నారాయణ్ కుండలిక్ హజారే బడ్జెట్ అనే పదాన్ని అర్థం చేసుకున్నారు, ఎందుకంటే ఆయన వద్ద పెద్ద బడ్జెట్ లేదు.
“ఆప్లా తేవ్ఢా బజెటచ్ నాహీ [నా దగ్గర అంత బడ్జెట్ లేదు]!” నారాయణ్ కాకా కేవలం నాలుగు మాటల్లో, రూ. 12 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను ఉండదని ఊదరకొడుతోన్న కొత్త పన్ను విధానం గాలి తీసేశారు .
కేంద్ర బడ్జెట్ గురించిన ప్రశ్న, పళ్ళను విక్రయించే ఈ 65 ఏళ్ళ వృద్ధరైతును తీవ్రంగా ఆలోచించేలా చేసింది. ఆయన చాలా నమ్మకంగా ఇలా సమాధానం ఇచ్చారు. “దీని గురించి నేను ఏమీ వినలేదు. ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడూ వినలేదు.”
నారాయణ్ కాకా కు, దాని గురించి తెలుసుకునే దారే లేదు. “నా దగ్గర మొబైల్ ఫోన్ లేదు. ఇంట్లో టీవీ కూడా లేదు." కొద్ది రోజుల క్రితమే ఒక స్నేహితుడు ఆయనకు ఒక రేడియోను బహుమతిగా ఇచ్చారు. అయితే ఈ వార్షిక ఈవెంట్ గురించి ఆ ప్రజా ప్రసారాల సేవ ఆయనకు ఇంకా తెలియజేయలేదు. “ ఆమ్చా అడాణీ మాణసాచా కాయ్ సంబంధ్, తుమ్‌హీచ్ సాంగా [మాలాంటి అక్షరజ్ఞానం లేనివాళ్ళకు దీనితో ఏమైనా సంబంధం ఉందా]?” అని ఆయన అడుగుతారు. ‘కిసాన్ క్రెడిట్ కార్డ్’ లేదా ‘పెరిగిన రుణ పరిమితి’లాంటి పదాలు నారాయణ్ హజారే ప్రపంచానికి చెందినవి కావు.
![](/media/images/2-1738822924148-MK-I_just_dont_have_that_k.max-1400x1120.jpg)
మహారాష్ట్రలోని తుళజాపూర్‌కు చెందిన రైతు, పండ్ల వ్యాపారి నారాయణ్ హజారే బడ్జెట్ గురించి ఎప్పుడూ వినలేదు.' ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడూ,' అని ఈ 65 ఏళ్ళ వృద్ధుడు చెప్పారు
నారాయణ్ కాకా తన చెక్కతో చేసిన తోపుడు బండి మీద ఆయా కాలాల్లో లభ్యమయ్యే రకరకాల పండ్లను విక్రయిస్తుంటారు. “ఇది జామపండ్ల చివరి దశ. వచ్చే వారం నుండి ద్రాక్ష పండ్లు, ఆ తర్వాత మామిడి పండ్లు వస్తాయి." ధారాశివ్ (గతంలో ఉస్మానాబాద్) జిల్లా, తుళజాపూర్ పట్టణంలోని ధాకటా తుళజాపూర్ (అక్షరాలా 'చిన్న తోబుట్టువు' అని అర్థం) నివాసి అయిన కాకా మూడు దశాబ్దాలకు పైగా పండ్లను విక్రయిస్తున్నారు. బాగా జరిగిన రోజున 8-10 గంటలు రోడ్ల మీద తిరుగుతూ, మొత్తం 25-30 కిలోల పండ్లను అమ్మితే, ఆ రోజుకి ఆయన రూ.300-400 సంపాదిస్తారు.
అయితే, నారాయణ్ హజారేకు బడ్జెట్లను మించిన కొన్ని విషయాలు తెలుసు. “డబ్బు గురించి ఎప్పుడూ చింతించకు. నీకు కావలసిన పండ్లు కొనుక్కో. ఆ తర్వాత ఎప్పుడైనా నాకు డబ్బులివ్వొచ్చు," అని నాకు హామీ ఇచ్చి, తన పని మీద తాను వెళ్ళిపోయారు.
అనువాదం: రవి కృష్ణ