"మొదటి రోజు, మజీదాఁ నా చేతి మీద ఇలా చరిచింది," అని 65 ఏళ్ళ కర్సైద్ బేగమ్ సరదాగా ఆ క్షణాన్ని గుర్తు చేసుకున్నారు. ఆమె ప్రక్కనే కూర్చునివున్న మజీదాఁ బేగమ్ ఆ పాత కథను తల్చుకుని ఉల్లాసపడిపోతూ, వెంటనే తన చర్యలను సమర్థించుకున్నారు. “కర్సైద్‌కు మొదట్లో దారాలతో ఎలా నేయాలో తెలిసేది కాదు. నేను ఆమెను ఒక్కసారి మాత్రమే ఇలా చరిచాను,” ఆమె చెప్పారు. “అప్పుడే తను త్వరగా నేర్చుకుంది.”

పంజాబ్‌లోని బఠిండా జిల్లా, ఘందా బానా అనే గ్రామంలో మజీదాఁ, కర్సైద్ అనే ఆ ఇద్దరు పెద్దవయసు మహిళలు పత్తి, జనపనార, పాత బట్టలతో సుందరమైన, సంక్లిష్టమైన నమూనాలతో ఉండే దరీల [రగ్గులు] నేతకు ప్రసిద్ధి చెందారు.

"నేను 35 సంవత్సరాల వయస్సులో మజీదాఁ నుంచి దరీలు నేయడం నేర్చుకున్నాను," అని కర్సైద్ చెప్పారు. "అప్పటి నుంచి మేమిద్దరం కలిసి దరీలు నేస్తున్నాం," అని 71 ఏళ్ళ మజీదాఁ చెప్పారు. "ఇది ఒకరితో అయ్యే పని కాదు, ఇద్దరూ చేయవలసిన పని."

వాళ్ళిద్దరూ, ఇద్దరు సోదరులను వివాహం చేసుకోవడం వల్ల ఏర్పడిన బంధుత్వంతో తమను తాము అక్కాచెల్లెళ్ళుగా, కుటుంబ సభ్యులుగా భావిస్తారు. " మేం నిజమైన అక్కాచెల్లెళ్ళకంటే భిన్నమేమీ కాదు," అని కర్సైద్ చెప్పారు. దానికి మజీదాఁ, "మా స్వభావాలు పూర్తిగా వ్యతిరేకం అయినా," అని నవ్వుతూ జత చేశారు. దానికి కర్సైద్ వేగంగా స్పందిస్తూ, "ఆమె అన్నీ గట్టిగా మాట్లాడేస్తుంది. నేను కొంచెం నెమ్మదిగా ఉంటాను," అన్నారు.

దరీలు నేయడంలో అనేక గంటల పాటు గడిపినా, మజీదాఁ, కర్సైద్‌లు ఆ పనితో పాటు తమ కుటుంబాలకు సహాయపడడానికి కొద్ది వేల రూపాయల జీతం కోసం కొన్ని ఇళ్ళల్లో పని చేస్తారు. అయితే ఈ రెండు పనులూ, మరీ ముఖ్యంగా ఆ వయసులో ఉన్న మహిళలకు, శారీరకంగా చాలా శ్రమతో కూడిన పనులే.

PHOTO • Sanskriti Talwar
PHOTO • Sanskriti Talwar

బఠిండాలోని ఘందా బానా గ్రామంలో నూలు, జనపనార, పాత బట్టలతో సుందరమైన, సంక్లిష్టమైన నమూనాలతో దరీలు [రగ్గులు] నేయడంలో ప్రసిద్ధిచెందిన మజీదాఁ బేగమ్ (ఎడమ), ఆమె తోటికోడలు కర్సైద్ బేగమ్ (కుడి). 'నేను 35 ఏళ్ళ వయసప్పుడు మజీదాఁ నుంచి దరీలు నేయడాన్ని నేర్చుకున్నాను,' అని 65 ఏళ్ళ కర్సైద్ చెప్పారు. 'అప్పటి నుంచి మేమిద్దరం కలిసి దరీలు నేస్తున్నాం,' అని 71 ఏళ్ళ మజీదాఁ చెప్పారు. 'ఇది ఒకరితో అయ్యే పని కాదు, ఇద్దరూ చేయాలి'

వాతావరణం తేమగా ఉన్న ఒక ఈద్ ఉదయాన, మజీదాఁ ఘందా బానాలోని ఇరుకైన దారుల గుండా కర్సైద్ ఇంటి వైపుకు వెళుతున్నారు. "ఈ గ్రామంలోని ప్రతి ఇల్లు నాకు తెరిచిన తలుపులతో స్వాగతం పలుకుతుంది," అని ఆమె గర్వంగా చెప్పారు. "ఇన్నేళ్ళలో నేనెంతలా పని చేశానో అదే చెబుతుంది."

వాళ్ళ కీర్తి గ్రామం దాటి విస్తరించింది. ఇద్దరూ ఇంకా రగ్గులు నేయగలరో లేదో తెలుసుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి మజీదాఁ వద్దకు దూతలను పంపించేవారు ఉన్నారు. "కానీ సమీపంలోని గ్రామాలు, లేకుంటే ఫూల్, ధపాలీ, రామ్‌పుర్ వంటి పట్టణాలలో నేను దరీలు బాగా నేస్తానని తెలిసినవాళ్ళు నేరుగా మా ఇంటికే వస్తారు," అని మజీదాఁ చెప్పారు.

కొన్ని నెలల క్రితం (ఏప్రిల్ 2024) PARI వారిని కలిసినప్పుడు, ఈ ఇద్దరు హస్త కళాకారులు ఘందా బానాలో నివాసముండే ఒకరి కోసం పూల ఎంబ్రాయిడరీతో ఉండే ఫూల్‌కారీ దరీ ని నేస్తున్నారు. త్వరలో పెళ్ళి చేసుకోనున్న తమ కుమార్తెకు ఈ రగ్గును బహూకరించాలని ఆమె కుటుంబీకులు భావిస్తున్నారు. "ఈ దరీ పెళ్లికూతురి దాజ్ [సరంజామా]లో ఒక భాగం," అని మజీదాఁ చెప్పారు..

ఆ కుటుంబీకులు ఇచ్చిన రెండు వేర్వేరు రంగుల దారాలను ఉపయోగించి వాళ్ళు పూలను సృష్టించారు. "పూలను నేసేటప్పుడు, మేం మధ్యలో అడ్డం వైపు (weft- పేక) పలు రంగురంగుల దారాలను కలుపుతాం," అని మజీదాఁ వివరించారు. ఆమె నిలువు వైపు (warp - పడుగు) ఉన్న10 తెలుపు దారాలను ఎత్తి పట్టుకుని, వాటిగుండా ఒక పసుపు దారాన్ని అడ్డంగా వెళ్ళేలా చేసి, ఆ తర్వాత నీలిరంగు దారాన్ని కూడా అదే విధంగా పంపించారు. ఆ తర్వాత కొంత ఖాళీ వదిలి, ఆమె ఈసారి ఆకుపచ్చ, నలుపు రంగు పువ్వులను అదే పద్ధతిలో నేశారు.

"పువ్వుల నేత పూర్తయిన తర్వాత, మేం ఎర్రటి పేక(weft) దారాలను ఉపయోగించి ఒక అడుగు దరీ ని నేస్తాం," అని మజీదాఁ చెప్పారు. బట్టను కొలవడానికి వాళ్ళ దగ్గర టేప్ లాంటిదేమీ లేదు, దానికి బదులుగా మజీదాఁ తన చేతులను ఉపయోగిస్తారు. ఆమె, కర్సైద్ ఎప్పుడూ బడికి వెళ్ళకపోయినా వాళ్ళు మొదటి నుంచీ ఇలాగే చేస్తున్నారు.

ఇద్దరూ హాథస్ [దువ్వెన]ను ఉపయోగించి అడ్డంగా నేసే నూలును దాని స్థానంలోకి నెడుతున్నప్పుడు, మజీదాఁ, "నమూనా అంతా నా బుర్రలో ఉంది," అన్నారు. ఆమె ఇప్పటివరకు తాను నేసిన దరీ లలో నెమలి, 12 పరియాల [దేవదూతలు] నమూనాల గురించి గర్వంగా చెప్పుకుంటారు. వాటిని ఆమె తన కుమార్తెలిద్దరికీ దాజ్ కింద బహుమతిగా ఇచ్చారు

PHOTO • Sanskriti Talwar
PHOTO • Sanskriti Talwar

ఒక వినియోగదారు కోసం పూల ఎంబ్రాయిడరీ ఉండే ఫూల్‌కారీ దరీని నేస్తోన్న మజీదాఁ. 'పూల నమూనాను నేసేటప్పుడు, మేం మధ్యలో వివిధ రంగుల పేక దారాలను కలుపుతాం,' అని మజీదాఁ వివరించారు. 10 తెల్లటి నిలువు దారాల గుండా అడ్డంగా పసుపు దారాన్ని పోనిచ్చి, ఆపైన నీలిరంగు దారాన్ని కూడా అదే పద్ధతిలో పంపించారు

PHOTO • Sanskriti Talwar
PHOTO • Sanskriti Talwar

ఎడమ: హాథస్ [దువ్వెన]ను ఉపయోగించి పేక దారాలను వాటి స్థానంలోకి నెడుతోన్న ఇద్దరు నేతకళాకారులు. కుడి: ఎర్ర రంగు నూలును కొయ్య కర్రకు చుడుతోన్న మజీదాఁ. దానిని అడ్డంగా నేసే నూలు దారంగా ఉపయోగిస్తారు. ఇద్దరూ కలిసి దరీని నేసే 10 అడుగుల ఇనుప చట్రంపై పనిచేస్తోన్న కర్సైద్. ఇక్కడ ఆమెతో ఉన్నది ఆమె మనవరాలు మన్నత్‌

*****

మజీదాఁ పక్కా ఇంటిలోని వాళ్ళ పని ప్రదేశంలో చిన్న చిన్న విషయాలపైన కూడా చాలా శ్రద్ధ పెట్టినట్లు కనిపిస్తోంది. మజీదాఁ పనిచేసే గదిలో పదేళ్ళ ఆమె మనవడు ఇమ్రాన్ ఖాన్‌ కూడా ఉంటాడు. 14 x 14-అడుగుల స్థలంలో ఎక్కువ భాగాన్ని ఆక్రమించి, స్థానికంగా ' అడ్డా ' అని పిలిచే 10 అడుగుల పొడవైన ఇనుప చట్రాన్ని ఈ బొమ్మల దరీలను నేయడానికి ఉపయోగిస్తారు. మిగిలిన గదిలో కొన్ని చార్‌పాయిలు (తాళ్ళతో అల్లిన మంచాలు) ఉన్నాయి. వాటిలో కొన్ని గోడకు ఆనించి ఉన్నాయి, ఒకటి చట్రం పక్కనే ఉంది; బట్టలు, వస్తువులతో నిండిన ట్రంక్ పెట్టె ఒక ప్రక్కన ఉంది. ఒకే ఒక బల్బు గదిని ప్రకాశవంతం చేస్తోంది, అయితే మజీదాఁ, కర్సైద్‌లు అవసరమైన వెలుతురు కోసం తెరిచిన తలుపుల్లోంచి లోపలికి వచ్చే సూర్యకాంతిపై ఆధారపడతారు.

ముందుగా వాళ్ళు పడుగును - నిలువు దారాలను - సుమారు 10 అడుగుల ఇనుప చట్రానికి చుట్టడం ద్వారా పనిని ప్రారంభిస్తారు. " దరీ లను నేసే పనిలో పడుగును చుట్టటం చాలా కష్టమైన పని," అని మజీదాఁ వ్యాఖ్యానించారు. గట్టిగా బిగించిన పడుగును ఒక లోహపు దండె చుట్టూ దాని నిడివి వైపున లాగి చుడతారు.

వాళ్ళిద్దరూ ఇనుప చట్రానికి పైగా ఉంచిన ఒక చెక్కపలకపై కూర్చుంటారు. అది వాళ్ళు నేసే బొమ్మలతో కూడిన దరీ ని గట్టిగా పట్టి ఉంచుతుంది. మగ్గం షెడ్‌ను తెరవడానికి, మూసివేయడానికి ఉపయోగించే కర్రను నేర్పుగా కదపడంతో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. షెడ్ అంటే పడుగు దారాలను ఒక దాని నుంచి వేరొక దాన్ని వేరు చేస్తుంది. ఇదే చివరికి రగ్గును రూపొందిస్తుంది.

ఈ ఇద్దరు నేతకారులు ఒకరి తర్వాత ఒకరు, ఒక చెక్క కర్రను ఉపయోగించి అడ్డంగా ఉండే పేక దారాల [ బానా ]ను పడుగు దారాల [ తానా ] గుండా పోనిస్తూ, సంక్లిష్టమైన ఆకృతులను సృష్టిస్తారు. మజీదాఁ 'తన తలలో ఉన్న ఆలోచనల ఆధారంగా' పడుగును తిప్పుతూ వివిధ రకాల ఆకృతులను సృష్టిస్తారు. ఆకృతికి ప్రతిరూపకల్పన చేయడానికి సంబంధించిన ప్రత్యేకమైన నమూనా గానీ స్టెన్సిల్ గానీ ఆమె వద్ద ఉండదు.

PHOTO • Sanskriti Talwar
PHOTO • Sanskriti Talwar

ఇద్దరు నేతకారులు ఇనుప చట్రానికి పైగా ఉంచిన ఒక చెక్కపలకపై కూర్చుంటారు. అది వాళ్ళు నేసే దరీని గట్టిగా పట్టి ఉంచుతుంది. స్థానికంగా అడ్డా అని పిలిచే దాదాపు 10 అడుగుల ఇనుప చట్రానికి పడుగును - నిలువు దారాలను - చుట్టడంతో వాళ్ళ పని ప్రారంభం అవుతుంది. 'దరీలను నేయడంలో పడుగు దారాలను చుట్టడమే చాలా కష్టమైన పని' అంటారు మజీదాఁ

కష్టంగా కనిపిస్తోన్న ఆ పని, ఇప్పుడు చాలా సులభమయింది. “దీనికి ముందు మేం నాలుగు పెద్ద ఇనుప కీలే [మేకులు]లను నేలలో నాలుగు మూలల్లో కొట్టేవాళ్ళం. వాటిపై చెక్క దండెలను ఉంచి చట్రాన్ని తయారుచేసి ఆపైన నేత నేయడం కోసం వాటి చుట్టూ పడుగు దారాలను చుట్టేవాళ్ళం,” అని కర్సైద్ చెప్పారు. "ఆ అడ్డా ఇప్పటిదానిలా కాకుండా కదల్చడానికి వీల్లేకుండా ఉండేది," అని మజీదాఁ చెప్పారు. వాళ్ళు ఇప్పుడు ఈ సెట్టింగ్‌ను మార్చాలనుకున్నప్పుడు, "మేం దీన్ని ఆవరణలోకి లాక్కెళ్ళగలం."

ఆ ఇద్దరు మహిళలకూ వారి కుటుంబాల నుంచి పెద్దగా ఆర్థిక సహాయం అందదు. మజీదాఁ చిన్న కొడుకు రియాసత్‌ అలీ ట్రక్‌ డ్రైవర్‌, కానీ ప్రస్తుతం ఒక గోశాలలో రోజుకు రూ. 500 జీతానికి పని చేస్తున్నారు. ఆమె పెద్ద కుమారుడు బర్నాలాలో స్థానిక విలేకరి. కర్సైద్ కుమారులు ఇద్దరు వెల్డర్లుగా పని చేస్తుండగా, మూడో కుమారుడు రోజువారీ కూలిపని చేస్తున్నారు.

మజీదాఁ, కర్సైద్ కంటే చాలా ముందునుంచే నేత పని చేస్తున్నారు. అయితే ఈ పనిని నేర్చుకోవడానికి ఆమెపై విధించిన క్రమశిక్షణా పద్ధతులు కూడా భిన్నమైనవేవీ కావు. "మా పర్జాయీ [వదిన] నాకు పని నేర్పడానికి నా టుయీ పై [పిరుదులపై] కొట్టేది," అని మజీదాఁ తన వదిన తనకు ఎలా నేయడం నేర్పిందో వివరించారు.

"నాది చాలా తొందరగా కోపం తెచ్చుకునే స్వభావం అయినా, నేర్చుకోవాలనే ఆసక్తితో అన్నీ నిశ్శబ్దంగా ఓర్చుకున్నాను." "మొదట్లో కోపం తెచ్చుకుని, కన్నీళ్ళు పెట్టుకున్నా," ఆమె ఒక నెలలోపే ఈ పనిని నేర్చుకున్నారు.

మజీదాఁ తండ్రి మరణించి, తల్లి మాత్రమే కుటుంబంలో సంపాదిస్తున్నప్పుడు ఆమె ధృఢంగా నిలబడ్డారు. మొదట తల్లి ఒప్పుకోకపోయినా, 14 ఏళ్ళ మజీదాఁ తన తల్లికి సహాయం చేయాలని పట్టుదలతో ఉన్నారు. "నేనింకా చిన్నపిల్లను అంటూ బెబే [తల్లి] సున్నితంగా తిరస్కరించింది," అని మజీదాఁ గుర్తు చేసుకున్నారు. "కానీ నేను గట్టిగా పట్టుపట్టాను, అమ్మాయిని అయినంత మాత్రాన కుటుంబానికి సహాయం చేయకుండా నన్ను ఎందుకు ఆపుతావని ప్రశ్నించాను."

PHOTO • Sanskriti Talwar
PHOTO • Sanskriti Talwar

ఈ ఇద్దరు నేతకారులు ఒకరి తర్వాత ఒకరు, ఒక చెక్క కర్రను ఉపయోగించి అడ్డంగా ఉండే పేక దారాల (బానా)ను పడుగు దారాల [తానా] గుండా పోనిస్తూ, సంక్లిష్టమైన ఆకృతులను సృష్టిస్తారు. మజీజిదాఁ 'తన తలలో ఉన్న ఆలోచనల ఆధారంగా' పడుగును తిప్పుతూ వివిధ రకాల ఆకృతులను సృష్టిస్తారు. ఆకృతికి ప్రతిరూపకల్పన చేయడానికి సంబంధించిన ప్రత్యేకమైన నమూనా గానీ స్టెన్సిల్ గానీ ఆమె వద్ద ఉండవు

PHOTO • Sanskriti Talwar
PHOTO • Sanskriti Talwar

పసుపు, నీలం రంగు దారాలను ఉపయోగించి మజీదాఁ, కర్సైద్‌లు రెండు పూల నమూనాలను సృష్టించారు. కొంత ఖాళీని వదిలి, మళ్ళీ ఆకుపచ్చ, నలుపు రంగు పువ్వులను నేశారు. 'పువ్వులు పూర్తయ్యాక, ఎరుపు రంగు పేక దారాలను మాత్రమే ఉపయోగించి ఒక అడుగు దరీని నేస్తాం,' అని మజీదాఁ చెప్పారు. చిన్నప్పటి నుంచి బడికి వెళ్ళని వాళ్ళిద్దరూ బట్టను తమ చేతులతోనే కొలుస్తారు

భారతదేశ విభజన వల్ల వారి కుటుంబం తీవ్రంగా ప్రభావితమైంది - ఆమె తల్లి వైపు తాతగారి కుటుంబం పాకిస్తాన్‌లో నివసిస్తున్నారు, దాన్ని తలచుకుని మజీదాఁ ఇప్పటికీ బాధపడతారు. 1980వ దశకంలో ఆమె వారిని సందర్శించినప్పుడు, ఆమె చేతితో నేసిన రెండు దరీ లను వారికి బహుమతిగా తీసుకువెళ్ళగా, "వారికి అవి నిజంగా చాలా నచ్చాయి," అని ఆమె చెప్పారు.

*****

ఎన్ని గంటలు పని చేసినా, ఈ మహిళలు ఒక్కో దరీ కి కేవలం రూ. 250 మాత్రం సంపాదిస్తారు. “మేం సాధారణంగా ఒక దరీ నేయడానికి రూ. 1,100 రూపాయలు వసూలు చేస్తాం. వినియోగదారులు సూత్ [నూలు దారం] ఇస్తే, మేం మా కూలీగా 500 రూపాయలు మాత్రం తీసుకుంటాం,” అని మజీదాఁ వివరించారు. “నేను పని ప్రారంభించినప్పుడు, మొత్తం దరీ నేస్తే 20 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మాకు సరిపోయినంత సంపాదన లేదు,” అని మజీదాఁ గుర్తు చేసుకున్నారు. “గ్రామంలో లీటరు పాల ధర 60 రూపాయలు. మరి ఒక నెలలో నాకయ్యే ఖర్చులను ఊహించుకోండి,” అని కర్సైద్ ఆవేదన వ్యక్తంచేశారు.

వారిద్దరి భర్తలకు ఏ ఉద్యోగమూ లేకపోవడంతో మజీదాఁ, కర్సైద్‌లు తమ పిల్లలను చాలా కష్టపడి పెంచారు. “నేను జాట్ సిక్కు కుటుంబాల ఇళ్ళలో పని చేశాను, వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళమని అవసరమైన సరుకులను ఇచ్చేవాళ్ళు. నేను నా పిల్లలను వాటితోనే పెంచాను,” అని కర్సైద్ గుర్తు చేసుకున్నారు. తన చిన్న కొడుకు, అతని కుటుంబంతో నివసించే మజీదాఁ, ఎనిమిదిమంది కుటుంబ సభ్యులతో కలిసి నివసించే కర్సైద్ తరచుగా తమ కష్టాలను ఒకరికొకరు చెప్పుకుంటుంటారు.

మూడేళ్ళ క్రితం వరకు, సెప్టెంబరు-అక్టోబర్ మధ్య పని ఎక్కువగా ఉండే పత్తి పంట సమయంలో వాళ్ళు పత్తిని ఏరేవాళ్ళు. పత్తిని వాళ్ళు నూలుగా వడికి, రోజుకు 40 కిలోల పత్తి ఏరితే వచ్చే రూ. 200 ఆదాయానికి మరికొంత అదనంగా చేర్చేవాళ్ళు. "ఈ రోజుల్లో చాలామంది రైతులు పత్తి బదులు వరిని విత్తుతున్నారు," అని మజీదాఁ అన్నారు. ఈ మార్పు వాళ్ళ జీవితాలను గణనీయంగా ప్రభావితం చేసింది. పంజాబ్‌లో పత్తి సాగు గణనీయంగా తగ్గిందని, 2014-15లో ఉన్న 420,000 హెక్టార్ల నుంచి అది 2022-23 నాటికి 240,000 హెక్టార్లకు పడిపోయిందని ప్రభుత్వ రికార్డులు చూపిస్తున్నాయి .

మార్చి నెలలో, మజీదా నూలు వడికే చరఖా ను అయిష్టంగానే పక్కన పెట్టారు, అది ఇప్పుడు ఒక షెడ్డులో పడివుంది. దరీ లకు గిరాకీ కూడా బాగా పడిపోయింది - ఒకప్పుడు వాళ్ళు నెలకు 10 నుంచి 12 వరకు నేసేవారు, ఇప్పుడు రెండు మాత్రమే నేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకున్న ఏకైక స్థిర ఆదాయం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందే నెలవారీ వితంతు పింఛను రూ. 1,500 మాత్రమే.

PHOTO • Sanskriti Talwar
PHOTO • Sanskriti Talwar

వదులుగా ఉండే దారాలకు ముడులు వేసి, చేతితో నేసిన దరీకి తుది మెరుగులు దిద్దుతోన్న మజీదాఁ

PHOTO • Sanskriti Talwar
PHOTO • Sanskriti Talwar

తాను, కర్సైద్ కలిసి రూపొందించిన దరీని(ఎడమ) చూపిస్తోన్న మజీదాఁ. పదేళ్ళ వయసున్న తన మనవడు ఇమ్రాన్ ఖాన్ (కుడి) సహాయంతో మజీదాఁ సూదిలోకి దారాన్ని ఎక్కిస్తారు. ఒక గంటకు పైగా పనిచేసిన తర్వాత కర్సైద్, మజీదాఁలు కొద్దిసేపు విరామం తీసుకుని, విశ్రాంతిగా కాళ్ళు బారచాపుకుంటారు. తమకు కంటి చూపు తగ్గిందని, కీళ్ళ నొప్పులు వస్తున్నాయని ఆ మహిళలు చెప్పారు

ఒక గంటకు పైగా పనిచేసిన తర్వాత కర్సైద్, మజీదాఁలు కొద్దిసేపు విరామం తీసుకుని, కాళ్ళు బారచాపుకుంటారు. కర్సైద్ తన వెన్ను నొప్పిని గురించి చెప్తే, మజీదాఁ తన మోకాళ్ళను నొక్కుకుంటూ, "ఈరోజు నాకు నడవడం కష్టంగా ఉంది. నా కీళ్ళన్నీ చాలా నొప్పిగా ఉన్నాయి," అన్నారు. తమ కంటి చూపు తగ్గిపోయిందని వాళ్ళిద్దరూ చెప్పారు.

" బందా బన్ కే కామ్ కిత్తా హై [నేను ఒక మగమనిషిలా పనిచేశాను], నేను ఈ వయస్సులోనూ అలా పని చేస్తూనే ఉన్నాను," తనకు వచ్చే అతి తక్కువ సంపాదనతో ఇంటిని నెట్టుకొస్తోన్న మజీదాఁ ఆవేదన వ్యక్తంచేశారు.

వయసు మీద పడి దానితో పాటు వచ్చే నొప్పులు బాధిస్తున్నా, మజీదాఁ తన పింఛన్, దరీ లను తయారుచేయగా వచ్చే డబ్బుకు మరికొంత అదనంగా కలపాలి. రోజూ ఉదయం 7 గంటలకు ఆమె ఒక కుటుంబానికి వంట చేయడం కోసం కొన్ని కిలోమీటర్ల దూరం నడిచి వెళతారు, దానికి ఆమెకు వచ్చే జీతం నెలకు రూ. 2,000. ఆమె, కర్సైద్‌లిద్దరూ ఇళ్ళలో పని చేస్తూ, గంటకు రూ.70 సంపాదిస్తారు.

రోజంతా చాలా పని ఉన్నా, వాళ్ళు ఎలాగోలా దరీలు నేయడానికి సమయం చిక్కించుకుంటారు. "మేం ప్రతిరోజూ నేస్తే, ఒక వారంలో ఒక దరీ ని పూర్తి చేస్తాం," అని కర్సైద్ చెప్పారు.

మజీదాఁ నేతపని మానేయాలనుకుంటున్నారు. “బహుశా ఇది, దీని తర్వాత ఇంకొకటి పూర్తిచేసిన తర్వాత, నేను ఆపేస్తాను. ఎక్కువసేపు కూర్చోవడం కష్టంగా మారింది. నాకు ఇక్కడ నొప్పిగా ఉంది, ” ఆమె గత సంవత్సరం పిత్తాశయ శస్త్రచికిత్స చేసిన చోట వేసిన కుట్లను చూపిస్తూ అన్నారు. "నేనింక - బహుశా ఒకటి రెండేళ్ళు బతికినా - మంచిగా బతకాలనుకుంటున్నాను."

అయితే, మరుసటి రోజు తాను పని నుంచి విరమించుకోవాలని చేసిన ఆలోచనను ఆమె మరచిపోతారు. బలహీనంగా ఉండి, ఎనభై ఏళ్ళు పైబడిన బల్బీర్ కౌర్ అనే మహిళ, మరొక గ్రామం నుంచి దరీ ని తయారుచేయాలంటూ వచ్చారు. “ మాయీ [అమ్మా], దరీ వాళ్ళ ఇంట్లో వాడుకోవడానికా లేక పెళ్ళికూతురి సరంజామా కోసమా అని మీ కుటుంబ సభ్యులను అడగండి,” అంటూ మజీదాఁ తనకు వంద రూపాయలు ఇస్తున్న ఆ వృద్ధురాలితో అన్నారు.

ఈ కథనానికి మృణాళిని ముఖర్జీ ఫౌండేషన్ (MMF) ఫెలోషిప్ సహకారం అందించింది.

అనువాదం: రవి కృష్ణ

Sanskriti Talwar

Sanskriti Talwar is an independent journalist based in New Delhi, and a PARI MMF Fellow for 2023.

Other stories by Sanskriti Talwar
Editor : Vishaka George

Vishaka George is Senior Editor at PARI. She reports on livelihoods and environmental issues. Vishaka heads PARI's Social Media functions and works in the Education team to take PARI's stories into the classroom and get students to document issues around them.

Other stories by Vishaka George
Translator : Ravi Krishna

Ravi Krishna is a freelance Telugu translator. Along with translating George Orwell's 'Animal Farm' for 'Chatura', a Telugu monthly magazine, he has published a few translations and parodies in the Telugu magazines 'Vipula' and 'Matruka'.

Other stories by Ravi Krishna