బడ్జెట్ గురించి తెలుసుకోవటం మగవాళ్ళ పని అని అంజనా దేవి నమ్ముతారు.
" మరద్ లోగ్ హీ జాన్తా హై యే సబ్, లేకిన్ వో తో నహీఁ హైఁ ఘర్ పర్ [దీని గురించి మగవాళ్ళకు మాత్రమే తెలుస్తుంది, కానీ నా భర్త ఇంట్లో లేడు]," అన్నారామె. అయితే వారి ఇంట్లో, కుటుంబ బడ్జెట్‌ను నడిపేది మాత్రం ఆమే. అంజనా షెడ్యూల్డ్ కులాల సముదాయానికి చెందిన ఒక చమార్ .
" బజ్జట్ [బడ్జెట్]!" తానేమైనా కొత్త ప్రకటనలు విన్నదేమో అని గుర్తు చేసుకుంటూ అన్నారామె. " ఊ సబ్ హమ్ నహీఁ సునే హైఁ [నేను దాని గురించి వినలేదు]." కానీ, " ఈ సబ్ [బడ్జెట్] పైసా వాలా లోగ్ కే లియే హై [ఇదంతా పైసలున్న వారి కోసం],” బిహార్‌లోని వైశాలి జిల్లా, సోంధో రత్తీ గ్రామంలో నివసించే ఈ దళిత మహిళ అన్నారు.
అంజన భర్త, 80 ఏళ్ళ శంభు రామ్ - మేం వారిని కలవడానికి వెళ్ళినప్పుడు భక్తి గాయకుడిగా ప్రదర్శన ఇచ్చేందుకు బయటకు వెళ్ళారు - తమ ఇంట్లోనే ఒక రేడియోలు బాగుచేసే కార్యశాలను నిర్వహిస్తున్నారు. కానీ బాగుచేయించుకునేవాళ్ళు తక్కువ. "మేం కష్టమ్మీద వారానికి 300-400 రూపాయలు సంపాదిస్తాం," అని ఆమె చెప్పారు. వార్షిక ఆదాయం ప్రకారం చూసుకుంటే అది గరిష్టంగా రూ.16,500. లేదా స్వతంత్ర వ్యక్తులకు ఇచ్చే 12 లక్షల పన్ను మినహాయింపు పరిమితిలో 1.37 శాతం. పెంచిన పరిమితి గురించి చెప్పినప్పుడు ఆమె నవ్వేశారు. “కొన్నిసార్లు మేం వారంలో 100 రూపాయలు కూడా సంపాదించలేం. ఇది మొబైల్ ఫోన్ల యుగం. ఇక రేడియో వినేవారే లేరు,” అని ఆమె ఫిర్యాదు చేశారు.
ఎవరి ‘ఆకాంక్షల’ను ఈ బడ్జెట్ నెరవేరుస్తున్నదని ప్రధాని మోదీ నమ్ముతున్నాడో, ఆ 1.4 బిలియన్ల భారతీయులలో 75 ఏళ్ళ అంజన కూడా ఒక భాగం. కానీ కొత్త దిల్లీలోని అధికార కారిడార్లకు 1,100 కిలోమీటర్ల దూరంలో నివసిస్తోన్న ఆమె మాత్రం ప్రధాని నమ్మకాన్ని పంచుకోవటంలేదు.
అది నిమ్మళంగా ఉన్న ఒక శీతాకాలపు మధ్యాహ్నం. ప్రజలు తమ రోజువారీ పనుల్లో మునిగిపోయి ఉన్నారు. బడ్జెట్ గురించి వారికి బహుశా తెలియకపోవచ్చు. లేదా అది తమకు అనవసరమని కూడా అనుకొనివుండొచ్చు.
బడ్జెట్ గురించి అంజనకు ఎలాంటి అంచనాలు లేవు. " సర్కార్ క్యా దేగా! కమాయేంగే తో ఖాయేంగే, నహీ కమాయేంగే తో భుఖలే రహేంగే [ప్రభుత్వం మనకేం ఇస్తుంది! మనం సంపాదించుకుంటే తింటాం, లేకుంటే ఆకలితో ఉంటాం]."
ఈ గ్రామంలోని 150 చమార్ కుటుంబాలలో 90 శాతం మందికి భూమి లేదు. కాలాన్ని బట్టి వలస వెళ్ళే వీరు ప్రధానంగా రోజువారీ కూలి పనులు చేసుకుంటారు. వారెన్నడూ ఏ పన్ను పరిధిలోనూ లేరు.
అంజనా దేవికి నెలకు ఐదు కిలోల ఆహారధాన్యాలు ఉచితంగా లభిస్తాయి, కానీ ఆమె ఒక క్రమంతప్పని రాబడిని కోరుకుంటున్నారు. “నా భర్త చాలా పెద్దవాడైపోయాడు, ఇక పని చేయలేడు. మేం మనుగడ సాగించడానికి ప్రభుత్వం నుండి మాకు కొంత క్రమంతప్పని రాబడి ఉండాలి."
అనువాదం: సుధామయి సత్తెనపల్లి