హేమంత్ కావళే తన పేరు ముందు మరో విశేషణం ఉండాల్సిందే అని పట్టుబట్టాడు.

"నేను చదువుకున్నాను, నిరుద్యోగిని, ఇంకా... అవివాహితుడిని," అని 30 ఏళ్ళ హేమంత్ తను, తనలాంటి యువ రైతులకు పెళ్ళి కాకపోవడం గురించి చమత్కరించాడు.

“సు-శిక్షిత్. బే రోజ్‌గార్. అవివాహిత్.” అతను ప్రతి పదాన్ని నొక్కి పలికాడు. ఆ చిన్న పాన్ బడ్డీలో అతని చుట్టూ ఉన్న అతని స్నేహితులు తమ బలవంతపు బ్రహ్మచారిత్వం వల్ల కలిగే కోపాన్నీ, అసౌకర్యాన్నీ దాచుకుంటూ, ఇబ్బందిగా నవ్వారు. వారంతా 30 ఏళ్ళు దాటిన అవివాహితులు.

"ఇదే మా ప్రధాన సమస్య," అని అర్థశాస్త్రంలో మాస్టర్స్ చేసిన కావళే చెప్పాడు.

మేం వ్యవసాయం కారణంగా రైతులు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడే మహారాష్ట్ర తూర్పు ప్రాంతమైన విదర్భలో, పత్తి పంటకు ప్రసిద్ధి చెందిన యవత్మాల్-దార్‌వ్హా రహదారిపై వ్యవసాయ సంక్షోభాన్నీ, వలస సమస్యలనూ ఎదుర్కొంటోన్న శెలోడీ అనే గ్రామంలో ఉన్నాం. అక్కడ కొందరు యువకుల బృందం గ్రామ ప్రధాన కూడలిలో హేమంత్ నడుపుతోన్న కియోస్క్ (బడ్డీ) నీడలో తమ సమయాన్ని గడుపుతుంటుంది. వీరందరూ గ్రాడ్యుయేట్లు లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్లు; వీరందరి పేరు మీద వ్యవసాయ భూమి ఉంది; వీరందరూ నిరుద్యోగులు. వీరిలో ఎవరికీ వివాహం కాలేదు.

వీరిలో చాలామంది పుణే, ముంబై, నాగ్‌పూర్, లేదా అమరావతి వంటి సుదూర నగరాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు; కొంతకాలం తక్కువ జీతానికి పని చేశారు. ఉద్యోగాల కోసం రాష్ట్ర, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్, ఇతర పోటీ పరీక్షలకు హాజరై, విఫలమయ్యారు.

ఈ ప్రాంతంలో, బహుశా దేశమంతటా ఉన్న చాలామంది యువతలాగే, కావళే కూడా ఉద్యోగం రావాలంటే మెరుగైన విద్య అవసరమని భావిస్తూ పెరిగాడు.

ఇప్పుడు తనకు వధువు రావాలంటే తనకు పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగం అవసరమని అతను గుర్తించాడు.

ఉద్యోగాలు చాలా తక్కువగానూ సుదూరంగానూ ఉండటంతో, కావళే గ్రామంలోని తన కుటుంబానికి చెందిన పొలంలో పనిచేస్తూ, సహాయంగా ఉండేందుకు గ్రామంలోనే ఒక కిళ్ళీ బడ్డీని తెరిచాడు.

"నేనొక పాన్ బడ్డీ తెరవాలని నిర్ణయించుకున్నాను. ఒక స్నేహితుడిని రస్వంతి [చెరకు రసం దుకాణం] నడపమని, మరో స్నేహితుడిని ఇక్కడే ఒక చిరుతిండి దుకాణం పెట్టమని చెప్పాను. దాని వల్ల అందరం ఏదో ఒక వ్యాపారం చేసినట్లు ఉంటుంది," అని చురుకైన చమత్కారి, కావళే చెప్పాడు. "పుణేలో ఒక పూర్తి చపాతీ తినే బదులు, మా గ్రామంలో సగం చపాతీ తినడం ఎంతైనా మంచిది," అన్నాడతను.

PHOTO • Jaideep Hardikar

పోటీ పరీక్షలతో తన అదృష్టాన్ని పరీక్షించుకుని, పుణే వంటి ఇతర నగరాల్లోని కర్మాగారాల్లో పనిచేసిన తర్వాత, హేమంత్ కావళే (కుడి) యవత్మాల్‌ జిల్లా దార్‌వ్హా తహసిల్‌లోని తమ శెలోడీ గ్రామానికి తిరిగి వచ్చి పాన్ బడ్డీ పెట్టుకున్నాడు. అతను, అతని స్నేహితుడు అంకుశ్ కాంకిరడ్ (ఎడమ) కూడా జీవనోపాధి కోసం తమ తమ పొలాలను చూసుకుంటున్నారు. హేమంత్‌ మాస్టర్స్ చేస్తే, అంకుశ్ అగ్రికల్చర్‌ బిఎస్సీ పూర్తిచేశారు

కొన్నేళ్ళుగా ఆర్థిక వేదన, సంక్షోభాన్ని ఎదుర్కొంటోన్న మహారాష్ట్రలోని గ్రామీణ యువకులు ఇప్పుడు విస్తృత పరిణామాల ఒక కొత్త సామాజిక సమస్యను ఎదుర్కొంటున్నారు: వారి వివాహాలు ఆలస్యం కావడం, బలవంతపు బ్రహ్మచర్యం, అనివార్యంగా ఒంటరిగా ఉండాల్సి రావడం.

"మా అమ్మ ఎప్పుడూ నా పెళ్ళి గురించే ఆందోళన చెందుతూ ఉంటుంది," అని హేమంత్ స్నేహితుడు, 31 ఏళ్ళ అంకుశ్ కాంకిరడ్ అన్నారు. 2.5 ఎకరాల భూమి ఉన్న అతను అగ్రికల్చరల్ బిఎస్సీ చేశారు. "ఒకవైపు వయస్సు పెరిగిపోతున్నా నేను ఒంటరిగా ఉండిపోతున్నానని ఆమె బాధ పడుతోంది." తనకు వివాహం చేసుకోవాలని ఉన్నా, తక్కువ ఆదాయం కారణంగా దాని గురించి ఇప్పుడేం ఆలోచించడం లేదని అంకుశ్ అన్నారు.

ఈ ప్రాంతంలో వివాహం అనేది ఒక ముఖ్యమైన సామాజిక కట్టుబాటు అని అందరూ PARIకి రకరకాల పద్ధతుల్లో చెప్పారు. ఈ ఆర్థికంగా వెనుకబడిన గోందియా తూర్పు కొన నుంచి పశ్చిమ మహారాష్ట్రలోని సాపేక్షంగా సంపన్నమైన పంచదార బెల్ట్ వరకు, సాధారణ వివాహ వయస్సు దాటిన యువతీయువకులు మనకు చాలామంది కనిపిస్తారు.

మెట్రోపాలిటన్ నగరాలు లేదా పారిశ్రామిక కేంద్రాలలో బాగా చదువుకున్న తమ తోటివారిలా సామాజిక,  కమ్యూనికేషన్ నైపుణ్యాలు లేకపోవడంతో వీరు ఉద్యోగాలు పొందలేకపోతున్నారు.

ఈ ఏడాది ఏప్రిల్ ప్రారంభం నుంచి ఒక నెల వ్యవధిలో, మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతాలలో విద్యావంతులై, అనేక ఆకాంక్షలు కలిగిన యువతీయువకులను PARI కలుసుకుని, వారిని ఇంటర్వ్యూ చేసింది. వీరంతా తమకు తగిన జోడీ దొరకక, నిరుత్సాహానికి గురై, భయాందోళనలతో, తమ భవిష్యత్తు గురించి అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు.

అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO), మానవ అభివృద్ధి సంస్థ (IHD) సంయుక్తంగా ప్రచురించిన ఇండియా ఎంప్లాయ్‌మెంట్ నివేదిక 2024 ప్రకారం భారతదేశంలోని నిరుద్యోగ జనాభాలో దాదాపు 83 శాతం మంది విద్యావంతులైన యువతే. మొత్తం నిరుద్యోగ యువతలో కనీసం మాధ్యమిక విద్య కలిగిన విద్యావంతులైన యువత నిష్పత్తి 2000లో 35.2 శాతం నుండి 2022 నాటికి 65.7 శాతానికి పెరిగింది, అంటే  దాదాపు రెట్టింపు అయింది.

342 పేజీల ఈ నివేదికలో, “వ్యవసాయం నుండి వ్యవసాయేతర రంగాలకు నెమ్మదిగా మారిపోతోన్న శ్రామిక శక్తి, 2019లో కోవిడ్-19 విజృంభణ తర్వాత తిరిగి వ్యవసాయంలోకి రావడం ప్రారంభమైంది. దీని వల్ల వ్యవసాయ ఉపాధి వాటా పెరుగుదలతో పాటు వ్యవసాయ శ్రామిక శక్తి పరిమాణమూ పెరిగింది," అని పేర్కొన్నారు.

భారతదేశంలో ఉపాధి ప్రధానంగా స్వయం ఉపాధి లేదా రోజువారీ ఉపాధి అని ఐఎల్‌ఒ నివేదిక వెల్లడిస్తుంది. "దాదాపు 82 శాతం మంది కార్మికులు అసంఘటిత రంగంలో ఉన్నారు, దాదాపు 90 శాతం మంది అనియత ఉపాధిని పొందుతున్నారు," అని ఈ నివేదిక పేర్కొంది. వీరంతా శెలోడీలోని యువకుల్లా పాన్ బడ్డీలు, రస్వంతి , టీ-స్నాక్ దుకాణాలను నడుపుకుంటున్నారు.

"2019 నుంచి ఈ రకమైన ఉపాధి పెరుగుదల కారణంగా, మొత్తం ఉపాధి వాటాలో అసంఘటిత రంగం మరియు/లేదా అనియత ఉపాధి వాటా పెరిగింది." 2012-22 మధ్యకాలంలో రోజువారీ కూలీల వేతనాలు స్వల్పంగా పెరగగా, సాధారణ కూలీల వాస్తవ వేతనాలు అలాగే ఉండడం లేదా తగ్గడం జరిగింది. 2019 తర్వాత స్వయం ఉపాధి వాస్తవ ఆదాయాలు కూడా క్షీణించాయి. మొత్తంమీద, వేతనాలు తక్కువగానే ఉండిపోయాయి. 2022లో 62 శాతం మంది నైపుణ్యం లేని రోజువారీ వ్యవసాయ కూలీలు, అఖిల భారత స్థాయిలో నిర్మాణ రంగంలో 70 శాతం మంది కార్మికులు వారికి సూచించిన రోజువారీ కనీస వేతనాలు కూడా పొందలేదు.

PHOTO • Jaideep Hardikar
PHOTO • Jaideep Hardikar

ఎడమ: అదనపు ఆదాయం కోసం పాన్ బడ్డీ సమీపంలో రస్వంతి (చెరుకు రసం దుకాణం) ఏర్పాటు చేసుకున్న రామేశ్వర్ కాంకిరడ్. వ్యవసాయం ద్వారా వచ్చే కొద్దిపాటి ఆదాయంతో పెళ్ళి చేసుకుని కుటుంబాన్ని పోషించడం కష్టమని అతను భావిస్తున్నాడు. కుడి: చెరకు యంత్రాన్ని నడుపుతోన్న రామేశ్వర్. అతని వెనుక నిలబడి ఉన్న కావళే (గళ్ల చొక్కా), అంకుశ్ కాంకిరడ్ (బ్రౌన్ రంగు టి-షర్ట్)

*****

క్షేత్రస్థాయిలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది.

వీరికి వధువులు దొరకడం ఒక సవాలు అయితే, గ్రామీణ ప్రాంతాలలో చదువుకున్న యువతులకు స్థిరమైన ఉద్యోగాలున్న వరుడు దొరకడం మరొక సవాలు.

శెలోడీలో బిఎ చదివిన ఒక యువతి (తన పేరు చెప్పడానికి ఇష్టపడని ఈ యువతి, తనకు కావలసిన వరుడిలో ఎలాంటి లక్షణాలు ఉండాలని అడిగితే చెప్పడానికి సిగ్గుపడింది), “నేను వ్యవసాయాన్ని అంటిపెట్టుకున్న వాళ్ళకంటే నగరంలో నివసిస్తూ, స్థిరమైన ఉద్యోగం ఉన్న వ్యక్తిని వివాహం చేసుకోవడానికి ఇష్టపడతాను," అని చెప్పింది.

ఇతర గ్రామీణ బాలికల అనుభవాన్ని బట్టి నగరాల్లో తమ వర్గానికే చెందిన, స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వరుడు దొరకడం అంత తేలిక కాదని ఆమె చెప్పింది.

ఈ సమస్య భూస్వామ్య అగ్రవర్ణ ఒబిసిలు లేదా మరాఠాల వంటి ఆధిపత్య వర్గాలే కాకుండా అన్ని కులాలు, వర్గాలు, ప్రాంతాల వారు కూడా ఎదుర్కొంటున్నారు.

నిరుద్యోగం అనేది కొత్తది కాదు, అలాగే వివాహాలు ఆలస్యం కావడమూ కొత్త కాదు. కానీ నేడు ఈ సామాజిక సమస్య ఆందోళనకర స్థాయికి చేరిందని అనుభవజ్ఞులైన రైతులు అంటున్నారు.

"గతంలో సంబంధాలను కుదిర్చేవాళ్ళు కూడా ఇప్పుడు ఆ పని చేయడానికి ఇష్టపడడం లేదు," అని శెలోడీలోని అనుభవజ్ఞుడైన రైతు భగవంత కాంకిరడ్ అన్నారు. సరైన జీవిత భాగస్వామి దొరకకపోవడం వలన ఆయన ఇద్దరు మేనల్లుళ్ళు, ఒక మేనకోడలు అవివాహితులుగానే ఉన్నారు. ఆయన చాలా ఏళ్ళ పాటు తన సముదాయంలో పెళ్ళీడుకొచ్చిన యువతీయువకులకు పెళ్ళిళ్ళు కుదిర్చే పని చేసేవారు. ఇప్పుడు తాను ఆ పని చేయడంలేదని ఆయన చెప్పారు.

"నేను మా కుటుంబంలో జరిగే పెళ్ళిళ్ళకు వెళ్ళడం మానేశాను," అని 32 ఏళ్ళ యోగేశ్ రావుత్ చెప్పారు. ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్‌కు పది ఎకరాల సాగునీటి సౌకర్యం ఉన్న పొలం ఉంది. "నేను పెళ్ళికి వెళ్ళిన ప్రతిసారీ, నువ్వెప్పుడు పెళ్ళి చేసుకుంటావని అడుగుతుంటారు. అది చాలా ఇబ్బందికరంగానూ, నిరాశ కలిగిస్తూనూ ఉంటుంది," అన్నారతను.

ఇటు ఇళ్ళల్లో తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పెళ్ళిళ్ళ గురించి ఆందోళన చెందుతున్నారు. అయితే అంత హీనమైన ఆదాయాలతో కుటుంబాన్ని పోషించడం కష్టం కాబట్టి తనకు వధువు దొరికినా తాను పెళ్ళి చేసుకోనని యోగేశ్ అన్నారు.

"వ్యవసాయ ఆదాయం మీద ఆధారపడి ఎవరూ జీవించలేరు," అని అతను చెప్పారు. అందుకే ఈ గ్రామంలోని చాలా కుటుంబాలు తమ అమ్మాయిలను కేవలం వ్యవసాయ ఆదాయంపై ఆధారపడిన లేదా గ్రామాల్లో నివసించే యువకులకు ఇచ్చి పెళ్ళి చేయాలనుకోవడం లేదు. స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగాలు, లేదా ప్రైవేట్ ఉద్యోగం, లేదా నగరాల్లో స్వయం ఉపాధి ఉన్న యువకులకే ఇక్కడ ప్రాధాన్యం.

సమస్య ఏమిటంటే, స్థిరమైన ఉద్యోగాలు చాలా తక్కువ. అలాంటి ఉద్యోగాలు చేసేవాళ్ళు దొరకడం చాలా కష్టం.

PHOTO • Jaideep Hardikar
PHOTO • Jaideep Hardikar

ఎడమ: 'మీకు స్థిరమైన ఆదాయం లేకపోతే మీరు కుటుంబాన్ని పోషించలేరు,' అంటారు రైతు యోగేశ్ రావుత్. ‘నువ్వెప్పుడు పెళ్ళి చేసుకుంటున్నావ్’ అని అందరూ అడుగుతుండడంతో అతను కుటుంబసభ్యుల ఇళ్ళల్లో పెళ్ళిళ్ళకు వెళ్ళడం మానేశారు. కుడి: తమ పాన్ బడ్డీలో హేమంత్, అంకుశ్

చాలా కాలంగా నీటి సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న మరాఠ్వాడా ప్రాంతంలో, యువకులు వధువులను వెతకడం మానేయటమో, లేదా పెళ్ళి చేసుకోవాలనుకుంటే ఉద్యోగాలు, నీరు లేదా రెండూ దొరికే నగరాలకు వలస పోవడమో చేస్తున్నారని PARI పలు ఇంటర్వ్యూల ద్వారా తెలుసుకుంది.

స్థిరమైన ఆదాయం పొందడం చాలా కష్టం. వ్యవసాయపు పనులు ఉండని వేసవికాలం వంటి సమయాలలో ఏదైనా కొంచెం ఆదాయం లభించే పనులు దొరికే అవకాశం లేదు.

"వేసవిలో పొలం పనులు ఉండవు," అని కావళే తెలిపాడు. అతనికి గ్రామంలో పది ఎకరాల వర్షాధార పొలం ఉంది. అయితే అతని స్నేహితులు కొందరు బావులు లేదా బోరు బావులతో తమ వ్యవసాయ భూముల్లో ఆయా కాలాలలో పండే ఓక్రా (బెండ) వంటి కూరగాయలను పండిస్తున్నప్పటికీ, అదంత లాభదాయకంగా లేదు.

“నేను తెల్లవారుజామున 2 గంటలకు లేస్తాను. ఉదయాన్నే నా పొలం నుంచి ఓక్రాల ను తీసుకొని, 20 కిలోల తట్టను 150 రూపాయలకు విక్రయించడానికి దార్‌వ్హాకు వెళ్తాను,” అని 8 ఎకరాల పొలానికి యజమాని, పట్టభద్రుడు, అవివాహితుడూ అయిన అజయ్ గావండే అన్నాడు. "వాటిని కోయడానికి 200 రూపాయలు ఖర్చవుతుంది, నాకు రోజు కూలి కూడా గిట్టుబాటు కాదు," అంటాడతను.

దీనికి తోడు జంతువుల దాడులను కూడా కలుపుకుంటే, అది మిమ్మల్ని మరింత ఘోరమైన సంకటంలో పడేస్తుంది. శెలోడీలో కోతుల బెడద చాలా ఎక్కువ అని గావండే చెప్పాడు. ఇక్కడ పొలాలకు, పొదలతో కూడిన అడవికీ మధ్య ఎలాంటి అడ్డంకులు లేవు. ఆ అడవిలో జంతువులకు నీరు గానీ ఆహారం గానీ దొరకదు. "అవి ఒక రోజు నా పొలంపై దాడి చేస్తాయి, మరొక రోజు వేరొకరి పొలంపై దాడి చేస్తాయి, మేమేం చేయాలి?" అని అతను ఆవేదన వ్యక్తం చేశాడు.

ఆధిపత్య తిరళే-కున్బీ కులానికి (ఒబిసి) చెందిన కావళే, దార్‌వ్హాలోని ఒక కళాశాలలో చదువుకున్నాడు. ఉద్యోగం వెతుక్కుంటూ పుణే వెళ్ళి, అక్కడ నెలకు రూ.8000 జీతంతో ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేశాడు. కానీ జీతం సరిపోకపోవటంతో ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత అదనపు నైపుణ్యంగా వెటర్నరీ సర్వీసెస్‌లో సర్టిఫికేట్ కోర్స్ చేశాడు. దాని వల్ల అతనికేమీ మేలు జరగలేదు. దాని తర్వాత ఫిట్టర్‌గా డిప్లొమా తీసుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోయింది.

మధ్యమధ్యలో అతను బ్యాంకు ఉద్యోగాలు, రైల్వే ఉద్యోగాలు, పోలీసు ఉద్యోగాలు, ప్రభుత్వ గుమాస్తా ఉద్యోగాల లాంటి అనేక పోటీ పరీక్షలకు తయారై, పరీక్షలు రాశాడు...

చివరకతను ఆశ వదిలేసుకున్నాడు. అతని మిగతా స్నేహితులు అతను చెప్పిన మాటలకు అమోదంగా తల వూపారు. ఇది వాళ్ళ కథ కూడా.

PHOTO • Jaideep Hardikar
PHOTO • Jaideep Hardikar

ఎడమ: శెలోడీలోని ప్రధాన గ్రామ కూడలి. కుడి: యవత్మాల్‌లోని తిరఝడాలో గ్రామ సర్పంచ్ ఏర్పాటు చేసిన స్టడీ సెంటర్‌లో ప్రభుత్వ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న 30 ఏళ్ళు దాటిన యువకులు. వీరంతా వధువులు దొరకని గ్రాడ్యుయేట్లు లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్లు

పశ్చిమ విదర్భలోని యవత్మాల్-వాశిమ్ నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల రెండో దశ వోటింగ్‌ జరగడానికి మూడు రోజుల ముందు, ఏప్రిల్ 26న, తామంతా ఈసారి మార్పుకు ఓటు వేస్తున్నామని వారు గట్టిగా చెప్పారు. పోటీ ప్రధానంగా శివ సేనలోని రెండు వర్గాల మధ్య ఉంది. సేన-ఉద్ధవ్ ఠాక్రే తమ పార్టీ తరపున సంజయ్ దేశ్‌ముఖ్‌ను రంగంలోకి దించింది; ఏకనాథ్ శిండే సేన తరపున రాజశ్రీ పాటిల్ బరిలో ఉన్నారు.

సేన-యుబిటిలు కాంగ్రెస్‌, ఎన్‌సిపిలతో పొత్తు పెట్టుకొన్నందున యువత దేశ్‌ముఖ్‌ను బలపరుస్తోంది. విదర్భ సంప్రదాయకంగా కాంగ్రెస్‌కు కంచుకోట.

"థ్యే నుస్తాచ్ బాతా మార్తే, కా కెలా జీ త్యానే [ఆయనవన్నీ మాటలే, ఇంతకూ ఆయన ఏం చేశాడు]?" అన్నారు కాంకిరడ్‌; అతని గొంతులో కోపం ధ్వనించింది. అతను ఈ ప్రాంతానికి చెందిన విలక్షణమైన వర్హాడీ మాండలికంలో మాట్లాడారు, దానిలో ఈ నేలకు చెందిన ఒక రకమైన వ్యంగ్యం ప్రసారమవుతుంది.

ఎవరు? అని మేం అడిగాం. పని చేయకుండా ఒట్టి మాటలు మాట్లాడేది ఎవరు?

ఆ యువకులు మళ్ళీ నవ్వారు. "మీకు తెలుసు," అని కావళే మౌనంగా ఉండిపోయాడు.

వాళ్ళ పదునైన వ్యంగ్యం, ఒట్టి వాగ్దానాలు తప్ప ఏమీ చేయలేదని వారు భావిస్తోన్న భారత ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించినది. 2014 సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో, మోదీ ఇక్కడికి దగ్గరలోని దార్‌వ్హా గ్రామంలో చాయ్-పే-చర్చా నిర్వహించాడు. రైతులకు అప్పులు లేకుండా చేస్తామని, పత్తి, సోయా చిక్కుళ్ళకు అధిక ధరలు ఇస్తామని, ఈ ప్రాంతంలో చిన్న పరిశ్రమలు స్థాపిస్తామని హామీ ఇచ్చాడు.

2014, 2019లలో వీళ్ళలో చాలామంది బిజెపికి ఓటు వేశారు, మోదీ తన వాగ్దానాలను నెరవేరుస్తాడని నమ్మారు. 2014లో కేంద్రంలోని కాంగ్రెస్ నేతృత్వంలోని యూపిఎ ప్రభుత్వాన్ని మట్టి కరిపించి మార్పు కోసం ఓటు వేశారు. ఇప్పుడు, మోదీ వాగ్దానాలు గాలి తీసేసిన బెలూన్ లాంటివని వీళ్ళు గ్రహించారు.

ఆనాడు వీళ్ళలో అత్యధికులు తొలిసారిగా ఓటు వేసినవారే. తమకు ఉద్యోగాలు వస్తాయని, ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని, వ్యవసాయం లాభసాటిగా మారుతుందని వారంతా ఆశించారు. ఎందుకంటే మోదీ చాలా నమ్మకంగా ఈ మాటలన్నీ చెప్పాడు. ఆనాడు ఈ ప్రాంతంలో మారుతున్న పవనాలకు అనుగుణంగా రైతులు కూడా ఆయనకు అనుకూలంగా ఓటు వేశారు.

పదేళ్ళు గడిచిపోయినా పత్తి, సోయాచిక్కుళ్ళ ధరలు అక్కడే నిలిచి ఉన్నాయి. పంట మీద పెట్టే ఖర్చులు మాత్రం రెండింతలు, మూడింతలు పెరిగాయి. ద్రవ్యోల్బణం దేశీయ బడ్జెట్‌ను నాశనం చేస్తోంది. ఉద్యోగాలు లేక, ఎక్కడా అవకాశాలు లేక యువత వేదన పడుతోంది, ఆందోళన చెందుతోంది.

ఇవన్నీ కలిసి, వీళ్ళు తప్పించుకోవాలనుకున్న వ్యవసాయంలోకే మళ్ళీ వీళ్ళను నెట్టేస్తున్నాయి. తమ ఆందోళనను దూరం చేసుకోవడానికి గ్రామీణ మహారాష్ట్రకు చెందిన ఈ సెలోడీ యువకులు, పదునైన హాస్యంతో ఒక కొత్త నినాదాన్ని మాకు చెప్పారు: “ నౌక్రీ నహీ, తార్ చోక్రీ నహీ! " [ఉద్యోగం లేకపోతే పెళ్ళిపిల్లా ఉండదు!]

అనువాదం: రవి కృష్ణ

Jaideep Hardikar

Jaideep Hardikar is a Nagpur-based journalist and writer, and a PARI core team member.

Other stories by Jaideep Hardikar
Editor : Priti David

Priti David is the Executive Editor of PARI. She writes on forests, Adivasis and livelihoods. Priti also leads the Education section of PARI and works with schools and colleges to bring rural issues into the classroom and curriculum.

Other stories by Priti David
Translator : Ravi Krishna

Ravi Krishna is a freelance Telugu translator. Along with translating George Orwell's 'Animal Farm' for 'Chatura', a Telugu monthly magazine, he has published a few translations and parodies in the Telugu magazines 'Vipula' and 'Matruka'.

Other stories by Ravi Krishna