"నాకు ఈ ఒటిపిలంటే చాలా భయం. సహా ఆకడే ఆణి పైసా గాయబ్ [ఆరు అంకెలు, డబ్బు మాయం]," అనిల్ ఠోంబరే నాతో చెప్పారు. బస్సుల హారన్లు, చిరుతిండ్లు, నీళ్ళ సీసాలు అమ్ముకొంటున్నవారి కేకలు, బస్సుల రాక పోకలతో ఆ రాష్ట్ర రవాణా శాఖ బస్టాండ్ అంతా శబ్దాల సందడితో నిండివుంది. ఎవరో ఆయనను ఒటిపి (ఒన్ టైమ్ పాస్‌వర్డ్) అడగటంతో ఆయన నా సహాయాన్ని కోరారు.
బడ్జెట్ - ఆయన మాటల్లో చెప్పాలంటే అర్థ సంకల్ప - గురించి ఆయన విన్నారు. “జనవరి 31న, దాని గురించి రేడియోలో కొన్ని వార్తలు వచ్చాయి. ప్రభుత్వం ప్రతి శాఖకు కొన్ని కేటాయింపులు ప్రకటిస్తుంది. దాని గురించి నాకు తెలుసు. అన్నీ కాకపోయినా, కనీసం రూపయత్ దహా పైసే [రూపాయిలో పది పైసలు]!” ఆయన ఒక అడికిత్తా (అడకత్తెర)తో పోకచెక్కను కత్తిరిస్తూ అన్నారు.
కొంత నిశ్శబ్దంగా ఉన్న చోటుకోసం మేం చూస్తుంటే, ఆయన అనేకంటే, ఆయన తెలుపు ఎరుపు రంగుల చేతికర్ర, క్యాంటీన్ వైపుకు దారితీసింది. ఠోంబరేకు దృష్టిలోపం ఉంది. ఆయనకు అక్కడి ప్లాట్‌ఫామ్‌లు, జనాల గుంపులు, క్యాంటీన్ కౌంటర్లు, మెట్లు - ఇవన్నీ బాగా తెలుసు. "తడపర పోసి నా కంటిచూపును పూర్తిగా పోగొట్టుకునే నాటికి నా వయసు కేవలం ఒక్క నెల మాత్రమేనని నాకు చెప్పారు."
![](/media/images/02-1738822924160-MK-Mai-baap_sarkar_forget.max-1400x1120.jpg)
వైకల్యాలు ఉన్న వ్యక్తులపై మరింత శ్రద్ధ చూపాలని బారుళ్‌కు చెందిన సంగీతకారుడు అనిల్ ఠోంబరే అభిప్రాయపడ్డారు
తుళజాపూర్ పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో, దాదాపు 2,500 జనాభా ఉన్న బారుళ్ అనే గ్రామంలో నివసించే ఠోంబరే, భక్తి పాటలు పాడుతూ ప్రదర్శనలనిచ్చే ఒక భజనీ మండల్ కోసం తబలా, పఖవాజ్ వాయిస్తారు. నిర్వాహకులు అందించే డబ్బు, ఆయనకు వచ్చే నెలవారీ వికలాంగుల పింఛన్ రూ. 1,000లకు తోడవుతుంది. "ఇది (పింఛను) ఎప్పుడూ సమయానికి రాదు," అని ఆయన చెప్పారు. అంతేకాక దానిని తెచ్చుకోవడానికి తుళజాపూర్‌లో ఉండే బ్యాంకుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇటీవలే ఆయనకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఒక ఇంటిని కేటాయించారు, త్వరలోనే దాని పనులు ప్రారంభమవుతాయి. "అందుకు కూడా నేను నా బ్యాంక్ ఖాతా నుండి మొదటి వాయిదాను పొందాలి, దాని కోసం నేను ఆ కెవైసిని పూర్తి చేయాలి" అని 55 ఏళ్ళ ఠోంబరే చెప్పారు.
ఈ రోజు ఆయన బారుళ్‌కు చెందిన తన స్నేహితుడి లాండ్రీ నుండి తన బట్టలు తెచ్చుకోవడానికి తుళజాపూర్‌లో ఉన్నారు. “నేను ఒంటరిని. ఇంటి పనులన్నీ నేనే చేసుకుంటాను. వంట చేసి కుళాయి నుంచి నీళ్ళు తెచ్చుకుంటాను. మీకు తెలుసా, నేను బట్టలు ఉతకడంతో విసిగిపోయాను!” నవ్వుతూ చెప్పారాయన.
ఠోంబరే అభిప్రాయంలో, " మాయ్-బాప్ (అమ్మా-నాన్న)ల వంటి ప్రభుత్వం అందరినీ బాగా చూసుకోవాలి. కానీ నన్నడిగితే, నా వంటి వైకల్యం కలిగినవారి పట్ల బడ్జెట్‌లో మరింత శ్రద్ధ చూపించాలి."
అయితే, 2025 కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో వైకల్యం లేదా దివ్యాంగ్‌జన్ అంటే వైకల్యం ఉన్న వ్యక్తుల గురించి ఒక్కసారి కూడా ప్రస్తావించలేదని ఠోంబరేకు తెలియదు.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి