" యే బారా లాఖ్‌వాలా నా? ఇసీ కి బాత్ కర్ రహే హై నా? " ఒక వాట్సాప్ సందేశాన్ని నా కళ్ళ ముందుకు తెస్తూ అడిగారు 30 ఏళ్ళ షాహిద్ హుస్సేన్. అది ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ. 12 లక్షలకు పెంచటం గురించి. షాహిద్ బెంగళూరు మెట్రో లైన్ పైన పనిచేస్తోన్న నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీకి చెందిన ఒక క్రేన్‌ను నడిపిస్తారు.
"మేం ఈ 12 లక్షల పన్ను లేని బడ్జెట్ గురించి చాలా వింటున్నాం," అని అదే ప్రదేశంలో పనిచేస్తోన్న బృజేష్ యాదవ్ వెక్కిరింపుగా అన్నారు. "ఇక్కడ ఎవరూ సంవత్సరానికి 3.5 లక్షల [రూపాయిలు] కంటే ఎక్కువ సంపాదించరు." 20 ఏళ్ళ వయసు దాటిన బృజేష్ ఉత్తరప్రదేశ్‌లోని దేవరియా జిల్లా, డుమరియా గ్రామానికి చెందిన అనిపుణ వలస కార్మికుడు.
“ఈ పని పూర్తయ్యే సమయానికి, మేం నెలకు సుమారు రూ. 30,000 వరకూ సంపాదిస్తాం," అన్నారు బిహార్‌లోని కైమూర్ (భభువా) జిల్లాలోని బివుర్‌కు చెందిన షాహిద్. "ఈ పని పూర్తయిన వెంటనే, కంపెనీ మమ్మల్ని వేరే ప్రదేశానికి పంపుతుంది, లేదా మేమే రూ. 10-15 ఎక్కువ సంపాదించే అవకాశం ఉన్న వేరే పని కోసం చూస్తాం."
![](/media/images/02a-IMG20250203111757-PP-One_migrant_morni.max-1400x1120.jpg)
![](/media/images/02b-IMG20250203120641-PP-One_migrant_morni.max-1400x1120.jpg)
బెంగళూరులోని NH44 వెంబడే ఉన్న మెట్రో మార్గంలో రాష్ట్రానికి చెందిన, రాష్ట్రం వెలుపల నుండి వచ్చిన అనేక ఇతర వలసదారులతో కలిసి పనిచేస్తోన్న క్రేన్ ఆపరేటర్ షాహిద్ హుస్సేన్ (నారింజ రంగు చొక్కా), బృజేష్ యాదవ్ (నీలం చొక్కా ధరించిన అనిపుణ కార్మికుడు). ఈ ప్రదేశంలో పనిచేసేవారెవరూ ఏడాదికి 3.5 లక్షల కంటే ఎక్కువ సంపాదించలేరని వారు అంటున్నారు
![](/media/images/03a-IMG20250203114431-PP-One_migrant_morni.max-1400x1120.jpg)
![](/media/images/03b-IMG20250203114637-PP-One_migrant_morni.max-1400x1120.jpg)
ఉత్తరప్రదేశ్‌కు చెందిన నఫీజ్ బెంగళూరుకు వలస వచ్చిన వీధి వ్యాపారి. అతను జీవనోపాధి కోసం తన గ్రామం నుండి 1,700 కిలోమీటర్ల దూరం రావాల్సివచ్చింది. మనుగడకు సంబంధించిన అనేక సమస్యలతో సతమతమవుతోన్న ఆయనకు బడ్జెట్ గురించి పట్టించుకునే సమయం చాలా తక్కువ
రహదారి మధ్యగా ఉన్న ట్రాఫిక్ జంక్షన్ వద్ద, యుపి నుండి వచ్చిన మరొక వలసదారు, విండో షీల్డులు, కారులో వెళ్ళేటపుడు ఉపయోగించే నెక్ సపోర్ట్‌లు, మైక్రోఫైబర్ డస్టర్లు, మరికొన్నింటిని విక్రయిస్తున్నారు. అతను రోజూ తొమ్మిది గంటల పాటు రోడ్డు ఆ చివర నుండి ఈ చివరకు తిరుగుతూ, జంక్షన్ వద్ద వేచి ఉన్న కార్ల కిటికీలను తడతారు. “ అరే కా బడ్జెట్ బోలే? కా న్యూస్? [అరే! నేను ఏ బడ్జెట్ గురించి మాట్లాడాలి? ఏం వార్తలు?]” నా ప్రశ్నలకు నఫీజ్‌లో విసుగు స్పష్టంగా కనిపించింది.
ఏడుగురు సభ్యులున్న వారి కుటుంబంలో ఆయన, ఆయన సోదరుడు మాత్రమే సంపాదించేవారు. వీరు ఇక్కడికి 1,700 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లా, భారత్‌గంజ్‌కు చెందినవారు. “మనం సంపాదించేది ఏదైనా మన పని మీద ఆధారపడి ఉంటుంది. ఆజ్ హువాతో హువా, నహీఁ హువాతో నహీఁ హువా [నేను ఈ రోజు సంపాదిస్తే సంపాదించినట్టు; సంపాదించకపోతే, లేనట్టు]. నేను సంపాదించిన రోజున సుమారు 300 రూపాయలు సంపాదిస్తాను. వారాంతాల్లో ఇది రూ. 600కి చేరుతుంది."
"మా గ్రామంలో మాకు భూమి లేదు. ఎవరి పొలాన్నైనా కౌలుకు తీసుకొని వ్యవసాయం చేయాలంటే అది '50:50 వ్యవస్థ'. అంటే, వారు ఖర్చులలో సగం భరిస్తారు - నీరు, విత్తనాలు వంటివి. “పని అంతా మేమే చేస్తాం, అయినప్పటికీ సగం పంటను అప్పగించాలి. మేం ఆ పని చేయలేం. ఇక బడ్జెట్ గురించి నేనేం చెప్పగలను?" నఫీజ్ అసహనంగా ఉన్నారు. సిగ్నల్ లైటు మళ్ళీ ఎరుపు రంగులోకి మారుతుంది. తమ అద్దాలు బిగించిన కార్లలో కూర్చొని సిగ్నల్ ఆకుపచ్చగా మారడానికి వేచివున్నవారిలో తన వస్తువులను కొనేవారి కోసం నఫీజ్ కళ్ళు వెదుకుతున్నాయి.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి