"ప్రస్తుత బడ్జెట్ మా మనుగడకు సంబంధించిన ఏ సమస్యనూ ప్రస్తావించలేదు. ఇది ప్రధానంగా మధ్యతరగతివారికి, ముఖ్యంగా జీతభత్యాల వ్యక్తులకు సంబంధించినదిగా కనిపిస్తోంది," అని గీతా వాళచ్చల్ అన్నారు.
36 ఏళ్ళ గీత, ప్రత్యేకించి దుర్బలమైన ఆదివాసీ సమూహం (PVTG)గా వర్గీకరించిన కాడర్ సముదాయానికి చెందినవారు. ఆమె కేరళలోని త్రిసూర్ జిల్లాలో ప్రతిపాదిత ఆతిరప్పిల్లి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్నారు..
చాలకుడి నదీ పరీవాహక ప్రాంతంలో ఉన్న ఈ ఆనకట్ట, ఇప్పటికి నాలుగోసారి ఆమె సముదాయానికి చెందినవారిని నిర్వాసితులను చేస్తోంది. “దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కారణంగా మేం మళ్ళీ మళ్ళీ నిర్వాసితులుగా మారుతున్నాం. అంతే కాకుండా మా భూములను, అడవులను, వనరులను కార్పొరేట్ సంస్థలు స్వాధీనం చేసుకోవడం గురించిన ప్రస్తావనే లేదు," అని ఆనకట్టకు వ్యతిరేకంగా జరుగుతోన్న ప్రజా ఉద్యమపు ముఖచిత్రంగా మారిన గీత అన్నారు.
"వాతావరణ మార్పులు అడవుల్లో నివసించే ఆదివాసులకు అంతకు ముందెన్నడూ లేని మనుగడ సమస్యలను సృష్టిస్తాయి. మేం ప్రతికూల వాతావరణం, క్షీణిస్తున్న అడవులు, జీవనోపాధులు తగ్గిపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాం,” అన్నారు కేరళలోని ఏకైక ఆదివాసీ నాయకురాలు గీత.
![](/media/images/02a-IMG008-2-KAS-Cosmetic_changes_for_Adiv.max-1400x1120.jpg)
![](/media/images/02b-IMG015-1-KAS-Cosmetic_changes_for_Adiv.max-1400x1120.jpg)
ఎడమ: తన విద్యార్థులతో గీత. కుడి: కేరళలోని త్రిసూర్ జిల్లాలో ప్రతిపాదిత ఆతిరప్పిల్లి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతంలో గీత నివసిస్తున్నారు
1905లో ఆంగ్లేయులు కొచ్చి నౌకాశ్రయానికి కలపను తరలించడానికి, అక్కడి నుండి గ్రేట్ బ్రిటన్‌కు రవాణా చేయడానికి ఈ ప్రాంతాన్ని కలుపుతూ ట్రామ్‌వేను నిర్మించినప్పుడు, అడవులలో నివసించే కాడర్ సముదాయానికి చెందిన ఇతరుల మాదిరిగానే, గీత పూర్వీకులు కూడా పరంబికుళం టైగర్ రిజర్వ్‌ను విడిచిపెట్టాల్సి వచ్చింది.
పెరింగల్‌కుత్తుకు, అక్కడి నుండి షోళయార్ అడవికి తరలి వెళ్ళిన గీత కుటుంబం, ఇప్పుడు అక్కడ నుంచి కూడా మళ్ళీ నిర్వాసితులు కాబోతున్నారు.
బడ్జెట్‌లో ఆదివాసీ సంక్షేమానికి నిధులు పెరిగాయని చూపుతున్నప్పటికీ, “కేటాయింపులు ప్రధానంగా మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, కనెక్టివిటీకి ప్రాధాన్యమిస్తున్నాయి. ఇవి కేవలం పైపై మెరుగులలాంటివి మాత్రమే. దుర్బలమైన ఆదివాసీ సముదాయాలకు చెందిన వ్యవసాయ భూములను, అడవులను, నీటి వనరులను, జీవనోపాధిని లాగేసుకుని రోడ్లు, మౌలిక సదుపాయాలు వంటివాటిని మెరుగుపరచడం అర్థంలేని పని," అని ఆమె పేర్కొన్నారు.
వాయనాడ్ జిల్లాలోని ముండక్కై, చూరళ్‌మల కొండచరియల బాధితుల కోసం బడ్జెట్‌లో న్యాయంగా కేటాయింపులు చేస్తారని కేరళలోని చాలామంది ప్రజలు భావించారు. "భారతదేశంలోని మొత్తం దక్షిణ ప్రాంతాన్ని విస్మరించినట్లు కనిపిస్తోంది."
ఇందులోని చిత్రాలను కొచ్చిలోని కేరళ మ్యూజియంకు చెందిన జానల్ ఆర్కైవ్, మాధవన్ నాయర్ ఫౌండేషన్ వారి అనుమతితో ఉపయోగించారు.
అనువాదం: రవి కృష్ణ