విసుర్రాయితో పనిచేస్తూ తన తల్లి పాడిన పాటలను ఛాయా ఉబాళే గుర్తు చేసుకున్నారు. అవి - కుటుంబ సంబంధాల సంతోషాలనూ, కష్టాలనూ ఇమిడ్చి పాడే విసుర్రాయి పాటలూ, జానపద గీతాలూ
మహారాష్ట్రలోని పుణే జిల్లా, శిరూర్ తాలూకా లో మేం ఆమెను కలిసినప్పుడు, "మా అమ్మ చాలా పాటలు పాడేది, కానీ వాటన్నిటినీ గుర్తుకు తెచ్చుకోవటం కష్టం," PARIతో చెప్పారు ఛాయా ఉబాళే. విసుర్రాయి పాటల ప్రాజెక్ట్ (GSP)కు పాటలు అందించిన గాయకులను మళ్ళీ కలవాలనే మా వెతుకులాటలో భాగంగా మేం అక్టోబర్ 2017లో సవిందణె గ్రామంలోని పవార్ ఇంటి తలుపు తట్టాం. అది కొడుకులు, కూతురు, కోడలు, పిల్లలతో నిండిన ఇల్లు.
కానీ నాలుగేళ్ళ క్రితమే మరణించటంతో మేం గీతా పవార్‌ని కలవలేకపోయాం. దాంతో మా కోసం తన తల్లి పాడిన పాటలను గుర్తుచేసుకోవటం గీత కుమార్తె ఛాయా ఉబాళే బాధ్యత అయింది. 43 ఏళ్ళ ఛాయ తన తల్లి ధరించిన వెండి జోడవే (మెట్టెలు)ను మాకు చూపించారు. వాళ్ళు వాటిని తాము ఆప్యాయంగా ఆరాధించే తల్లి ఫోటో ఫ్రేమ్ పక్కన ఉంచారు.
ఆమె తన తల్లి పాడిన ఒవీ ని గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నించిన తర్వాత, ఛాయ నాలుగు విసుర్రాయి పాటలను పాడారు. ఒకటి విచారంగానూ, మరొకటి ఉల్లాసంగానూ ఉన్న రెండు చిన్న జానపద పాటలను కూనిరాగం తీశారు. ఆమె భద్రకు రాజైన అశ్వపతి కుమార్తె, పురాణసంబంధమైన సావిత్రి సద్గుణాలను కీర్తిస్తూ ఒక రెండు వరుసల కథతో ప్రారంభించారు. తరువాత వచ్చే పాటలకు శ్రుతిని స్థిరం చేయడానికి పాడే గళా (రాగం) ఈ ద్విపద. ఇది ఒక సాధారణ అభ్యాసం.
మొదటి జానపద గీతంలో ఆమె మహాభారతంలో వందమంది దాయాదులైన కౌరవులతో సంఘర్షిస్తోన్న ఐదుగురు పాండవ సోదరుల పరిస్థితిని, చాలా పెద్ద కుటుంబంలో రోజువారీ పనులు చేసే ఒంటరి మహిళగా తన స్వంత పరిస్థితితో పోల్చారామె. పండర్‌పూర్ ఆలయంలోని విఠ్ఠల్-రుక్మిణి పట్ల భక్తిని ఆవాహన చేస్తూ, ఆ దేవతలను తన స్వంత తల్లిదండ్రులతో పోల్చారు. తల్లిదండ్రుల ప్రస్తావన రాగానే ఛాయ గొంతు గద్గదికమైపోయి, తన చెంపల మీదుగా ప్రవహిస్తున్న కన్నీటిని ఆమె నిలవరించలేకపోయారు. అంతలోనే, అదే వరుసలో ఉన్నట్లుగా ఉన్నట్టుండి మేఘం కమ్మి, ఆ ఇంటి రేకుల కప్పుపై పెద్ద శబ్దాలు చేస్తూ భారీ వర్షం మొదలయింది.
ఆ తర్వాతి చరణంలో ఆమె తన నలుగురు బావగార్లు, వారి భార్యలు కోరిన కోరికలను తీర్చడానికి తన సోదరుడు పడిన కష్టాలను గురించి పాడారు.
ఆ జానపద పాట తర్వాత పాడిన నాలుగు చరణాల ఒవీ లో ఛాయ ఒక పిల్లవాడు తన మేనమామల నుండి, అత్తల నుండి పొందే ప్రేమను గురించి, బహుమతుల గురించి పాడారు. శిశువుకు మేనమామ ఎరుపు రంగు జుబ్బా, టోపీ బహుమతిగా ఇచ్చారు. శిశువు ఆకలితో ఏడవడం మొదలుపెట్టగానే, పిల్లవాడికి పెరుగన్నం తినిపించమని గాయని సూచిస్తారు.
కన్నీటిని తుడుచుకుంటూ, విచారం నుండి త్వరగానే కోలుకున్న ఛాయ హాస్యం నిండిన ఒక జానపద పాటను పాడి ముగించారు: కాకయరకాయ చేదులా తనను ఇబ్బందిపెట్టే అత్తగారిని సంతోషపెట్టడం కోడలుకి ఎంత కష్టమో ఇందులో వర్ణించారు. మీరు ఎలా వండినా, దాని రుచి ఎప్పుడూ చేదుగానే ఉంటుంది; దానిని తీపిగా చేయడం అసాధ్యం. ఈ చివరి పాటలో మేం కూడా ఛాయ నవ్వులలో జతకలిపాం.
జానపద గీతం:
गिरीजा आसू गाळिते
भद्र देशाचा अश्वपती राजा पुण्यवान किती
पोटी सावित्री कन्या सती केली जगामध्ये किर्ती
एकशेएक कौरव आणि पाची पांडव
साळीका डाळीका गिरीजा कांडण कांडती
गिरीजा कांडण कांडती, गिरीजा हलक्यानं पुसती
तुमी कोण्या देशीचं? तुमी कोण्या घरचं?
आमी पंढरपूर देशाचं, काय विठ्ठलं घरचं
विठ्ठल माझा पिता, रुक्मिनी माझी माता
एवढा निरोप काय, सांगावा त्या दोघा
पंचमी सणाला काय ये बंधवा न्यायाला
ए बंधवा, ए बंधवा, तुझं पाऊल धुईते
गिरीजा पाऊल धुईते, गिरीजा आसू जी गाळिते
तुला कुणी बाई नि भुलीलं, तुला कुणी बाई गांजिलं
मला कुणी नाही भुलीलं, मला कुणी नाही गांजिलं
मला चौघे जण दीर, चौघे जण जावा
एवढा तरास मी कसा काढू रे बंधवा
గిరిజ కన్నీరు పెడుతోంది
భద్ర రాజ్యానికి రాజు అశ్వపతి
ఎంతటి భాగ్యశాలి
అతని కూతురు సతీ సావిత్రి ఎంతటి
ప్రపంచఖ్యాతిని ఆర్జించింది
నూరున్నొక్కమంది కౌరవులు, పంచ
పాండవులు
ధాన్యమో కాయధాన్యాలో, గిరిజ
వాటిని దంచుతోంది
వాటిని దంచుతూ గిరిజ నెమ్మదిగా
అడుగుతుంది
ఏ దేశం నుంచి వచ్చావు? ఏ పరివారం
నుంచి?
మేం పండర్‌పూర్ నుంచి వచ్చాం,
విఠ్ఠల్ ఇంటి నుంచి
విఠ్ఠల్ నా తండ్రి, రుక్మిణి
నా తల్లి
నా యీ సందేశాన్ని వారిద్దరికీ
అందించు
పంచమి పండుగ కోసం, నన్ను తీసుకువెళ్ళేందుకు
నా సోదరుణ్ణి పంపమని
ఓ సోదరా, నా సోదరా, నీ కాళ్ళు
కడుగుతాను
గిరిజ [నీ] కాళ్ళు కడుగుతుంది,
గిరిజ కన్నీరు పెడుతుంది
నిన్ను మర్చిపోయినది, నిన్ను
బాధలు పెట్టినది
నన్నెవరూ మర్చిపోలేదు, నన్నెవరూ
బాధపెట్టలేదు
కానీ నాకు నలుగురు బావలు, నలుగురు
తోడికోడళ్ళు ఉన్నారు
ఈ బాధలన్నిటినీ నేనెలా దాటిపోగలను,
ఓ సోదరా
ఒవీలు (విసుర్రాయి పాటలు):
अंगण-टोपडं सीता घालिती बाळाला
कोणाची लागी दृष्ट, काळं लाविती गालाला
अंगण-टोपडं हे बाळ कुणी नटविलं
माझ्या गं बाळाच्या मामानं पाठविलं
माझ्या गं योगेशच्या मामानं पाठविलं
अंगण-टोपडं गं बाळ दिसं लालं-लालं
माझ्या गं बाळाची मावशी आली कालं
रडतया बाळ त्याला रडू नको देऊ
वाटीत दहीभात त्याला खायला देऊ
సీత తన బిడ్డకు జుబ్బా తొడిగి
టోపీ పెట్టింది
చెడు చూపు సోకకుండా బుగ్గన
నల్ల చుక్క కూడా పెట్టింది
ఈ పాపడికి తొడిగిన జుబ్బా టోపీ
వాడి మేనమామ వాడి కోసం పంపినవి
నా యోగేశ్ మేనమామ వాటిని వాడికోసమే
పంపాడు
ఎర్రని జుబ్బా టోపీలతో బిడ్డ
ముస్తాబయ్యాడు
నా బిడ్డ మేనత్త నిన్న వచ్చింది
బిడ్డ ఏడుస్తున్నాడు, వాడిని
ఏడవనివ్వకు
వాడికొక గిన్నెలో పెరుగు బువ్వ
తినిపిద్దాం
జానపద గీతం:
सासू खट्याळ लई माझी
सासू खट्याळ लई माझी सदा तिची नाराजी
गोड करू कशी बाई कडू कारल्याची भाजी (२)
शेजारच्या गंगीनं लावली सासूला चुगली
गंगीच्या सांगण्यानं सासूही फुगली
पोरं करी आजी-आजी, नाही बोलायला ती राजी
गोड करू कशी बाई कडू कारल्याची भाजी
सासू खट्याळ लई माझी सदा तिची नाराजी
నన్ను వేధించే అత్తగారు
నా అత్తగారు చాలా ఇబ్బందులు
పెడతారు, ఎల్లప్పుడూ అసంతృప్తిగానే ఉంటారు
చేదు కాకరకాయను నేనెలా తీపి
చేయగలను? (2)
పొరుగింటి గంగి, నాపైన చాడీలు
చెప్పింది
అది విన్న అత్తకు కోపం వచ్చింది
నానమ్మా నానమ్మా అంటూ పిల్లలు
ప్రేమగా దరిచేరతారు, కానీ ఆమె మాట్లాడేందుకు సిద్ధంగా లేరు
చేదు కాకరకాయను తీపిగా ఎలా
చేయగలను?
నా అత్తగారు చాలా ఇబ్బందులు
పెడతారు, ఎల్లప్పుడూ అసంతృప్తిగానే ఉంటారు
ప్రదర్శనకారిణి/గాయని: ఛాయా ఉబాళే
గ్రామం : సవిందణే
తాలూకా: శిరూర్
జిల్లా: పుణే
తేదీ : ఈ పాటలను రికార్డ్ చేసి, ఫోటోలు తీనది 2017 అక్టోబర్‌లో
పోస్టర్: సించిత పర్‌బత్
హేమా రాయిర్కర్, గి పొయ్‌టెవాఁ నెలకొల్పిన మౌలిక విసుర్రాయి పాటల ప్రాజెక్ట్ గురించి చదవండి.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి