1951-52 మధ్య జరిగిన భారతదేశపు మొట్టమొదటి ఎన్నికల సమయంలో వోటు వేయడానికి వెళ్ళిన రోజు ఉదయం తాను ధరించిన బిరుసైన తెల్లని కుర్తా ఖ్వాజా మొయీనుద్దీన్‌కు ఇంకా గుర్తుంది. అప్పుడు 20 ఏళ్ళ వయసున్న ఆయన తన ఉత్సాహాన్ని అణచుకోలేకపోతున్నాడు. తన చిన్న పట్టణం నుంచి నూతన ప్రజాస్వామ్య ఉత్సవపు స్వేచ్ఛావాయువును పీల్చుకుంటూ, ఎగురుకుంటూ పోలింగ్ స్టేషన్‌కు వెళ్ళాడు.

ఇప్పుడు, 72 ఏళ్ళ తర్వాత, మొయీన్ తన పదవ దశకంలో ఉన్నారు. మే 13, 2024న ఆయన మళ్ళీ బిరుసుగా ఉన్న తెల్లని కుర్తా ధరించి పొద్దున్నే ఇంటి నుంచి బయటకు వచ్చారు. కానీ ఈ సారి ఆయన ఒక చేతి కర్ర సాయంతో పోలింగ్ స్టేషన్‌కు నడిచివెళ్ళారు. పోలింగ్ రోజున ఉండే ఉత్సవ వాతావరణం మాయమైపోయినట్టే, ఆయన అడుగులలోని తుళ్ళింత కూడా మాయమైపోయింది.

" తబ్ దేశ్ బనానే కే లియే వోట్ కియా థా, ఆజ్ దేశ్ బచానే కే లియే వోట్ కర్ రహే హై [అప్పుడు దేశ నిర్మాణం కోసం వోటు వేశాను, ఇప్పుడు దాన్ని రక్షించడానికి వోటు వేస్తున్నా]," మహారాష్ట్ర, బీడ్ నగరంలోని తన ఇంటిలో PARIతో మాట్లాడుతూ అన్నారాయన.

బీడ్ జిల్లా శిరూర్ కాసార్ తెహసీల్‌ లో 1932లో పుట్టిన మొయీన్ తహసీల్ కార్యాలయంలో చౌకీదార్ (కాపలాదారు)గా పనిచేశారు. కానీ 1948లో అప్పటి రాచరిక రాష్ట్రమైన హైదరాబాద్‌ను భారత యూనియన్‌లో విలీనం చేసే సమయంలో జరిగిన హింసాకాండ నుండి తప్పించుకోవడానికి, ఆయన దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీడ్ నగరానికి పారిపోవలసి వచ్చింది.

1947లో రక్తపాతంతో కూడిన దేశవిభజన జరిగిన ఒక సంవత్సరం తర్వాత, మూడు రాచరిక రాష్ట్రాలు - హైదరాబాద్, కశ్మీర్, ట్రావెన్‌కోర్ - భారత యూనియన్‌లో చేరకుండా ప్రతిఘటించాయి. భారతదేశం లేదా పాకిస్తాన్‌లో భాగం కాని స్వతంత్ర రాజ్యాన్ని హైదరాబాద్ నిజామ్ కోరుకున్నాడు. బీడ్ కూడా భాగంగా ఉన్న మరాఠ్వాడాలోని వ్యవసాయ ప్రాంతం హైదరాబాద్ రాచరిక రాష్ట్రంలో కలిసి ఉండేది

సెప్టెంబరు 1948లో భారత సాయుధ దళాలు హైదరాబాద్‌లోకి ప్రవేశించి, నాలుగు రోజులలోపే నిజామ్‌ను లొంగిపోయేలా చేశాయి. ఏది ఏమైనప్పటికీ, దశాబ్దాల తరువాత బయటపెట్టిన ఒక రహస్య ప్రభుత్వ నివేదిక - సుందర్‌లాల్ కమిటీ నివేదిక - ప్రకారం , కనీసం 27,000 నుండి 40,000 మంది ముస్లిములు ఈ దండయాత్ర సమయంలోనూ, ఆ తరువాత ప్రాణాలు కోల్పోయారు; మొయీన్ వంటి యుక్తవయస్కులు ప్రాణాల కోసం పరిగెత్తవలసి వచ్చింది.

"మా ఊరిలో ఉన్న బావి శవాలతో నిండిపోయింది. మేమంతా బీడ్ నగరానికి పారిపోయాం. అప్పటినించీ అదే నా ఇల్లయింది," ఆయన గుర్తుచేసుకున్నారు.

PHOTO • Parth M.N.
PHOTO • Parth M.N.

ఖ్వాజా మొయీనుద్దీన్ 1932లో మహారాష్ట్ర, బీడ్ జిల్లాలోని శిరూర్ కాసార్ తెహసీల్‌లో పుట్టారు. భారతదేశంలో 1951-52లో నిర్వహించిన మొట్టమొదటి ఎన్నికలలో వోటు వేయడాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. 92 ఏళ్ళ మొయీన్ మే 2024లో లోక్‌సభ ఎన్నికలలో వోటు వేశారు

ఆయన బీడ్‌లోనే పెళ్ళి చేసుకున్నారు, ఇక్కడే తన పిల్లలను పెంచారు, అలాగే తన మనవ సంతానం పెరిగి పెద్దవాళ్ళవటాన్ని కూడా చూశారు. ఆయన 30 ఏళ్ళ పాటు దర్జీగా పనిచేశారు, కొద్దిగా స్థానిక రాజకీయాలలో కూడా వేలు పెట్టారు.

కానీ ఏడు దశాబ్దాల క్రితం తన స్వస్థలమైన శిరూర్ కాసార్ నుంచి పారిపోయి వచ్చిన తర్వాత, మొదటిసారిగా మొయీన్ ముస్లిమ్ గుర్తింపు ఆయనను అభద్రతకు గురయ్యేలా చేస్తోంది.

ద్వేషపూరిత ప్రసంగాలను, ద్వేషపూరిత నేరాలను డాక్యుమెంట్ చేసే వాషింగ్టన్ డిసి-ఆధారిత సంస్థ ఇండియా హేట్ ల్యాబ్ అందించిన వివరాల ప్రకారం, భారతదేశంలో 2023లో 668 ద్వేషపూరిత ప్రసంగ సంఘటనలు జరిగాయి. అంటే, రోజుకు దాదాపు రెండు చొప్పున. ఇందులో మహాత్మా ఫూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి ప్రగతిశీల ఆలోచనాపరులకు పేరుగాంచిన మహారాష్ట్ర, 118 ప్రసంగాలతో అగ్రస్థానంలో నిలిచింది.

"దేశ విభజన తర్వాత భారతదేశంలో ముస్లిముల స్థానం గురించి కొంత అనిశ్చితి ఉండేది," ఆయన గుర్తుచేసుకున్నారు. "కానీ నేనెప్పుడూ బెదిరిపోలేదు. ఒక దేశంగా నాకు భారతదేశంపై నమ్మకముంది. అయితే, నా జీవితమంతా ఇక్కడే గడిపిన తర్వాత, ఈ రోజున నేనీ దేశానికి చెందినవాడిని కానా అని ఆశ్చర్యపోతున్నాను..."

అగ్రస్థానంలో ఉన్న ఒక నాయకుడు ఇంత విభేదాన్ని తేగలగడం నమ్మశక్యం కాకుండా ఉందని ఆయన భావిస్తున్నారు.

"పండిత్ జవాహర్‌లాల్ నెహ్రూ అందరినీ అవ్యాజంగా ప్రేమించాడు, అంతే సమానంగా ఆయన్ని కూడా అందరూ ప్రేమించారు," అన్నారు మొయీన్. "హిందువులు, ముస్లిములు సామరస్యంతో జీవించగలరని ఆయన మనకు నమ్మకం కలిగించాడు. ఆయన సున్నిత స్వభావుడు, నిజమైన లౌకికవాది. ఒక ప్రధానమంత్రిగా ఆయన భారతదేశం ఒక విశిష్టమైన దేశంగా మారగలదనే ఆశను మనకు కలిగించాడు."

ఇందుకు విరుద్ధంగా, ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోదీ ముస్లిములను "చొరబాటుదారులు" అని పేర్కొన్నప్పుడు, వోటర్లను మతపరమైన మార్గాల్లో విభజించడం ద్వారా ఎన్నికలను గెలవాలని చూస్తున్నప్పుడు, ఇది కడుపులో గుద్దినట్టుగా ఉంటుందని మొయీన్ చెప్పారు.

అధికార భారతీయ జనతా పార్టీ ప్రసిద్ధ ప్రచారకర్త అయిన మోదీ ఏప్రిల్ 22, 2024న, రాజస్థాన్‌లో ఒక ర్యాలీలో ప్రసంగిస్తూ, కాంగ్రెస్ పార్టీ ప్రజల సంపదను “చొరబాటుదారులకు" పంచాలని యోచిస్తోందని చెప్పుకొచ్చాడు

"ఇది చాలా నిరాశను కలిగిస్తుంది. సిద్ధాంతాలు, సమగ్రత అత్యంత విలువైన ధనంగా ఉన్న సమయం నాకు గుర్తుంది. ఇప్పుడు ఎలాగైనా అధికారమే ప్రధానంగా ఉంది," అన్నారు మొయీన్.

PHOTO • Parth M.N.
PHOTO • Parth M.N.

'దేశ విభజన తర్వాత భారతదేశంలో ముస్లిముల స్థానం గురించి కొంత అనిశ్చితి ఉండేది. కానీ నేనెప్పుడూ బెదిరిపోలేదు. ఒక దేశంగా నాకు భారతదేశంపై నమ్మకముంది. అయితే, నా జీవితమంతా ఇక్కడే గడిపిన తర్వాత, ఈ రోజున నేనీ దేశానికి చెందినవాడిని కానా అని ఆశ్చర్యపోతున్నాను...' అన్నారు మొయీన్

మొయీన్ ఒంటిగది ఇంటికి సుమారు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో సయ్యద్ ఫక్రు ఉజ్ జమా నివసిస్తున్నారు. ఆయన మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలలో వోటు వేయకపోయినా, మొదటి ప్రధానమంత్రి నెహ్రూను తిరిగి ఎన్నుకోవటానికి 1962లో వోటేశారు. "కాంగ్రెస్‌కి రోజులు బాలేదని తెలుసు గానీ, నెహ్రూ సిద్ధాంతాలను నేను వదులుకోలేను," అంటారాయన. "1970లలో ఇందిరాగాంధీ బీడ్ రావటం నాకు గుర్తుంది. నేనామెను చూడటానికి వెళ్ళాను."

కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర పేరుతో రాహుల్ గాంధీ చేసిన పాదయాత్ర ఆయనను బాగా ఆకట్టుకుంది. మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే పట్ల ఆయనకు ఎంతో అవ్యక్తమైన కృతజ్ఞతా భావం ఉంది.

"శివసేన మంచికి మారిపోయింది," అని ఆయన చెప్పారు. "కోవిడ్-19 సమయంలో ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే వ్యవహరించిన తీరు చాలా చక్కగా ఉంది. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా మహారాష్ట్రలో ముస్లిములను లక్ష్యంగా చేసుకోకుండా చూసేందుకు అతను చాలా దూరం వెళ్ళాడు.”

ప్రస్తుతం 85 ఏళ్ళ వయసున్న జమా మాట్లాడుతూ, భారతదేశంలో మతపరమైన విభజన ఎప్పుడూ అంతర్వాహినిగా ఉంటూనే ఉందని, అయితే "దానిని వ్యతిరేకించే ప్రజలు ఎక్కువగా కాకపోయినా, సమానంగానే గొంతు విప్పారు." అన్నారు.

డిసెంబర్ 1992లో, విశ్వహిందూ పరిషత్ నేతృత్వంలోని హిందూ అతివాద సంస్థలు, ఇది పౌరాణిక మూర్తి రాముడి జన్మస్థలమని పేర్కొంటూ, ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరంలో ఉన్న బాబ్రీ మసీదును కూల్చివేశారు. ఈ ఘటన తర్వాత బాంబు పేలుళ్ళు, అల్లర్లతో దద్దరిల్లిన మహారాష్ట్ర రాజధాని ముంబైతో సహా దేశవ్యాప్తంగా మత ఘర్షణలు చెలరేగాయి.

1992-93 అల్లర్ల సమయంలో బీడ్ నగరంలో తలెత్తిన ఉద్రిక్తతలను గురించి జమా గుర్తు చేసుకున్నారు.

“మా సోదరభావం చెక్కుచెదరకుండా ఉండేందుకు నా కొడుకు నగరంలో ఒక శాంతి ర్యాలీని నిర్వహించాడు. పెద్ద సంఖ్యలో హిందువులు, ముస్లిములు ఈ ర్యాలీలో చేరారు. ఆ సంఘీభావం ఇప్పుడు కనిపించడం లేదు,” అన్నారాయన

PHOTO • Parth M.N.

సయ్యద్ ఫక్రు ఉజ్ జమా, మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రుని తిరిగి ఎన్నుకునేందుకు 1962లో వోటు వేశారు. భారతదేశంలో మతపరమైన విభజన ఎప్పుడూ అంతర్వాహినిగా ఉంటూనే ఉందని, అయితే 'దానిని వ్యతిరేకించే ప్రజలు ఎక్కువగా కాకపోయినా, సమానంగానే గొంతు విప్పారు,' అని ప్రస్తుతం 85 ఏళ్ళ వయసున్న ఆయన చెప్పారు

ప్రస్తుతం తాను నివాసముంటోన్న ఇంటిలోనే జమా పుట్టారు. బీడ్‌లో మంచి పలుకుబడి ఉన్న ముస్లిమ్ కుటుంబాలలో ఆయన కుటుంబం కూడా ఒకటి. ఎన్నికలకు ముందు ఆశీర్వాదం కోసం రాజకీయ నాయకులు ఈ ఇంటికి తరచుగా వస్తుంటారు. ఉపాధ్యాయులైన ఆయన తండ్రి, తాతగారు కూడా "పోలీస్ చర్య" సందర్భంగా జైలుకు వెళ్ళారు. ఆయన తండ్రిగారు మరణించినపుడు స్థానిక నాయకులతో సహా వివిధ మతాలకు చెందిన వేలాదిమంది ప్రజలు ఆయన అంత్యక్రియలకు హాజరయ్యారని జమా చెప్పారు.

"నాకు గోపీనాథ్ ముండేతో అద్భుతమైన సంబంధం ఉంది," అని బీడ్‌కు చెందిన అత్యంత ఎత్తైన నాయకులలో ఒకరిని సూచిస్తూ చెప్పారు జమా. ఆయన బిజెపికి చెందినప్పటికీ 2009లో నా కుటుంబం మొత్తం ఆయనకు ఓటు వేసింది. అతను హిందువులకు, ముస్లిములకు మధ్య భేదం చూపరని మాకు తెలుసు.”

బీడ్ నుండి బిజెపి టిక్కెట్‌పై పోటీ చేస్తున్న ముండే కుమార్తె పంకజ పట్ల కూడా తన సమీకరణం అనుకూలమైనదేనని, అయినప్పటికీ ఆమె మోదీ మతతత్వ స్థాయికి నిలబడలేకపోయిందని అతను నమ్ముతున్నారు. "అతను బీడ్‌లో జరిగిన ర్యాలీలో కూడా ఒక కొంపముంచే వ్యాఖ్య చేసాడు," అని జమా చెప్పారు. “అతని పర్యటన తర్వాత పంకజ కొన్ని వేల ఓట్లను కోల్పోయారు. అబద్ధాలు చెప్తూ ఎవరూ ఎంతో దూరం వెళ్ళలేరు.

తన తండ్రి గురించి తాను పుట్టకముందరి ఒక కథను జమా గుర్తుచేసుకున్నారు. అతని ఇంటికి కొద్ది దూరంలో 1930లలో ఒక ఆలయం పరిశీలనకు గురైంది. కొంతమంది స్థానిక ముస్లిమ్ నాయకులు అది వాస్తవానికి ఒక మసీదు అని నమ్మేవారు, ఆ ఆలయాన్ని మార్చమని హైదరాబాద్ నిజామ్‌కు విజ్ఞప్తి చేశారు. జమా తండ్రి సయ్యద్ మెహబూబ్ అలీ షా సత్యవాదిగా పేరు తెచ్చుకున్నారు.

"అది మసీదా లేదా దేవాలయమా అని నిర్ణయించాల్సిన బాధ్యత ఆయనపై పడింది," అని జమా చెప్పారు. “అది మసీదు అనటానికి రుజువును తానెప్పుడూ చూడలేదని నా తండ్రి సాక్ష్యమిచ్చారు. విషయం సద్దుమణిగింది, ఆలయాన్ని రక్షించారు. ఇది కొందరిని నిరాశపరిచినప్పటికీ, మా నాన్న అబద్ధం చెప్పలేదు. 'సత్యం మిమ్మల్ని ఎల్లప్పుడూ స్వతంత్రులను చేస్తుంది' అనే మహాత్మా గాంధీ బోధనలను మేం విశ్వసిస్తాం.”

మొయీన్‌తో జరిగే సంభాషణలో కూడా గాంధీ ప్రస్తావన క్రమం తప్పకుండా వస్తుంది. "అతను మన మధ్య ఐక్యత, మత సామరస్యాల ఆలోచనను కలిగించాడు," అని అతను చెప్పారు. ఇంకా ఒక పాత హిందీ సినిమా పాటను కూడా చదివారు: తు నా హిందూ బనేగా, నా ముసల్మాన్ బనేగా. ఇన్సాన్ కీ ఔలాద్ హై, ఇన్సాన్ బనేగా

1990లో బీడ్‌లో కౌన్సెలర్‌ అయినప్పుడు అదే తన నినాదం అని మొయీన్ చెప్పారు. "నేను రాజకీయాల వైపు ఆకర్షితుడనయ్యాక 30 ఏళ్ళ నా దర్జీ ఉద్యోగాన్ని 1985లో వదులుకున్నాను," అని అతను నవ్వారు. “కానీ నేను ఎక్కువ కాలం రాజకీయ నాయకుడిగా కొనసాగలేదు. స్థానిక ఎన్నికల్లో కూడా అవినీతిని, డబ్బును వినియోగించడాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను. నేను ఇప్పటికి 25 సంవత్సరాలకు పైగా విశ్రాంత వ్యక్తిగా ఉన్నాను.”

PHOTO • Parth M.N.

1992-93 అల్లర్ల సమయంలో బీడ్ నగరంలో తలెత్తిన ఉద్రిక్తతలను గురించి జమా గుర్తు చేసుకున్నారు. ‘మా సోదరభావం చెక్కుచెదరకుండా ఉండేందుకు నా కొడుకు నగరంలో ఒక శాంతి ర్యాలీని నిర్వహించాడు. పెద్ద సంఖ్యలో హిందువులు, ముస్లిములు ఈ ర్యాలీలో చేరారు. ఆ సంఘీభావం ఇప్పుడు కనిపించడం లేదు’

మారుతున్న కాలం, విపరీతమైన అవినీతి మూలంగానే జామా తన పని నుంచి విరమించాలనే నిర్ణయం తీసుకున్నారు. అతను సాధారణ కాలంలో స్థానిక కాంట్రాక్టర్‌గా పనిచేశారు. "1990ల తర్వాత, అది మారిపోయింది," అని అతను గుర్తుచేసుకున్నారు. "పనిలో నాణ్యత వెనక్కుపోయి, మొత్తం లంచాలమయమైపోయింది. నేనిక ఇంట్లో ఉండటం మంచిదని నాకనిపించింది.

పని నుంచి విరమించుకోవటంతో, జమా, మొయీన్‌లిద్దరూ మరింత భక్తులుగా మారారు. జమా తెల్లవారుజామున 4:30 గంటలకు మేల్కొని ఉదయం ప్రార్థనలు చేస్తారు. మొయీన్ శాంతి కోసం వీధికి ఒక పక్కగా ఉన్న తన ఇంటికి, మసీదుకు తిరుగుతూ ఉంటారు. ఆయన మసీదు బీడ్‌లో ఒక ఇరుకైన సందులో ఉండడం ఆయన అదృష్టం.

గత రెండు సంవత్సరాలుగా, హిందూ మితవాద సమూహాలు మసీదుల ముందు రెచ్చగొట్టే, ద్వేషపూరితమైన, మంటలురేపే పాటలను వినిపిస్తూ రామ నవమి పండుగను జరుపుకుంటున్నాయి. బీడ్ కథ కూడా అందుకు భిన్నంగా లేదు. అదృష్టవశాత్తూ, మొయీన్ మసీదు ఉన్న వీధి దూకుడుగా ఊరేగింపులు చేయడానికి వీల్లేనంత చిన్నదిగా ఉంటుంది

ఆ విషయంలో జమా తక్కువ అదృష్టవంతులు. ముస్లిములపై హింసకు పిలుపునిచ్చే పాటలను, వారిని అమానుషంగా చిత్రించే పాటలను ఆయన వినవలసి వస్తోంది. ఆ పాటల్లోని ప్రతి మాటా ఆయనను మనిషిగా తనని తాను తక్కువగా భావించేలా చేస్తుంది.

"రామ నవమి, గణేశ్ పండుగల సమయంలో నా మనవలు, వారి ముస్లిమ్ స్నేహితులు హిందూ యాత్రికులకు నీరు, పండ్ల రసాలు, అరటిపండ్లు అందించేవారని నాకు గుర్తుంది," అని జమా చెప్పారు. “కేవలం మమ్మల్ని బాధపెట్టటం కోసమే రెచ్చగొట్టే పాటలను పెద్ద శబ్దాలతో వినిపించటం మొదలుపెట్టిన తర్వాత అంత అందమైన సంప్రదాయం ముగిసిపోయింది.

PHOTO • Parth M.N.

ప్రస్తుతం తాను నివాసముంటోన్న ఇంటిలోనే జమా పుట్టారు. బీడ్‌లో మంచి పలుకుబడి ఉన్న ముస్లిమ్ కుటుంబాలలో ఆయన కుటుంబం కూడా ఒకటి. ఎన్నికలకు ముందు ఆశీర్వాదం కోసం రాజకీయ నాయకులు ఈ ఇంటికి తరచుగా వస్తుంటారు. ఉపాధ్యాయులైన ఆయన తండ్రి, తాతగారు కూడా ‘పోలీస్ చర్య’ సందర్భంగా జైలుకు వెళ్ళారు. ఆయన తండ్రిగారు మరణించినపుడు స్థానిక నాయకులతో సహా వివిధ మతాలకు చెందిన వేలాదిమంది ప్రజలు ఆయన అంత్యక్రియలకు హాజరయ్యారని జమా చెప్పారు

ఆయనకు రాముడి పట్ల చాలా గౌరవం ఉంది, కానీ “ఇతరులను ద్వేషించమని రాముడు ఎవరికీ నేర్పలేదు. యువకులు తమ దేవుడి పరువుని తామే తీస్తున్నారు. అతను ప్రతినిధిగా ఉన్నది దీనికి కాదు," అంటారాయన.

మసీదుల ముందుకు వచ్చే హిందువుల మూకలో యువకులు ఆధికంగా ఉండటం జమాను ఎక్కువగా ఆందోళనకు గురిచేస్తోంది. "ఈద్ రోజున మా నాన్న తన హిందూ స్నేహితులు వచ్చే వరకు తినేవారు కాదు," చెప్పారతను. “నేనూ అలాగే చేశాను. ఆ పరిస్థితులు వేగంగా మారిపోతున్నట్టు కనిపిస్తోంది."

మనం మత సామరస్యపు రోజులకు తిరిగి రావాలంటే, ఐక్యతా సందేశాన్ని పునరుజ్జీవింపజేయడానికి గాంధీ వంటి దృఢ నిశ్చయం, నిజాయితీ కలిగిన వ్యక్తి కావాలి అని మొయీన్ చెప్పారు.

గాంధీ ప్రయాణం అతనికి మజ్రూహ్ సుల్తాన్‌పురి రాసిన ద్విపదను గుర్తు చేసింది: " మైఁ అకేలా హీ చలా థా జానిబ్-ఎ-మంజిల్ మగర్, లోగ్ సాథ్ ఆతే గయే ఔర్ కారవాన్ బన్‌తా గయా [నేను ఒంటరిగా నా లక్ష్యం వైపు నడిచాను; ప్రజలు చేరుతూ వచ్చారు, బిడారు పెరిగింది]."

"లేకుంటే రాజ్యాంగం మారిపోతుంది, తర్వాతి తరం నష్టపోవాల్సి వస్తుంది," అని ఆయన అన్నారు.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Parth M.N.

Parth M.N. is a 2017 PARI Fellow and an independent journalist reporting for various news websites. He loves cricket and travelling.

Other stories by Parth M.N.
Editor : Priti David

Priti David is the Executive Editor of PARI. She writes on forests, Adivasis and livelihoods. Priti also leads the Education section of PARI and works with schools and colleges to bring rural issues into the classroom and curriculum.

Other stories by Priti David
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli