ఆమె ఖాళీ చేతులతో ఆ పేవ్‌మెంట్ పై నిల్చొని ఉంది. ఘనీభవించిన శోకంలా. వారి విషపు పంజాల నుండి దేనినీ తిరిగి పొందేందుకు ఆమె ఇంక ప్రయత్నించటం లేదు. ఆమె తన తలలో అంకెలను కుదురుగా ఉంచుకోలేకపోయింది, తనకు కలిగిన నష్టాలను లెక్కించడం మానేసింది. అపనమ్మకం నుండి భయం నుండి ఆవేశం నుండి ప్రతిఘటన నుండి పూర్తి నిరాశ నుండి మొద్దుబారిపోవడం వరకు - నిమిషాల వ్యవధిలో ఆమె అనేక అవస్థలను దాటేసింది. ఇప్పుడామె వీధికి ఇరువైపులా నిల్చొని చూస్తున్న అనేకమంది ఇతరుల వలె, ఆ అల్లకల్లోలాన్ని అలా చూస్తూ ఉండిపోయింది. గడ్డకట్టిపోతోన్న కన్నీళ్ళు కన్నుల నుండి ధారాపాతంగా ఉప్పొంగుతుండగా, దుఃఖపు ముద్ద నొప్పిగా గొంతులో కదలాడుతుండగా. ఆమె జీవితం బుల్‌డోజర్‌ పాదాల కింద నలిగిపోయింది. కొన్ని రోజుల క్రితం చెలరేగిన అల్లర్లు చేసింది ఏ మాత్రం చాలదన్నట్టు.

కాలం కొంతకాలంగా మారుతున్నదని నజ్మాకు తెలుసు. పాలు తోడు పెట్టేందుకు చల్ల అడగడానికి వెళ్ళినప్పుడు రష్మీ ఆమెను చూసిన విధానం మాత్రమే కాదు. షాహీన్ బాగ్ వద్ద నిరసన తెలుపుతున్న మహిళలతో తాను చేరినప్పటి నుండి, లోతైన కందకాలు చుట్టుముట్టి ఉన్న ఒక చిన్న నేల పీలికపై తాను ఒంటరిగా నిలబడినట్టుగా, క్రమం తప్పకుండా వస్తున్న ఒక పీడకల గురించి కాదు. ఈ మారుతున్నది ఆమె లోపల కూడా ఉంది, తన గురించి, తన పిల్లల గురించి, తన దేశం గురించి తానెలా అనుకుంటున్నదీ. ఆమె భయపడింది.

తమ స్వంతం అనుకున్నది దోపిడీకి గురికావటం కుటుంబ చరిత్రలో ఇదే మొదటిసారి కాదు. మతకల్లోలాలు వ్యాపింపజేసిన విద్వేషపూరిత జ్వాలల వల్ల పుట్టిన ఆ బాధ గురించిన భావన తన అమ్మమ్మకు కూడా తెలుసునని ఆమెకు ఖచ్చితంగా తెలుసు. ఒక చిన్నారి వేలు ఆమె చున్నీని పట్టి లాగింది. వెనుతిరిగి చూడగానే, ఒక నిస్సహాయమైన చిరునవ్వు ఆమెను పలకరించింది. అప్పుడే ఆమె ఆలోచనలు మళ్ళీ అడవి పువ్వుల్లా వికసించాయి…

ప్రతిష్ఠ పాండ్య చదువుతోన్న పద్యాన్ని వినండి

అడవి వాసనల పూలు

బుల్‌డోజర్ల పదునైన పారలు నిర్దయతో
ఎత్తి పారేస్తున్నాయి రాళ్లగుట్టలని,
తవ్వుతున్నాయి కాలగర్భంలో కలిసిపోయిన ప్రేతాత్మలని,
కూలుస్తున్నాయి మసీదులని, మినారులని.
వటవృక్షాలనీ పెళ్ళగించగలవవి
పిట్టల గూళ్ళు, గాలిలోని ఊడలతో సహా.

బుల్లెట్ ట్రైనులకి దారివ్వండి,
చెట్ల మోడులనూ బండరాళ్ళనూ తోసివేయండి,
యుద్ధమైదానపు అడ్డంకులను తొలగించండి,
కాల్పులకి సైనికులను మోహరించండి.
రిప్పర్ భూతపు పదునైన ఇనుప పళ్ళు
పెళ్ళగించగలవు రాతినేలను కూడా.
వాటికి తెలుసు దేనినెట్లా మట్టంగా చదును చేయాలో.

కానీ అంతా కూలగొట్టి శుభ్రం చేశాక కూడా
పుప్పొడి పంచుతూ తుమ్మెదలు, సీతాకోకచిలుకలు
చురుకైనవి, ప్రబలమైనవి, మృదువైనవి, ప్రేమతో నిండినవి
ఇంకా మిగిలేవుంటాయి మిమ్మల్ని సవాలు చేస్తూ.
అవి పుస్తకాల నుంచి జారిపడతాయి
నాలుకుల నుంచి దొర్లుతాయి.
వాటినేం చేయగలరు?
అనుకోని గాలుల మాటున మాయమవుతాయి,
పిట్టల, తేనెటీగల వీపులపై స్వారీ అవుతాయి,
నదీజలాలపై తేలియాడుతూ,
కవితల పాదాల వెనుక దాగుడుమూతలాడుతూ
విచ్చలవిడిగా పుప్పొడిని పంపిణీ చేస్తూ
అక్కడా ఇక్కడా ప్రతిచోటా?
పసుపు పచ్చని రంగులో ఎండిన తేలికపాటి మొండి దుమ్ము
పొలాలపై, అడవులపై, పూరెక్కలపై పరచుకుంటుంది.
చూడు, అవన్నీ ఎలా విరగపూస్తున్నాయో!
చిక్కని రంగులతో పూలతోటలు
నాగరికతకు పరిచయంలేని వాసనతో,
ఆశలా మొలుస్తూ
మీ రిప్పర్ల బ్లేడుల మధ్యనుంచి
మీ బుల్‌డోజర్లు వదిలిన జాడల్లోంచి.
చూడు, ఎలా విరగబూస్తున్నాయో!

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Poem and Text : Pratishtha Pandya

प्रतिष्ठा पांड्या पारीमध्ये वरिष्ठ संपादक असून त्या पारीवरील सर्जक लेखन विभागाचं काम पाहतात. त्या पारीभाषासोबत गुजराती भाषेत अनुवाद आणि संपादनाचं कामही करतात. त्या गुजराती आणि इंग्रजी कवयीत्री असून त्यांचं बरंच साहित्य प्रकाशित झालं आहे.

यांचे इतर लिखाण Pratishtha Pandya
Illustration : Labani Jangi

मूळची पश्चिम बंगालच्या नादिया जिल्ह्यातल्या छोट्या खेड्यातली लाबोनी जांगी कोलकात्याच्या सेंटर फॉर स्टडीज इन सोशल सायन्सेसमध्ये बंगाली श्रमिकांचे स्थलांतर या विषयात पीएचडीचे शिक्षण घेत आहे. ती स्वयंभू चित्रकार असून तिला प्रवासाची आवड आहे.

यांचे इतर लिखाण Labani Jangi
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

यांचे इतर लिखाण Sudhamayi Sattenapalli