రాణి మహ్తో తన రెండు రోజుల పాపను సురక్షితంగా ప్రసవించినందుకు ఆనందంగా ఉన్నా, ఇంటికి వెళ్లి తన భర్తకు మళ్ళీ.ఆడపిల్ల పుట్టింది అని చెప్పాలంటే భయపడుతుంది.
"అతను ఈసారి కొడుకు కావాలనుకున్నాడు," అని ఆమె భయంగా చెప్పింది. బీహార్‌లోని పాట్నా జిల్లాలోని దానాపూర్ సబ్-డివిజనల్ హాస్పిటల్లో 20 ఏళ్ళ రాణి, తన మంచం పై ఉన్న పసిపాపకు పాలు ఇస్తోంది. "నేను ఇంటికి వెళ్ళాక రెండవసారి కూడా ఆడపిల్ల పుట్టింది అని చెబితే అతను ఏమంటాడో అని భయంగా ఉంది.”
2017లో 16 సంవత్సరాల వయస్సులో తన పెళ్లి అయిన వెంటనే రాణికి మొదటి కూతురు పుట్టింది. ఆ సమయంలో ఆమె భర్త ప్రకాష్ కుమార్ మహ్తో వయస్సు 20 ఏళ్ళు. ఆమె, ప్రకాష్ తో, అతని తల్లితో కలిసి, అదే జిల్లాలోని ఫుల్వారీ బ్లాక్‌లో ఒక గ్రామంలో(పేరు చెప్పడానికి ఇష్టపడలేదు) నివసిస్తుంది. మహ్తోలు సంప్రదాయవాద OBC వర్గానికి చెందినవారు.
“మా ఊరిలో చాలా మంది ఆడపిల్లలకు 16 ఏళ్లకే పెళ్లిళ్లు చేస్తారు” అని యుక్తవయసులో ఉన్నప్పుడే పెళ్లి వల్ల తలెత్తే సమస్యల గురించి తెలియని రాణి చెప్పింది. "నాకు ఒక చెల్లెలు కూడా ఉంది, కాబట్టి నా తల్లిదండ్రులు నాకు త్వరగా పెళ్లి చేయాలని అనుకున్నారు" అని ఆమె చెప్పింది, ఆమె అత్తగారు గంగా మహ్తో తనతో కలిసి మంచం మీద కూర్చొని చుట్టీ వాలే పేపర్(డిశ్చార్జ్ సర్టిఫికేట్) కోసం ఎదురు చూస్తోంది.
రాణి, ఆమె సోదరి మాత్రమే కాదు. దేశంలోని 55 శాతం బాల్య, కౌమార వివాహాలు బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, రాజస్థాన్‌లలో జరుగుతున్నాయని జనాభా లెక్కల విశ్లేషణ , జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలు, ఇంకా ఇతర అధికారిక డేటా ద్వారా బాలల హక్కుల స్వచ్ఛంద సంస్థ, NGO Child Rights & YOU(CRY), తెలిపింది.
"మాకు చుట్టీ వాలే పేపర్ వచ్చాక, మేము ఆటోరిక్షా మాట్లాడుకుని మా గ్రామానికి వెళ్ళిపోతాము" అని రాణి నాకు చెప్పింది. ఇప్పటికే ఆమె ఆసుపత్రిలో సాధారణంగా అవసరమైన దానికంటే రెండు రోజులు ఎక్కువ సమయం గడిపింది. ఎందుకంటే ఆమెకు వేరే వైద్యపరమైన సమస్యలు ఉన్నాయి. "నాకు ఖూన్ కి కమీ (రక్తహీనత) ఉంది" అని రాణి చెప్పింది.
రక్తహీనత అనేది ముఖ్యంగా భారతదేశంలోని మహిళలు, కౌమారదశలో ఉన్న బాలికలలో, చిన్న పిల్లలలో ఉన్న తీవ్రమైన ప్రజారోగ్య సమస్య. అధికారిక, స్వతంత్ర పరిశోధనా అధ్యయనాల ప్రకారం, ముందుగానే వివాహం చేసుకున్న అమ్మాయిలు ఆహార అభద్రత, పోషకాహార లోపం, రక్తహీనతతో బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. తక్కువ స్థాయి ఆదాయం, చదువు లేకపోవడం- ఈ రెండిటితో బాల్య వివాహం ముడిపడి ఉంది. ఆహార అభద్రత ఎక్కువగా ఉన్న పేద కుటుంబాలు తరచుగా తమ కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి బాల్య వివాహాలను ఒక మార్గంగా చూస్తాయి.
తొందరగా పెళ్లి చేసుకునే అమ్మాయిలకు తమ ఆరోగ్యం, పోషకాహారానికి సంబంధించిన విషయాలలో నిర్ణయాధికారం ఉండదు. దీని వలన వారికి పుట్టిన పిల్లలలో అనారోగ్యం, పోషకాహారలేమి, రక్తహీనత, తక్కువ బరువుతో పుట్టడం వంటి విషయాలకు దారి తీస్తాయి. బాల్య వివాహం, ఈ ప్రక్రియను మొత్తం నడిపి, పై ఫలితాలలో ఒకటిగా మారుతుంది . ఆపై, దీనిపై తగిన పాలసీని రూపొందించడం క్లిష్టతరం చేసే మరో సమస్య ఉంది: అసలు భారతదేశంలో పిల్లలు అంటే ఎవరు?
బాలల హక్కులపై 1989 ఐక్యరాజ్యసమితి కన్వెన్షన్, ఇంకా 18 ఏళ్లు నిండని ప్రతి వ్యక్తిని బాలలుగా నిర్వచిస్తుంది. దీనిని భారతదేశం 1992 నుండి ధృవీకరిస్తోంది. భారతదేశంలో, బాలల వయసుకు - బాల కార్మికులకు, వివాహానికి, అక్రమ రవాణాకు, బాల్య న్యాయంపై చట్టాలకు వేర్వేరు నిర్వచనాలు ఉన్నాయి. మన చట్టంలో బాల కార్మికులంటే 14 ఏళ్ళ వయసు వరకు బాలలే. వివాహానికి సంబంధించిన చట్టం ప్రకారం స్త్రీకి 18 ఏళ్లకి గాని మెజారిటీ రాదు. భారతదేశంలో, వివిధ చట్టాలు కూడా 'పిల్లలు', 'మైనర్'ల మధ్య తేడాలను చూపుతాయి. దీనివలన, 15-18 ఏళ్ల వయస్సులో ఉన్న యువకులు తరచుగా పరిపాలనాపరమైన చర్యల ద్వారా తప్పిపోతారు.
ఎలా చూసినా రాణి మహ్తో జీవితంలో, సామాజిక ఆచారాలు, లింగ వివక్షకు సంబంధించిన కఠినమైన వాస్తవాలు, ఈ చట్టాలు, చట్టపరమైన ప్రకటనల కంటే ఎప్పుడూ శక్తివంతమైనవే.
“రాఖీ [ఆమె పెద్ద కూతురు] పుట్టినప్పుడు, నా భర్త నాతో వారాల తరబడి మాట్లాడలేదు. అతను వారానికి రెండు లేదా మూడు సార్లు తన స్నేహితుల దగ్గర ఉంటూ తాగి ఇంటికి వచ్చేవాడు.” అన్నది రాణి. ప్రకాష్ మహ్తో కూలీగా పనిచేస్తాడు కానీ నెలలో సగం రోజులు మాత్రమే పనికి వెళతాడు. "నా కొడుకు పని కోసం ప్రయత్నించడు" అని అతని తల్లి గంగ బాధగా చెప్పింది. "అతను ఒక నెలలో 15 రోజులు పని చేస్తాడేమో - కానీ ఆ తరువాత వచ్చే 15 లో అతను సంపాదించినదంతా తన కోసం ఖర్చు చేస్తాడు. తాగుడు అతని జీవితాన్ని, మా జీవితాన్నికూడా నాశనం చేస్తోంది."
రాణి గ్రామంలోని ఆశా కార్యకర్త ఆమెకు రెండవ ప్రసవం తర్వాత ట్యూబల్ లైగేషన్ చేయించుకోమని సూచించింది. కానీ రాణి భర్త అందుకు అంగీకరించలేదు. “నాకు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉండకూడదని ఆశా దీదీ చెప్పింది. రక్తహీనత కారణంగా నా శరీరం మూడో బిడ్డను కనేందుకు బలహీనంగా ఉందని చెప్పింది. కాబట్టి, నేను నాలుగు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు, కానుపు తర్వాత ఆ ఆపరేషన్ చేయించుకోవడం గురించి ప్రకాష్‌తో మాట్లాడటానికి ప్రయత్నించాను. కానీ అది నాకు పీడకలగా మారింది. అతను నాకు చెప్పాడు, నేను అతని ఇంట్లో బతకాలనుకుంటే, నేను అతనికి ఒక అబ్బాయిని కని తీరాలి. దీనికోసం ఎన్నిసార్లయినా గర్భం దాల్చాలి. పిల్లలు పుట్టకుండా అతను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడానికి ఇష్టపడడు. నేను మరీ పట్టుబట్టినట్లయితే, నా చెంప వాయిస్తాడు. మా అత్తగారు కూడా కొడుకు పుట్టేదాకా ఆపరేషన్ చేయించుకోకూడదనే అంటారు.”
ఆమె తన అత్తగారి ముందు ధైర్యంగా మాట్లాడడం చూస్తే, ఇద్దరు మహిళల మధ్య ఆత్మీయ బంధం అసాధ్యమేమీ కాదని తెలుస్తుంది. రాణి పట్ల సానుభూతి ఉన్నా గాని గంగ, తన సమాజాన్ని పాలిస్తున్న పితృస్వామ్య మనస్తత్వం నుండి బయట పడలేదు.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4 ప్రకారం పాట్నా (గ్రామీణ)లో కేవలం 34.9 శాతం మంది మాత్రమే ఏదో ఒక కుటుంబ నియంత్రణ పద్ధతులను ఉపయోగిస్తున్నారు. కాని జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో పురుషుల స్టెరిలైజేషన్ శాతం సున్నాగా నమోదు చేయబడింది. NFHS-4 కూడా బీహార్‌లో 15-49 సంవత్సరాల వయస్సు గల గర్భిణీ స్త్రీలలో 58 శాతం రక్తహీనతతో ఉన్నట్లు సూచిస్తుంది.
"20 సంవత్సరాల వయస్సులో రెండవ డెలివరీతో, నేను ఒక విషయంపై నిర్ణయం తీసుకున్నాను" అని రాణి చెప్పింది. “అంటే: నా అమ్మాయిలకు కనీసం 20 ఏళ్లు దాటేదాకా పెళ్లి చేయను. నేను మాత్రం ఒక కొడుకు పుట్టే వరకు పిల్లలను కంటూనే ఉంటాను.”
ఆమె నిట్టూర్చి నెమ్మదిగా చెప్పింది: “మా లాంటి స్త్రీలకు మా ఆద్మీ (పురుషుడు) చెప్పినట్లు చేయడం తప్ప వేరే మార్గం లేదు. ఇదిగో, నా నుండి మూడవ మంచం మీద ఆమెని చూశారా? ఆమె నగ్మా. ఆమెకు ఇది నాలుగో డెలివరీ. ఆమె ఇంట్లో కూడా, ఆమె బచ్చెదాని (గర్భాశయం) తీసివేయాలనే ఆలోచనను వారు తోసిపుచ్చారు. కానీ ఇప్పుడు ఆమె అత్తమామలతో కాకుండా తన తల్లిదండ్రులతో ఇక్కడ ఉంది, ఇంకో రెండు రోజుల తర్వాత ఆ ఆపరేషన్ చేయించుకుంటుంది. ఆమె చాలా ధైర్యంగా ఉంది. తన భర్తతో ఎలా మాట్లాడాలో తనకు తెలుసని చెప్పింది,” అని రాణి చిరునవ్వు నవ్వింది.
యునిసెఫ్ నివేదిక ప్రకారం, రాణి వలె, చాలా మంది బాల వధువులు తమ యుక్తవయస్సులోనే తల్లులవుతారు . అలాగే, వారి కుటుంబాలు, ఆలస్యంగా వివాహం చేసుకున్న మహిళల కుటుంబాల కంటే పెద్దవిగా ఉంటాయి. దీని మీద ఈ మహారోగం, పరిస్థితులను మరింత దిగజార్చింది.
"2030 నాటికి బాల్య వివాహాలను అంతం చేయాలనే లక్ష్యం ఇప్పటికీ ఒక సవాలుగా అనిపిస్తుంది" అని కనికా సరఫ్ చెప్పారు. "మీరు దీనిని గుర్తించాలంటే, దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా గ్రామీణ ప్రాంతాల పరిస్థితిని చూడాలి." కనికా సరఫ్ బీహార్‌లోని అంగన్ ట్రస్ట్‌లో పిల్లల భద్రతా వ్యవస్థల అధిపతి, ఇది పిల్లల రక్షణపై గట్టిగా దృష్టి సారించింది. "కానీ మహారోగం ఈ సమస్యకు మరిన్ని పొరలను జోడించింది. ఈ కాలంలో ఒక్క పాట్నాలోనే 200 బాల్య వివాహాలను ఆపగలిగాం. కాబట్టి మీరు వేరే జిల్లాలలోని గ్రామాలలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఊహించవచ్చు.” అన్నారు ఆమె.
నీతి ఆయోగ్ ప్రకారం , బీహార్ రాష్ట్రంలో అప్పుడే పుట్టిన పిల్లల లింగ నిష్పత్తి 2013-15లో ప్రతి 1,000 మంది పురుషులకు 916 మంది స్త్రీలు ఉన్నారు. అయితే ఇది 2005-07లో 909గా ఉన్నప్పుడు పరిస్థితి కంటే మెరుగుగా కనిపించినా,, ఐదేళ్లలోపు పిల్లలలో, మగపిల్లల కంటే ఆడపిల్లలే ఎక్కువగా చనిపోవడంతో లింగ నిష్పత్తి మరింత దిగజారుతున్నది. అంటే, 5 ఏళ్లలోపు పిల్లలలో మరణాల రేటు (ప్రతి 1,000 సజీవ జననాలకు ఐదు సంవత్సరాలలోపు మరణాల సంభావ్యత) రాష్ట్రంలో 43 మంది ఆడపిల్లలు, 39 మంది మగపిల్లలుగా ఉంది. 2019లో యుఎన్ ఏజెన్సీల ప్రకారం , అఖిల భారతంలో ప్రతి 35 మంది స్త్రీలకు 34 మంది పురుషులు ఉన్నట్లుగా తెలుస్తుంది.
మనవడు కుటుంబానికి సంతోషకరమైన రోజులను తెస్తాడని గంగ నమ్ముతుంది - కానీ తన కొడుకు మాత్రం ఇంటిలో ఏ సంతోషాన్ని ఇవ్వడం లేదని ఆమె అంగీకరించింది. “ప్రకాష్ వల్ల ఉపయోగం లేదు. ఐదో తరగతి తర్వాత ఎప్పుడూ స్కూల్‌కి వెళ్లలేదు. అందుకే నాకు మనవడు కావాలని కోరిక. తన కుటుంబాన్ని, తల్లిని చూసుకునేవాడు కావాలి. రాణి గర్భిణిగా ఉన్నప్పుడు ఆమెకు కావాల్సినంత పౌష్టికాహారం తీసుకోలేకపోయింది. నిన్నా, మొన్నా చాలా బలహీనంగా ఉండి అసలు మాట్లాడలేకపోయింది. అందుకే నేను ఆమెకు తోడుగా ఆసుపత్రిలో ఉందామని నన్ను తన వద్ద విడిచిపెట్టమని నా కొడుకును అడిగాను.”
"అతను తాగి ఇంటికి వచ్చినప్పుడు, నా కోడలు ప్రశ్నిస్తే, అతను ఆమెను కొడతాడు, ఇంటిలో వస్తువులన్నీ పాడు చేస్తాడు." కానీ ఇది మద్యనిషేధం ఉన్న రాష్ట్రం కాదా? అలా ప్రకటించబడిన తర్వాత కూడా, బీహార్‌లో దాదాపు 29 శాతం మంది పురుషులు మద్యం సేవిస్తున్నారని NFHS-4 తెలిపింది. గ్రామీణ పురుషులలో ఇది దాదాపు 30 శాతం.
రాణి గర్భధారణ సమయంలో, గంగ తన గ్రామం వెలుపల పనిమనిషిగా పని దొరుకుతుందేమోనని ప్రయత్నించింది, కాని దొరకలేదు. “నా పరిస్థితి చూసి, నేను ఊరికే జబ్బు పడడం చూసి, అప్పుడప్పుడు పండ్లు, పాలు తీసుకురావడానికి మా అత్తగారు బంధువుల దగ్గర దాదాపు ఐదు వేల రూపాయలు అప్పుగా తీసుకున్నారు” అని రాణి చెప్పింది.
"నాకు పిల్లలు పుట్టేలా చేస్తే రాబోయే రోజుల్లో నాకు ఏమి జరుగుతుందో నాకు తెలియదు," అని రాణి తన శరీరం, జీవితంపై నియంత్రణ లేకపోవడంపై తన నిస్సహాయతను ఒప్పుకుంటుంది. "కానీ నేను బతికి ఉంటే, నా కూతుర్లను వారు కోరుకున్నంత వరకు చదివించటానికి ప్రయత్నిస్తాను."
"నా కుమార్తెలు నాలాగా అవడం నాకు ఇష్టం లేదు."
ఈ కథనంలో కొంతమంది వ్యక్తుల పేర్లు, స్థలాలు వారి గోప్యతను కాపాడడానికి మార్చబడ్డాయి.
పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా లో భాగంగా, PARI మరియు కౌంటర్ మీడియా ట్రస్ట్ కలిసి గ్రామీణ భారతదేశంలో కౌమారదశలో ఉన్న బాలికలు మరియు యువతులపై దేశవ్యాప్త రిపోర్టింగ్ ప్రాజెక్ట్ ను చేస్తున్నారు. అట్టడుగున ఉన్నా ఎంతో కీలకమైన ఈ సమూహాల స్థితిగతులను అన్వేషించడానికి, సాధారణ ప్రజల గొంతులను, వారి అనుభవాలను వినిపించడానికి ఈ ప్రాజెక్టు కృషి చేస్తుంది.
ఈ వ్యాసాన్ని ప్రచురించాలనుకుంటున్నారా? అయితే [email protected]కి ఈమెయిల్ చేసి అందులో [email protected]కి కాపీ చేయండి.
జిగ్యసా మిశ్రా ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్ నుండి స్వతంత్ర జర్నలిజం గ్రాంట్ ద్వారా ప్రజారోగ్యం మరియు పౌర స్వేచ్ఛపై నివేదికలు అందిస్తారు. ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్ ఈ రిపోర్టేజీలోని విషయాలపై సంపాదకీయ నియంత్రణను అమలు చేయలేదు.
అనువాదం: అపర్ణ తోట