"ఈ వృత్తి మాయమైపోతే, ఇంకో రాష్ట్రానికి వలసపోవటం తప్ప నాకు మరో మార్గం లేదు," ఒక బుట్ట మొదలు చుట్టూ సన్నని వెదురు బద్దెలను తిప్పుతూ అన్నది, దరాంగ్ జిల్లాలోని నా-మట్టీ గ్రామానికి చెందిన వెదురు బుట్టలు అల్లే మాజెదా బేగమ్.
దినసరి కూలీ, ఒంటరి తల్లి అయిన ఈ పాతికేళ్ళ హస్తకళాకారిణి పదేళ్ళ వయసున్న తన కొడుకునూ, అనారోగ్యంతో ఉండే తల్లినీ పోషించుకుంటున్నారు. "నేను ఒక్కరోజులో 40 ఖసాలు (బుట్టలు) అల్లగలను, కానీ ప్రస్తుతం 20 మాత్రమే అల్లుతున్నాను," స్థానిక మియా మాండలికంలో మాట్లాడుతూ అన్నదామె. మాజెదా అల్లే ప్రతి 20 బుట్టలకు ఆమెకు రూ. 160 వస్తాయి. ఇది రాష్ట్ర షెడ్యూల్డ్ ఉద్యోగానికి కనీస వేతనమైన రూ. 241.92 కంటే చాలా తక్కువ (2016 సంవత్సరానికి కనీస వేతనాల చట్టం, 1948పై నివేదిక)
వెదురు ధరలు పెరిగిపోవటంతో పాటు స్థానిక కూరగాయల మండీలలో వెదురు బుట్టలకు గిరాకీ తగ్గిపోవటం, వెదురు బుట్టలను అమ్మితే వచ్చే ప్రతిఫలంపై ప్రభావం చూపుతున్నాయి. అస్సామ్ అంతటిలోకీ అతి పెద్ద మండీలలో రెండు మండీలు దరాంగ్‌లోనే ఉన్నాయి: మొత్తం ఈశాన్య రాష్ట్రాలతో పాటు దూరాన ఉన్న దిల్లీకి కూడా వ్యవసాయ ఉత్పత్తులను సరఫరా చేసే బేసిమరి, బాలుగాఁవ్ మండీలు.
బలవంతంగా వలస వెళ్ళాల్సిరావడం గురించి మాజెదా భయాలు నిజమైనవే: దాదాపు 80 నుండి 100 కుటుంబాలు "మెరుగైన పని" కోసం ఇప్పటికే వెళ్ళిపోయాయని 39 ఏళ్ళ హనీఫ్ అలీ స్థానిక మదర్సా సమీపంలో ఉన్న వార్డ్ A చుట్టూ ప్రాంతాన్ని మాకు చూపిస్తూ చెప్పారు. ఒకప్పుడు దాదాపు 150 కుటుంబాలు వెదురు పనిలో నిమగ్నమై ఉండేవి. కానీ ఇప్పుడు, ఆ హస్తకళాకారులంతా కాఫీ తోటలలో పనిచేయడానికి కేరళ, కర్ణాటక వంటి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళడంతో చాలా ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి.














