ఆమె పరుగెత్తగలదు. ఆయన శిక్షణ ఇవ్వగలరు.
అందుకనే, జయంత్ తాండేకర్ తన రెండు గదుల అద్దె ఇంటిని తెరచి ఆమెను తన రెక్కల కిందకు తీసుకున్నారు.
తాండేకర్ తన ఆశ్రితురాలైన ఎనిమిదేళ్ళ ఊర్వశి ద్వారా తన కలను సాకారం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇది ధనం లేకపోయినా సంకల్పం ఎక్కువగా ఉన్న ఒక గ్రామీణ బాలిక, ఆమె తల్లిదండ్రులు, ఒక యువ క్రీడా శిక్షకుడు పెద్ద పెద్ద కలలు కనడానికి ప్రయత్నిస్తోన్న కథ.
రెండేళ్ళ క్రితం తాండేకర్ వద్దకు వచ్చినపుడు ఊర్వశి నింబార్తేకు ఎనిమిదేళ్ళు. భండారా నగర శివార్లలో ఒక చిన్న అద్దె ఇంట్లో నివసిస్తోన్న అతని ఇంటికి ఊర్వశి తన వస్తువులన్నిటినీ తీసుకొని వచ్చింది; ఇప్పుడామెకు అతనే తల్లీ తండ్రీ. ఊర్వశి తల్లిదండ్రుల వద్ద డబ్బు లేదు. వారు భండారా నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉండే దవ్వా గ్రామానికి చెందిన చిన్న రైతులు. అయితే ఆ బాలిక తల్లి మాధురి మాత్రం తన కుమార్తె ఏదైనా సాధించాలంటే తాను ఆ యువకుడిని, తన కూతురి కోసం అతను కనే కలలను విశ్వసించాలని భావించారు.
బక్కపలుచగా ఉన్నా, మంచి దమ్మున్న మాధురి లక్ష్యం ఏమిటంటే, తన పిల్లలను వారి జీవితాల్లో ఏదైనా అర్థవంతమైన పని చేసేలా పెంచడమే. ఊర్వశి తండ్రి అయిన ఆమె భర్త, వ్యవసాయం చేయడంతోపాటు సమీపంలోని చిన్న పరిశ్రమలో రోజువారీ కూలీగా పనిచేస్తున్నారు.
"ఆమె మాతోనే కలిసి జీవిస్తే, మరో 10 సంవత్సరాల్లో అచ్చం నాలాగే తయారవుతుంది - పెళ్ళి చేసుకుని పిల్లలను పెంచడం, పొలాల్లో పని చేయడం, ఆపైన ఒక రోజు చనిపోవటం," దవ్వా గ్రామంలోని తమ రెండు గదుల ఇంట్లో తన భర్త, మామగారి పక్కనే కూర్చొనివున్న మాధురి, PARIతో చెప్పారు. "ఆమెకు అలా జరగడం నేను భరించలేను," చెప్పారామె.
ఊర్వశి తాండేకర్‌ను ' మామా ' అని పిలుస్తుంది, అంటే తల్లి సోదరుడైన మేనమామ. ఈ యువ క్రీడాకారిణి బాధ్యతలను స్వీకరించినప్పుడు జయంత్ వయస్సు 35 సంవత్సరాలు, అవివాహితుడు
తాండేకర్ దళితుడు, చాంభార్ కులానికి చెందినవారు. భండారా, గోండియా, గడ్చిరోలి జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల నుంచి మంచి క్రీడాకారులను తయారుచేయాలనే తపన కలిగినవారు. అతను ఈ యువతకు తనకు లభించనిదాన్ని - ట్రాక్‌లపై పరుగులు తీసే అవకాశం - ఇవ్వాలనుకుంటున్నారు.
ఊర్వశి కుణబీ (ఒబిసి) కులానికి చెందినదయినప్పటికీ, కుల క్రమానుగతి (హైరార్కీ)నీ, పితృస్వామ్యపు ఉచ్చునూ ధిక్కరించాలని ఆమె తల్లిదండ్రులు భావించారు. 2024 వేసవిలో, భండారాలోని శివాజీ స్టేడియంలో తాండేకర్ PARIతో మాట్లాడుతూ, ఊర్వశి ఒక ప్రత్యేకమైన బాలిక అని చెప్పారు.
భండారాలో ఆయన పేరుకు తగినట్టే ఉండే అనాథ పిండక్ - అనాథల రక్షకుడు - అనే ఒక అకాడమీని నిర్వహిస్తారు. అన్ని వయసులలోని సుమారు 50 మంది విద్యార్థులకు నిధులు సమకూర్చడానికి చిన్న చిన్న విరాళాల రూపంలో డబ్బును సేకరించడం ద్వారా ఆయన నెట్టుకొస్తున్నారు. గుండ్రని ముఖం, పదునైన, ప్రేమ కురిపించే కళ్ళు, పొట్టిగా ఉండే ఈయన, ఎప్పుడూ వైఫల్యం లేదా ఎదురుదెబ్బలకు భయపడవద్దని తన ఔత్సాహిక గ్రామీణ రన్నర్‌లకు చెప్తుంటారు.
ప్రతి ఉదయం ఆయన ఇతర పిల్లలు వచ్చి చేరకముందే ఊర్వశిని మైదానానికి తీసుకువచ్చి ఆమెకు శిక్షణనిస్తారు. ఆమె క్రమం తప్పకుండా కసరత్తులు చేయవలసి ఉంటుందని ఆయన చెప్పారు.
ట్రాక్ దుస్తులను ధరించిన చిన్నారి ఊర్వశి ట్రాక్‌పై విభిన్నంగా, పరుగెత్తేందుకు పొంగులెత్తే ఉత్సాహంతో, కఠినమైన వ్యాయామానికి సిద్ధంగా కనిపిస్తూ ఉంటుంది. ఆమెకు మార్గనిర్దేశం చేసే గురువు, మామ పక్కనే ఉంటారు. ఊర్వశి ఇంకా చాలా దూరం ప్రయాణం చేయవలసి ఉంది: ఆమె పాఠశాల స్థాయి క్రీడా పోటీలలో పాల్గొనడం ప్రారంభించింది; అప్పుడు తాండేకర్ ఆమెను జిల్లా స్థాయి పోటీలకు పంపుతూ, ఆ పైన రాష్ట్ర, దేశీయ స్థాయికి పంపించాలనే లక్ష్యంతో ఉంటారు.
ఏది ఏమైనా గ్రామీణ ప్రాంతాల పిల్లలు పందెంలోకి రావాలని తాండేకర్ ఆలోచిస్తారు. పిల్లలను ప్రేరేపించడానికి ఆయన, ఎన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ గొప్ప స్థాయికి చేరిన పి.టి. ఉష వంటివారిని ఉదాహరణలుగా తీసుకొని కొంతమంది భారతదేశపు రన్నర్ల కథలను చెప్పారు. తాము కూడా కష్టపడుతూ, పెద్ద పెద్ద కలలు కన్నట్లయితే అంత పెద్ద స్థాయికి రాగలమని ఆయన విద్యార్థులు భావిస్తారు.
తన స్వంత ప్రయాణం నుండి నేర్చుకుంటూ తాండేకర్ ఆమె ఆహారం, పోషణలపై దృష్టి సారించారు. పాలు, గుడ్లు వంటి ప్రాథమికమైన వాటిని కూడా ఆయన ఎప్పుడూ క్రమం తప్పకుండా తినలేకపోయారు. ఊర్వశి ఆహారంలో మాంసకృత్తులు, పిండిపదార్థాలు, కొవ్వులు తప్పనిసరిగా ఉండేలా ఆయన చూసుకుంటారు. భండారాలో నివసించే అతని సోదరి, సీజన్‌లో అక్కడ లభించే చేపలను తీసుకువస్తుంటారు. ఊర్వశి తల్లి తన కుమార్తె ఎలా ఉందో చూడటానికి, బడి పనులలో, సాధారణ పనులలో ఆమెకు సహాయం చేయడానికి క్రమం తప్పకుండా వస్తూ ఉంటారు.
శిక్షకుడు తన శిష్యురాలికి - ఎదిగే సమయంలో తానెప్పుడూ వేసుకొని ఎరుగని - మంచి బూట్లు ఉండేలా చూసుకుంటారు. తన తండ్రి ఒక భూమిలేని కూలీ అని, ఎప్పుడూ ఇంటి అవసరాలు తీర్చడానికే కటకటలాడేవారని ఆయన చెప్పారు. పైగా ఆయన విపరీతంగా మద్యం సేవించేవాడు, ప్రతిరోజూ తన కొద్దిపాటి సంపాదనను ఒక సీసా కోసం ఖర్చు చేశాడు. తాను, తన తోబుట్టువు ఆకలితో అలమటించిన రోజులు ఉన్నాయని అతను వివరించారు.
"ట్రాక్‌పై పరుగెత్తాలని నేను కలలుగన్నాను," ఒక చిన్న చిరునవ్వులో తన నిరాశను కప్పిపుచ్చుతూ చెప్పారాయన. "నాకెప్పుడూ ఆ అవకాశం లేకపోయింది."
అయితే ఊర్వశికి, ఆమెలాంటివారికి ఇది సాధ్యం కావాలంటే, వారికి ఆరోగ్యకరమైన ఆహారం, నాణ్యమైన పాదరక్షలు, పెద్ద లీగ్‌లో ప్రవేశం కల్పించడం వంటి తాను చేయగలిగినదంతా చేయాలని తాండేకర్‌కు తెలుసు.
అంటే, వాళ్ళు మంచి పాఠశాలల్లో చేరి, గట్టి పోటీ ఇవ్వాలని ఆయన చెప్పారు.
అవసరమైనప్పుడు - చీలమండ బెణుకు, కండరాలు బిగుసుకుపోవటం, అలసట, శరీరపు నొప్పులు పెరిగిపోవటం - మంచి ఆరోగ్య సంరక్షణను పొందడం కూడా ఇందులో భాగమే.
"ఇది చాలా కష్టమే. కానీ కనీసం నా విద్యార్థులకు పెద్దగా కలలు కనడం ఎలాగో నేను నేర్పిస్తాను," చెప్పారతను.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి