యో నాన్ తమాసో మత్ సంఝో, పుర్ఖా కి అమర్ నిశాని ఛే!
నహాన్‌ని కేవలం
వినోదం కోసమే అని తప్పుగా అనుకోవద్దు; అది మన పూర్వీకుల వారసత్వం
ఆగ్నేయ రాజస్థాన్‌లోని హడౌతీ ప్రాంతంలో జరుపుకునే నహాన్ పండుగ గురించి కోటాలోని సాంగోద్ గ్రామానికి చెందిన దివంగత కవి సూరజ్‌మల్ విజయ్ ఈ విధంగా సంగ్రహించారు.
"కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టినా కూడా, ఏ ప్రభుత్వమూ ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించలేదు," అని నగల వ్యాపారి అయిన గ్రామ నివాసి రాంబాబు సోనీ చెప్పారు. "ఒకవేళ నిర్వహించినా, మా గ్రామ ప్రజలు తమ స్వంత సంస్కృతి కోసం, స్వంత ఇష్టానుసారం నిర్వహించే విధంగా అయితే కాదు." హోలీ పండుగ తర్వాత ఐదు రోజుల పాటు జరిగే ఈ పండుగను, 15వ శతాబ్దంలో ఇక్కడ నివసించినట్లు భావిస్తోన్న జానపదకథనాయకుడు సంగా గుర్జర్ గౌరవార్థం జరుపుకుంటారు.
'నహాన్' అంటే 'స్నానం'. హోలీ పండుగతో సంబంధమున్న ఈ పండుగ ఒక సామూహిక ప్రక్షాళనకు ప్రతీక. దీనిని పూర్తిగా సాంగోద్ ప్రజలే నిర్వహిస్తారు. వారు తమ దినచర్యలను పక్కనపెట్టి, స్వయంగా చేసుకున్న మేకప్‌తో, పండుగ దుస్తులతో అసాధారణమైన పాత్రలలోకి ప్రవేశిస్తారు.
"సుమారు 400-500 ఏళ్ళ క్రితం, మొఘల్ చక్రవర్తి షాజహాన్ పరిపాలించిన కాలంలో, సాంగోద్‌లో ఒక విజయ్‌వర్గీయ 'మహాజన్' ఉండేవాడు," రాంబాబు సోనీ చెప్పారు. "ఆయన షాజహాన్ వద్ద పనిచేసేవాడు. ఆయన ఉద్యోగ విరమణ చేసిన తర్వాత, ఇక్కడ నహాన్‌ను నిర్వహించేందుకు చక్రవర్తి అనుమతిని కోరాడు. ఆ విధంగా సాంగోద్‌లో ఈ పండుగ మొదలయింది."
నృత్య ప్రదర్శనలు, గారడీ విద్యలు, విన్యాసాలతో అబ్బురపరిచే కళాకారులను చూడటానికి సమీపంలోని గ్రామాల నుండి వేలాదిమంది సాంగోద్‌కు వస్తారు. ఈ వేడుకలు బ్రహమ్మణి దేవి ఆరాధనతో ప్రారంభమవుతాయి, ఆ తర్వాత ఘూగ్రీ (ఉడికించిన ధాన్యాలు)ని ప్రసాదంగా పంచిపెడతారు.
"ఇక్కడ మాంత్రిక నైపుణ్యాలను ప్రదర్శిస్తారు, కత్తులను మింగుతారు, ఇంకా అలాంటి అనేక కృత్యాలను ప్రదర్శిస్తారు," అని ప్రదర్శకులలో ఒకరైన సత్యన్నారాయణ్ మాలి ప్రకటించారు. "ఒక వ్యక్తి కాగితపు ముక్కలను తిని, నోటి నుండి 50 అడుగుల పొడవైన దారాన్ని బయటకు తీస్తాడు."
ఉత్సవాలు ముగియబోతున్నప్పుడు బాద్షా కి సవారీ జరుగుతుంది. ఇందులో ఒక సాధారణ వ్యక్తికి ఒక రోజు రాజుగా పట్టాభిషేకం జరుగుతుంది. అతని రాచరిక ఊరేగింపు గ్రామ వీధుల గుండా తిరుగుతుంది. గత 60 ఏళ్ళుగా రాంబాబు కుటుంబంలోని వారే ఈ రాజు పాత్ర పోషిస్తున్నారు. "నా తండ్రి 25 సంవత్సరాల పాటు ఈ పాత్రను పోషించాడు, నేను గత 35 ఏళ్ళుగా ఈ వారసత్వాన్ని కొనసాగిస్తున్నాను," అని ఆయన చెప్పారు. “ఒక సినిమాలో ప్రధాన నటుడి పాత్రదే ప్రధాన ఆకర్షణ అయినట్టు, ఇక్కడ రాజు పదవి చాలా ముఖ్యం. ఇది కూడా ఒక సినిమానే,” అన్నారాయన.
ఆ రోజున ఎవరికి ఆ పాత్ర దక్కినా, వారికి దానికి తగిన గౌరవం కూడా దక్కుతుంది.
"అవును, ప్రతి ఏడూ ఒక్క రోజు మాత్రమే," ఉత్సవాలకు హాజరైన ఒక వ్యక్తి చెప్పారు. "అవును, ఆ రోజుకు అతనే రాజు."
అనువాదం: సుధామయి సత్తెనపల్లి