నవంబర్ నెలలో ఒక మూడు రోజుల పాటు మాజులీ ద్వీపంలోని గరముర్ మార్కెట్ రంగురంగుల విద్యుద్దీపాలు, మట్టి ప్రమిదలతో వెలిగిపోతుంది. తొందరగా చీకటిపడే శీతాకాలపు సాయంత్రాలలో చుట్టూ అక్కడక్కడా ఉన్న లౌడ్ స్పీకర్ల నుండి ఖోల్-తాళ్ ల చప్పుళ్ళు వినిపిస్తాయి.
రాస్ మహోత్సవం మొదలయింది.
ఈ ఉత్సవం అస్సామీ నెలలైన కాతి-ఆఘొన్ లలో - ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం అక్టోబర్-నవంబర్ నెలలు - వచ్చే నిండు పూర్ణిమ నాడు మొదలవుతుంది. ప్రతి సంవత్సరం ఈ ద్వీపానికి భక్తులనూ పర్యాటకులనూ ఆకర్షించే ఈ పండుగ ఆ తర్వాత మరో రెండు రోజులపాటు కొనసాగుతుంది.
"ఈ పండుగే జరగకపోతే, మాకు ఏదో కోల్పోయినట్టుగా ఉంటుంది. అది (రాస్ మహోత్సవ్) మా సంస్కృతి," అంటారు వరుణ్ చితాదర్ చుక్ గ్రామానికి చెందిన ఈ ఉత్సవ నిర్వాహక కమిటీ కార్యదర్శి రాజా పాయేంగ్.
చక్కటి దుస్తులు ధరించివున్న వందలాది మంది ప్రజలు అస్సామ్‌లోని అన్ని ఇతర సత్రాల మాదిరిగానే నవ వైష్ణవ మతానికి చెందిన గరముర్ సరు సత్రం సమీపంలో గుమిగూడారు.
రాస్ మహోత్సవ్ (కృష్ణుని నృత్యోత్సవం) కృష్ణ దేవుని జీవితాన్ని నృత్య, నాటక, సంగీత ప్రదర్శనల ద్వారా వేడుక చేసే ఉత్సవం. ఒక్క రోజు ఉత్సవంలోనే వేదికపై 100కు పైగా పాత్రలను ప్రదర్శించవచ్చు.
ఈ ప్రదర్శనలు కృష్ణుని జీవితంలోని వివిధ దశలను - బాలునిగా బృందావనంలో పెరిగినప్పటి నుంచి గోపికలతో నాట్యమాడాడని చెప్పే రాస లీల వరకూ - చిత్రిస్తారు. ఈ సమయంలో ప్రదర్శించే కొన్ని నాటకాలలో శంకరదేవ రచించిన 'కేళీ గోపాల్', ఆయన శిష్యుడు మాధవదేవ రచించినట్టుగా చెప్పే 'రాస్ ఝుమురా' వంటి అంకియ నాట్ (ఏకాంకికలు) రూపాంతరాలుంటాయి.
తాను నటించేటపుడు కొన్ని నిర్దిష్టమైన సంప్రదాయాలను పాటించాల్సివుంటుందని గరముర్ మహోత్సవంలో విష్ణు పాత్రను వేసే ముక్తా దత్తా చెప్పారు: "కృష్ణ, నారాయణ, విష్ణు వంటి పాత్రలను మాకిచ్చిన రోజు నుంచి, మేం కేవలం శాకాహార సాత్విక ఆహారాన్ని మాత్రమే తింటాం. రాస్ మొదటి రోజున మేం బ్రత (వ్రతం-ఉపవాసం)ని పాటిస్తాం. మొదటిరోజు ప్రదర్శన ముగిసిన తర్వాత మాత్రమే మేం బ్రత భంగం చేస్తాం."
అస్సామ్ గుండా 640 కిలోమీటర్ల మేర ప్రవహించే బ్రహ్మపుత్రానదిలోని ఒక విశాలమైన ద్వీపం మాజులీ. ఈ దీవిలోని సత్రాలు (మఠాలు) వైష్ణవ మతానికే కాక కళకూ సంస్కృతికీ కూడా కేంద్రాలే. సంఘ సంస్కర్త, సాధువూ అయిన శ్రీమంత శంకరదేవ 15వ శతాబ్దంలో స్థాపించిన ఈ సత్రాలు అస్సామ్‌లో నవ-వైష్ణవ భక్తి ఉద్యమానికి ఒక రూపును దిద్దడంలో ప్రముఖ పాత్రను పోషించాయి.
మాజులీలో 65కు పైగా ఉన్న సత్రాలలో , ఈరోజున 22 మాత్రమే పనిచేస్తున్నాయి. ప్రపంచంలోని అతి పెద్ద నదీ పరివాహక వ్యవస్థలలో ఒకటైన బ్రహ్మపుత్రా నదికి పదే పదే వచ్చే వరదల వలన మిగిలిన సత్రాలు కోతకు గురయ్యాయి. వేసవి-ఋతుపవన మాసాలలలో కరిగే హిమాలయాలలోని హిమానీనదాల మంచు, ఈ నదీ పరీవాహక ప్రాంతంలో ఖాళీ అయిపోయే నదులను నీటితో నింపుతుంది. దీనితో పాటు మాజులీలోనూ, పరిసర ప్రాంతాలలోనూ కురిసిన వర్షపాతం కోత ఏర్పడటానికి ప్రాథమిక పరిస్థితులను సృష్టిస్తుంది.
ఈ సత్రాలు రాస్ మహోత్సవ్ వేడుకలకు వేదికలుగా పనిచేస్తాయి. ద్వీపంలోని వివిధ సముదాయాలకు చెందిన ప్రజలు కమ్యూనిటీ భవనాలలో, బహిరంగ మైదానాల్లో తాత్కాలికంగా ఏర్పాటుచేసిన వేదికలపై, పాఠశాల మైదానాల్లో కూడా ఈ వేడుకలనూ ప్రదర్శనలనూ సమష్టిగా జరుపుకుంటారు.
గరముర్ సరు సత్రంలో రాస్ ప్రదర్శనలో మహిళలు కూడా పాల్గొంటారు కానీ ఉత్తర కమలాబారీ సత్రంలో అలా కాదు. ఇక్కడ మతపరమైన, సాంస్కృతిక విద్యను అందించే భకత్స్ (భక్తులు) అనే సత్రానికి చెందిన బ్రహ్మచారులైన సన్యాసులు మాత్రమే అందరికీ అందుబాటులో ఉండేవిధంగా ఈ నాటకాలను ప్రదర్శిస్తారు.
ఇంద్రనీల్ దత్తా (82) గరముర్ సరు సత్రంలో రాస్ మహోత్సవ్ వ్యవస్థాపకులలో ఒకరు. 1950లో ఆ సత్రాధికార్ (సత్రం ప్రధాన అధికారి)గా ఉన్న పీతాంబర్ దేవ్ గోస్వామి ప్రదర్శనలలో కేవలం పురుషులే నటించే సంప్రదాయానికి స్వస్తి పలికి, మహిళా నటులను ఎలా స్వాగతించారో ఇంద్రనీల్ గుర్తుచేసుకున్నారు.
“పీతాంబర్ దేవ్ (సంప్రదాయ ప్రదేశమైన) నామ్‌ఘర్ (ప్రార్థనా మందిరం)కు వెలుపల ఒక వేదికను నిర్మించారు. నామ్‌ఘర్ ప్రార్థనా స్థలం కాబట్టి, మేం వేదికను బయటకు తీసుకువచ్చాం,” అని ఆయన గుర్తు చేసుకున్నారు.
అదే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ మహోత్సవాన్ని నిర్వహించే 60కి పైగా ఉన్న ప్రదేశాలలో గరముర్ కూడా ఒకటి. 1000మందికి పైగా కూర్చొని చూడగలిగేలా ఏర్పాట్లు చేసిన సమావేశ మందిరంలో జరిగే ఈ ప్రదర్శనలను చూసేందుకు టిక్కెట్ కొనుక్కోవాలి.
ఇక్కడ ప్రదర్శించే నాటకాలు వైష్ణవ సంప్రదాయంలో శంకరదేవ, మరికొంతమంది రచించిన నాటకాలకు రూపాంతరాలు. అనుభవజ్ఞులైన కళాకారులు కొత్తకు అనుగుణంగా మార్చినవి. “నేను నాటకాన్ని రాసేటప్పుడు, అందులో లోక్ సంస్కృతి కి (జానపద సంస్కృతి) చెందిన అంశాలను ప్రవేశపెడతాను. మనం మన జాతిని, సంస్కృతిని సజీవంగా ఉంచుకోవాలి" అని ఇంద్రనీల్ దత్తా చెప్పారు.
దీపావళి వెళ్ళిన మరుసటి రోజునుంచే ప్రధాన రిహార్సల్ మొదలవుతుంది," అన్నారు ముక్తా దత్తా. ఇది ప్రదర్శకులకు సిద్ధపడేందుకు రెండు వారాల కంటే తక్కువ సమయాన్ని ఇస్తుంది. "ఇంతకుముందు నటించినవారు వివిధ ప్రదేశాలలో నివసిస్తున్నారు. వాళ్ళను తిరిగి రప్పించడం ఇబ్బందవుతుంది," నటించడంతో పాటు గరముర్ సంస్కృత టొల్ (పాఠశాల)లో ఆంగ్లాన్ని కూడా బోధించే దత్తా చెప్పారు.
కళాశాలల, విశ్వవిద్యాలయాల పరీక్షలు తరచుగా మహోత్సవ్ సమయంలోనే జరుగుతుంటాయి. "అయినా వస్తారు (విద్యార్థులు), కనీసం ఒక రోజు కోసమైనా సరే. రాస్‌లో తమ పాత్రను ప్రదర్శించి, ఆ మరుసటి రోజున పరీక్ష రాయటానికి వెళ్ళిపోతుంటారు," అన్నారు ముక్తా.
ఈ ఉత్సవ నిర్వహణ కోసం అయ్యే ఖర్చు ప్రతి సంవత్సరం పెరుగుతూపోతోంది. గరముర్లో 2022లో అయిన ఖర్చు సుమారు 4 లక్షలు. "టెక్నీషియన్లకు మేం చెల్లిస్తాం. నటించేవారంతా స్వచ్ఛందంగా ఆ పని చేస్తారు. దాదాపు 100-150 మంది స్వచ్ఛందంగానే పనిచేస్తారు." ముక్తా చెప్పారు.
వరుణ్ చితాదర్ చుక్లో రాస్ మహోత్సవాన్ని అసామ్లో షెడ్యూల్డ్ తెగలకు చెందిన మిసింగ్ (మిషింగ్) ప్రజలు స్థానిక పాఠశాలలో నిర్వహిస్తారు. గత కొన్నేళ్ళుగా యువతలో ఆసక్తి లేకపోవడం వలన, ఈ ప్రాంతం నుంచి వలసలు విపరీతంగా పెరిగిపోవడం వలన ప్రదర్శనకారుల సంఖ్య తగ్గిపోయింది. అయినా వారు పట్టుదలతోనే ఉన్నారు. "మేం రాస్ నిర్వహించకపోతే, గ్రామానికి ఏదైనా అమంగళం జరుగుతుంది. ఇది గ్రామస్థులలో ప్రాచుర్యం పొందిన నమ్మకం," అని రాజా పాయేంగ్ చెప్పారు.
ఈ కథనానికి మృణాళిని ముఖర్జీ ఫౌండేషన్ (ఎమ్ఎమ్ఎఫ్) ఫెలోషిప్ మద్దతు ఉంది.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి