మరోసారి ఈరోజు పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా (PARI) ప్రపంచ అనువాద దినోత్సవం జరుపుకుంటోంది. అదే సందర్భంలో ఎక్కడెక్కడి జర్నలిజం వెబ్‌సైట్‌లతో పోల్చినా అగ్రస్థానాన నిలిచే తన అనువాదకుల బృందాన్ని సత్కరించుకుంటోంది. నాకు తెలిసినంతవరకూ - ఈ విషయంలో నన్ను ఎవరైనా సవరిస్తే అది నాకు సంతోషమే - ప్రపంచంలోని జర్నలిజం వెబ్‌సైట్లలోకెల్లా PARI భాషా వైవిధ్య పరంగా మొదటిస్థానంలో నిలుస్తుంది. మాతో పనిచేసే 170 మంది అద్భుతమైన అనువాదకుల కృషి వల్ల PARI 14 భాషల్లో తన ప్రచురణను సాగిస్తోంది. నిజమే, కొన్ని మీడియా సంస్థలు 40 భాషల్లో ప్రచురిస్తున్న మాట నిజమే. కానీ ఆ సంస్థల విషయంలో భాషలపరంగా బలమైన నిచ్చెనమెట్ల వ్యవస్థ ఉంది. కొన్ని భాషలు మిగిలిన భాషలకన్నా బాగా తక్కువ సమానంగా ఉంటాయి.
‘ ప్రతి భారతీయభాష, మన భాష ' అన్న భావనతో మేం ప్రచురణలు కొనసాగిస్తున్నాం. అన్ని భాషలూ సమానమే అన్నది ఇందులో ఇమిడి ఉన్న విలువ. ఒక భాషలో ఒక కథనం వచ్చిందంటే దాన్ని మిగిలిన 13 భాషల్లోనూ ప్రచురించాలన్నది మా ధ్యేయం. ఈ మధ్యే ఛత్తీస్‌గఢీ మా భాషా కుటుంబంలో చేరింది. భోజ్‌పురి చేరబోతోంది. ఇంకా ఎన్నో భాషలు వరుసతీరి ఉన్నాయి.
భారతీయ భాషలను నిలబెట్టడమన్నది సమాజానికి ఎంతో అవసరం అని మేం నమ్ముతాం. ఈ దేశం భాషాపరంగా ఎంత వైవిధ్యం కలదీ అంటే- మనం వినే మాట, 'ప్రతి మూడునాలుగు కిలోమీటర్లకూ ఇక్కడి నీటి రుచి విభిన్నంగా ఉంటుంది ' అనే మాటకు దీటుగా ఈ దేశంలో ప్రతి పది పదిహేను కిలోమీటర్లకూ సరికొత్త భాష వినపడుతుంది.
మన ఈ భాషా వైవిధ్యాన్ని చూసుకొని సంబరపడుతూ ఉండే పరిస్థితి ఇప్పుడు లేదు. పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా ఈ దేశంలోని దాదాపు 800 భాషల్లో 225 భాషలు గత ఏభై ఏళ్ళలో అంతరించిపోయాయి అని చెపుతున్నపుడు; మనమంతా లేచి నిలబడాల్సి వస్తోంది. యునైటెడ్ నేషన్స్‌వారు ఈ శతాబ్దాంతానికి ప్రపంచంలోని 90-95 శాతం మౌఖిక భాషలు అంతరించిపోబోతున్నాయి అని చెపుతున్నపుడు నిలబడి నడుము బిగించాల్సి వస్తోంది. ప్రపంచంలోని ఏదో ఒక దేశవాళీ భాష ప్రతి పదిహేను రోజులకూ తన మనుగడ చాలిస్తోంది అని తెలిసినపుడు నడుం బిగించి కార్యాచరణకు సిద్ధపడాలి.
ఒక భాష అంతరించిపొతుంది అంటే మన సంస్కృతి, చరిత్ర, మన సమాజంలోని ఒక భాగం అంతరించిపొయినట్టే. భాష కనుమరుగు అయిందీ అంటే ఆ భాషలోని పాటలు, కథలు, కళలు, పురాణగాథలు, సంగీతం, మౌఖిక సంప్రదాయాలు, శ్రవణ ప్రపంచం, జ్ఞాపకాలు, ఒక జీవన విధానం - ఇవన్నీ అంతరించిపోయినట్టే. ఆ భాషకు చెందిన బృందానికి మిగతా ప్రపంచంతో సంబంధ బాంధవ్యాలు తెగిపోయినట్టే. ఆ బృందపు గౌరవ మర్యాదలు, ఉనికి అంతరించినట్టే. ఆ దేశపు - అప్పటికే మొక్కవోతున్న - వైవిధ్యానికి భంగం కలిగినట్టే. మన బ్రతుకుతెరువులు, మన పర్యావరణం, మన ప్రజాస్వామ్యం - ఇవన్నీ మన మన భాషలతో, వాటి భవిష్యత్తులతో ఎంతో గాఢంగా ముడిపడి ఉన్నాయి. ఈ భాషా వైవిధ్యం ఇపుడు తోచినంత అమూల్యంగా మునుపెన్నడూ మనకు అనిపించలేదు. ఈ విషయంలో ఇప్పుడున్నంత దారుణంగా పరిస్థితి మునుపెన్నడూ లేదు.
కథలూ కవితలూ పాటల ద్వారా PARI భారతీయ భాషలను గౌరవించుకుంటూ ఉంటుంది. తన అనురాగం ప్రదర్శిస్తూ ఉంటుంది. ఆ భాషల్లోకి అనువదించడం ద్వారా తన నిబద్ధతను చాటుకొంటూ ఉంతుంది. ఈ ప్రక్రియలో దేశపు మారుమూలల్లో నివసించే ఎవరికీ పట్టని భాషా బృందాల ద్వారా ఎన్నో ఆణిముత్యాలు లభించాయి. ఈ ఆణిముత్యాలను మనకు అంతగా తెలియని భాషలూ పలుకుబళ్ళలో ఇమిడివున్న ఈ ఆణిముత్యాలను, ఆ భాషాబృందపు నివాస స్థలాల నుంచి వెలికితీసి సుదూర ప్రాంతాలకు చేరవేసే ప్రయత్నంలో మా అనువాదకుల బృందం అనునిత్యం నిమగ్నమై ఉంది. ఈ ప్రక్రియ భారతీయ భాషల నుంచి ఆంగ్లంలోకి అనువదించడానికే పరిమితం కాదు. పరి భాషా ప్రపంచపుటెల్లలు మరింత విశాలమయినవి. మరింత వైవిధ్యం కలవి.
మనదేశపు అపార భాషా వైవిధ్యాన్ని సూచనమాత్రంగా ప్రతిబింబించే మా అనువాదకుల బృందం ఈరోజు మేం కృషిచేస్తోన్న ప్రతి భారతీయ భాష నుంచీ తలా ఒక ఆణిముత్యాన్ని మనకు అందిస్తోంది. అసోం, బంగ్లా, ఛత్తీస్‌గఢీ, హిందీ, గుజరాతీ, కన్నడ, మళయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ- ఈ భాషల్లోని మణులను మనకు అర్పిస్తోంది. ఈ విభిన్నతలోని ఏకత్వాన్నీ, వైవిధ్యంలోని ఉత్సవహేలనూ మీరంతా ఆస్వాదించాలని మా ఆకాంక్ష.
ఇక్కడ తెలుగు భాషలో, చిక్కనవుతున్నపాట అనే కవితా సంకలనంలోని డా. ఎండ్లూరి సుధాకర్ రాసిన ‘నెత్తుటి ప్రశ్న’ అనే కవిత సమాజంలోని అణగారిన వర్గాల ఆత్మగౌరవాన్ని గురించి ప్రగాఢంగా నొక్కి చెబుతుంది.
నెత్తుటి ప్రశ్న
నేనింకా నిషిద్ధ మానవుణ్నే
నాది బహిష్కృత శ్వాస
నా మొలకు తాటాకు చుట్టి
నా నోటికి ఉమ్మిముంత కట్టి
నన్ను నలుగురిలో
అసహ్య మానవజంతువుని చేసిన మనువు
నా నల్లని నుదుటి మీద బలవంతంగా
నిషిద్ధముద్ర వేసినప్పుడే
నా జాతంతా
క్రమక్రమంగా హత్యచేయబడింది.
ఇప్పుడు కొత్తగా చావడమేమిటి?
మా రహస్యచావుల్ని అక్షరీకరిస్తే
పత్రికల నిండా మా హత్యలే పతాక శీర్షికలవుతాయి.
ఈ దేశంలోని ఏ నేలను తవ్విచూసినా
మా అస్థిపంజరాలు మట్టి గొంతుకల్తో సాక్ష్యమిస్తాయి.
వేదం విన్న నా చెవుల్లో సీసం పోసినప్పుడు
అదేదో భాష మాట్లాడితే నాలుక తెగ్గోసినప్పుడు
నా వీర్యం తీర్చిన దాహానికి నా తల నరికేసినప్పుడు
నన్ను చెట్టుక్కట్టి గొడ్డులా చావగొట్టినప్పుడు
నేనప్పుడే శవమైపోయాను.
మా శవాలు కనీసం వార్తలు కూడా కాలేకపోయాయి.
ఆయుధాల పేర్లు మారాయి
అంకెల సంఖ్యలూ పెరిగాయి
మారనివల్లా మా హత్యలే
ఇప్పుడు మా శవాలు మాకు సంచలన వార్త కాదు
శవాలపై హంతకులు పట్టే సానుభూతి కొత్త కాదు
ఊరేగింపుల మీద రాజకీయమేఘాల ఓట్లకన్నీరూ కొత్త కాదు.
నిన్నటి చరిత్ర బొటనవేళ్ళనే కోసింది
వర్తమానం ఐదువేళ్ళనీ నరికేస్తుంది.
బహిరంగంగానూ
రహస్యంగానూ
ఘటసర్పం మా నీడల్ని వెంటాడుతుంది
నిలువెత్తు గొలుసుల్లో నిలబడ్డ దృశ్యం
ఈ దేశం చౌరస్తా
ఇరవయ్యో శతాబ్దానికి కూడా నెత్తుటి ప్రశ్నే.
కాలం చాలా స్పష్టంగా మాకు శత్రువవుతూవుంది.
పెరిగిన మా ఛాతీమీదుగా ఖడ్గం దూసుకొస్తూవుంది.
రాజ్యాంగం రాసిన వారసత్వానికి
జైళ్ళూ, సంకెళ్ళూ, చావులూ బహుమానాలవుతున్నాయి
మా మధ్యన కలుపుమొక్కలు
మా హరితశ్వాసల్ని నొక్కుతున్నాయి.
మా చావుకి వెల కూడా నిర్ణయించబడుతూంది
మాకిప్పుడు కావలసింది నెత్తుటి రొఖ్ఖంకాదు
మాకేం కావాలో కోరుకునే నిర్భయ గొంతుక.
కొత్త రాజ్యాంగం, కొత్త దేశం, కొత్త భూమి, కొత్త ఆకాశం.
కవి: డా. ఎండ్లూరి సుధాకర్
చిక్కనవుతున్న పాట , కవితా సంకలనం నుంచి