ముంబైలోని ప్రతి మూలా మెట్రోకు, ఎక్స్‌ప్రెస్‌వేలకు అనుసంధానించి ఉండగా, దాము నగర్ నివాసితులు చాలా తక్కువ దూరం ప్రయాణించడానికే ఇబ్బంది పడుతున్నారు. అంటే: వారు ఇప్పటికీ బహిరంగ మలవిసర్జన చేసే ప్రాంతం గుండా వెళ్ళాల్సి రావడం. వారు ఒక అడుగు ఎత్తున్న గోడ మీదుగా అడుగు పెట్టి, ఆపైన మల పదార్థపు గాఢమైన వాసనతో నిండివున్న చెత్త కుప్పల మీదుగా నడవాలి. ఇది ఎండిన గడ్డితో ఉన్న ఒక బహిరంగ మైదానం. ఇక్కడ ఉన్న కొన్ని చెట్లు కొంత చాటును, కొద్దిగా నీడను అందిస్తుంటాయా?

ఎంతమాత్రం కాదు. “ఇక్కడ చాటు అంటూ ఏమీ లేదు," దాము నగర్‌లో చాలాకాలంగా నివసిస్తోన్న 51 ఏళ్ళ మీరా యేడే అన్నారు. "ఆడవాళ్ళం మేం ఏదైనా అడుగుల చప్పుడు వినబడితే వెంటనే లేచి నిలబడాలి." గత కొన్నేళ్ళుగా ఈ భూమి పేరుకు మాత్రం మహిళలకు, పురుషులకు వేరువేరుగా ఉపయోగించేందుకు వరుసగా ఎడమ, కుడి భాగాలుగా విభజించబడింది. కానీ, "వీటి మధ్య దూరం చాలా తక్కువ. కొన్ని మీటర్ల దూరం ఉండవచ్చు. అయినా దానిని కొలిచిందెవరు?" రెండు విభాగాల మధ్య ఏదైనా అవరోధం గానీ, గోడ గానీ లేదు.

అనేకమంది గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన మొదటి లేదా రెండవ తరం వలసదారులైన దాము నగర్ నివాసులకు ఇది ముంబై ఉత్తరం నియోజకవర్గంలోని ఈ భాగంలో జరిగే ఎన్నికలకు మించిన సమస్య. భారతదేశం తన 18వ లోక్‌సభకు 543 మంది పార్లమెంటు సభ్యులను ఎన్నుకోవడానికి దశలవారీ వోటింగ్‌ను జరుపుతున్నప్పటికీ ఇది వారిని ఇబ్బంది పెట్టే సమస్యే. "ఈ రోజు దేశంలో జరుగుతోన్న ప్రతిదీ మంచిదేననే ఒక కథనం పుట్టింది," అంటారు, మీరా కుమారుడు ప్రకాశ్ యేడే. ప్రకాశ్ తన ఇంటి గుమ్మం వద్ద మాతో మాట్లాడుతున్నారు. ఆ ఇంటి రేకుల పైకప్పు బహుశా లోపల వేడిని కొన్ని డిగ్రీల మేర పెంచుతుంది.

“దేశంలోని ఈ ప్రాంతాల్లోని నిజమైన సమస్యల గురించి ఎవరూ మాట్లాడరు," అని 30 ఏళ్ళ ప్రకాశ్ అంటున్నారు. దాము నగర్‌లోని 11,000 మందికి పైగా నివాసితులు మరుగుదొడ్లు, నీరు, విద్యుత్ అందుబాటులో లేకపోవడం వల్ల తలెత్తే అసౌకర్యాన్నీ, ప్రమాదాలనూ ఎలా ఎదుర్కొంటున్నారో అతను దృష్టికి తెచ్చారు. జనాభా గణనలో భీమ్ నగర్ అని కూడా పిలిచే దాము నగర్ మురికివాడలో బలహీనమైన గోడలు, టార్పాలిన్లు, రేకుల పైకప్పులను కలిగివున్న 2,300కు పైగా ఇళ్ళున్నాయి. ఇవి సంజయ్ గాంధీ నేషనల్ పార్క్‌లోని ఒక కొండపై ఉన్నాయి. ఈ ఇళ్ళను చేరాలంటే, ప్రవహించే మురుగుకాలువ నీటిలోకి అడుగు పెట్టకుండా ఇరుకైన, ఎగుడుదిగుడు రాతి దారుల గుండా కొండపైకి ఎక్కాలి.

PHOTO • Jyoti
PHOTO • Jyoti

ఎడమ: దాము నగర్‌లోని తన ఇంటి ముందు ప్రకాశ్ యేడే. ఆయన తన తల్లిదండ్రులైన మీరా, జ్ఞానదేవ్‌లతో కలిసి ఇక్కడే ఉంటారు. కుడి: భీమ్ నగర్ అని కూడా పిలిచే దాము నగర్ మురికివాడలోకి ప్రవేశద్వారం

PHOTO • Jyoti
PHOTO • Jyoti

ఎడమ: దాము నగర్ వాసులు తమ ఇళ్ళలో మరుగుదొడ్లు లేకపోవడంతో మలవిసర్జన చేసే బహిరంగ మైదానానికి చేరుకోవడానికి ఒక అడుగు ఎత్తున్న గోడ ఎక్కి కిందకు దిగి, చెత్త కుప్పలను దాటుకొని నడవాలి. కుడి: ఈ నివాసాలు 'చట్టవిరుద్ధం' అని పేర్కొంటూ ఈ మురికివాడలకు నీరు, విద్యుత్, మరుగుదొడ్లు వంటి ప్రాథమిక మున్సిపల్ సేవలను పౌర సంస్థలు అందించలేదు

అయితే గత ఎన్నికల్లో జరిగినట్టుగానే ఇక్కడి ప్రజల వోట్లు కేవలం కనీస సౌకర్యాలు లేకపోవడం గురించి అయితే కాదు.

“ఇదంతా వార్తలకు సంబంధించినది. వార్తల్లో నిజం ఉండాలి. అయితే, మీడియా మాలాంటి వారి గురించి నిజం చెప్పడం లేదు,” అన్నారు ప్రకాశ్ యేడే. ఆయన తప్పుడు సమాచారం, కుహనా వార్తలు, పక్షపాతంతో రాసే వార్తల గురించి గుర్రుగా ఉన్నారు. “ప్రజలు తాము విన్న, చూసిన వాటి ఆధారంగా వోటు వేస్తారు. వారు వింటున్నది, చూసేది ఏమిటంటే - ప్రధాని మోడీని ప్రశంసించడమే.”

ప్రకాశ్ తన సమాచారాన్ని చాలావరకు ప్రకటనలు లేని, స్వతంత్ర జర్నలిజం రంగాల నుండి పొందుతారు. “ఇక్కడ నా వయసువాళ్ళు చాలామందికి ఉద్యోగాలు లేవు. వాళ్ళు ఇళ్ళల్లో పనులు, మానవ శ్రమకు సంబంధించిన ఉద్యోగాలు చేస్తున్నారు. 12వ తరగతి ఉత్తీర్ణులైనవారిలో చాలా కొద్దిమంది మాత్రమే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నారు,” అని దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోన్న యువతలో నిరుద్యోగం గురించి ఆయన చెప్పారు.

12వ తరగతి పూర్తిచేసిన ప్రకాశ్, నెలకు రూ. 15000 జీతం మీద మాలాడ్‌లోని ఒక ప్రైవేట్ సంస్థలో ఫోటో ఎడిటర్‌గా పనిచేసేవారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాకతో అతని పాత్ర అనవసరమైపోయి ఉద్యోగాన్ని కోల్పోయారు. "దాదాపు 50 మంది ఉద్యోగులను తీసేశారు. నాకు కూడా ఉద్యోగం పోయి నెలరోజులవుతోంది," అన్నారాయన.

దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులందరిలో చదువుకున్న యువత వాటా 2000లో ఉన్న 54.2 శాతం నుండి 2022 నాటికి 65.7 శాతానికి పెరిగిందని ఇండియా ఎంప్లాయ్‌మెంట్ రిపోర్ట్ 2024 చెబుతోంది. ఆ నివేదికను మార్చి 26న ఢిల్లీలోని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ILO), ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ (IHD) విడుదల చేశాయి.

PHOTO • Jyoti
PHOTO • Jyoti

ఎడమ: 'వార్తలు నిజాయతీగా ఉండాలి, మీడియా మాలాంటి వ్యక్తుల గురించి నిజం చెప్పడం లేదు,' అంటారు ప్రకాశ్. కుడి: 2015లో జరిగిన వరుస సిలిండర్ల పేలుడులో దాము నగర్‌లో మంటలు చెలరేగడంతో భర్తను కోల్పోయిన చంద్రకళ ఖరత్. ఆమె ఇప్పుడు రోడ్ల మీదా, చెత్త కుప్పల నుండి ప్లాస్టిక్ వస్తువులను ఏరుకొని వాటిని కొనే వ్యాపారులకు అమ్ముతుంటారు

ప్రకాశ్ ఆదాయం అతని కుటుంబ పురోగతిలో ఒక మైలురాయి. దాన్ని అతను గత రెండేళ్ళలో మాత్రమే సాధించారు. అతనిది ఒక విషాదం తరువాత సాధించిన విజయం కథ. 2015లో జరిగిన వరుస వంటగ్యాస్ సిలిండర్ల పేలుడు ప్రమాదం కారణంగా దాము నగర్ అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో దెబ్బతిన్నవారిలో యేడే కుటుంబం కూడా ఉంది. “మేం కట్టుబట్టలతో పారిపోయాం. డాక్యుమెంట్లు, ఆభరణాలు, ఫర్నీచర్, పాత్రలు, ఎలక్ట్రానిక్స్ అన్నీ బూడిదగా మారిపోయాయి," అని మీరా గుర్తు చేసుకున్నారు.

"వినోద్ తావడే [అప్పటి మహారాష్ట్ర విద్యామంత్రి, బోరివిలీ నియోజకవర్గ శాసనసభ్యుడు] ఒక్క నెలలో మాకు పక్కా ఇల్లు వస్తుందని వాగ్దానం చేశాడు," ఆ ఘోరమైన అగ్నిప్రమాదం తర్వాత తమకు ఇచ్చిన హామీని గుర్తుచేసుకున్నారు ప్రకాశ్.

ఆ వాగ్దానం చేసి ఇప్పటికి ఎనిమిదేళ్ళు అవుతోంది. ఆ తర్వాత వాళ్ళు 2019లో సార్వత్రిక ఎన్నికలలోనూ, అదే ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికలలోనూ వోటు వేశారు. అయినా జీవితంలో మారిందేమీ లేదు. జాల్నా జిల్లాకు చెందిన భూమి లేని వ్యవసాయ కూలీలైన ప్రకాశ్ నాయనమ్మా తాతయ్యలు 1970లలో ముంబైకి వలసవచ్చారు.

ప్రకాశ్ తండ్రి 58 ఏళ్ళ జ్ఞానదేవ్ ఇప్పటికీ పెయింటర్‌గా పనిచేస్తుండగా అతని తల్లి మీరా కాంట్రాక్టు పద్ధతిపై సఫాయి కర్మచారి (పారిశుద్ధ్య కార్మికురాలు)గా పనిచేస్తున్నారు. ఆమె ఇళ్ళ నుండి చెత్తను తీసుకువెళ్తారు. "ప్రకాశ్ జీతంతో కలిపి, మేం ముగ్గురం కలిసి నెలకు రూ. 30000 వరకూ సంపాదించేవాళ్ళం. సిలిండర్లు, నూనె, ధాన్యాలు, ఆహార పదార్థాల ధరలతో [అప్పటికి ధరలు ఇప్పుడున్నంత ఎక్కువగా లేవు] మేం బాగానే జీవించడం ప్రారంభించాం,” అని మీరా చెప్పారు.

PHOTO • Jyoti
PHOTO • Jyoti

ఎడమ: 2015లో జరిగిన అగ్ని ప్రమాదంలో యేడే కుటుంబం కూడా తమ సర్వస్వాన్నీ పోగొట్టుకుంది. అప్పటి బోరివిలీ శాసనసభ్యుడు ఇక్కడి నివాసితులకు పక్కా ఇళ్ళు కట్టిస్తామని వాగ్దానం చేశాడు. ఎనిమిదేళ్ళయినా ఆ వాగ్దానం నెరవేరలేదు. కుడి: ప్రకాశ్ మాలాడ్‌లోని ఒక ప్రైవేట్ సంస్థలో ఫోటో ఎడిటర్‌గా పనిచేసేవారు. కానీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వలన అతని ఉద్యోగం పోయింది. నెలరోజులుగా అతను నిరుద్యోగిగా ఉన్నారు

PHOTO • Jyoti

సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ లోపల ఒక కొండపై ఉన్న దాము నగర్‌లో దాదాపు 2,300 ఇళ్ళు ఉన్నాయి. ఇరుగ్గా, ఎగుడుదిగుడుగా ఉండే రాతి దారులు గజిబిజిగా ఉన్న ఇళ్ళకు దారితీస్తాయి

ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకం కింద మోదీ ప్రభుత్వం 2022 నాటికి అర్హులైన కుటుంబాలు "అందరికీ ఇళ్ళు (అర్బన్)" అందించాలనే లక్ష్యంతో ఉంది. తన కుటుంబం ఆ 'అర్హత' పొందేలా చూడడానికి ప్రకాశ్ ప్రయత్నిస్తున్నారు.

"ఆ పథకం ప్రయోజనాలు నా కుటుంబానికి దక్కేలా నేను ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. కానీ ఆదాయానికి రుజువు, చెల్లుబాటయ్యే పత్రాలు లేకపోవటం వలన నేనెప్పటికీ దానికి అర్హత పొందలేకపోవచ్చు," అన్నారాయన.

ఈ సంవత్సరం (2024) ఫిబ్రవరిలో మహారాష్ట్ర రాష్ట్రానికి సంబంధించిన విద్యా హక్కు ( RTE ) చట్టం నిబంధనలను మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ అతన్ని మరింత ఇబ్బందిపెడుతోంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం, పిల్లల నివాసం నుండి ఒక కిలోమీటరులోపు ప్రభుత్వ లేదా ప్రభుత్వ-సహాయక పాఠశాల ఉంటే, అతను లేదా ఆమె తప్పనిసరిగా ఆ బడిలో చేరాలి. అంటే అట్టడుగు వర్గాలకు చెందిన పిల్లలకు RTE ద్వారా వచ్చే 25 శాతం కోటా ప్రకారం అడ్మిషన్లు ఇవ్వకుండా ఆంగ్ల మాధ్యమ పాఠశాలలతో సహా ప్రైవేట్ సంస్థలలో నిషేధించబడింది. "అది వాస్తవానికి RTE చట్టాన్ని తలకిందులుగా నిలిపింది" అని అనుదాని శిక్షా బచావ్ సమితి (సేవ్ ది ఎయిడెడ్ స్కూల్స్ అసోసియేషన్)కి చెందిన ప్రొఫెసర్ సుధీర్ పరాంజపే PARIతో చెప్పారు.

"ఇటువంటి నిర్ణయాల వలన మనం నాణ్యమైన విద్యను పొందలేం. దానికి హామీ ఇచ్చే ఏకైక చట్టం (ఈ నోటిఫికేషన్‌ వలన) ఉనికిలో ఉండదు. అలాంటప్పుడు మనం ఎలా పురోగమిస్తాం?" అతను ఆవేదనతో అడిగారు.

దాము నగర్‌లోని ప్రకాశ్ తదితరుల తర్వాతి తరానికి మంచి నాణ్యమైన విద్య లభించటం ఒక్కటే వారి అభివృద్ధికి మార్గం. దాము నగర్ పిల్లల అట్టడుగు స్థితి గురించి చిన్న సందేహం కూడా లేదు. ఈ మురికివాడలో నివసిస్తున్నవారిలో ఎక్కువ మంది - వారిలో నాలుగు దశాబ్దాలుగా నివసిస్తున్నవారు కూడా ఉన్నారు - నవబౌద్ధులు. అంటే దళితులు. 1972లో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన కరవు సమయంలో ఇక్కడి చాలామంది పిల్లల తాతలు, తల్లిదండ్రులు జాల్నా, సోలాపూర్‌ల నుండి ముంబైకి వలస వచ్చారు.

PHOTO • Jyoti
PHOTO • Jyoti

ఎడమ: ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం, ఒక కిలోమీటరు పరిధిలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ-సహాయక పాఠశాల ఉంటే, విద్యాహక్కు చట్టం ప్రకారం 25 శాతం సీట్లలో వెనుకబడిన వర్గాల విద్యార్థులను చేర్చుకోవడం నుండి ప్రైవేట్ పాఠశాలలు మినహాయించబడ్డాయి. ఈ నోటిఫికేషన్ దాము నగర్ విద్యార్థులకు నాణ్యమైన విద్యను పొందే హక్కును దూరం చేసిందని అనుదానిత్ శిక్షా బచావ్ సమితికి చెందిన ప్రొ. సుధీర్ పరాంజపే అన్నారు. కుడి: దాము నగర్‌లోని మహిళలకు సురక్షితమైన మరుగుదొడ్లు అందుబాటులో లేవు. 'మీరు అనారోగ్యంతో ఉన్నా, గాయపడి ఉన్నా కూడా చేతిలో బకెట్‌ నీళ్ళు పట్టుకొని గోడ ఎక్కాల్సిందే,' అంటారు లతా సోనావనే (పచ్చ దుపట్టా)

PHOTO • Jyoti
PHOTO • Jyoti

కుడి, ఎడమ: తన ఇంటిలో పిల్లలతో ఉన్న లత

ఒక్క విద్యాహక్కు చట్టాన్ని వినియోగించుకోవడంలో మాత్రమే ఇబ్బందులు ఉన్నాయని కాదు. ప్రకాశ్ పొరుగున ఉండే ఆబాసాహెబ్ మ్హాస్కే 'లైట్ బాటిల్స్' తయారుచేసే చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాలని చేసిన ప్రయత్నం కూడా విఫలమయింది. "ఈ పథకాలన్నీ పేరుకు మాత్రమే ఉన్నాయి," అని 43 ఏళ్ళ మ్హాస్కే చెబుతున్నారు. “నేను ముద్రా పథకం కింద రుణం కోసం ప్రయత్నించాను. కానీ రాలేదు. అంతకుముందు నేను బ్యాంకులో తీసుకున్న రూ. 10,000 అప్పును కట్టటంలో కేవలం ఒక్క వాయిదాను చెల్లించలేదు. అందుకని వాళ్ళు నన్ను బ్లాక్ లిస్టులో పెట్టారు.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల పేదలకు వివిధ ఆరోగ్య, సంక్షేమ పథకాలు అందుబాటులోకి వచ్చే పరిస్థితిపై PARI క్రమం తప్పకుండా నివేదిస్తోంది. [ఉదాహరణకు చదవండి: ఉచిత చికిత్సకు భారీ మూల్యం ; నా మనవసంతానం తమ సొంత ఇంటిని కట్టుకుంటారు’ ].

మ్హాస్కే తన కార్యశాలను, కుటుంబాన్నీ కూడా 10x10 అడుగుల వైశాల్యమున్న గదిలో నడుపుతున్నారు. ఎడమవైపు నుంచి మనం లోపలికి ప్రవేశించగానే వంటగది, ఆ తర్వాత మోరీ [బాత్రూమ్] ఉంటాయి. దాని ప్రక్కనే, సీసాలను అలంకరించేందుకు అవసరమైన సామగ్రి అంతా బీరువా అరలలో క్రమపద్ధతిలో పెట్టివుంటాయి

"నేను కాందివలీ, మాలాడ్ చుట్టుపక్కల తిరుగుతూ ఈ దీపాలను అమ్ముతుంటాను." అతను మద్యం దుకాణాలు, స్క్రాప్ డీలర్ల నుండి ఖాళీ వైన్ సీసాలను సేకరిస్తారు. “విమల్ [అతని భార్య] వాటిని శుభ్రం చేయడం, కడగడం, పొడిగా తుడవడంలో సహాయం చేస్తుంది. అప్పుడు నేను ప్రతి సీసాను కృత్రిమ పువ్వులతోనూ, దారాలతోనూ అలంకరిస్తాను. వాటికి వైరింగును, బ్యాటరీలను కలుపుతాను,” అంటూ ఆయన ‘లైట్ బాటిల్స్‌'ను తయారుచేసే విధానాన్ని క్లుప్తంగా వివరించారు. ‘మొదట నేను కాపర్ వైర్ LED లైట్ తీగలకు కలిపిన నాలుగు LR44 బ్యాటరీలను ఇన్‌స్టాల్ చేస్తాను. ఆ తర్వాత ఆ లైటును కొన్ని కృత్రిమ పూలతో పాటుగా సీసా లోపలికి తోస్తాను. ఇప్పుడు దీపం సిద్ధమైంది. మీరు బ్యాటరీపై ఉన్న ఆన్-ఆఫ్ స్విచ్‌తో దీన్ని ఉపయోగించవచ్చు." కొంతమంది తమ ఇళ్ళల్లో ఉంచుకోవటం కోసం ఇష్టపడే ఈ అలంకార దీపాలకు ఆయన తన కళాత్మక మెరుగులను అద్దుతారు.

"నాకు కళపై చాలా మక్కువ. నేను నా నైపుణ్యాలను విస్తరించాలనుకుంటున్నాను, తద్వారా నేను మరింత సంపాదించగలను, నా ముగ్గురు కుమార్తెలకు మంచి విద్యను అందించగలను," అని ఆబాసాహెబ్ మ్హాస్కే చెప్పారు. ఒక్కో సీసా తయారీకి 30 నుంచి 40 రూపాయల వరకు ఆయనకు ఖర్చవుతుంది. మ్హాస్కే ఒక్కో దీపాన్ని 200 రూపాయలకు విక్రయిస్తారు. ఆయన రోజువారీ సంపాదన తరచుగా 500 రూపాయల కంటే తక్కువగానే ఉంటుంది. "మొత్తం 30 రోజులు పనిచేస్తే నెలకు 10,000 నుండి 12,000 రూపాయలు సంపాదిస్తాను." అంటే ఆయన సగటున రోజుకు కేవలం రెండు సీసాలను అమ్ముతారు. "ఈ సంపాదనతో ఐదుగురున్న కుటుంబాన్ని పోషించడం కష్టం," అని ఆయన చెప్పారు. మ్హాస్కే స్వస్థలం జాల్నా జిల్లా జాల్నా తాలూకా లోని థేరగాఁవ్ గ్రామం.

PHOTO • Jyoti
PHOTO • Jyoti

ఎడమ: ఆబాసాహెబ్ మ్హాస్కే 'లైట్ బాటిల్స్'ను తయారుచేసి కాందివలీ, మాలాడ్‌లలో అమ్ముతుంటారు. ఆయన తన కుటుంబం నివసించే 10x10 అడుగుల గదిలోనే తన కార్యశాలను కూడా నడుపుతుంటారు. కుడి: కృత్రిమ పూలతో అలంకరించి ఆబాసాహెబ్ తయారుచేసిన సీసా. ఆయన ఈ సీసాలను మద్యం దుకాణాల నుండీ, చెత్తను సేకరించే వ్యాపారులనుండీ కొంటారు

PHOTO • Jyoti
PHOTO • Jyoti

ఎడమ: ఆయన భార్య విమల్ సీసాలను శుభ్రంచేసి, కడిగి, పొడిగా తుడవటంలో సాయంచేస్తుంటారు. కుడి: ఒక్కో సీసా తయారీకి 30-40 రూపాయలు ఖర్చవుతాయి. మ్హాస్కే వాటిని ఒక్కోటీ రూ. 200కు అమ్మడంద్వారా నెలకు రూ. 10,000-12,000 వరకూ సంపాదిస్తారు. అంటే, ఆయన రోజుకు దాదాపు రెండు సీసాలను అమ్ముతారని అర్థం

ఆయన  ప్రతి సంవత్సరం జూన్‌లో ఒంటరిగా తన గ్రామానికి తిరిగివెళ్ళి, తనకున్న ఎకరంన్నర పొలంలో సోయాచిక్కుళ్ళను, జొవరి (జొన్నలు)ని సాగు చేస్తారు. “నేనెప్పుడూ విఫలమవుతూనేవుంటాను. వర్షాభావ పరిస్థితుల వలన ఎప్పుడూ మంచి దిగుబడి రాదు," అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మ్హాస్కే గత రెండేళ్ళుగా వ్యవసాయం చేయడం మానేశారు.

2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలోని 65 మిలియన్లకు పైగా ఉన్న మురికివాడల నివాసితుల లో ప్రకాశ్, మీరా, మ్హాస్కే, దాము నగర్ మురికివాడలోని ఇతర నివాసితులది చాలా తక్కువ భాగం. కానీ, ఇతర మురికివాడల ప్రజలతో కలిపితే, వారు భాగమై ఉన్న R/S మునిసిపల్ వార్డులో వారికి పెద్ద సంఖ్యలో వోట్లు ఉన్నాయి.

"మురికివాడలు గ్రామీణ వలసదారుల భిన్నమైన దునియా (ప్రపంచం)," అన్నారు ఆబాసాహెబ్.

మే 20న ముంబై ఉత్తరం లోక్‌సభ స్థానానికి కాందివలీ ప్రజలు వోటు వేయనున్నారు. ఈ నియోజకవర్గం నుండి ప్రస్తుత పార్లమెంటు సభ్యుడు, భారతీయ జనతా పార్టీకి చెందిన గోపాల్ శెట్టి 2019లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఊర్మిళ మతోండ్కర్‌పై నాలుగున్నర లక్షల ఓట్ల తేడాతో గెలుపొందాడు.

ఈసారి బిజెపి గోపాల్ శెట్టికి టికెట్ నిరాకరించింది. అయితే కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ ముంబై నార్త్ నుంచి పోటీ చేస్తున్నాడు. “బిజెపి ఇక్కడ రెండుసార్లు [2014, 2019లలో] గెలిచింది. అంతకు ముందు కాంగ్రెస్. కానీ నేను చూస్తున్నదాని ప్రకారం, బిజెపి నిర్ణయాలు పేదలకు అనుకూలంగా లేవు,” అని ఆబాసాహెబ్ మ్హాస్కే చెప్పారు.

PHOTO • Jyoti
PHOTO • Jyoti

ఎడమ: దాము నగర్ ఇరుకు సందులు. ఈ మురికివాడ ప్రజలు మే 20న వోటు వేయనున్నారు. కుడి: తమ ఇంటిలో ఆబాసాహెబ్ మ్హాస్కే, ఆయన భార్య విమల్, వారి కూతుళ్ళు. 'ఈ ఎన్నికలు [...] మాలాంటి అణగారిన వర్గాల హక్కులను కాపాడే పోరాటమని నేను భావిస్తున్నాను'

EVMలను అనుమానించే మీరా యేడే, పేపర్ బ్యాలెట్‌లను మరింత నమ్మదగినవిగా భావిస్తారు. “ఈ వోటింగ్ యంత్రం మోసపూరితమైనదని నేను గుర్తించాను. ఆ పేపర్ వోటింగే మెరుగ్గా ఉంది. నేను ఎవరికి ఓటు వేశానో అనే విషయంలో ఆ పేపర్ వోటింగ్ నాకు మరింత భరోసానిస్తుంది,” అని మీరా చెప్పారు.

వార్తలపై, తప్పుడు సమాచారంపై నిరుద్యోగి ప్రకాశ్ అభిప్రాయాలు; సఫాయి కర్మచారి మీరాకు EVMలపై నమ్మకం లేకపోవడం; ప్రభుత్వ పథకాల ద్వారా తన స్వంత చిన్న వెంచర్‌ను ఏర్పాటు చేయడానికి మ్హాస్కే చేసిన విఫలప్రయత్నాలు. చెప్పాలంటే ఒక్కొక్కరికీ ఒక్కో కథ ఉంటుంది.

"మా సమస్యలను గురించి నిజంగా మాట్లాడే మంచి అభ్యర్థికి ఓటు వేయాలని నేను ఆశిస్తున్నాను," అని ప్రకాశ్ చెప్పారు.

“ఇప్పటి వరకు ఎవరు గెలిచినా అది మాకు ఎలాంటి అభివృద్ధిని తీసుకురాలేదు. మా పోరాటం కూడా అలాగే ఉంది. మేం ఎవరికి వోటు వేసినా, మా కష్టమే మమ్మల్ని నిలబెడుతుంది తప్ప గెలిచిన నాయకుడిది కాదు, మనం మన జీవితాన్ని నిర్మించుకోవడానికి మాత్రమే కృషి చేయాలి, గెలిచే నాయకుడిని కాదు” అని మీరా వ్యాఖ్యానించారు.

“ఈ ఎన్నికలు కేవలం ప్రాథమిక సౌకర్యాల కోసమేనని నేను అనుకోవటంలేదు. కానీ మనలాంటి అణగారిన పౌరుల హక్కులను నిలుపుకోవడం కోసం,” అని ఆబాసాహెబ్ ముగించారు. ఇంకోమాటలో చెప్పాలంటే, దాము నగర్ ప్రజలు ప్రజాస్వామ్యానికే ఓటు వేస్తారు.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Jyoti is a Senior Reporter at the People’s Archive of Rural India; she has previously worked with news channels like ‘Mi Marathi’ and ‘Maharashtra1’.

Other stories by Jyoti

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli