తాను సైన్యంలో చేరాలనుకుంటున్నానని తండ్రితో చెప్పేనాటికి సూరజ్ జట్టి వయసు ఇంకా పదమూడేళ్ళ లోపే. విశ్రాంత సైనికుడైన అతని తండ్రి శంకర్, తన కొడుకు తనను స్ఫూర్తిగా తీసుకున్నందుకు పొంగిపోయారు.

"నా ఇంటి వాతావరణం కారణంగా ఇది నా ఖచ్చితమైన ఎంపిక అయింది," మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా, పలుస్ నగరంలోని ఒక అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న 19 ఏళ్ళ సూరజ్ అన్నాడు. "నాకు గుర్తున్నప్పటి నుండి ఇంక వేరే దేని గురించీ నేను ఆలోచించలేదు." కొడుకు నిర్ణయం పట్ల శంకర్ సంతోషించారు. ఏ తండ్రి అయినా చాలా సంతోషంగా ఆమోదం తెలుపగలిగే విషయమిది.

ఒక దశాబ్దం లోపే, తన కొడుకు ఎంపిక గురించి శంకర్‌కు సందేహాలు మొదలయ్యాయి. ఉద్వేగభరితుడై, గర్వించే తండ్రిగా ఉండే ఆయన ఈ కొన్ని సంవత్సరాల్లో ఎక్కడో విశ్వాసాన్ని కోల్పోయారు. సరిగ్గా చెప్పాలంటే జూన్ 14, 2022న.

ఆ రోజునే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఒక విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి, “అగ్నిపథ్ పథకం కింద, దేశ యువకులకు అగ్నివీర్‌గా సాయుధ దళాలలో సేవ చేసే అవకాశం కల్పించబడుతుంది," అని ప్రకటించాడు.

ఈ పథకాన్ని తీసుకురావడానికి ముందు, 2015-2020 మధ్య ఐదేళ్ళలో సాయధ దళాలలోకి చేరినవారి సగటు సంఖ్య 61,000గా ఉంది. 2020లో కోవిడ్ విలయం వలన నియామకాలు ఆగిపోయాయి.

అగ్నిపథ్ పథకం ద్వారా భారత సైన్యంలోకి తక్కువమంది - సుమారు 46,000 మంది యువకులను లేదా అగ్నివీరులను "మరింత చిన్నవయసు, మరింత అర్హులైన, వైవిధ్యమైన" దళం కోసం తీసుకుంటారు. ప్రభుత్వ పత్రికా ప్రకటన ప్రకారం, బలగాల సగటు వయస్సును 4-5 సంవత్సరాలు తగ్గించి, నమోదు చేసుకునే వయస్సు అర్హతను 17.5 నుండి 21 సంవత్సరాల మధ్యగా నిర్ణయించారు.

జీవితకాల సైనిక ఉద్యోగంలా కాకుండా, ఇది నాలుగు సంవత్సరాల ఒప్పందం. ఇది ముగిసే సమయంలో, ఆ జట్టులోని 25 శాతం మందికి సాయుధ దళాల సాధారణ శ్రేణిలో ఉద్యోగం లభిస్తుంది.

PHOTO • Parth M.N.
PHOTO • Parth M.N.

ఎడమ: సాంగ్లీజిల్లా, పలుస్ నగరంలోని యశ్ అకాడమీలో రక్షణ రంగంలో చేరేందుకు శిక్షణ పొందుతున్న యువతీయువకులు. జీవితకాల సైనిక ఉద్యోగంలా కాకుండా, అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ పథకం నాలుగు సంవత్సరాల ఒప్పందం. ఇది ముగిసే సమయంలో ఆ జట్టులోని 25 శాతం మందికి మాత్రమే సాయుధ దళాల సాధారణ శ్రేణిలో ఉద్యోగం లభిస్తుంది. కుడి: మాజీ సైనికుడు, కుండల్‌లోని సైనిక్ ఫెడరేషన్ అధ్యక్షుడు శివాజీ సూర్యవంశీ (నీలం రంగు), ' ఒక సైనికుడు తయారుకావటానికి నాలుగు సంవత్సరాలు చాలా తక్కువ సమయం,' అన్నారు

ఈ పథకం దేశ ప్రయోజనాలకు వ్యతిరేకమని మాజీ సైనికుడు, సాంగ్లీ జిల్లా కుండల్‌లోని సైనిక్ ఫెడరేషన్ అధ్యక్షుడు, 65 ఏళ్ళ శివాజీ సూర్యవంశీ నమ్ముతున్నారు. "ఒక సైనికుడు తయారుకావటానికి నాలుగు సంవత్సరాలు చాలా తక్కువ సమయం," అన్నారాయన. "వారిని కశ్మీర్ లేదా ఇతర సంఘర్షణా ప్రాంతాలకు పంపినపుడు వారి అనుభవ లేమి సుశిక్షితులైన ఇతర సైనికులను ప్రమాదంలోకి నెడుతుంది. ఈ పథకం దేశ భద్రతను సంకటంలో పడవేస్తుంది.

ఇందులో చేరినవారికి కూడా ఇది అగౌరవమని సూర్యవంశీ అన్నారు. "విధుల్లో ఉండగా ఈ అగ్నివీరులు మరణిస్తే, వారికి అమరుల హోదా ఉండదు," అన్నారతను. "ఇది అవమానకరం. ఒక ఎమ్ఎల్ఎ (రాష్ట్ర శాసనసభ్యుడు), లేదా ఎమ్‌పి (పార్లమెంట్ సభ్యుడు) ఒక నెలరోజులపాటు ఆఫీస్‌లో ఉన్నా కూడా, తమ పూర్తి పదవీకాలాన్ని పూర్తిచేసిన సభ్యులతో సమానంగా ప్రయోజనాలు పొందుతారు. అలాంటప్పుడు సైనికుల పట్ల ఈ వివక్ష ఎందుకు?"

ఈ వివాదాస్పద పథకం గురించి ప్రకటన వెలువడగానే దేశవ్యాప్తంగా దీన్ని వ్యతిరేకిస్తూ విస్తృతంగా నిరసనలు చెలరేగాయి; అభ్యర్థులు, మాజీ సైనికోద్యోగులు దీనిని సమానంగా వ్యతిరేకించారు.

2024 సార్వత్రిక ఎన్నికలలో పేలవమైన ప్రదర్శన తర్వాత, బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దీనికి సవరణలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. సాయుధ దళాల్లోకి చేరేవారి సంఖ్య ఎక్కువగా ఉండే హరియాణా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ తీవ్రంగా నష్టపోయింది. రెండు సంవత్సరాల తర్వాత, సాయుధ దళాలలోకి అధిక సంఖ్యలో రిక్రూట్‌మెంట్‌లకు ప్రసిద్ధి చెందిన పశ్చిమ మహారాష్ట్రలో కూడా ఈ పథకం పట్ల అసంతృప్తి ఎప్పటిలాగే స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ, ప్రతి ఇంటి నుండి కనీసం ఒకరిని సైన్యానికి పంపిన గ్రామాలున్నాయి.

జట్టి అటువంటి ఒక కుటుంబానికి చెందినవాడు. అతను డిగ్రీ చివరి సంవత్సరంలో ఉన్నాడు. అయితే, అగ్నివీర్ అవటం కోసం అకాడెమీలో చేరగానే, అతని చదువు దెబ్బతింది.

PHOTO • Parth M.N.
PHOTO • Parth M.N.

అకాడమీలో ఇచ్చే శారీరక శిక్షణలో కష్టతరమైన వ్యాయామాలు ఉంటాయి: స్ప్రింటింగ్, పుష్-అప్‌లు, నేలపై పాకటం, ఒక అంకాన్ని పూర్తిచేస్తున్నప్పుడు మరొక వ్యక్తిని వీపుపై మోసుకెళ్లడం

"నేను ఉదయం ఒక మూడు గంటలు, సాయంత్రం ఒక మూడు గంటలు శారీరక శిక్షణలో గడుపుతాను," చెప్పాడతను. "అది చాలా అలవగొట్టేస్తుంది, నా చదువుపై కేంద్రీకరించేందుకు శక్తిని మిగల్చదు. నేను ఎంపిక అయిన పక్షంలో, నా డిగ్రీ పరీక్షలకు ముందే నేను వెళ్ళిపోవాల్సివుంటుంది.”

అతను తీసుకునే శిక్షణలో తీవ్రమైన వ్యాయామాలు ఉంటాయి: స్ప్రింటింగ్, పుష్-అప్‌లు, నేలపై పాకటం, ఒక అంకాన్ని పూర్తిచేస్తున్నప్పుడు మరొక వ్యక్తిని వీపుపై మోసుకెళ్లడం. సెషన్ ముగిసే సమయానికి అతని బట్టలు చెమటతో తడిసిపోయి, మురికిపట్టిపోతాయి. మళ్ళీ కొద్ది గంటల్లోనే అతని ఈ వ్యాయామాలన్నింటినీ తిరిగి చేస్తాడు.

ఒక ఏడాదిపాటు ఇటువంటి క్రమశిక్షణతో అగ్నివీర్‌గా ఎంపిక అయితే, జట్టికి నెలకు రూ. 21,000 చేతికి వస్తాయి, నాలుగవ ఏడాదికి అది రూ. 28,000కు పెరుగుతుంది. అతని జట్టు నుంచి ఎంపికయ్యే 25 శాతం మందిలో అతను లేకపోతే, అగ్నిపథ్ పథకం ప్రకారం అతని ఒప్పందం పూర్తయ్యే నాటికి రూ. 11.71 లక్షలతో అతను ఇంటికి తిరిగివస్తాడు.

తన అవకాశాలు మెరుగుపరచుకోవటం కోసం ఎటువంటి డిగ్రీ లేకుండా అతను ఉద్యోగ మార్కెట్‌లోకి ప్రవేశించేసరికి అతనికి 23 ఏళ్ళ వయసు వస్తుంది.

"అందుకే మా నాన్న నా గురించి ఆందోళన పడుతుంటారు," చెప్పాడు జట్టి. "దీనికన్నా నేనొక పోలీసు అధికారిని కావాలని ఆయన అంటున్నారు."

ప్రారంభ సంవత్సరమైన 2022లో 46,000 మంది అగ్నివీరులను తీసుకుంటామని భారత ప్రభుత్వం చెప్పింది. అంటే, వారిలో 75 శాతంమంది, లేదా 34,500 మంది ఇరవై ఇరవయ్యయిదేళ్ళ మధ్య వయసుండే యువజనం 2026 కల్లా చేతిలో ఎలాంటి అవకాశాలు లేకుండా ఇళ్ళకు వచ్చేస్తారు. వాళ్ళు మళ్ళీ తమ జీవితాలను మొదటి నుండి మొదలెట్టాల్సివుంటుంది.

2026 వరకూ రిక్రూట్‌మెంట్ గరిష్ట పరిమితి 175,000. ఐదవ ఏడాదిలో 90,000 మందికి, ఆ ఏడాది తర్వాత నుంచి 125,000 మందికి రిక్రూట్లను పెంచాలనేది లక్ష్యం.

PHOTO • Parth M.N.
PHOTO • Parth M.N.

ఎడమ: అగ్నిపథ్ పథకాన్ని ప్రకటించగానే భారతదేశవ్యాప్తంగా విస్తృతంగా నిరసనలు చెలరేగాయి. అభ్యర్థులు, మాజీ సైనికోద్యోగులు కూడా దీనిని వ్యతిరేకించారు. కుడి: పలుస్‌లో యశ్ అకాడమీని నడుపుతోన్న ప్రకాశ్ భోరే, ఈ పథకం గ్రామీణ భారతదేశంలో ఉపాధి సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని నమ్ముతున్నారు. ఎందుకంటే యువత తరచుగా తమ గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేయడానికి ముందే విధులకు వెళ్ళాల్సివచ్చే విధంగా దీనిని రూపొందించారు

ఈ యూనిఫామ్ ధరించేవాళ్ళలో ఎక్కువమంది వ్యవసాయ సంక్షోభంతో పోరాడుతున్న రైతుల పిల్లలు. పెరిగిపోతున్న అప్పులు, పంటల ధరలు పడిపోవడం, రుణాలు దొరక్కపోవటం, వాతావరణ మార్పుల వినాశకరమైన ప్రభావాల కారణంగా వేలాది మంది రైతులు తమ ప్రాణాలను తీసుకున్నారు. వ్యవసాయ కుటుంబాలకు చెందిన పిల్లలకు నిర్దిష్ట కాలంలో స్థిరమైన ఆదాయం ఉండే ఉద్యోగంలో చేరడం మరింత ముఖ్యం.

అగ్నిపథ్ పథకం గ్రామీణ భారతదేశంలో ఉపాధి సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని, ఎందుకంటే యువత తరచుగా తమ గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేయడానికి ముందే విధులకు వెళ్ళాల్సివచ్చే విధంగా దీనిని రూపొందించారనీ, పలుస్‌లో యశ్ అకాడమీని నడుపుతోన్న ప్రకాశ్ భోరే నమ్ముతున్నారు. "ఉద్యోగ మార్కెట్ ఇప్పటికే ఆశాజనకంగా లేదు," అన్నారతను. "డిగ్రీ కూడా లేకపోవటం ఈ పిల్లలకు మరింత చేటును తెస్తుంది. నాలుగేళ్ళ ఒప్పందం పూర్తయిన తర్వాత ఇంటికి తిరిగివచ్చిన వీరు ఒక సొసైటీ, లేదా ఎటిఎమ్ బయట సెక్యూరిటీ గార్డులుగా ఉద్యోగం చేయాల్సివుంటుంది."

వాళ్ళనెవరూ పెళ్ళిచేసుకోవటానికి ఇష్టపడరని కూడా ఆయన అన్నారు. "భర్త కాబోయేవాడికి స్థిరమైన ఉద్యోగం ఉందా, లేక 'నాలుగేళ్ళ సైనికోద్యోగి'యా అని వధువు కుటుంబం స్పష్టంగా అడుగుతుంది. తుపాకీలను కాల్చటంలో శిక్షణ పొంది, చేయటానికి ఏమీ లేక నిస్పృహలో మునిగిపోయిన యువకుల పరిస్థితిని ఊహించండి. నేనింక ఎక్కువగా ఏమీ చెప్పాలనుకోవటం లేదు, కానీ అది చాలా భయానక చిత్రం."

నిజానికి ఈ పథకం యువతను సైన్యంలో చేరకుండా నిరుత్సాహపరిచిందని, సైన్యంలో 17 ఏళ్ళపాటు పనిచేసి, 2009 నుంచి సాంగ్లీలో ఒక శిక్షణా అకాడెమీని నిర్వహిస్తోన్న మేజర్ హిమ్మత్ ఔహాల్ అన్నారు. "2009 నుండి ప్రతి ఏటా 1,500-2,000 మంది వరకూ పిల్లలు మా అకాడెమీలో చేరేవారు," అన్నారతను. "ఈ అగ్నివీర్ తర్వాత, ఆ సంఖ్య 100 మందికి దిగజారింది. ఇది చాలా తీవ్రంగా పడిపోవటం."

ఇటువంటి పరిస్థితులలో, ఇప్పటికీ ఇందులో చేరాలనుకునేవారు జట్టీ లాగా తాము కూడా ఆ 25 శాతంలో ఉంటామని ఆశతో ఉన్నవారే. లేదంటే రియా బేల్దార్‌కున్నట్టు ఏదైనా భావోద్వేగపరమైన కారణం ఉన్నవారు.

బేల్దార్, సాంగ్లీ జిల్లాలోని మిరాజ్ అనే చిన్న పట్టణానికి చెందిన ఒక సన్నకారు రైతుల కూతురు. ఆమె తన చిన్నతనం నుంచి తన మామయ్యకు చాలా దగ్గరగా ఉండేది, ఆయన గర్వపడేలా చేయాలనుకుంటోంది. "ఆయన భారత సైన్యంలో చేరాలనుకున్నాడు," చెప్పిందామె. "ఆ కలను ఆయనెప్పుడూ నిజం చేసుకోలేకపోయాడు. నా ద్వారా ఆయన తన కలను సఫలం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను.”

PHOTO • Parth M.N.
PHOTO • Parth M.N.

సైన్యంలో చేరాలనుకునే యువతులు జనం నుండి అవమానకరమైన ఎగతాళి మాటలను ఎదుర్కొంటారు. 'నేను సైన్యం నుండి తిరిగివచ్చాక బాలికల కోసం ఒక అకాడమీని ప్రారంభించాలనుకుంటున్నాను,' అని సాంగ్లీలోని మిరాజ్ అనే చిన్న పట్టణానికి చెందిన సన్నకారు రైతుల కుమార్తె, అకాడమీలో శిక్షణ పొందుతున్న రియా బేల్దార్ చెప్పింది

సైన్యంలో చేరాలనుకుంటున్న తన గురించి ఇరుగుపొరుగువారు మాట్లాడే అవమానకరమైన హేళన మాటలను, ఔహాల్ దగ్గర శిక్షణ పొందుతున్న రియా పట్టించుకోదు. ఆమె వెక్కిరింపులకూ, హేళనకూ గురయ్యింది. "నేను వాళ్ళ మాటలనసలు పట్టించుకోను, ఎందుకంటే నా తల్లిదండ్రులు నాకు అండగా ఉన్నారు," అంటుంది బేల్దార్.

అగ్నిపథ్ పథకం తన ధ్యేయం కాదని ఈ 19 ఏళ్ళ బాలిక చెప్తోంది. "నువ్వు రాత్రిబగళ్ళూ శిక్షణ తీసుకుంటావు, నువ్వు విమర్శలను ఎదుర్కొంటావు, నీ చదువును ప్రమాదంలో పడేస్తావు, యూనిఫామ్ తొడుక్కుంటావు," అంటూ కొనసాగించింది రియా, "కేవలం నాలుగేళ్ళలో ఎలాంటి ముందరి భవిష్యత్తు లేకుండా ఇవన్నీ నీ నుంచి లాగేసుకుంటారు. ఇది చాలా అన్యాయం."

అయితే, తన నాలుగేళ్ళ పరిమితి ముగిశాక బేల్దార్‌కు తన ప్రణాళికలు తనకున్నాయి. "నేను వెనక్కి తిరిగివచ్చాక బాలికల కోసం ఒక అకాడెమీని ప్రారంభించాలనుకుంటున్నాను, మా పొలంలో చెరకును సాగుచేస్తాను," అంటోందామె. "నాలుగేళ్ళు పూర్తయ్యాక నాకు పర్మనెంట్ ఉద్యోగం దొరకకపోయినా కూడా నేను ఒకప్పుడు సైన్యంలో పనిచేశానని, నా మామయ్య కన్న కలను సఫలం చేశానని చెప్పుకోగలను."

బేల్దార్‌ శిక్షణ తీసుకుంటున్న అదే అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న కొల్హాపూర్ నగరానికి చెందిన 19 ఏళ్ళ ఓమ్ విభూతే మరింత ఆచరణాత్మక విధానాన్ని ఎంచుకున్నాడు. అగ్నిపథ్ పథకాన్ని ప్రకటించడానికిముందే దేశానికి సేవ చేయాలనే ఆశతో అతను ఔహాల్ అకాడమీలో చేరాడు. అయితే రెండేళ్ళ తన వైఖరిలో ఇప్పుడు మార్పుచేసుకున్నాడు. "నేనిప్పుడు పోలీసు అధికారిని కావాలనుకుంటున్నాను," చెప్పాడతను. "ఇది మీకు 58 సంవత్సరాల వయస్సు వచ్చేవరకు ఉద్యోగ భద్రతను ఇస్తుంది, పోలీసు దళంలో పనిచేయడం కూడా దేశ ప్రయోజనాలకు సంబంధించినదే. నేను సైనికుడిని అవుదామనుకున్నాను, కానీ అగ్నిపథ్ పథకం నా మనసును మార్చేసింది.

నాలుగేళ్ళ తర్వాత ఇంటికి తిరిగి రావాలనే ఆలోచన తనకు అమితమైన ఆదుర్దాను కలగజేస్తోందని విభూతే చెప్పాడు. "తిరిగివచ్చాక నేనేం చేయాలి?" అడిగాడతను. "నాకు తగిన ఒక ఉద్యోగాన్ని ఎవరిస్తారు? ఎవరైనా తమ భవిష్యత్తు గురించి వాస్తవంగా ఆలోచించాలి."

అగ్నిపథ్ పథకంలోని అతిపెద్ద ప్రతికూలత ఏమిటంటే, ఇది ఔత్సాహిక సైనికులలో దేశీయతావాదాన్ని పలుచన చేసిందని మాజీ సైనికుడు సూర్యవంశీ అన్నారు. "నేను కొన్ని కలతపెట్టే నివేదికలు వింటున్నాను," అన్నారాయన. "పిల్లలు 25 శాతం మందిలో తాము లేమని గ్రహించినప్పుడు, వారు తమ ప్రయత్నం తాము చేయడం మానేసి, తమ సీనియర్లకు అవిధేయత చూపుతారు. అందుకు నేను వారిని తప్పుపట్టను. ఎవరైనా వారి జీవితాన్ని ఎందుకు పణంగా పెడతారు, నాలుగేళ్ళలో మిమ్మల్ని వదిలించుకునే ఉద్యోగంలో మీ రక్తాన్ని, చెమటను ఎందుకు ధారపోస్తారు? ఈ పథకం సైనికులను కాంట్రాక్టు కార్మికుల స్థాయికి తగ్గించేసింది."

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Parth M.N.

Parth M.N. is a 2017 PARI Fellow and an independent journalist reporting for various news websites. He loves cricket and travelling.

Other stories by Parth M.N.
Editor : Priti David

Priti David is the Executive Editor of PARI. She writes on forests, Adivasis and livelihoods. Priti also leads the Education section of PARI and works with schools and colleges to bring rural issues into the classroom and curriculum.

Other stories by Priti David
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli