇంట్లో ఉండి చదువుకునేవాడిని," అన్నారు. తారిఖ్ 2003లో సౌరా శ్రీనగర్‌లోని ప్రభుత్వ బాలుర హైయ్యర్ సెకండరీ పాఠశాలలో తన 12వ తరగతిని పూర్తిచేశారు.
బకర్‌వాల్ సముదాయానికే చెందిన తారిఖ్, ఇది తన రుణం తీర్చుకునే సమయంగా భావిస్తుంటారు. " అబ్బా [నాన్న] మాకిక్కడ అన్ని సబ్జెక్టులను ఆయనే చెప్తారు. మా బడిలో అయితే ప్రతి సబ్జెక్ట్‌కూ వేరు వేరు ఉపాధ్యాయులుంటారు," అంటోంది రఫీక్ బానో. పదేళ్ళ వయసున్న ఈ బాలిక రజౌరి జిల్లా, కాలాకోట్ తెహసిల్ లోని జమ్మూ కశ్మీర్ ప్రభుత్వ బాలికల మాధ్యమిక పాఠశాలలో ఆరవ తరగతి చదువుతోంది.
"నేను చదువుకొని ఉపాధ్యాయురాలిని కావాలనుకుంటున్నాను. అలా అయితే మా అబ్బా చేసినట్టే నేను కూడా ఈ పిల్లలకు చదువు చెప్పొచ్చు. ఇక్కడ ఉపాధ్యాయులెవరూ లేరు, అందుకని నేను కూడా టీచర్ని అవుదామనుకుంటున్నా," అంటోంది ఈ చిన్న పాప.
కాబట్టి తమ రోజులను ఆటలాడటంలోనో లేదా పర్వతాల చుట్టూ తిరుగడంలోనో గడిపే పిల్లలు ఇప్పుడు తారిఖ్‌తో రోజుకు కొన్ని గంటలు గడుపుతున్నారు. జూలైలో ఈ విలేఖరి వారిని కలిసిన రోజున వారు తమ పుస్తకాలను శ్రద్ధగా చదువుతున్నారు. 3-10 సంవత్సరాల వయస్సు గల 25 మంది పిల్లల ఈ బృందం మినిమార్గ్‌లోని వారి ఇళ్ళ వద్ద కూర్చుని, ఎత్తైన చెట్ల బారుకు ఇంకా పై ఎత్తున ఉన్న ఈ ఎత్తైన ప్రదేశంలో తారిఖ్ రూపంలో కొంత నీడను పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.
"నేనిక్కడ ఉన్నాను కాబట్టి పిల్లలు చదువుకోగలుగుతున్నారు, కానీ ఇంకా మరింతో ఎత్తైన ప్రదేశాలలో ఉన్న పిల్లల సంగతేమిటి? వారికి ఎవరు చదువు చెప్తారు?" ఎలాంటి రుసుమూ తీసుకోకుండా చదువు చెప్తోన్న ఆ ఉపాధ్యాయుడు అన్నారు.
కర్గిల్ ఇటీవల (2019) కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన లదాఖ్‌లో ఉంది. అంతకుముందు అది జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో భాగంగా ఉండేది.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి