ఏనుగు తన ఫంది (శిక్షకుడు)ని ఎన్నటికీ మరచిపోదని శరత్ మొరాన్ అంటారు. ఆయన 90కి పైగా ఏనుగులకు శిక్షణనిచ్చారు. ఏనుగు తన జీవితకాలంలో దట్టమైన అడవిలో అడవి ఏనుగుల మందతో కలిసి ఉన్నప్పటికీ కూడా తన ఫంది వద్దకు పరుగెట్టుకుంటూ వస్తుందని కూడా ఆయన అంటారు.

పిల్‌ఖానా లో - శిక్షణ కోసం ఏర్పాటుచేసిన తాత్కాలిక శిబిరం - కొత్తగా పుట్టిన ఏనుగు గున్నకు నెమ్మదిగా మానవ స్పర్శను పరిచయం చేసి, దానికి అలవాటయ్యేవరకూ అనేకసార్లు కొనసాగిస్తారు. "శిక్షణా సమయంలో కలిగే చిన్న నొప్పి కూడా చాలా ఎక్కువగా అనిపిస్తుంది," అంటారు శరత్.

రోజులు గడిచేకొద్దీ, ఆ జంతువుకు అసౌకర్య భావన తొలగిపోయేంత వరకూ ఆ గున్న చుట్టుపక్కల ఉండే మనుషుల సంఖ్య పెరిగిపోతూ వుంటుంది

శిక్షణ సాగినంత కాలం శరత్, అతని తోటి శిక్షకులు జంతువుకూ, దాని శిక్షకునికీ మధ్య ఉందే స్నేహం గురించిన కథను వివరిస్తూ సాంత్వననిచ్చే పాటలను పాడుతుంటారు.

"కొండల్లో ఉండేదానివి నువ్వు,
పెద్ద పెద్ద కాకో వెదురును తింటూ.
లోయకు వచ్చావు నువ్వు
శిక్షకుని మంత్రకట్టుతో.
నీకు నేను నేర్పిస్తాను,
నిన్ను బుజ్జగిస్తాను,
ఇది నేర్చుకునే సమయం!
ఈ ఫంది
నీ మూపునకెక్కి
వేటకు వెళ్తాడు."

కొంతకాలం తర్వాత, జంతువు కదలికలను నియంత్రించే మోకులు నెమ్మదిగా తక్కువైతూపోయి మొత్తానికే తొలగించబడతాయి. ఏనుగుకు శిక్షణనివ్వడానికి అనేక మోకుల అవసరం ఏర్పడుతుందని, ఇంకా ఆ మోకులకు కూడా నిర్దిష్టమైన ఉపయోగం, పేరూ ఉంటాయని శిక్షకుడు చెప్పారు. ఏనుగు తమదైన సొంత ప్రభావాన్ని వేసే సుమధురమైన పాటలతో కూడా స్నేహం చేస్తుంది. ఈ నమ్మికయే పూర్వకాలంలో అడవి ఏనుగులను పట్టుకోవటానికి, వేటలో కూడా ఉపయోగపడింది.

శరత్ మొరాన్ బీర్బల్‌కు శిక్షణనివ్వడాన్ని ఈ వీడియోలో చూడండి

తాను ఏ విధంగా ఫంది అయ్యారో నిపుణుడైన శిక్షకుడు శరత్ మొరాన్, "మా ఊరు అడవిలో ఉండటం, అందులో చాలా ఏనుగులు ఉండటమే కారణం. మేం చిన్నతనం నుండి వాటితో ఆడుకుంటూనే పెరిగాం. ఆ విధంగానే నేను వాటికి శిక్షణనివ్వడాన్ని నేర్చుకున్నాను," అంటూ చెప్పారు.

ఏనుగులకు శిక్షణ ఇవ్వడానికి సంఘటితంగా పనిచెయ్యటం అవసరం. "బృందానికి నాయకుడే ఫంది . అప్పుడు లూహొతియా, మహౌత్ (మావటి), ఘసీ అనే సహాయకులు వస్తారు. అంత పెద్ద జంతువును అదుపులో ఉంచాలంటే కనీసం ఐదుగురు మనుషులు కావాలి. మేం ఆహారాన్ని కూడా సమీకరించాల్సి ఉంటుంది," అన్నారు శరత్. గ్రామ ప్రజలు వారికి సాయంచేస్తారు.

ఆయన అస్సామ్, తిన్‌సుకియా జిల్లాలోని ఒక చిన్న గ్రామమైన తొరానీలో నివసిస్తారు. ఈ గ్రామానికి సరిహద్దుగా ఎగువ దిహింగ్ రిజర్వ్ అటవీ ప్రాంతం ఉంది. మొరాన్ సముదాయ శిక్షణా నైపుణ్యాలు శతాబ్దాలుగా ప్రశంసలు అందుకుంటూనేవున్నాయి. వాళ్ళు ఒకప్పుడు యుద్ధం చేయటం కోసం ఏనుగులను పట్టుకొని శిక్షణ ఇవ్వటంలో పేరుపొందారు. మూలవాసీ సముదాయానికి చెందిన వీరు, ఎగువ అస్సామ్‌లోని కొన్ని జిల్లాలలోనూ, పక్కనే ఉన్న అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోనూ నివసిస్తున్నారు.

ఈనాడు అడవి ఏనుగులను మచ్చిక చేసుకోవడం చట్టవిరుద్ధం, అయితే అప్పుడే పుట్టిన గున్నలకు మానవ స్పర్శను పరిచయం చేయాల్సిన అవసరం ఇంకా ఉండటంతో శరత్, అతని బృందం వంటి ఫందీ లకు నెల నుండి మూడు నెలల వరకు పట్టే ఈ శిక్షణనిచ్చే పని కోసం రూ. లక్ష వరకూ చెల్లిస్తారు.

PHOTO • Pranshu Protim Bora
PHOTO • Pranshu Protim Bora

ఎడమ: తాత్కాలిక శిబిరమైన పిల్‌ఖానాలో శిక్షణ పొందుతున్న ఏనుగు బీర్బల్. కుడి: బడి అయిపోగానే ఊరిలోని పిల్లలంతా బీర్బల్‌ను కలవటానికి వస్తారు. నిలుచున్నవారు, ఎడమ నుండి కుడికి: ఉజ్జ్వల్ మొరాన్, దొండో దోహూతియా, సుబఖి దోహూతియా, హీరూమొణి మొరాన్, ఫిరుమొణి మొరాన్, లొక్ఖీమొణి మొరాన్, రోషీ మొరాన్

PHOTO • Pranshu Protim Bora

మొరాన్ సముదాయ శిక్షణా నైపుణ్యాలు శతాబ్దాలుగా ప్రశంసలు అందుకుంటున్నాయి. బీర్బల్ సంరక్షణను అనేకమంది చేపట్టారు: (ఎడమ నుంచి కుడికి) దికొమ్ మొరాన్, సుసేన్ మొరాన్, శరత్ మొరాన్, జితేన్ మొరాన్

గ్రామానికి బయట నెలకొల్పిన ఈ శిబిరం ఒక ఆకర్షణా కేంద్రంగా మారింది. ఏనుగును ప్రాణమున్న దైవంగా భావించే ప్రజలు దాని దీవెనల కోసం వస్తారు. ఏనుగుకు శిక్షణనిచ్చే ఫంది ని పూజారిగా భావిస్తారు, ఆయన తన ఇంటితో సహా ఎక్కడికీ ప్రయాణాలు చేయరాదు, ఇతరులు వండే ఆహారాన్ని భుజించకూడదు. ఈ కట్టుబాటును సువా అంటారు. ఏనుగును చూడటానికి వచ్చే పిల్లల చేతికిచ్చి తన కుటుంబానికి డబ్బు పంపుతానని శరత్ చెప్పారు.

పంటల పండుగ అయిన మాఘ్ బిహు జరుపుకునే సమయంలో ఈ డాక్యుమెంటరీ చిత్రీకరణ జరిగింది. బూడిద గుమ్మడికాయతో కలిపి వండిన బాతు వేపుడు కూడా ఈ పండుగ ఉత్సవాల్లో ఒక భాగం. "ఒకే దెబ్బకు రెండు పిట్టలు. అంటే, మేం ఏనుగుకు శిక్షణ ఇస్తూనే మాఘ్ బిహు పండుగను కూడా జరుపుకుంటున్నామన్నట్టు. మేం బాతు వేపుడు చేస్తున్నాం. అందరం కలిసి దానిని తింటాం," చెప్పారు శరత్.

అక్కడంతా పండుగ వేడుకలు జరుగుతున్నప్పటికీ, దీన్ని నేర్చుకునే కాలం సుదీర్ఘంగా ఉండటం వలన చిన్నకుర్రాళ్ళు దీన్ని వృత్తిగా స్వీకరించరేమోననీ, తద్వారా ఈ సంప్రదాయం త్వరలోనే అంతరించిపోతుందేమోననీ ఆయన లోలోపల తీవ్రంగా భయపడుతున్నారు. గ్రామంలోని యువత వచ్చి దీన్ని నేర్చుకునేలా, సంప్రదాయాన్ని సజీవంగా ఉంచేలా ప్రేరేపించడానికి ఆయన ప్రయత్నిస్తుంటారు. “నేను నెమ్మదిగా నా బలాన్ని కోల్పోతున్నాను. దీన్ని తప్పనిసరిగా నేర్చుకోమని నేను మా ఊరి అబ్బాయిలకు చెబుతున్నాను. నేను అసూయపడే వ్యక్తిని కాదు. దీన్ని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని, తద్వారా మన జ్ఞానం ముందువారికి అందాలని నేను కోరుకుంటున్నాను,” అని అతను చెప్పారు.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Himanshu Chutia Saikia

Himanshu Chutia Saikia is an independent documentary filmmaker, music producer, photographer and student activist based in Jorhat, Assam. He is a 2021 PARI Fellow.

Other stories by Himanshu Chutia Saikia
Photographs : Pranshu Protim Bora

Pranshu Protim Bora is a cinematographer and photographer based in Mumbai. From Jorhat, Assam he is keen to explore the folk traditions of the north east of India.

Other stories by Pranshu Protim Bora
Editor : Priti David

Priti David is the Executive Editor of PARI. She writes on forests, Adivasis and livelihoods. Priti also leads the Education section of PARI and works with schools and colleges to bring rural issues into the classroom and curriculum.

Other stories by Priti David
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli